జమిలి పోరాటాలు నేటి అవసరం

27 Jun, 2019 05:29 IST|Sakshi

విశ్లేషణ

ఇప్పుడు దేశాన్ని చుట్టుముడుతున్న నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, తగ్గిన తలసరి ఆదాయం, అవినీతి, పార్టీ ఫిరాయింపులు వంటి అన్ని కీలక సమస్యలను గాలికి వదిలేసి లోక్‌సభకు, రాష్ట్ర శాసనసభలకు కలిపి ఒకేసారి ఎన్నికలు పెట్టడం అనే అంశమే అతి ప్రధాన సమస్య అయినట్లు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కానీ, భారత్‌కి ఇప్పుడు కావలసింది మౌలిక సమస్యలపై జమిలి పోరాటాలే తప్ప జమిలి ఎన్నికలు కావని గ్రహించాలి. అలాగే ఏపీలో సాధారణ ప్రజానీకం తరపున పేదలకు అండగా సామాజిక న్యాయం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని బలపర్చేందుకు ప్రగతిశీల శక్తులు సిద్ధంకావాలి.

ఇటీవలనే జమిలి (లోక్‌సభకు, రాష్ట్ర శాసనసభలకు కలిపి ఒకేసారి) ఎన్నికల అంశాన్ని, అది మన దేశ ప్రజలముందున్న అతి తీవ్రమైన, తక్షణం పరిష్కరించవలసిన సమస్య అయినట్లూ.. దానిముందు, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, తగ్గిన తలసరి ఆదాయం, అవినీతి, పార్టీ ఫిరాయింపులు వంటివి చాలా చిన్న సమస్యలైనట్లు, ముందుకు తెచ్చి దానిపై చర్చించేందుకు ఎన్టీయే ప్రభుత్వం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఇక్కడో చిన్న మెలిక ఉంది. బీజేపీ ప్రభుత్వం ‘వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌’ అన్న అంశాన్ని ఎజెండాగా చేసింది. ఇది ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్న అర్థంలో మన తెలుగు మీడియాలోకి వచ్చి చర్చలు జరిగాయి. నిజానికి దీని అసలు అనువాదం ‘ఒకేజాతి, ఒకే ఎన్నికలు’ అని చెప్పుకోవాలి. జాతి–దేశం సమానార్థకాలు కావు. 

భౌగోళికంగా సారూప్యత, ఒకే విధమైన వాతావరణం, ఆర్థిక నేపథ్యం, సంస్కృతి సంప్రదాయాలు అన్నింటినీ మించి ఒకే భాష కలిగిన ప్రజాసమూహాన్ని జాతి అంటాము. నిజానికి ఈ దేశంలో రాష్ట్రపతి గానీ, ప్రధాని గానీ, తమ మాతృభాషలో ప్రసంగిస్తే,  మన దేశ జనాభాలో సగంమందికి అర్థం కాదు. అంటే ఒకే భాష ‘జాతి’కి ఒక సామాన్య అంశం. ఉదాహరణకు, మనది తెలుగుజాతి, అలాగే ద్రవిడ, మరాఠా, పంజాబీ, గుజరాతీ ఇలా మనదేశంలో వివిధ జాతులున్నాయి. మన జాతీయ గీతం జనగణమనలో కూడా విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కూడా పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ,  ఉత్కళ, వంగా అని మన దేశం వివిధ జాతుల సముదాయం అనే రాశారు. నా భారతదేశం జిందాబాద్, మా తెలుగుతల్లికి మల్లెపూదండ అని సగర్వంగా నేను నినదిస్తాను. ఇలా ఒక దేశంలో ఎన్నో జాతులున్నట్లే, ఒకేజాతి ఎన్నో దేశాలలో ఉండవచ్చు.

