జనరంజకం... జగన్‌మోహనం

9 Jun, 2020 02:50 IST|Sakshi

సందర్భం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్ని కలలు కన్నారో, ఎంతటి మంచి  చేయాలని తపన పడుతున్నారో, ప్రజల పట్ల ఆయనకి ఎంతటి వాత్సల్యం ఉందో, నిత్యం ఆయన చేస్తున్న పనులే మనకి తెలియజేస్తున్నాయి. వాలంటీర్‌ వ్యవస్థను తీసుకొచ్చి దాదాపుగా 4 లక్షల మందికి ఉద్యోగాలనీ కల్పిం చారు. జాతీయస్థాయిలో సైతం నాలుగు నెలల కాలంలో ఇన్ని ‘ఉద్యోగాల కల్పన’ జరగనేలేదు. ‘అమ్మ ఒడి’ అనే కార్యక్రమం ఎంతటి అద్భుతమైన కార్యక్రమం! పేదింటి బిడ్డ పనిలోనికి కాకుండా బడిలోకి వెళ్ళటానికి ఇంతకంటే ప్రేరణ కలిగించే వ్యవస్థ ఇంకొకటి వుంటుందా? ఏకకాలంలో అక్షరాస్యత రేటునూ, కుటుంబ స్థాయినీ పెంచే మంచి కార్యక్రమం ఇది. ‘కంటి వెలుగు’ అనే కార్యక్రమంతో ప్రతి విద్యార్థికీ కంటి పరీక్షలు జరిపి, కళ్ళద్దాలూ, అవసరమైతే శస్త్ర చికిత్సలూ చేయటమనే ఇలాంటి సంక్షేమ చర్యల గురించి గతంలో ఎప్పుడైనా విన్నామా..? గోడలు కూలిపోయి, మూత్రశాలలు కరువై, అవసరమైతే ఇంటికే తప్ప వేరెక్కడికీ వెళ్ళలేని దుస్థితినుండి స్కూళ్ళను విముక్తి చేయాలని కనీసం ఒక్కసారైనా ఆలోచిం చామా.. నో బ్యాగ్‌ డే, నాడునేడు, ఉచిత యూనిఫాం, టెక్ట్స్‌బుక్స్, నోట్‌బుక్స్, షూలూ, సాక్సులూ, నిరంతర పౌష్టికా హారం ఒకటేమిటి ఇలా చెప్పుకుంటూ పోతే వసతిదీవెన, విద్యాదీవెన పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వాటితో సహా ఎన్నో... ఎన్నెన్నో! ప్రజలను నిండు మనస్సుతో ప్రేమిస్తే తప్ప ఇలాంటి కార్యక్రమాల రూపకల్పన జరగనే జరగదు.

పదేళ్లలో చేయగలిగినన్ని పనులు కేవలం ఏడాదిలోపే చేయటమంటే మాటలు కాదు. ఇంటింటికీ రేషన్‌ సరఫరా, అవ్వాతాతలకు పింఛన్‌ అందజేత.. ఇలాంటి వినూత్న కార్యక్రమాలను చూసే అదృష్టం ప్రజలకి దక్కింది. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా దాదాపు రెండువేల కోట్లు ఆదా చేయటం విషయంలో గానీ, ఇసుక విధానం ద్వారా కొన్ని వందల కోట్లు ప్రభుత్వానికి జమ చేయటంలో గానీ, విద్యుత్‌ ఒప్పందాలను రద్దు చేసి, బహిరంగ మార్కెట్‌లో విద్యుత్తును కొనటం ద్వారా మిగులుస్తున్న కోట్ల రూపాయలు గానీ మంచి చర్యలు కావని అనగలమా..? రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వ రంగంలోనికి తీసుకురావటం గానీ, వందలాది ఉద్యోగాలను భర్తీ చేయటం గానీ, పోలీసులకు వారాంతపు సెలవును ఏర్పాటు చేయటం గానీ, సెలూన్లకు, నేతన్నలకూ, ఆటోడ్రైవర్లకూ, పూజారులకూ నగదు సహాయం అందించటం గానీ ప్రజోపయోగ కార్యక్రమాలు  కాదని  చెప్పగలమా?

