కలల రాజధాని X ప్రగతి రాజధాని

26 Dec, 2019 01:15 IST|Sakshi

విశ్లేషణ

రాజధాని మార్పుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తాజా ప్రతిపాదనతో గ్రాఫిక్స్‌ రాజధాని భ్రమలు తొలగిపోయాయి. టీడీపీ ముందుకు పోతుందన్న నమ్మకం లేని బాబు, ఆ మధ్య వెనక్కి నడవటం ప్రాక్టీసు చేశారు. రెండు రాజధానులా, మూడు రాజధానులా అని ఇప్పుడు కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర అభివృద్ధి ముఖ్యం. అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకూ అందాలి. సామాజిక రాజకీయ వ్యవహారాల్లో ఎంతో కొంత అనుభవం ఉన్న సినీ నటుడు చిరంజీవి సైతం వైఎస్‌ జగన్‌ మూడు రాజధానుల ప్రస్తావనను సమర్థిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి ప్రజానుకూల పాలనపై నమ్మకం ఉందన్నారు. పైగా, బాబు కంటే జగన్‌పై అత్యధిక ప్రజలలో విశ్వసనీయత ఉంది. వైఎస్‌ జగన్‌ ప్రతిపాదిస్తున్న రాజధాని ప్రగతికి సంబంధించినది కాగా, బాబు ప్రతిపాదించిన రాజధాని కలల రాజధాని మాత్రమే!

ఇటీవల చంద్రబాబు కలల రాజధాని గురించి ఆందోళనలు మిన్నంటుతున్నట్లు కొన్ని మీడియా చానళ్లు, పత్రికలు గగ్గోలు పెడుతున్నాయి. అసలు చంద్రబాబుకి ఒక మంచి రాజధాని నిర్మించాలన్న ఆలోచన లేనేలేదని నాకు అనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో బాబు తెలుగుదేశం, మోదీ బీజేపీ, పవన్‌ కల్యాణ్‌ జనసేన అన్నీ కలిపి పోటీ చేసినప్పటికీ, ఆ అవకాశవాద రాజకీయ కూటమికి.. ఒంటరిగా పోటీ చేసిన వైఎస్సార్‌సీపీపై కేవలం 1.5 శాతం ఓట్ల ఆధిక్యతతో అధికారం దక్కింది. ఆ క్షణంలోనే చంద్రబాబు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకాన్ని కూడా వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధపడి ఉంటారు. ఇక 2019లో తాను మళ్లీ గెలవడం అసాధ్యం అని దూరదృష్టితో గ్రహించి ఉంటారు. 

అందుకే అయిదేళ్లపాలనలో సాధ్యమైనంతగా సంపద సృష్టించుకుని, తన వారికి, తన పుత్రునికి తన సామాజిక వర్గం వారికి, బంధుమిత్రులకు తాను సృష్టించిన సంపదను కట్టబెడతామని నిర్ణయానికి వచ్చి ఉంటారు. ఏ ఒక్కరితోనూ చర్చించకుండా అప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికను తుంగలో తొక్కి, పూర్తిగా అప్రజాస్వామికంగా అమరావతిని ఏకపక్షంగా రాజధానిగా ప్రకటించారు. విద్యాలయాల పేరుతో ధనాగారాన్ని సృష్టించుకున్న పెద్దమనిషి నారాయణ నేతృత్వంలో కమిటీ వేసి దానితో అమరావతి రాజధాని అని ‘మమ’ అనిపించారు. అలా అమరావతి చంద్రబాబు ఏకపక్ష నిర్ణయమైంది. ఇందులో ప్రజాస్వామ్య పద్ధతి ఏ కోశానా కనిపించదు.

చంద్రబాబు అయిదేళ్ల పాలనలో ప్రధానిచేత ప్రతిష్టింపజేసిన రాజధాని ఫలకం అలాగే ఉండిపోయి ఆ ఫలకం చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి బాబుగారి సామర్థ్యానికి ప్రతీకగా నిలిచివున్నాయి. ప్రపంచంలోని అయిదు గొప్ప రాజధానులతో సమానంగా అమరావతి నిలిచేటట్టు చేస్తానని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు బాబు. సింగపూర్‌ నుంచి రాజధాని నమూనా తయారు చేయించారు. 

ఆకాశ హర్మ్యాలు, 20, 25 బహుళ అంతస్తులు, ఉద్యానవనాలు, నీటిలో విహారాలు, అద్భుతమైన శిల్పాలమయంగా రాజధానిని రూపొంది స్తున్నామని బాబు చెప్పారు. కానీ ఆ నమూనా చూసిన వారెవరూ ఆనందించలేదు. రాజమౌళి బాహుబలి ఎన్నో రెట్లు మెరుగ్గా అని పించిందన్నారు వారు. ఇంకేం.. రాజధాని నిర్మాణానికి రాజమౌళిని కూడా రప్పించేశారు. ఐకాన్‌ బ్రిడ్జిలూ, పగలు రాత్రి తెలియని జాజ్వల్యమానమైన విద్యుత్‌ వెలుగులతో ప్రజల కళ్లకు గ్రాఫిక్స్‌తో గంతలు కట్టారు.

