అవి విస్మృత వెలుగులేనా!

19 Dec, 2017 01:14 IST|Sakshi

రెండో మాట
ఇలాంటి దురవగాహన వల్లనే, రాజకీయ లబ్ధి కోసమే ‘ఆంధ్ర’ శబ్దం పట్ల కొందరు ఏవగింపు ప్రకటించారు. అలా తెలంగాణ ఆంధ్రోద్యమంతో పాటు, ఆంధ్ర మహాసభల ప్రారంభకులూ, చరిత్రకారులూ, తెలంగాణ వైతాళికులూ సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి, ఒద్దిరాజు సోదరులు వంటివారు ప్రవేశపెట్టిన చారిత్రక సంప్రదాయాన్నీ, విజ్ఞతనూ పెడచెవిని పెట్టడానికి సాహసించారు. ‘జాతిరీత్యా, భాష రీత్యా మనం ఆంధ్రుల’మని స్పష్టం చేస్తూ సురవరం అనేక దశాబ్దాల క్రితం హెచ్చరించాల్సి వచ్చింది.

‘... నీ ప్రాకట పూర్వభాగ్య పరిపాటి తలంచినన్‌/ ఆంధ్ర రాజ్యలక్ష్మీ కఠినాత్మకుండైన చింతిలి/ నీరయి పోకయుండునే?’ అనీ, ‘ఆంధ్ర శిల్ప ప్రౌఢి ఆంధ్ర విక్రమరేఖ జాలుగా పారిన శాద్వలంబు’నీ కాకతీయ రాజ్య ఉత్థానపతన దశలను తలచుకుంటూ తెలంగాణ చరిత్రను, శాసనసంపదను తవ్వి తలకెత్తి చూపినవారు ఆంధ్రకవులు– శేషాద్రి–రమణకవులు. కాగా ప్రాచ్య దేశాం ధ్రకు ‘శ్రీమహాభారతం’ భవ్య తెలంగాణకు ‘శ్రీమహాభాగవతం’, మహిత రాయలసీమకు ‘రామాయణం’– వెరసి యావదాంధ్ర త్రివేణీ సంగమంగా రూపొందినదని చాటినవారు పక్కా తెలంగాణమూర్తి వానమామలై వరదాచార్యులు. ఈ ఆంధ్ర స్ఫూర్తి, ఈ తెలుగు స్ఫూర్తి అంతటితో ఆగలేదు. ఎవరు రుద్రమ? ఎవరు రాయలు? ఎవడు సింగన? అని ప్రశ్నించుకుని ‘వెలుగూ నేనే, తెలుగూ నేనే’ అని చాటి తనకు కావలసిన సమాధానం ఒకేఒకటన్నాడు మహాకవి దాశరథి. ఏమిటది? ‘నాకు కావలె! నాకు కావలె! మనిషి మనిషి మనసుదారుల/ రాగబంధము, రాగబంధము నాకు కావలె!’ అని బలంగా చాటాడు. అంతటితో కథ ఆగలేదు. ‘నీటి గుణమో, గాలి గుణమో/ అన్నపూర్ణ నామాంకిత ఆంధ్రావని సౌభాగ్యమో! పుడమి దున్ని పండించిన మొదటివాడు తెలుగువాడు’ అన్నాడు ప్రజాకవి కాళోజీ. అయినప్పుడు, ‘మేము ఆంధ్రులం కాము, మాది తెలుగు కాదు, మా తెలుగు వేరు’ అని తెలుగుదేశంలో పుట్టిన వాడెవడైనా అంటాడా? ఎవరెన్ని మార్చినా వెళ్లవలసిన దారి, చేరుకోవలసిన గమ్యమూ మాత్రం ఒకటే– అది తెలుగు దారే. వెలుగు దారీ అదేను!

మనసులను తేజోవంతం చేసుకోవాలి
అన్ని ప్రాంతాలకు చెందిన ‘ప్రపంచ తెలుగు మహాసభలు’ నడవడిక వేరుగా ఉందంటే కొందరు బాధపడనక్కరలేదు. ఎందుకంటే ఈ సభలలో పాల్గొం టున్న ఒక ప్రముఖ నిర్వాహకుడు, సాహితీవేత్త, వరంగల్‌ ఎన్నడూ ఆంధ్ర రాజధాని కాదు; కృష్ణదేవరాయలకూ, తెలంగాణ ప్రాంతానికీ ఎలాంటి సంబంధం లేదు; అది కల్పితగాథ అని ప్రకటించాడు. ఈ సమయంలోనే కొన్ని అంశాలను జ్ఞప్తికి తెచ్చుకుని, మనస్సులని తేజోవంతం చేసుకోవాలి. మన స్వార్థ చింతన కొద్దీ మన పూర్వీకులకు వారికి లేని సాహితీ పాండిత్య దురభిమానాలను అంటగట్టే ప్రయత్నానికి దిగకూడదు. చారిత్రక వారసత్వాన్ని భావి తరాలకు సక్రమంగా అందించాలి.

