సత్యంపై ‘శ్వేత’వస్త్రం!

28 Dec, 2018 07:22 IST|Sakshi

సందర్భం

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విడుదల చేసిన శ్వేతపత్రాలు వాస్తవాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఎదుటివారిపై నిందలు, తన పాలనపై స్వోత్కర్షలతో సొంత డబ్బా కొట్టుకున్నారు. అవి శ్వేతపత్రాలు కాదు, నల్ల పత్రాలు. ఆంధ్రప్రదేశ్‌ విభజనచట్టంలో పొందుపరచిన అంశాలన్నింటినీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. 14వ ఆర్థ్ధిక సంఘం సిఫారసుల మేరకు అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులు కేటాయించారు. పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచారు. దీనితో ఏపీకి రూ.2,06,910 కోట్లు లబ్ధి చేకూరింది. ప్రత్యేకహోదాతో ఏడాదికి వెయ్యి కోట్లు మాత్రమే వస్తాయి. కానీ దానికంటే ఎక్కువగా ప్యాకేజీ పేరుతో ఏడాదికి రూ.3 వేల కోట్లకు పైగా ఆర్థిక ప్రయోజనం రాష్ట్రానికి ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రత్యేకప్యాకేజీ వద్దంటూనే ఇంత వరకు వివిధ సంస్థల ద్వారా రూ. 12 వేల కోట్లకు పైగా ప్రాజెక్టులను తీసుకుంటున్నారు. రుణమాఫీలు, పింఛన్లను కలిపి రెవెన్యూలోటు రూ. 16,078 కోట్లుగా చూపించడం తప్పనే విషయాన్ని శ్వేతపత్రంలో చెబితే బాగుండేది.
 
కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు అంచనా లను భారీగా రూ.57,940.86 కోట్లకు పెంచేసి కేంద్రానికి పంపారు. రూ.10,069.66 కోట్లు ఖర్చు చేస్తే  కేంద్రం రూ. 6,727.26 కోట్లు విడుదల చేసిం దని ఇంకా రూ. 3,342 కోట్లు రావాలని చెప్పారు. కానీ 2010–11 ధరల ప్రకారం రూ. 7,158.53 కోట్లు మాత్రమే వాస్తవంగా ఖర్చయినట్లు కేంద్రం ప్రకటించింది. మిగిలిన రూ. 431.27 కోట్లకు, రూ. 399 కోట్లు పంపింది. పెరిగిన అంచనాలకు సరైన కారణాలు కేంద్రానికి చెప్పకపోవడం వల్లే పోలవరం నిర్మాణం జాప్యం జరుగుతోందనే విషయాన్ని పత్రంలో ఎందుకు రాయలేదు. రాజధాని నిర్మాణానికి 20 వేల ఎకరాలు చాలు. కానీ ఎందుకు 54 వేల ఎకరాలు సేకరించారో చెప్పలేదు. సెక్రటేరియట్, హైకోర్టు, శాసనసభల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.1,500 కోట్లకు లెక్కాపత్రంలేదు. కనీసం శంకుస్థాపనలు చేయలేదు. డ్రైనేజీల కోసం ఇచ్చిన వెయ్యి కోట్ల గురించి ఎందుకు ప్రకటించలేదు.  
 
వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం రూ. 1,050 కోట్లు కేంద్రప్రభుత్వం ఇస్తే, కొన్ని పనులు పూర్తిచేశామని అంటున్నారు. వాటిని చూపించగలరా? 11 జాతీయ విద్యాసంస్థలు ఏర్పాటు చేయాల్సి ఉండగా గిరిజన వర్సిటీ తప్ప అన్నీ ఏర్పాటై అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. ఈ సంస్థలకు స్థల సేకరణ విషయంలో మీరు చేసిన జాప్యం గురించి ఎందుకు పత్రంలో పేర్కొనలేదు. రక్షణ అవసరాల దృష్ట్యా దుగరాజపట్నం పోర్టు సాధ్యం కాకపోవడంతో దానికి ప్రత్యామ్నాయంగా  మరో ప్రాంతంలో పోర్టును ఏర్పాటు చేసుకోమన్న విషయం చెప్పలేదు. కడపలో ఉక్కుకర్మాగారం ఏర్పాటుకు వేసిన మేకాన్‌ టాస్క్‌ఫోర్స్‌కు నెలల తరబడి అనుమతి ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవçహరించారు. విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు రూ. 4,211 కోట్లు కేటాయించి, మొదటి విడతగా ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు నుండి రూ. 2,500 కోట్లు విడుదల చేసిన విషయాన్ని దాచి ఉంచారెందుకు? రాష్ట్రంలో జరుగుతున్న రూ.1.63 లక్షల కోట్ల విలువైన కేంద్ర ప్రభుత్వపు అభివృద్ధి పనుల గురించి మీ శ్వేతపత్రంలో ఎందుకు లేవు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు రూ.3.50 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. సాగరమాల పథకం ద్వారా మంజూరైన రూ. 68 వేల కోట్ల విలువైన 104 ప్రాజెక్టులున్నాయనే విషయాన్ని ఎందుకు చెప్పలేదు?. ఇవి కాక రూ. 3 లక్షల కోట్ల విలువ గల పథకాలు, ప్రాజెక్టులను కేంద్రం, రాష్ట్రానికి మంజూరు చేసిన విషయాన్ని మర్చిపోయారు. రాష్ట్రంలో జరిగిన 4,193 కి.మీ. జాతీయ రహదారులు అభివృద్ధి ప్రస్తావించలేదు ఎందుకని? 3,720 కి.మీ. జాతీయ రహదారుల ఏర్పాటుకు అనుమతి లభించిన విషయాన్ని ప్రజలకు చెప్పాలి కదా.
 
విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయాలను, ‘ఉడాన్‌’’ పథకంద్వారా  రాజమండ్రి, కడప విమానాశ్రయాలను అభివృద్ధి చేసిన విషయాన్ని ఎందుకు ప్రకటించలేదు. కమిటీ నివేదిక కొత్త రైల్వే జోన్‌ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఉన్నా రాజకీయంగా అయినా నిర్ణయం తీసు కుని జోన్‌ ఏర్పాటు చేసేందుకు కేంద్రం పునఃపరిశీలన చేస్తోంది. ప్రపంచ బ్యాంకు నుండి తెచ్చిన లక్షా 25 వేల కోట్లు అప్పులతో ఏ ప్రాజెక్టులు నిర్మించారో చెప్పలేదెందుకు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ప్రపంచ బ్యాంకు తమకు ప్రథమ స్థానం కట్టబెట్టిందంటున్నారే టీడీపీ హయాంలో  ఎన్ని పరిశ్రమలు ఏర్పడ్డాయో చెప్పగలరా? ఇది అభివృద్ధా, తిరోగమనమా? చెప్పండి సీఎంగారు. 


తురగా నాగభూషణం(వ్యాసకర్త బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు)

మొబైల్‌ : 98488 06399

మరిన్ని వార్తలు