మన దేశ స్వాతంత్య్రోద్యమంలో, వివిధ జాతుల ప్రజానీకమూ, పరాయి, వలస బ్రిటిష్‌ దుర్మార్గ దోపిడీ పాలనకు వ్యతిరేకంగా, తమ తమ పోరాటాలు సాగించారు. మన అల్లూరి, కొమరం భీం ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి, తమిళులకు వీరపాండ్య కట్టబొమ్మన, మరాఠాలకు శివాజీ, కన్నడిగులకు టిప్పుసుల్తాన్, ఇలా స్వాతంత్య్రం కోసం పోరాడిన వివిధ జాతుల వీరులెందరో ఉన్నారు. అయినా రాజకీయంగా, కాంగ్రెస్‌ పార్టీ గాంధీజీ నాయకత్వాన దేశవ్యాపితంగా ప్రధానమైన పాత్ర పోషించిందనడం నిర్వివాదం! 1885లో కాంగ్రెస్‌ పార్టీ ఏర్పడినప్పుడు, తొలి సమావేశాన్ని భారత జాతీయ కాంగ్రెస్‌ అనే పిలిచారు. నిజానికి భారత స్వాతంత్య్రోద్యమం ‘భారత జాతుల స్వాతంత్య్రోద్యమం’ అన్నమాట. ఈ వివిధ జాతులన్నీ బ్రిటిష్‌ వాడు ఏర్పర్చిన పాలనాపరమైన దేశంలాగా గాక, తమ జాతుల అస్తిత్వాన్ని నిలుపుకుంటూ, భారతదేశంగా ఏకశిలాసదృశ్యమైన, రాజ్యాంగంగానే.. వివిధ రాష్ట్రాలుగా ఉన్న ఒక సమాఖ్య స్వరూపంగానే మన రాజ్యాంగం ఏర్పడింది. ఇప్పటికీ తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండులో జాతులు, ఉపజాతులు మన దేశంలో కళ్లముందు ఉన్న దృశ్యమే.

ఇంత సువిశాల భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో వివిధ సమయాలలో, ఎన్నికలు జరుగుతూ ఉండటం వలన, ఎన్నికల నియమావళి, పాలనాపరమైన ఇబ్బందులు, అధిక ధనవ్యయం, ఎప్పుడూ ఎన్నికల వాతావరణంతో అభివృద్ధి వెనకడుగు వేయడం, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఒకేసారి రాష్ట్రాల శాసనసభలకూ, దేశ లోక్‌సభకూ ఎన్నికలు నిర్వహించడం వలన మేలు జరుగుతుందన్న భావన ఉండవచ్చు. వాస్తవానికి మన రాష్ట్రంలో 20 ఏళ్లకు పైగా అలా జమిలి ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, జమిలి ఎన్నికలకు సూత్రప్రాయమైన అంగీకారం తెలిపారు.

తనకు అత్యంత ప్రధానమైన ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ప్రయోజనాలను, ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టంలో పొందుపర్చవలసిన హామీలన్నింటినీ నెరవేర్చాలన్న ఆకాంక్షను, అక్కడి అఖిలపక్ష సమావేశంలో మరోసారి వక్కాణించారు. అదీ ఆయన నిబద్ధత. వైవిధ్యభరితమైన వివిధ జాతుల ప్రత్యేకతలను బీజేపీ తృణీకరించి ప్రతిపాదించిన అఖండ భారత జాతి అన్న అవగాహనకు భిన్నంగా ‘ఒకే జాతి–ఒకే ఎన్నిక’ అంశం మరింతగా అధ్యయనం చేయాల్సి ఉంది. అందుకే ఒక కమిటీ ఏర్పాటుకు అఖిల పక్ష సమావేశం నిర్ణయించింది. అంతేకాదు. జమిలి ఎన్నికల్లో రాష్ట్ర, కేంద్ర ప్రాధాన్యతలు ఒకటి కాకపోవచ్చు. 

ఉదాహరణకు, మొన్నటి మన శాసనసభ ఎన్నికలలో గత వెన్నుపోట్ల పార్టీ పాలనలోని అవినీతి, అసమర్థత, కులతత్వం, నయవంచన వంటి వాటిని అంతం చేయడం.. మన రాష్ట్రానికి, ప్రత్యేక హోదాతోసహా విభజన లాభాలను సాధించడం.. ఒక నిబద్ధత గల, ప్రజానురంజక, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయడం ప్రధాన ఎజెండాగా వైఎస్‌ జగన్‌ నాయకత్వాన వైఎస్సార్‌సీపీ ఎన్నికల రంగంలోకి దిగి అద్భుత విజయాన్ని సాధించింది. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వారికి ఈ అంశాలు పట్టలేదు. భారత జాతీయత, అఖండ భారతం అంటూ సామాజిక న్యాయసాధనను వ్యతిరేకిస్తూ మనుస్మృతి ఆధారిత, మతతత్వ నిచ్చెనమెట్ల వర్ణ(కుల) వ్యవస్థను నిలబెట్టడం ఎజెండా. అందుకే ప్రజలు, వెన్నుపోటు పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసేవిధంగా తిరస్కరించడమే కాక, బీజేపీ పార్టీకీ దాని భావజాలానికి రాష్ట్ర శాసనసభలో స్థానం లేకుండా చేశారు. 