తెలంగాణ చరిత్రకు ఆధారాలనదగిన పలు శాసనాధారాలను వెలికితీసిన ఉద్దండపిండాలు శేషాద్రిరమణ కవులు. ఆంధ్రకవులైన వీరు ‘నిజాము రాష్ట్రము– వాజ్ఞయ చరిత్రము’ అన్న విశేష రచనలో నిజాం రాష్ట్రములో ఏవి ఆంధ్ర ప్రాంతాలో ఖాయపరుస్తూ, ‘ఆంధ్ర దేశ విస్తృతి, అచటి సారస్వత రంగస్థలాలు, చారిత్రక ప్రదేశాల’ గురించి చెప్పారు, ‘నిజాం రాష్ట్రంలోని తెలుగుదేశం నిర్జీవ స్థలం కాదు. ఆంధ్ర కవిరాజుల రసవత్కవితామృతంచే పునీత పుణ్యభూమి; ఆంధ్రవీరుల పరాక్రమ రక్తధారలచే పవిత్రమైన స్మరణ చిహ్నం. ఆంధ్రశిల్పుల హస్త విన్యాసంచే సజీవమైన చరిత్రకు రంగస్థలం.’ ఈ చారిత్రక చిహ్నాలు అప్పటి నుంచి ఆంధ్ర పరిశోధకుల దృష్టిని ఆకర్షించక పోవడాన్ని గ్రహించిన ఆ పండితులు గుంటూరు జిల్లావాసులు. ఉద్యోగ రీత్యా వచ్చి నిజాం రాష్ట్రంలోని ఆంధ్రభాగంలో స్థిరపడినవారు ఆ శేషాద్రిరమణ కవులు. నిజాం రాష్ట్రంలో ఏవి ఆంధ్ర భాగాలో వారు ఇలా వివరిం చారు, ‘వరంగల్లు, కరీమునగరము, ఆదిలాబాదు, అత్రాపుబల్దా, మెదకు, నిజామాబాదు, మహబూబునగరము, నల్లగొండ మండలములు పూర్తిగా ఆంధ్రమండలములు’. కాగా ఇవిగాక రాయచూరు మండలంలోని కొన్ని తాలూకాలు, ఇందూరు మండలంలోని కొన్ని తాలూకాలు ఆంధ్రదేశానికి సంబంధించినవి. తక్కిన మండలములలో కూడా ఆంధ్రులు నివాసముండే గ్రామాలు ఉన్నవి. అంతేగాక, కృష్ణదేవరాయల శాసనం నేలకొండపల్లిలో ఉంది. సమన్వయించి చూస్తే ‘నిజాం రాష్ట్రంలోని తెలుగు దేశమంతా రాయలు పాలించాడని ఈ ప్రాంతాన్ని తెలగాణ్యమని రాయలు ప్రయోగించడం చేత అది తెలంగానా యను నామమును, మొగలాయి పాలకులు పెట్టకముందే నిజాము రాష్ట్రమందలి ఆంధ్రదేశము తెలగాణ్యమనే వ్యవహారంతో ఉంది’ అని శేషాద్రిరమణ కవులు నిర్ధారించారు. కనుకనే నేలకొండపల్లి (ఖమ్మం జిల్లా) శాసనం వల్లనే రాయలకు నిజాం నిజాం రాష్ట్రానికి గల సంబంధం తెలియబట్టే ‘రజతోత్సవం’ జరపవలసిన అవసరం ఉందని ఆ జంటకవులు పేర్కొన్నారు. బహమనీలను, గజపతులను వరంగల్‌ పరిసరాలలో ఎదుర్కొని వరంగల్‌ను రక్షించింది కృష్ణదేవరాయలని చరిత్రకారుల భావన. అంతేగాదు, విదేశీ వర్తక వ్యాపారాలకు సహితం యావదాంధ్ర భూభాగంలో అంతర్భాగమైన కోస్తాతీరం కీలకమని గ్రహించిన తొలి పాలకులు కూడా శాతవాహనులు, మొగలులేనని ఆ కారణంగానే ఉభయ పక్షాలు కోస్తా వైపే రాజ్యవిస్తరణ సాగించాయని మరవరాదు.

