పురోగమన దిశలో జగన్‌ పాలన

23 Aug, 2019 00:44 IST|Sakshi
సీఎం వైఎస్‌ జగన్‌

ఈ మధ్య సాక్షిలో నేను రాసిన ‘చంద్రబాబు భజనలో బీజేపీ’ వంటి నా వ్యాసాలు చదివిన మార్క్సిస్టు మిత్రుడొకరు ’జై మార్క్సిజం – జై జగన్‌’ అని ఒక మెసేజ్‌ పెట్టారు. అలాగే ఆ మధ్య ‘చిరస్మరణీయుడు సుందరయ్య’ అని ఆ మహనీయుని పేరును మన ప్రజలకు, ప్రత్యేకించి యువతకు స్ఫూర్తిదాయకంగా ఉండేటట్టు మన ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పర్చనున్న జిల్లాకో లేక ప్రజలకు ప్రాణప్రదమైన ఒక ప్రాజెక్టుకో, లేదా పోలవరం ప్రధాన కుడి ఎడమల కాలువలలో ఒకదానికో ఆలోచించి పెట్టమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ చిన్న లేఖ రాశాను. ‘అలా సుందరయ్య పేరు పెడితే సోషలిజం వచ్చేస్తుందా అండీ’ అనీ, ‘మీరు విజ్ఞప్తి చేయకపోయినా వైఎస్‌ జగన్‌.. సుందరయ్య గారి పేరు పెడతారు లెండి. ఎలాగూ ఆయనా రెడ్డే కదా!’ అనీ, మరీ తమాషా ఏమిటంటే,  ‘మీరు విఠల్‌ రెడ్డి కదా, సీపీఐ నాయకులేనా’ అనీ వంద అభినందనలతోపాటు వ్యాఖ్యానాలు కూడా పాఠకుల నుండి వస్తుంటాయి.

‘మీరు మార్క్సిస్టు  విశ్లేషకులా? అయితే చంద్రబాబుపై విమర్శలేమిటండీ మీ రాతల్లో ? చివరకు తెలుగుదేశం పార్టీ అని కూడా అనకుండా వెన్నుపోటు పార్టీ అని హేళన చేస్తూ రాస్తారు. ఇది పెయిడ్‌ న్యూస్‌ కిందికి రాదా?’ అని అడిగేవారూ ఉంటారు. ఏమండీ, మీరు తెలంగాణ వారా? తెలంగాణ సీపీఎం పార్టీ సామాజిక న్యాయ పోరాట వేదికగా ఉన్న బహుజన వామపక్ష సంఘటనను బలపరుస్తూ రాస్తుంటారు. అంటే అంబేడ్కర్‌ సిద్ధాంతం, మార్క్సిజం రెండూ సమాన ప్రాధాన్యత ఉన్నవేనా’ అని తెలిసో తెలియకో అడిగేవారు కూడా ఉంటారు. వీళ్లకి ఫోన్‌లోనే జవాబు చెప్పినా వీటన్నింటి మధ్యా ఒక సాధారణ అంశం ఉంది గనుక సంక్షిప్తంగా ఈ వ్యాస పరిధిలోనే సమాధానం ఇవ్వదలిచాను.

