గ్రేట్‌ రైటర్‌

23 Jul, 2018 01:01 IST|Sakshi

ఆధునిక చెహోవ్‌ అనిపించుకున్న రచయిత్రి ఆలిస్‌ మన్రో. 1931లో కెనడాలో జన్మించారు. అసలు పేరు ఆలిస్‌ యాన్‌ లెయిడ్‌లా. వాళ్ల నాన్న నక్కలను పెంచేవాడు. వాటి తోలుకు అప్పట్లో మంచి గిరాకీ ఉండేది. డిమాండ్‌ పడిపోయాక, కుటుంబం టర్కీ కోళ్ల వైపు మళ్లింది. ఈ వాతావరణం ఆలిస్‌ కథల్లో కనిపిస్తుంది. ఆలిస్‌ కూడా వెయిట్రెస్‌గానూ, పొగాకు తోటల్లోనూ, గ్రంథాలయ గుమస్తాగానూ పనిచేసింది. యూనివర్సిటీ సహవిద్యార్థి జేమ్స్‌ మన్రోను పెళ్లి చేసుకుని, ఆలిస్‌ మన్రో అయిన తర్వాత దంపతులిద్దరూ ‘మన్రోస్‌ బుక్స్‌’ పేరిట బుక్‌ స్టోర్‌ తెరిచారు. తర్వాతి కాలంలో అది ప్రతిష్టాకరమైన పుస్తకాలయంగా పేరు తెచ్చుకుంది.

కొత్తలో అందులోని పుస్తకాలు కొన్ని చదివి, తాను ఇంతకంటే బాగా రాయగలనని రాయడం ప్రారంభించానని వ్యాఖ్యానించారు. కానీ ఆమె టీనేజ్‌లోనే రాయడం మొదలైంది. 1968లో ఆమె తొలి కథా సంపుటి వెలువడినప్పుడు సానుకూల స్పందన వచ్చింది. కథకు కొత్త నిర్మాణపద్ధతిని ఇచ్చిన మన్రో విస్తృతంగా రాస్తూ, సుమారు నాలుగేళ్లకో కథా సంపుటి వెలువరిస్తూ వచ్చారు. మానవ సంక్లిష్టతను అత్యంత సరళంగా ఆవిష్కరించే తీరు విమర్శకుల మెప్పు పొందింది. ఆమె కొన్ని కథలు సినిమాలుగా కూడా తీశారు. 2013లో నోబెల్‌ పురస్కారం అందుకున్నారు. పాత కథకే కొత్త వెర్షన్‌ రాయడం ఆలిస్‌ ప్రత్యేకతల్లో ఒకటి.

మరిన్ని వార్తలు