ఆంధ్రభాషంటే తెలుగుభాషే!
అయితే, ఒక దురవగాహన వల్లనే, రాజకీయ లబ్ధి కోసమే ‘ఆంధ్ర’ శబ్దం పట్ల కొందరు ఏవగింపు ప్రకటించారు. అలా తెలంగాణ ఆంధ్రోద్యమంతో పాటు, ఆంధ్ర మహాసభల ప్రారంభకులూ, చరిత్రకారులూ, తెలంగాణ వైతాళికులూ సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి, ఒద్దిరాజు సోదరులు వంటివారు ప్రవేశపెట్టిన చారిత్రక సంప్రదాయాన్నీ, విజ్ఞతనూ పెడచెవిన పెట్టడానికి సాహసించారు. ‘జాతిరీత్యా, భాష రీత్యా మనం ఆంధ్రుల’మని స్పష్టం చేస్తూ సురవరం అనేక దశాబ్దాల క్రితం ఇలా హెచ్చరించాల్సి వచ్చింది: ‘‘ఆంధ్ర అను పదము కులమును తెలుపదు, వర్ణము (కులము)నకు వర్తించదు, మతమునకు సంబంధించదు. ఆంధ్రులు అంటే తెలుగు మాట్లాడేవారు. అట్టి ఆంధ్ర పదమునకు మనము కొత్త అర్థము నిచ్చుటకు ఏమాత్రమును మనకు అధికారము లేదు. ‘ఆంధ్ర’ భాష అంటే తెలుగు భాషే’’!
ఇప్పటికి కూడా ‘ఆంధ్ర’శబ్దం అంటే ఒంటినిండా ‘దద్దుర్లు’(ఎలర్జీ) పెంచుకునే కొందరు ఉన్నారు. తెలుగు భాషకు ప్రాచీన (శిష్ట) భాషా ప్రతిపత్తి రాకుండా అడ్డుకోజూసిన తమిళుడొకరితో ఒక తెలంగాణ సోదరుడు చేతులు కలిపాడు. ఆ సమయంలో సకల ఆధారాలతో ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం తెలుగు లిపి, భాష, సాంస్కృతిక, చారిత్రక శాసనాధారాలతో కేంద్ర ప్రభుత్వానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తరఫున (2006లో) బృహత్‌ సమాచారాన్ని సమర్పించడం జరిగింది. కరీంనగర్‌లోని జినవల్లభుని (క్రీస్తు శకం 946) కుర్క్యాల శాసనం సహా ఆ సాక్ష్యాధారాలలో ఉన్నాయి. కానీ విచి త్రమేమంటే, ఆ శాసనాన్ని తామే అందజేసినట్టు, దాని ఆధారంగానే కేంద్రం తెలుగుకు శిష్ట భాషా ప్రతిపత్తిని ఇచ్చినట్టు (10.12.17) నమ్మించడానికి కొందరు ప్రయత్నించడం హుందాతనానికి దూరం కావడమే. ‘ఆంధ్రులు చేతులెత్తేస్తే ఆధారాలిచ్చి ఆదుకున్న తెలంగాణా’ అని ఒక స్థానిక దినపత్రిక (17.07.16) పచ్చి అబద్ధం రాసింది.
 
ఇది ఇలా ఉండగా, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపోహలు రేపే మరొక విషయానికి తెరలేపుతూ, తెలంగాణ ప్రభుత్వం తరఫున హాజరైన ఒక అధికారి ఒక ‘నోట్‌’ను పంపారు. అందులో ఆయన ‘తెలుగు మహాభారతం’లో 70 శాతానికి పైగా పదాలు సంస్కృత పదాలే కాబట్టి ఆ తెలుగు అరువు తెచ్చుకున్నదేనని, తెలుగు సాహిత్య చరిత్రకు 900 ఏళ్ల చరిత్ర మాత్రమే ఉంది గనుక, ప్రాచీన భాష హోదాకు తగదని అందులో పేర్కొన్నారు. నిజానికి నన్నెచోడుని కాలం కూడా బరాబరిగా జినవల్లభుడి కుర్క్యాల శాసన కాలం దగ్గరదగ్గరే. నన్నయ తాను ఆదికవినని ప్రకటించుకోలేదు. కుర్క్యాల శాసనాన్ని, దాని ఆధారాలను బహుశా మొదటిసారి వెలుగులోకి తెచ్చినదీ, నన్నయకన్నా సుమారు నూరు సంవత్సరాల ముందు (సుమారు క్రీ.శ. 945) జినవల్లభుడని ‘చెప్పవచ్చుననీ’, తెలుగులోని తొలి మూడు కంద పద్యాలు ఇతని రచనేనని చెప్పినవాడు నేలటూరి వెంకటరమణయ్యే (నెల్లూరు జిల్లా)నని మరచిపోరాదు.

