ఈచ్‌ వన్‌–టీచ్‌ వన్‌కు పుస్తకం పనిముట్టు

4 Jan, 2020 01:37 IST|Sakshi

విశ్లేషణ 

33వ జాతీయ పుస్తకప్రదర్శన హైదరాబాద్‌ మహానగరంపై చెరిగిపోని సంతకం చేసింది. మాకు కొండంత అండగా ఉన్న రాష్ట్రముఖ్యమంత్రి  కల్వ కుంట్ల చంద్రశేఖరరావుకు హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ అభినందనలు తెలియజే స్తుంది. డిసెంబర్‌ 23 నుంచి జనవరి 1 వరకు సాగిన ఈ పుస్తక ప్రదర్శనలు విజయవంతంగా ముగిశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ‘ఈచ్‌ వన్‌–టీచ్‌ వన్‌’ పిలుపునందుకుని ఈ పుస్తక ప్రదర్శనలను ఒక ఉద్యమంగా గ్రామగ్రామానికి తీసుకుపోతామని బుక్‌ఫెయిర్‌ నిర్వాహక కమిటీ ప్రకటించింది.
 
పాఠశాలలు, కళాశాలలు, గ్రామ పంచాయ తీలు, పోలీస్‌స్టేషన్లు, మున్సిపాల్టీలు, పట్టణాల లోని అపార్ట్‌మెంట్ల దాకా పుస్తక ప్రదర్శనలను తీసుకుపోయేందుకు కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకుంది. మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పలు హోదాలలో వున్న ప్రతినిధులు, పాలనారంగానికి చెందిన ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అన్ని కార్యక్రమాలకు పూలదండలు, శాలువాలు, బోకేలకు బదులుగా పుస్తకాలను బహుమతులుగా ఇస్తే మంచి ఫలితాలు వస్తాయని పుస్తక ప్రదర్శన కోరుతుంది. బహుమతులుగా ఇచ్చిన పుస్తకాలను తిరిగి పేద విద్యార్థులకు, విద్యాసంస్థలకు బహూకరిస్తే అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
 
హైదరాబాద్‌ మహానగరం నుంచి 33 జిల్లాల వరకు పుస్తక ప్రదర్శనలను తీసుకుపోవడమే కాకుండా ఇకపై చేయబోయే పుస్తక ప్రదర్శనలను ‘‘టీచ్‌ వన్‌–ఈచ్‌ వన్‌’’ నినాదంగా ముందుకు తీసుకుపోవాలి. జ్ఞాన తెలంగాణ కోసం 2020 సంవత్సరం పొడుగుతా పుస్తక ప్రదర్శనలను కొనసాగించి ‘అక్షర తెలంగాణ’గా రూపొందించేందుకు అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కేజీ టు పీజీ విద్యను పటిష్టం చేసేందుకు పుస్తక ప్రదర్శనలను ఒక పని ముట్టుగా అందించాలన్న దీక్షతో కృషి చేయాల్సి ఉంది.

పుస్తక ప్రదర్శనలంటే అమ్మకాలు, కొనుగోలు కార్యక్రమాలు అన్న దృక్పథాన్ని మార్చి పుస్తక ప్రదర్శనలను కూడా నాలెడ్జ్‌ సెంటర్లుగా మార్చేం దుకు ప్రయత్నించడం ఒక పరిణామం. తెలంగాణ రాష్ట్రంలో ఆరేళ్లుగా పుస్తక ప్రదర్శనల సందర్భంగా వందల కాలేజీల్లో, స్కూళ్లలో సెమినార్లు నిర్వహించడం జరిగింది. పిల్లలతో వక్తృత్వ, వ్యాస రచన పోటీలు నిర్వహించి పుస్తకంపై ప్రచారం కొనసాగించారు. మాతృభాషను సంరక్షించుకునే పనిని, తెలుగు భాషపై ప్రేమను, మమకారాన్ని పెంచేం దుకు, కొత్త తరానికి తెలంగాణ సంస్కృతిని, చరిత్రను, సాహిత్య, సాంస్కృతిక వైభవాన్ని అందించే విధంగా పుస్తక ప్రదర్శనలను తీర్చిదిద్దాలన్న తలంపుతో బుక్‌ఫెయిర్‌ కమిటీ ముందుకు సాగడం మొత్తం సమాజం ఆహ్వానించదగింది. 

పుస్తకాలు చదవటంపై అభిలాషను పెంచటం పుస్తక ప్రదర్శన లక్ష్యం. గ్రంథాలయాలు చేసే పనిని బుక్‌ఫెయిర్‌ కూడా తమ శక్తి మేరకు చేయా లని తలంచటం రాష్ట్ర గ్రంథాలయాల పునర్నిర్మాణ ఉద్యమానికి దోహదపడుతుంది. ఆసక్తిగల పాఠకులతో బుక్‌లవర్స్‌ గ్రూప్స్‌ ఏర్పాటు చేసి సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేయాల్సి ఉంది. సంపూర్ణ అక్షరాస్యతకు కావాల్సిన సాహిత్యాన్ని శక్తికొద్దీ బుక్‌ఫెయిర్‌ ద్వారా కూడా అందించే ప్రయత్నం ముమ్మరంగా జరగాలి. ఇప్పటికే వయోజన విద్యాకేంద్రాల ద్వారా సాహిత్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. బుక్‌ఫెయిర్‌ నిర్వహణదారులు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు సంపూర్ణ అక్షరాస్యతకు ప్రోత్సాహం కల్గించే విధంగా సాహిత్యాన్ని తయారుచేసి అందించే పనిని శక్తికొద్దీ చేయాలని నిర్ణయం తీసుకోవడం శుభసూచకం. ఈ స్ఫూర్తితో 2020 సంవత్సరానికి 2020 పుస్తక ప్రదర్శనలు జరపాలని బుక్‌ఫెయిర్‌ తీసుకున్న నిర్ణయం విజయవంతమైతే అది ‘ఈచ్‌ వన్‌–టీచ్‌ వన్‌’ నినాదానికి అండగా మారుతుంది.

వ్యాసకర్త : జూలూరు గౌరీశంకర్‌, అధ్యక్షులు, హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌

మరిన్ని వార్తలు