అదేసమయంలో తన కలల రాజధానికి లక్షకోట్ల రూపాయలు అవసరమవుతాయని బాబు చావుకబురు చల్లగా చెప్పారు. కట్టుబట్టలతో గెంటేశారనీ, అమరావతిలో దాదాపు దిశమొలతో తిరి గామనీ, చివరకు పడుకునే మంచాలు లేక నేలమీదే పడుకున్నామనీ, చెట్లకు వేళ్లాడవలసి వచ్చిందనీ ఒకవైపు దీనంగా అరుస్తూ, మింగమెతుకు లేనివానికి మీసాలకు సంపెంగ నూనె అన్నట్లు ఈ పరిస్థితిలో ఉన్న రాష్ట్రానికి ప్రపంచ స్థాయి, గ్రాఫిక్‌ రాజధాని అవసరమా అని ఆనాడే మాబోటివాళ్లం చెబితే బాబు గారి అహం దెబ్బ తింది. మన తెలుగువారు ప్రపంచ స్థాయి అద్భుత రాజధానికి అర్హులు కారా, మన తెలుగువారి సత్తా చూపించలేమా అంటూ హుంకరించారు. ఇక భూ సమీకరణ మొదలెట్టారు. అదుగో ద్వారక, ఆలమందలవిగో.. యదుసింహుండు వశించు మేడ అదిగో అన్నట్లుగా ప్రజలకు సింగపూర్‌ డాక్యుమెంట్లు చూపిస్తూ భూసమీకరణకు పురికొల్పారు. 

తన సామాజిక వర్గానికి చెందిన మోతుబరులను రప్పించి వారిచేత అమరావతి ప్రాంతంలోని సాధారణ రైతులతో చెప్పిం చారు. ‘మీరు కూడా భూసమీకరణకు భూములిస్తే మాలాగే విలాసవంత జీవితం గడపవచ్చు. భూములిచ్చినవారికి రాజధాని ప్రాంతంలో బహుగిరాకీగా ఉండే వ్యావార, వాణిజ్య ప్రాంతంలో ఎకరానికి 1200 చ.అడుగులను బాబు ఇస్తారని అది కోట్ల విలువ చేస్తుంద’ని ఈ మోతుబరులు నమ్మబలికారు. 

కొందరు అమాయక రైతులు, అగ్రిగోల్డ్‌ బాధితులు ఆ మాటలకు నమ్మేశారు. కానీ ఈ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంపై ఆధారపడలేమని, మా సేద్యం మేం చేసుకుంటామని తిరస్కరించిన సన్నకారు రైతులను వేధించారు. బలవంతంగా అయినా సరే భూసేకరణ చేస్తామని అప్పుడు మేం చెబుతున్న ఈ ప్లాట్లు కూడా రావని బెదిరించి వారినుంచి భూములు లాక్కున్నారు. ఎదిరించిన రైతుల భూముల్లో అరటి, పండ్ల తోటలను బాబు అనుయాయులు తగులబెట్టారు. 

ఇలాంటి పాశవిక చర్యలన్నింటికీ పూనుకుని రాజధాని పేరుతో 33 వేల ఎకరాలను సేకరించారు. ఇంకా భవిష్యత్‌ అవసరాలకోసం, రింగ్‌ రోడ్డులను చూపించి మొత్తం 55 వేల ఎకరాలను బాబు ప్రభుత్వం తన అధీనంలోకి తెచ్చుకుంది. దారుణమైన విషయం ఏమిటంటే ఎస్సీ,ఎస్టీలకు గతంలో వైఎస్సార్‌ పాలనలో దఖలుపర్చిన భూములను ఎవరూ కొనరాదని చట్టం చేశారు కానీ దానికి కూడా తూట్లు పొడిచిన చంద్రబాబు ఒక కొత్త చట్టం పేరుతో ఆ దళితుల భూములను కూడా కొనవచ్చని తీర్మానించి వాటిని కూడా తనవారిచేత కొనిపించారు. నిజానికి రాజధానికి అంత భూమి అవసరం లేదు. ఆ పేరుతో బడాబాబులు, బాబుగారి సహజ మిత్రులు, ఆయన బంధువులు, బినామీలు, ఇంకా రియల్‌ ఎస్టేట్‌ కోసం భూదాహంతో ఉన్నవారు అలాంటి భూబకాసురులకు కట్ట బెట్టేందుకు ఇంకా ఎన్ని వేల ఎకరాలైనా సరిపోవు మరి. ఇదీ వెన్నుపోటు బాబు గారి కలల రాజధాని. ఇలాంటిది వాస్తవంలో రాజధాని కాలేదు.