రైతుల సంక్షేమానికై రైతు భరోసా, గిట్టుబాటు ధర, మార్కెటింగ్‌ సౌకర్యం, పంటనష్టం, ఉచిత విద్యుత్తు, ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణం, రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామాల్లోనే విత్తన పంపిణీ, ఎగుమతులను ప్రోత్సహించటం, ప్రభుత్వమే ఆహార ధాన్యాలను కొనుగోలు చేయటం  ఇలాంటి లెక్కలేనన్ని కార్యక్రమాలు శరవేగంగా రూపుదిద్దుకుని ఒకప్పుడు ‘దండగ’ని పేరుబడ్డ వ్యవసాయాన్ని ‘పండగ’గా మారుస్తున్నాయి. జగన్‌ అంటే జనం. జగన్‌ అంటే  నమ్మకం. జగన్‌ అంటే  మానవత్వం. గ్యాస్‌ ప్రమాదం రూపంలో ఓ సంక్షోభం లాంటి ఉపద్రవం సంభవిస్తే, రాజకీయ పక్షాల డిమాండ్లను మించి, మరణించినవారికి, దేశంలో ఎక్కడాలేని విధంగా కోటి రూపాయలు ఇవ్వటంలో గాని, ప్రజలను సంరక్షించటంలో గానీ, ప్రాణాల్ని కాపాడటంలో గానీ, వివిధ రకాలుగా ప్రజలకు భరోసా కల్పించడంలో గానీ, సహాయపడడంలోగానీ, గంటల వ్యవధిలోనే ‘ప్రమాదం’ తర్వాతి పరిస్థితుల నుండి, ప్రజలను ‘ప్రమోదం’ వైపు నడిపించడంలో గానీ, వైఎస్‌ జగన్‌ వ్యవహరించిన తీరు బాధితులు, విమర్శకుల ప్రశంసలనందుకొంది. 

‘కరోనా’ విపత్కర సమయంలో దేశమంతా ఆంధ్రప్రదేశ్‌ వైపు దృష్టిని నిలిపిందంటే అందుకు కారణం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అని చెప్పక తప్పదు. ‘కరోనాతో భవిష్యత్తులో కూడా కలిసి జీవించక తప్పదు, ఇది ఒక రోజుతోనో, నెలతోనో సమసిసోయే సమస్య కానే కాదు, ఇది ఒక నిరంతర ప్రక్రియ. కేసులు వస్తుంటాయి. ట్రీట్‌ చేస్తుంటాం. మరలా వస్తుంటాయి.మరలా మరలా ట్రీట్‌ చేస్తుంటాం..’ అని ముందుచూపుతో చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే, అది కేవలం వైఎస్‌ జగన్‌ మాత్రమే.. దేశం మొత్తం మీద అత్యధిక స్థాయిలో పరీక్షలు నిర్వహించటంలో గానీ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తికి మూడేసి చొప్పున మాస్కులు పంచే విషయంలో గానీ, వలస కార్మికులను ఆదుకోవడంలో గానీ, వైఎస్‌ జగన్‌ దార్శనికత, దక్షతలు ప్రస్ఫుటమవుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా, ఇంకా చెప్పాలంటే జాతీయస్థాయిలో సైతం ఎన్నడూ జరగని విధంగా పాతిక లక్షలకు పైగా ఇళ్ళను తొలి ఏడాది లోనే, ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వాలని సంకల్పించటం, రత్నాల్లాంటి ‘నవరత్నాలు’ అనే తొమ్మిది సంక్షేమ పథకాలను, ఐదేళ్ళలో కాకుండా కేవలం ఐదు నెలల కాలంలోనే దాదాపుగా నెరవేర్చటం వైఎస్‌ జగన్‌కి మాత్రమే చెల్లింది.

ఈ రాష్ట్రం బాగుండాలంటే, ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందాలంటే, ఈ రాష్ట్ర విద్యార్థులు అద్భుతాలు సాధించాలంటే, ఈ రాష్ట్ర రైతులు ఆత్మనిబ్బరంతో మెలగాలంటే  చెయ్యాల్సింది చాలా సులువైన పని. అది వైఎస్‌ జగన్‌ని మళ్ళీ మళ్ళీ గెలి పించుకోవటం మాత్రమే. ఇంతకన్నా ప్రజలను మనసారా ప్రేమించే ముఖ్యమంత్రి మరెవ్వరూ ఉండరు. గుప్తులనాటి స్వర్ణయుగం కాదు.. ఆంధ్రప్రదేశ్‌లో ‘వజ్రయుగం’ రావాలంటే ఎప్పటికీ కావాల్సిందీ... రావాల్సిందీ జగన్‌..!(ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వై.ఎస్‌.జగన్‌మోహనరెడ్డి  ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా)


డా. ఎమ్‌.వి.జె. భువనేశ్వరరావు 

వ్యాసకర్త ప్రముఖ కథారచయిత,
డిప్యూటీ జనరల్‌ మేనేజర్, వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌
మొబైల్‌ : 85006 6950

మరిన్ని వార్తలు