28 Jun, 2018 02:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ ఉద్యమానికి ఆజ్యం పోసిన పాలమూరు ప్రజల కష్టాల కొలిమిని కేసీఆర్‌ ఉద్యమ సమయంలో ప్రపంచానికి విడమరిచి చాటిచెప్పారు. ఆనాడు నెర్రలుబాసిన ఎర్రసెలకల్లో జలాలను రప్పించేందుకు పాలమూరు ఊరూరా పాదయాత్రలు చేసి ఉద్యమ జలస్వప్నాలను స్వప్నించారు. అదే కేసీఆర్‌ నేడు నదుల నడకను మార్చి తరాల పాలమూరు కరువును తరిమేస్తున్నారు. నదులను గండికొట్టి బాజాప్తాగా నెర్రలు బారిన భూములకు గంగమ్మను అందిస్తున్నారు. నిన్నటిదాకా కన్నీరు పెట్టిన పాలమూరు పల్లెలు నేడు ఆనంద భాష్పాలను వర్షిస్తున్నాయి. కరువుకు నెర్రలు బాసిన నేలకు ముఖచిత్రంగా తెలంగాణ అంచు చివరన సరిహద్దులో ఎడారిగా మారిన గట్టు, కెటిదొడ్డి, ధరూర్‌ మండలాలకు సాగునీరందించేందుకు రూ. 553 కోట్ల నిధులతో 33 వేల ఎకరాల సాగు విస్తీర్ణం లక్ష్యంగా నేడు గట్టు ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయబోతున్నారు. 
 

పేదరికం వల్ల చదువుకు దూరమైన గట్టుమండలం 34.8% అత్యల్ప అక్షరాస్యత రేటుతో దక్షిణాసియాలోనే దిగువస్థానంలో మిగిలిపోయింది. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తున ఉన్న గట్టు ప్రాంతానికి తెలంగాణ రాష్ట్ర మొచ్చినా, మిగిలిన ప్రాంతానికి నీళ్లు వస్తాయోమో గానీ ఈ ప్రాంత నేలలకు సాగునీరివ్వడం అసాధ్యమనే అభిప్రాయం అందరిలో బలపడి ఉంది. కానీ, తెలంగాణలో పారే ప్రతి నీటిబొట్టుపైన లెక్కలేసి పెట్టుకున్న కేసీఆర్‌ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. దాదాపు రూ. 783 కోట్ల నిధులతో 55,600 ఎకరాలకు సాగునీరందించేందుకు నిర్దిష్ట ప్రణాళికతో చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పనులను కూడా కేసీఆర్‌ పర్యవేక్షిస్తున్నారు. 2003 జూలైలో ఆలంపూర్‌ జోగుళాంబ ఆలయం నుంచి గద్వాల వరకు 150 కిలోమీటర్ల మేరకు చేసిన పాదయాత్ర ముగింపు బహిరంగ సభలో ‘‘మల్దకల్‌’’ వెంకటేశ్వర స్వామి సాక్షిగా నడిగడ్డకు న్యాయంగా దక్కాల్సిన చివరి నీటిబొట్టు దక్కేదాకా విశ్రమించనని చేసిన ప్రకటనను నిజం చేస్తున్నారు. 

87,500 ఎకరాలకు నీరందించాల్సిన ఆర్డీయస్‌ ఏనాడూ 50వేల ఎకరాలకు కూడా కనీసం ఒక పంటకు నీరవ్వని దుస్థితి, ఒక లక్షా రెండు వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన జూరాల ప్రాజెక్టు దశాబ్దాల పాటు ఏనాడూ 40 వేల ఎకరాలను కూడా తడపకుండా తరలిపోయిన చరిత్ర, దాని వెనకున్న పాలకుల వివక్షా పూరిత విధానాలు, వత్తాసుగా  నిలిచిన స్థానిక భూస్వామ్య రాజకీయాలు మరిచిపోలేని వాస్తవాలు. కానీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే పాలమూరు పొలాల తరాల దాహం తీర్చే నిర్దిష్ట చర్యలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. గద్వాల, ఆలంపూర్‌లతో పాటు ఉమ్మడి జిల్లాలోని 14 నియోజక వర్గాల నీటి కష్టాలకు ముగింపు పలుకుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో 35 లక్షల మందికి పైగా మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ప్రజలు కరువు కుంపటిని మోశారు. జురాల, నెట్టెంపాడు, భీమా తదితర ప్రాజెక్టుల నిర్మాణాన్ని తాబేలు నడకలా మార్చిన ఫలితంగా దాదాపు 28 లక్షల సాగుయోగ్యమైన భూమి ఉన్నా పాలమూరు రైతు బక్కచిక్కి బలవన్మరణాల బాధితుడిగా మారాడు. 

ఇక్కడి జనం దశాబ్దాల పాటు అనుభవించిన దారిద్య్రాన్ని బద్దలు కొడుతూ కేసీఆర్‌ పల్లెల తలలపై నీటి సంతకాలు చేస్తున్నారు. నెట్టెంపాడు పెండింగ్‌ పనులు పూర్తి చేసి జోగుళాంబ గద్వాల్‌ జిల్లాలో, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా నాగర్‌కర్నూల్, భీమా2 ద్వారా వనపర్తి, కోయిల్‌ సాగర్‌ తదితర ప్రాజెక్టుల ద్వారా మహబూబ్‌నగర్‌ జిల్లాలో నూతనంగా నాలుగు లక్షల ఎకరాలు సాగులోకి వచ్చింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 944 కోట్లతో మిషన్‌ కాకతీయ పథకం ద్వారా మూడు విడతలలో 3,633 చెరువుల పునరుద్ధరణ చేసి మరో 2 లక్షల 38 వేల ఎకరాల ఆయకట్టును అందుబాటులోకి తెచ్చారు. దీంతో పాటు రూ. 35,200 కోట్ల అంచనాలతో పాలమూరు–రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టును ప్రారంభించి కరువును కూకటివేళ్లతో పెకిలించేందుకు పునాదులేశారు. ఇప్పుడు పాలమూరు నేల తల్లి కడుపారా పంటను కంటున్నది. దశాబ్దాల దారిద్య్రం మీద గెలుపు సాధించే దిశగా వడివడిగా అడుగులేస్తున్నది.

నాగేటి సాళ్ళల్ల... నా తెలంగాణ...నవ్వేటి బతుకుల్ల... నా తెలంగాణ పాట నిన్నటి జ్ఞాపకం. ఇప్పుడు నాగళ్లు నేలతల్లిపై రేపటి భవితాక్షరాలను దున్నుతున్నాయి. 99% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలున్న పాలమూరు ఉమ్మడి జిల్లా గత చరిత్రను విడిచి తలెత్తుకుని నిలబడుతున్నది. నీటికి అలమటించిన నేలపై కాలువలు పరుగులు పెట్టబోతున్నాయి. ముందు చూపు, ప్రజలపై ప్రేమ, మానవీయ దృక్పథంతో చేపడుతున్న సాగునీటి పథకాలు అతి స్వల్పకాలంలోనే గ్రామాల స్వరూపాన్ని సమగ్రంగా మార్చబోతున్నాయి. (ఈ నెల 29న గట్టు ఎత్తిపోతలకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా)


డా. ఆంజనేయగౌడ్‌, వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ సభ్యులు
98661 65308

మరిన్ని వార్తలు