ముందుగా ఒక విషయం చెప్పాలి. ఇటీవల అమెరికాలో వేలాది ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి డల్లాస్‌లో చేసిన ప్రసంగం తెల్లవారుజామున 4–5 గంటల మధ్యలో ప్రసారమైనా నేను శ్రద్ధగా విన్నాను. నాకు చాలా ముచ్చటేసింది. అమెరికా జాతివివక్ష పోరాట యోధుడు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ (జూనియర్‌) స్ఫూర్తితో అది నా కల అంటూ ఎంతో నిజాయతీగా, ఉత్తేజకరంగా, జగన్‌ ప్రసంగం అత్యంత హృద్యంగా, ప్రస్తుత వాస్తవికతకు అద్దంపడుతూ ఆకట్టుకునే రీతిలో సాగింది. ముగింపులో జగన్‌ ‘నాకు గాంధీజీ ఆదర్శం, అంబేడ్కర్‌ రచనలతో ప్రభావితుడినయ్యాను. సమాజంలో మతం, కులం, లింగ వివక్ష లేకుండా ఆదివాసీ, గిరిజన, బీసీ, మైనారిటీ మహిళల అభ్యున్నతి నా కల. మనిషిని మనిషి దోచుకోని వ్యవస్థ, సామాజిక న్యాయం జరిగే అసమానతలు, అన్ని రకాల అణచివేతలు లేని సమాజం రూపు దిద్దుకుంటేనే మనకు నిజమైన స్వాతంత్య్రం. బీసీలంటే వెనుకబడిన కులాలు అని కాదు. సమాజ అస్తిత్వానికి  బ్యాక్‌ బోన్‌ (వెన్నెముక) కులాలు అన్నదే దాని అసలు అర్థం’ అన్నారు. 

నేను మార్క్సిజాన్ని ఆచరించాలని ఆశించే వ్యక్తిని. మార్క్సిజం కేవలం గాలిలో ఉండదు. మన కోరికలను బట్టి సమాజ పరిణామం జరగదు. భౌతిక వాస్తవ పరిస్థితి ఆధారంగా సమాజ పరిణామ క్రమం జరుగుతుంది.  ఆనాటి స్వాతంత్య్రోద్యమం వలస పాల ననుంచి మన దేశానికి స్వాతంత్య్రం సాధించడం అప్పటి సామాజిక పరిణామ క్రమంలో పురోగమనమే! స్వాతంత్య్రం వచ్చెననీ సంబరపడగానే సరిపోదోయి అన్న గీతం చెప్పింది నిజమే! మనదేశంలో పేదరికం పోవాలి! శ్రమజీవుల శ్రమఫలితం వారు సంపూర్తిగా అనుభవించాలి. మార్క్సిజం చెప్పినట్లు దోపిడీపై శ్రమ శక్తి వర్గపోరాటం చెయ్యాలి. ఆవిధంగా దోపిడీలేని సమాజం – కమ్యూనిస్టు సమాజం ఏర్పడుతుంది. వర్గపోరాటం దోపిడీలేని, యజమాని–శ్రామికుడు అనే వర్గ వైరుధ్యాన్ని ఆవిష్కరించి వర్గరహిత సమాజాన్ని నెలకొల్పుతుంది. ఈ సాధారణతా పరిధిలోనే మన భారతదేశ ప్రత్యేకతకు అన్వయింపగలగాలి. వివిధ జాతులున్న మన దేశంలో,  మనుçస్మృతి ఆధారిత నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో అణచబడుతున్న నిమ్నకులాలుగా పిలువబడుతున్న వారికీ, అగ్రవర్ణాలు అందునా ఆధిపత్యవర్గాల వారికి శతాబ్దాలుగా సాగుతున్న అణచివేత వైరుధ్యం కూడా ఉన్నది. ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌ మాటల్లోనే, యూరప్‌ దేశాల్లో బానిసవ్యవస్థ అంతమయి తదుపరి దశలకు సమాజం పురోగమించింది. కానీ మన భారతదేశంలో బానిసవ్యవస్థ కులవ్యవస్థ రూపంలో ఘనీ భవించింది. నేటికీ కొనసాగుతోంది.