అనేక నిర్బంధాలమధ్య, భాషా వైరుధ్యాల మధ్య శతాబ్దాల పాటు నలిగిపోయిన చారిత్రక ప్రదేశాలలో ఒకటి తెలంగాణం. కనుకనే, తెలంగాణ భూగర్భంలో దాగి, వెలుగులోకి రాని పురావస్తు సంపదకు విముక్తి కల్పించిన సంగంభట్ల నరహరి, బీఎన్‌ శాస్త్రి, డి. సూర్యకుమార్‌లను తెలంగాణ తొలి చారిత్రక త్రయంగా పేర్కొనాలి. తెలంగాణ మాగాణంలో దాగిన చారిత్రక సంపదను కోకొల్లలుగా వెలికితీయడంలో పురాతత్వ పరిశోధకులుగా, చరిత్రకారులుగా, శాసనభాషా వివేచకులుగా చేదోడువాదోడైన పలువురు తీరాం ధ్రులైన తెలుగువారే! వారు: మల్లంపల్లి సోమశేఖరశర్మ, వి.వి. కృష్ణశాస్త్రి, పరబ్రహ్మ శాస్త్రి, ఎన్‌.ఎస్‌. రామచంద్రమూర్తి, శేషాద్రి రమణకవులు, ప్రొఫెసర్‌ శివనాగిరెడ్డి, దేమె రాజారెడ్డి వంటివారు తెలుగు జాతి వెలుగులే.

నిండుగ వెలుగుజాతి
కాగా, కీ.శ. 1వ శతాబ్ది నాటికి తెలంగాణ కేంద్రంగా శాతవాహన రాజ్యం కోస్తాంధ్రకు విస్తరించి, అమరావతిని రాజధానిగా చేసుకుంది. ఈ పెనుమార్పుకు బలమైన కారణం– రోమ్‌ వర్తక వాణిజ్య కేంద్రంగా ఆంధ్ర కోస్తా వర్ధిల్లడమే. ఈ కాలంలో అమరావతి (ధాన్యకటకం) విజయపురికి తోడు ఇతర ప్రసిద్ధ కేంద్రాలుగా గుంటుపల్లి, ఘంటసాల, శంకరంతో పాటు తెలంగాణ ప్రాంతమందలి నేలకొండపల్లి, చైతన్యపురి (హైదరాబాద్‌) ప్రసిద్ధ వర్తక కేంద్రాలుగా వర్ధిల్లాయి. ఇలా యావదాంధ్రలో (తెలంగాణ సహా)నూ బౌద్ధ, జైన చైత్యాలు, విహారాలతోపాటు సాంస్కృతిక, వైజ్ఞానిక వికాసానికి వీలుగా మౌర్య చక్రవర్తి అశోకుడి కాలంలో (క్రీ.పూ. 3వ శతాబ్ది) బ్రాహ్మీ లిపి ప్రామాణీకరణ సాంస్కృతిక విప్లవంగా ప్రారంభమై ప్రాకృత–పాళీ భాషలు దేశవ్యాప్తంగానే రెక్కలు విప్పుకున్నాయి. బహుశా అందుకనే అప్పకవి ‘ప్రాచీన భారతంబు ప్రాకృతంబు’ అని దిలాసాగా ప్రకటించి ఉంటాడు. ఆ ప్రాకృతం, పాళీ భాషలు తెలుగుతో చెలిమి చేశాయి. కనుకనే ‘సినారె’ ‘‘తెలుగుజాతి మనది/ నిండుగ వెలుగు జాతి మనది/.... అన్నీ కలసిన తెలుగునాడు మనదే, మనదే మనదేరా’’! అన్నారు. ఆ ‘మనదన్న’మాట నిలిచిపోవాలి, ‘మన–పర’ అన్నమాటే వినిపించరాదు. అలా వినిపించినన్నాళ్లు మనం తెలుగు వాళ్లం కాదు. మనది ఆంధ్రజాతి కాదు– నేటితో ముగియబోతున్న యావన్మంది తెలుగువారికీ ప్రాతినిధ్యం కాని ‘ప్రపంచ తెలుగు మహాసభల’ సాక్షిగా...

ఏబీకే ప్రసాద్‌ abkprasad2006@yahoo.co.in
సీనియర్‌ సంపాదకులు

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు