గరిమెళ్ల గర్జనకు వందేళ్లు!

20 Dec, 2019 00:18 IST|Sakshi

సందర్భం 

గాంధీ పిలుపుతో ఉధృతంగా సాగుతోన్న సహాయనిరాకరణోద్యమ సమయంలో ఉద్యమకారుల గళాలు గర్జించిన ‘మాకొద్దీ తెల్లదొరతనం...’ గీతానికి వందేళ్లు! జాతి యావత్తుకీ ఉద్యమ గీతమందించిన గరిమెళ్ల సత్యనారాయణ రాజకీయోద్యమ రచయిత! సాహిత్యాన్ని సామాజిక అభ్యున్నతికి వినియోగించాలనే లక్ష్యాన్ని కలిగిన రచయిత! స్వాతంత్య్రోద్యమ సందర్భాన రాసిన ‘స్వరాజ్యగీతాలు’ (1921), ‘హరిజన పాటలు’ (1923) వంటి గీతాలు ఉత్తేజాన్ని రగిలించాయి. దాంతో గరిమెళ్లను తెల్లదొరలు నిర్బం  ధానికి గురిచేశారు. కేవలం ‘మాకొద్దీ తెల్లదొరతనం...’ గీతాలాపన కలిగించే ఉద్రేకాన్నీ, ఉత్తేజాన్నీ స్వయానా విని గ్రహించిన ఆంగ్లేయ అధికారి, తెలుగుభాష తెలియని తననే యింతటి సంచలనానికి గురిజేస్తే, భాష తెలిసిన ప్రజలనింకా సంచలనానికి గురిజేసి ఉద్యమోన్ముఖులను జేస్తుందని  రాజద్రోహనేరం ఆరోపించి గరిమెళ్లను ఏడాది పాటు జైల్లోకి నెట్టారు. జైలులో వున్నపుడే గరిమెళ్ల తండ్రి, తాతయ్య, భార్య మరణించారు. జైలులోనున్న గరిమెళ్ల ఈ విషాద సందర్భంలోనయినా  పెరోల్‌పై విడుదల కోసం, క్షమాభిక్ష కోరడం వంటి చర్యలకు దిగజారలేదు.  

జాతీయోద్యమం ఉధృతంగా ఉన్నపుడు ప్రజలను  ఉత్తేజపరచడానికి ఉపయోగపడే పాటలను రాసిన గరిమెళ్ల ఉద్యమం నెమ్మదించినపుడూ, స్వాతంత్య్రం సిద్ధించాక ప్రజలను ఆలోచింపచేయ డానికి వ్యాసరచనలు చేశాడు. రాజకీయాలను ప్రభావితం చేసే ఆర్థిక పరిస్థితుల గురించి, జస్టిస్‌పార్టీ, స్వరాజ్యవాదుల గురించీ ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు గరిమెళ్ల తన భావాలను వెల్లడించారు. అభ్యుదయకర భావావేశం, రష్యా కమ్యూనిజంపట్ల అనురక్తీ వుండినా భారతదేశానుకూల కమ్యూనిజం కావాలనడం, దేశాన్ని అభివృద్ధి చేయడానికి ‘అవతారమూర్తి దిగిరావాలనడం’ వంటి భావాల పరిమితి గరిమెళ్ల వ్యాసాల్లో కన్పించినా ఆయన నిబద్ధ ప్రజా పక్షపాత రాజకీయ రచయితే! రాజకీయ సంబంధ అంశాలతో పాటు కథ, నవల, భాషా పరిణామం వంటి సాహిత్యాంశాల మీద కూడా అనేక రచనలు చేశారు. గృహలక్ష్మి, కృష్ణాపత్రిక, ఆనందవాణి, ఢంకా, ఆంధ్రప్రభ నుంచి భారతి దాకా అనేక పత్రికల్లో గరిమెళ్ల రచనలు ప్రచురణ అయ్యాయి. తమిళంలోని ‘తిరుక్కుళ్‌’, ‘నందియార్‌’ లనూ; కన్నడలోని ‘తళ్లికోట’ రచననూ తెలుగులోకి అనువదించారు. భోగరాజు పఠాభి సీతారామయ్య గారి ‘ఎకనమిక్‌ కాంక్వెస్ట్‌ ఆఫ్‌ ఇండియా’ రచనను తెలుగులోకి అనువదించారు.

తనకూ, తనతో మిగిలిన తల్లి, చెల్లెలకూ పట్టెడన్నం పెట్టలేక స్వగ్రామాన్ని వదిలి వెళ్లాల్సిన సందర్భంలో కూడా సాహిత్యం కోసం తాతలనాటి ఇంటిని అమ్మేసి ‘శారదా గ్రంథమాల’ స్థాపిం చారు. రచనారంగం, రాజకీయభావజాలం కారణంగా ఉపాధ్యాయ ఉద్యోగం, గుమస్తా ఉద్యోగం కోల్పో యేరు. తర్వాత జీవికకోసం చిన్నచిన్న నౌకరీలు చేశారు. దుర్భర దారిద్య్రాన్ని అనుభవిం చారు. బతుకుతెరువు కోసం చివరికి బిచ్చమెత్తు కొని జీవించారు. తన గళాన్నీ, కలాన్నీ దేశాభ్యుదయానికే వినియోగించిన ఆ మహనీయుడు 1952 డిసెంబర్‌ 18న మద్రాస్‌లో మహానగరంలో అనామకుడిగా మరణించాడు. గరిమెళ్ల జాతికి అందించిన ‘మాకొద్దీ తెల్ల దొరతనం...’ ఉద్యమగీతానికి వందేళ్లు! స్వాతంత్య్రోద్యమంలో ఏ ఆశయాలతో, ఆకాంక్షలతో గరిమెళ్ల వంటి అనేకులు త్యాగాలు చేశారో ఆ ఆశయాలు, ఆకాంక్షలేవీ నెరవేరలేదు. కుల, మత, లింగ, ప్రాంత అసమానతలతో మండుతున్న ఖండంలా ఉంది దేశం! ‘కుక్కలతో కొట్లాడీ కూడూ తింటామండీ’ అన్న గరిమెళ్ల ఆవేదన యిప్పటికీ మాసిపోలేదు. వందేళ్ల నాటి గరిమెళ్ల గర్జనను మళ్లీ అందిపుచ్చుకోవాల్సిన సందర్భంలోనే దేశమింకా వుంది.
(డిసెంబర్‌ 22వ తేదీన శ్రీకాకుళంలో గరిమెళ్ల సంస్మరణోత్సవం)


వ్యాసకర్త అధ్యక్షులు,ఉత్తరాంధ్ర రచయితలు, కళాకారుల వేదిక
అట్టాడ అప్పల్నాయుడు

మరిన్ని వార్తలు