అయినా రాజధాని నిర్మాణానికి ఈ ఆరు సంవత్సరాల్లో లక్ష కోట్లకుగాను బాబు గారి కలల ప్రభుత్వం ఖర్చు చేసింది 5 వేలకోట్లు. అంటే ఏడాదికి వెయ్యికోట్లు సుమారు ప్రభుత్వం ఖర్చు చేసినట్టు. ఇలా అయితే బాబుగారి కలల రాజధాని నిర్మాణం పూర్తయేందుకు 1000 సంవత్సరాలు పడుతుంది.  2050 నాటికి ప్రపంచ ప్రఖ్యాత విలాసవంతమైన పెద్ద రాజధానిగా అమరావతి నిర్మాణమవుతుందని బాబు చెప్పారు. అయితే బాబుగారు ఏమోగానీ ఆయన వెన్నుపోటు పార్టీలో ఇప్పుడున్న 23 మందిలో ఎంతమంది వచ్చే ఎన్నికల నాటికి ఉంటారన్నది చెప్పలేం. ఏదేమైనా చంద్రబాబు తన పార్టీ ముందుకు పోతుందని నమ్మటం లేదు.

అందుకే ఆయన ఆమధ్య వెనక్కు నడవటం ప్రాక్టీస్‌ చేశారు కదా. నిజంగా రియల్‌ ఎస్టేట్స్‌ ద్వారా 100 రెట్లు ఎక్కువగా ఆదాయం పొందవచ్చని ప్లాన్లు చెబితే సాధారణ రైతులు, కౌలు రైతులు చంద్రబాబు మోసానికి గురైనారు. అయినా అమాయకంగా మనం ఇంకా బాబుగారి మాటలు నమ్మగలమా? చంద్రబాబు నయవంచనతో అమరావతిని కేవలం తన ధన దాహానికే వాడుకున్నారు. ఆయన కట్టించిన భవనాల నాణ్యత ప్రశ్నార్థకం అయ్యాయి. నమ్మదగిన ఒక్క అభివృద్ధి కూడా లేదు. అభివృద్ధిపై ఆయన మాటలు నీటి మూటలే. కనుక ఆయనను విశ్వసించడం ఇకనైనా మానుకోమని అమరావతి ప్రాంత ప్రజలకు చెప్పడమే మిగిలింది. మిమ్మల్ని మోసం చేసింది చంద్రబాబే అని చెప్పడమే మిగిలింది. 

ఇక ప్రజల మనిషిగా, మనసున్న నేతగా ఎదుగుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల విషయం. ముందు ఆయన శాసనసభలో ప్రసంగిస్తూ తన అభిప్రాయంగా ఆ సంగతిని ప్రస్తావించారు. తగిన రీతిలో రాజధానిపై అధ్యయనం చేశారు. రాజధానిపై ఒక కమిటీ వేసి దాని తుది నివేదికను ప్రజలకు తెలియజేశారు. మంత్రివర్గం కూర్చుని ఆ కమిటీతో చర్చించి దానిపై వారు ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తారు. రాజధాని నిర్ణయం చర్చకు వస్తుంది. 

రెండు రాజధానులా, మూడు రాజధానులా అని ఇప్పుడు కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర అభివృద్ధి ముఖ్యం. అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకూ అందాలి. మూడు రాజధానులు అభివృద్ధి అయితే మంచిదే కదా. సామాజిక రాజకీయ వ్యవహారాల్లో ఎంతోకొంత అనుభవం ఉన్న సినీ నటుడు చిరంజీవి సైతం జగన్‌ మూడు రాజధానుల ప్రస్తావనను సమర్థిస్తున్నారు. 

జగన్‌ ప్రజానుకూల పాలనపై నమ్మకం ఉందన్నారు. అదే సమయంలో రైతులకు న్యాయం జరగాలని సూచించారు. ఆ సూచన ఆచరణీయమేనని వైఎస్సార్‌సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రైతులకు న్యాయమైన పరిహారం చెల్లిస్తామన్నారు. అన్నింటినీ మించి చంద్రబాబు కంటే జగన్‌పై అత్యధిక ప్రజలలో విశ్వసనీయత ఉంది. వైఎస్‌ జగన్‌ ప్రతిపాదిస్తున్న రాజధాని ప్రగతికి సంబంధించినది కాగా, బాబు ప్రతిపాదించిన రాజధాని కలల రాజధాని మాత్రమే!
వ్యాసకర్త : డాక్టర్‌ ఏపీ విఠల్‌, మార్క్సిస్టు విశ్లేషకులు 

మొబైల్‌ : 98480 69720

మరిన్ని వార్తలు