కేవలం మాటలతోనూ, ప్రచారంతోనే కాదు.. ఆచరణలో మన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా, పదహారు రోజుల పండుగ కూడా ముగియకుండానే, జగన్‌మోహన్‌రెడ్డి ఆచరణలో అడుగులు వేశారు. ఆయన పాలన ఆరంభించి అవినీతి రహిత పాలన దిశగా, నవరత్న పథకాల ఆచరణకు రూపు దిద్దుకునే రీతిలో రాష్ట్రం ముందడుగు వేయడం చూస్తున్నాం! వైఎస్‌ జగన్‌ రాజకీయ ప్రత్యర్థుల సంగతి ఎలా ఉండినా, దాదాపు యావదాంధ్ర ప్రజలు ఆశావహ రీతిలో అభినందించడమూ చూస్తున్నాం. ఒక్క సామాజిక న్యాయ అంశాన్నే తీసుకుందాం. ఎన్నడైనా, ఏ పార్టీ అయినా తన మంత్రివర్గ కూర్పులో అయిదుగురు దళిత, గిరిజన, మైనార్టీ, మహిళా, వెనుకబడిన కులాలవారికి ఉప ముఖ్యమంత్రి పదవులనిచ్చి గౌరవించిందా? 

తన మంత్రివర్గంలో 60 శాతం సామాజిక న్యాయం అవసరమైన వారికే స్థానం కల్పించి చరిత్ర సృష్టించిన వారు ఇంతకు ముందెవరు? ఇటీవల ఒక మార్క్సిస్టు మిత్రుడు నాకు ఫోన్‌ చేసి, ‘మీరు జగన్‌ను సమర్థిస్తున్నట్లు వ్యాసాలు రాస్తుంటే, జగన్‌ ఏమైనా సోషలిజం తీసుకువస్తాడా అని అడిగాడు. కానీ సాధారణ ప్రజానుకూల పాలనదిశగా, ఇంత త్వరగా ఇంత నిబద్ధతతో జగన్‌ తన ప్రస్థానం ఆరంభించగలడని అనుకోలేదండీ! ఎండకన్నెరుగని జగన్‌మోహన్‌ రెడ్డి ఇలా దళితులకు, గిరిజనులకు, మహిళలకు, మైనారిటీలకు, వెనుకబడిన కులాలవారికి, ఇంత పెద్ద పీట వేస్తారని అనుకోలేదండీ’ అంటూ ఎంతో స్పందనతో మాట్లాడాడు.

నిజానికి ఈ వర్ణ(కుల) వ్యవస్థను అంతం చేయడం.. ఈ దేశ ప్రజల శ్రేయస్సును కోరేవారందరి ప్రథమ కర్తవ్యం. ఆర్థిక దోపిడీకి గురవుతున్న సాధారణ శ్రామికులలో కూడా ఈ అణగారిని ప్రజానీకమే ఎక్కువ. వర్గదోపిడీని అరికట్టాలన్నా, ఈ కులవ్యవస్థను బద్దలు కొట్టకుండా మన దేశంలో అసాధ్యం. విభిన్న జాతుల సమాహారం మన భారతదేశం అని చెప్పుకున్నాం కదా! ఈ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ జాతిలో అయినా ఈ కులవివక్ష ఉంది. అదే మన సామాన్య అంశంగా ఉందన్నదీ నిర్వివాదాంశమే. ఆంధ్రప్రదేశ్‌లో అయినా, బెంగాల్‌లో అయినా, ఉత్తరాది రాష్ట్రాల్లో అయినా కులవ్యవస్థ అమానవీయత మన దేశంలో సర్వేసర్వత్రా వ్యాపించింది. అత్యంత పేదరికం అనుభవిస్తున్న శ్రమజీవులూ ఈ అణగారిన కులాల్లోనే ఉన్నారు. అంతేకాదు మన జనాభాలో ఆధిపత్య కులాలవారు 20 శాతం ఉంటే మిగిలిన వారిలో అత్యధికులు సామాజిక న్యాయం పొందవలసిన అణగారిన ప్రజానీకమే. 