ఆధిపత్య కులాలపై నిమ్న కులాల ప్రజానీకం కుల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి కుల నిర్మూలన చేసి కులరహిత సమాజానికై పోరాడాలి. ఆర్థిక, సామాజిక, విద్య వంటి సాంస్కృతిక రంగాల్లో వెనుకబడిన కులాలకు చెందిన శ్రామిక శ్రేణులు అధికం. ఆర్థిక వైరుధ్యం పునాది. ఈ కుల అణచివేత ఉపరితలంలోనే ఉంటుంది. కనుక ఆర్థిక అంశాలపై వర్గపోరాటాలే ముఖ్యం. ఈ కుల నిర్మూలన పోరాటం వర్గపో రాటంలో చీలికలు తెస్తుంది అని వాదించే మార్క్సిస్టులకు భారత దేశ ప్రత్యేకత అయిన లాల్‌–నీల్‌ ప్రాధాన్యత తెలియనట్లే. పైగా ఇప్పుడు కమ్యూనిస్టులు 33 పార్టీలుగా చీలిపోయారు. వర్గపోరాటం సాయుధమా, పార్ల మెంటరీ మార్గమా దేశవ్యాప్త సర్వ శ్రామిక సమ్మె లేదా గెరిల్లా పోరా టమా అనే పంథాకు సంబంధించిన వర్గపోరాట రీత్యానే కమ్యూని స్టుపార్టీలు చీలిపోయాయి అన్నది వాస్తవం !

కాబట్టి ఈ స్థితిలో, కష్టజీవులైన రైతులకు, తదితర నిరుద్యోగ చిరుద్యోగులకు మేలు చేసే విధంగా నవరత్నాల మేనిఫెస్టోలో తన పాలన సాగాలన్న ఆకాంక్షతో గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్‌ ప్రయత్నిస్తున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మైనారిటీ మహిళలకు తగిన ప్రాధాన్యతతో దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయనట్లు వారికి మంత్రివర్గంలో చోటు కల్పించారు. మహిళలకు ప్రభుత్వ పథకాలన్నింటా పంచాయతీ పదవులకు, అలాగే కాంట్రా క్టులలో కూడా 50 శాతం కేటాయిస్తామన్నారు. ఆచరణలో చేసి చూపిస్తున్నారు. నేటివరకు అనితర సాధ్యమైన తన పాదయాత్రలో కోట్లాది ప్రజానీకంతో మమేకమైన నాయకుడు జగన్‌. అందుకే ప్రస్తుత పరిస్థితిలో సమాజం పురోగమన దిశగా పరిణామం చెందాలంటే ఏం చెయ్యాలి ? ఆ కృషిని, ఆ పనిని ఎంత అవినీతిరహితంగా నిజాయతీగా, పారదర్శకంగా, మనసు పెట్టి చేయాలో ఒక నిర్ణయానికి రాగలిగారు. ప్రస్తుతం వైఎస్‌ జగన్‌ పాలన. మార్క్సిజం దిశలో సమాజ పరిణామ క్రమంలో ఒక పురోగమన దిశ, ఒక ముందడుగు. అది ఆహ్వానించదగినది.

అంతేకాదు. ఒక నాయకుడు తన అనుచరులను కూడా అన్ని విధాలా కార్యనిర్వహణలో, తనకు తోడ్పడగలిగిన వారిని తయారు చేసుకోగలగాలి. యువకుడైనా తన కృషితో వైఎస్‌ జగన్‌ తన సహచరులకు స్ఫూర్తిదాయకంగా ఎలా నిలిచి, వారిని ఎలా మలుచుకోగలిగాడో మొన్న అమెరికా వెళ్లిన సందర్భంగా మన రాష్ట్రంలో, కృష్ణా, గోదావరి వరదలు వచ్చినప్పుడు ఆయన ఎంచుకున్న మంత్రి వర్గ సహచరులు, శాసనసభ్యులు, ఉన్నత స్థాయి అధికారులు, అం తకు ముందు రోజే గ్రామ వాలంటీర్లుగా ఎంపికైన యువతీయువకులు ఎంత సమష్టిగా, సామర్థ్యంగా ఎంత మానవీయతతో ప్రజలపట్ల వ్యవహరించారో చూసి ఆశ్చర్యానందాలు పొందాను. అలాగే అమెరికాలో ఉన్నప్పటికీ, ప్రతిక్షణం ఇక్కడి వరద పరిస్థితి నష్ట నివారణ చర్యలను ఇతర సాంకేతిక అంశాలను జగన్‌ పర్యవేక్షించిన తీరు అభినందనీయం. ఈ వరదల్లో ఇంతవరకు ఒక్కరు కూడా మృతి చెందిన సందర్భం లేదు. ప్రజలను హెచ్చరించడంలో, సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో, వారికి సాధ్యమైనంతవరకు ఆహారం, మందులు, ఇత్యాది అవసరాలు అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం ఆర్ద్రంగా వ్యవహరించిందని చెప్పక తప్పదు. 

