స్వరాజ్యం నా జన్మహక్కని గర్జించిన తిలక్‌

1 Aug, 2018 01:26 IST|Sakshi

స్వరాజ్యం నా జన్మహక్కని గర్జించిన తొలి స్వాతంత్య్ర పోరాటవీరుడు బాలగంగాధర్‌ తిలక్‌.   ప్రజల చేత లోకమాన్యుడుగా పిలిపించుకొన్న తిలక్‌ అసలు పేరు కేశవ్‌ గంగాధర్‌ తిలక్‌. 160 ఏళ్ల క్రితం 1856 జూలై 23 న మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉపాధ్యాయుడైన గంగాధర్‌ తిలక్‌ దంపతులకు జన్మించారు. చిన్ననాటి నుంచే దేశ పరిస్థితులను నిశితంగా గమనిస్తూ తాను కూడా స్వరాజ్య పోరాటంలో ఓ సమిధగా మారాలని నిశ్చయించుకున్నారు. 1890 ప్రాంతంలో స్వరాజ్య పోరాట వేదిక అయిన కాంగ్రెస్‌లో చేరారు. తిలక్‌ ప్రవేశం నాటికి జాతీయోద్యమంలో గోపాలకృష్ట గోఖలే సారథ్యంలో మితవాదులు పోరాటం చేస్తున్నారు. అయితే అహింస, మితవాదం వల్ల స్వరాజ్యం లభించదని, బిట్రిష్‌వారితో పోరాటం వల్లనే స్వాతంత్య్రం సాధించగలమని విశ్వసించిన తిలక్‌ అతివాదిగా తన పోరాటాన్ని ప్రారంభించారు. మహాత్మాగాంధీ కంటే ముందే దేశ స్వాతంత్య్రోద్యమంలో కీలక భూమిక పోషించారు. పాత్రికేయునిగా జీవితం ప్రారంభించి నాటి బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా తన కలం పదునుతో ఎన్నో వ్యాసాలతో అక్షర గర్జన చేసి నాటి సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేశారు. మాతృభాష మరాఠీలో, ఇంగ్లిష్‌ భాషలలో పత్రికలను ప్రారంభించి స్వరాజ్య పోరాటాన్ని తీవ్రంగా ప్రభావితం చేశారు. 1897లో బొంబాయి పరిసర ప్రాంతలలో ప్లేగు వ్యాధి విజృంబించింది. ఈ వ్యాధి నియంత్రణ పేరుతో బ్రిటిష్‌ వారు ప్రజల ఇళ్ళపై దాడులు చేస్తూ సోదాలు జరపడంతో ఆ చర్యను తిలక్‌ వ్యతిరేకించారు. దీనితో బ్రిటిష్‌ వారు ఆయనపై విప్లవ వాదిగా ముద్ర వేసి జైల్లో పెట్టారు. జైలు నుంచి విడుదల అయ్యాక ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి పోరాడారు. దీంతో ఆయనను రంగూన్‌ జైలుకు తరలించి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. 1914లో జైలు నుంచి విడుదలై తిరిగి తన పోరాటం కొనసాగిం చారు. ఆయన రచించిన గీతా రహస్యం పుస్తకం విశేష ప్రాచుర్యం పొందింది. తన జీవితాంతం దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన తిలక్‌ బొంబాయిలో 1920 ఆగస్టు 1న తన 64వ యేట కన్నుమూశారు. తిలక్‌ జీవితం ఆదర్శప్రాయం. 
(నేడు లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్‌ 88వ వర్ధంతి సందర్భంగా)

- యస్‌.బాబు రావు, జాతీయ కార్యవర్గ సభ్యులు, దళిత జర్నలిస్టులు, రచయితల సంక్షేమ సంఘం, కావలి ‘ 9573011844 

మరిన్ని వార్తలు