ఎక్కువమంది పేద మధ్యతరగతి ప్రజానీకం ఉండగా, కోటీశ్వరుల సంఖ్య చట్టసభల్లో పెరుగుతుండటం నిజం. ప్రజాస్వామ్యం పెంపొందే క్రమంలో అది పేద, మధ్యతరగతి ప్రజానీకానికి అనుగుణంగా మారాలి. అలాగే సామాజిక అణచివేతకు గురవుతున్న వారిలో దళితులకు, గిరిజనులకు రిజర్వేషన్‌ ఉన్నది. ఇతర వెనుకబడిన కులాల వారికి, మహిళలకు, మైనారిటీలకు, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌ అవసరం. అప్పుడే ఈ ప్రజాస్వామ్యం ఆధిపత్య కుల ధనస్వామ్యంగా మారకుండా ఉంటుంది. పార్లమెంటులో వైఎస్సార్‌ సీపీ తరపున విజయసాయిరెడ్డి.. ఇతర వెనుకబడిన కులాలవారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్‌ కల్పించాలని, ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టి, ఆ ప్రజాసమూహాల అభినందనలు అందుకున్నారు.

నిజానికి ఇలాంటి బిల్లును కమ్యూనిస్టులే ఎప్పుడో పెట్టాల్సి ఉండింది. కానీ సృజనాత్మకత, సాధారణ వివేకం కనుమరుగైనట్లుగా.. ఈ కుల వ్యవస్థ నిర్మూలనకు నడుం కడితే, వర్గపోరాటం వెనకపట్టు పడుతుందని వాదిస్తున్న కమ్యూనిస్టు నేతల ఆలోచనా ధోరణి సరి కాదు. కులతత్వం మన భారతదేశంలో ఘనీభవించింది అని ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ అన్నారు. పైగా మార్క్సిజం ప్రవచించిన నాటి ‘ప్రొలిటేరియట్స్‌’ నేడు బాగా తగ్గిపోతున్నారు. నేడు ట్రేడ్‌ యూనియన్‌లలో ప్రధానంగా ఆర్గనైజ్డ్‌ ట్రేడ్‌ యూనియన్‌లలో (రెక్కల కష్టం తప్ప మరేమీ లేనివారు), బ్యాంకింగ్‌ రంగంలో, తదితర పరిశ్రమల్లో ఉన్న వారిలో అత్యధికులు మధ్యతరగతివారు. వారు ఆర్థిక సమస్యలతో పాటు నిజానికి, అంతకంటే కొంచెం ఎక్కువగానే సామాజిక న్యాయం అవసరమని అర్రులు చూస్తున్నారు.  కనుక వర్గపోరాటాన్ని, వర్ణపోరాటాల్ని పరస్పర విరుద్ధంగా ఆలోచించడం మన దేశ పరిస్థితుల్లో మార్క్సిజం అనిపించుకోదు. 

తెలంగాణ రాష్ట్ర సీపీఎం, నాడు తెలంగాణ పోరాటంలో దిశానిర్దేశం చేసి నేడు ఈ కులనిర్మూలన పోరాటంలో ముందున్నందుకు వారికి అభినందనలు! ఆ తెలంగాణ గడ్డమీదే లాల్‌–నీల్‌ నినాదమిచ్చాడు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం! కానీ, ఇప్పుడెందుకో పార్టీ కేంద్రనాయకత్వం తెలంగాణ సీపీఎం విధానాన్ని ప్రోత్సహిస్తున్నట్లు లేదు. ప్రజలు ఎక్కడ ఏరకమైన దోపిడీకి, అణచివేతకు గురవుతున్నారో వారికి అండగా ఉంటేనే మనదేశంలో కమ్యూనిస్టు పార్టీలకు ఏమాత్రమైన పురోగమనం ఉంటుంది. లేకుంటే ఆ పార్టీల ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. 

జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ ఈ విషయంలో.. మన మార్క్సిస్టు పరిభాషలో, బూర్జువా పార్టీనే అయినా, బహుజన వామపక్ష సంఘటన వంటి వాటి నిర్మాణంతో, ప్రస్తుత దేశ, కాల, రాష్ట్ర, సామాజిక న్యాయ పరిస్థితులకు అనుగుణంగా, సాధారణ ప్రజానీకం తరఫున పేదలకు అండగా సామాజిక న్యాయదిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రజల అభ్యున్నతి – ప్రస్తుత దశలో, ఎలా ఆచరణలోకి వస్తే, దానిని బలపర్చి, మొత్తం సమాజం మార్క్స్‌ చెప్పిన పరిణామ దిశగా పురోగమించడానికి కమ్యూనిస్టులు ప్రయత్నించాలని మనసారా కోరుకుంటున్నాను.

వ్యాసకర్త : డాక్టర్‌ ఏపీ విఠల్‌, మార్క్సిస్టు విశ్లేషకులు 

మొబైల్‌ : 98480 69720

మరిన్ని వార్తలు