మీరు మార్క్సిస్టు విశ్లేషకులు కదా. చంద్రబాబు గొడవ ఎందుకండీ అని అడిగేవారున్నారని చెప్పాను కదా. ఈ వరదల సందర్భంగా కరకట్టపై ఉన్న అక్రమ కట్టడంలో తాను నివాసముంటూ, వరదరాకతో తన ఇంటికి ముప్పు రావచ్చని ఆ ముందురోజే హైదరాబాద్‌కు మకాం మార్చిన పెద్దమనిషి చంద్రబాబు. నిజానికి 40 ఏళ్ల అనుభవం ఉందని అడక్కపోయినా ఎక్కడ పడితే అక్కడ చెప్పుకునే చంద్రబాబు వరదల సమయంలో తన నివాసంలో ఉంటూనే తనకు తోచిన సూచనలుసలహాలు ప్రభుత్వానికి అందించాల్సి ఉండె. ఆపదలో అక్కరకు రాని అనుభవం ఉంటేనేం, పోతేనేం! పోనీ హైదరాబాద్‌కు వెళ్లినవాడు ఊరుకుండినా బావుండేది. నా కొంప ముంచేందుకు వరదలను ప్రభుత్వం తెప్పించిందని ఎంత హాస్యాస్పద రీతిలో ఆయన వ్యవహరించారో చూశాం. అధికారులు, పాలక పక్ష నేతలు స్పందించి నష్టనివారణ చర్యలు చేపట్టారు కనుక సరిపోయింది. లేకుంటే చంద్రబాబుగారి కొంప మునిగేదే. వరద పరిస్థితిని సమీక్షించేందుకు డ్రోన్‌ ఉపయోగిస్తే దానిని చంద్రబాబు తనపై హత్యాప్రయత్నంగా చిత్రించారు.

అదిగో పులి అంటే ఇదిగో తోక అనే ఆయన అనుచరగణం తానా తందానా అంటూ బాబు వాదనను అందుకుంది. ఒక ప్రజానాయకుడు, ఒక పార్టీ నేత ఎలా వ్యవహరించకూడదో చూపే ఉదాహరణగా చంద్రబాబు ప్రహసనం నిలిచింది. బాబుగారు, ఆయన అంతేవాసులు సుజనా చౌదరి, సీఎం రమేష్, కోడెల శివప్రసాద్‌ వంటి వారి వ్యవహారం మనకు తెలిసిందే కదా. నయవంచన, అవినీతి, ధనదాహం, కులతత్వం, అహంకారం ఎలా వెన్నుపోటు పార్టీ నేతను, ఆయన అస్మదీయులను చివరకు ఆయన పార్టీని దిగజార్చాయో తెలుసుకుంటే కదా ఎలా ఉండరాదో తెలిసేది. అందుకే చించేస్తే చిరిగిపోని, చెరిపేస్తే చెరిగిపోని బాబుగారి చరిత్ర ప్రస్తావించక తప్పదు. కమ్యూనిస్టులు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ భౌతిక వాస్తవికతను గ్రహించగలిగితే, జగన్‌మోహన్‌రెడ్డి పాలనావిధానాల సమకాలీన ప్రాధాన్యత గ్రహించగలరు.


- డాక్టర్‌ ఏపీ విఠల్‌ 
వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు
మొబైల్‌ : 98480 69720 

మరిన్ని వార్తలు