రైతు చుట్టూ చీకట్లు తొలగేనా?

8 Jan, 2019 01:09 IST|Sakshi

విశ్లేషణ

వ్యవసాయ రుణమాఫీలు ఆర్థిక అవసరంగా ఉంటూ, వాటికోసం రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని వనరులను వెతకాల్సి ఉంటున్న నేపథ్యంలో, ప్రత్యక్ష నగదు మద్ధతును వ్యవ సాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారంగా చూడకూడదు. తక్షణ ఉపశమన చర్యలను చేపడుతూనే, వ్యవసాయ రంగానికి పలు గట్టి సంస్కరణలను అమలు చేయడం ఎంతైనా అవసరం. అందుకే ఈ 2019 సంవత్సరం వ్యవసాయ సంస్కరణల సంవత్సరంగా మారుతుందని ఆశిద్దాం. చిన్న, పెద్ద  వ్యాపారాల్ని సులభతరం చేసే అవకాశా లను కల్పించడానికి ప్రభుత్వాలు 7,000 రకాల చర్యలు చేపడుతున్నప్పుడు, వ్యవసాయాన్ని సులభతరం చేసేందుకు చిన్న మొత్తాన్ని కేటాయించడం తప్పెలా అవుతుంది?

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాకు చెందిన బంగాళాదుంపలు పండించే రైతు ప్రదీప్‌ శర్మ వరు సగా నాలుగేళ్లు నష్టాలను ఎదుర్కొన్నారు. ఈ సంవత్సరం 10 ఎకరాల్లో బంగాళా దుంపల సాగు చేసిన ఈయన 19,000 కేజీల దిగుబడిని మండీకి తీసుకు వచ్చారు. కానీ పంటను మొత్తంగా అమ్మిన తర్వాత  రూ. 490ల లాభం మాత్రమే దక్కింది. ఆ రైతు ఆగ్రహంతో తనకు వచ్చిన లాభాన్ని ప్రధానికి పంపుతూ తన సమస్యలను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. అంతకు కొన్ని రోజుల ముందు మధ్యప్రదేశ్‌ రైతు భేరూలాల్‌ మాలవీయ తీవ్ర మైన మనస్తాపానికి గురై చనిపోయారు. మండసార్‌ మార్కెట్లోకి తాను తీసుకువచ్చిన 27,000 కిలోల ఉల్లిపాయలకు కేవలం రూ. 10 వేల ధర పలకడమే కారణం. 

మీడియాలో వస్తున్న ఇలాంటి విషాదకరమైన వార్తలతో కొంత కాలంగా రైతుల దుస్థితి గురించిన సమాచారం పతాక శీర్షికల్లో చోటు చేసుకుంటోంది. సంవత్సరాలుగా నష్టాలు చవిచూస్తుండటంతో, రైతులు వాస్తవంగానే అప్పులు తీసుకుని బతుకుతున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర వనరుల నుంచి వీరు రుణాలు పొందుతున్నారు. 2016 సెప్టెంబర్‌ నాటికి, దేశంలో వ్యవసాయ రుణాల మొత్తం రూ. 12.60 లక్షల కోట్లకు చేరుకుంది. 17 రాష్ట్రాల్లో అంటే సగం దేశంలో రైతుల ఆదాయం సగటున కేవలం రూ. 20,000గా ఉన్న పరిస్థితితో ఈ భారీ రుణాలను పోల్చి చూస్తే రైతు జీవితంలో నిస్సహాయత అర్థమవుతుంది. 

రైతుల బాధలను పరిష్కరించడానికి వ్యవసాయ రుణాల మాఫీ సరైన సమాధానం అవుతుందా అనే అంశంపై ప్రస్తుతం సాగుతున్న చర్చ నేపథ్యంలో భయంకరమైన వ్యవసాయ దుస్థితిని ఊహించుకోండి. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆర్థిక భారాన్ని ఎలా భరిస్తాయి?  ఇటీవలే ముగి సిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మధ్యప్రదేశ్, రాజ స్తాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఎంపికైన కొత్త ముఖ్యమంత్రులు వ్యవసాయ రుణాల మాఫీని ప్రకటించిన వేగాన్ని పరిశీలిస్తే వారి చర్య వెనుక ఉన్న రాజకీయ కొలమానం కంటే ఆర్థికంగా అది చెల్లుబాటవుతుందా అనే ప్రశ్న కలుగుతోంది. పైగా, ఈ రుణమాఫీకి అవసరమైన డబ్బు ఎక్క డినుంచి వస్తుందనేది పెద్ద ప్రశ్నగా మారింది.

ఇది ఇంతటితో ముగియడం లేదు. రైతులకు ప్రత్యక్ష నగదు ప్రోత్సాహకాన్ని కల్పిస్తూ సంవత్సరానికి రూ. 8,000ల (ఇప్పుడు దీన్ని రూ. 10,000కు పెంచారు) నిర్దిష్ట మొత్తాన్ని అందించే విశిష్టపథకం రైతుబంధును తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన తర్వాత, దేశంలోని పలు రాష్ట్రాలు వరుసగా అదేవిధమైన లేక మెరుగుపర్చిన రూపంలో రైతులకు ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ వస్తున్నాయి. మొదటగా, కర్ణాటకలో మునుపటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మెట్ట భూములున్న రైతులకు హెక్టారుకు రూ. 5,000ల ప్యాకేజీని ప్రతిపాదించింది. హిందీ ప్రాబల్య ప్రాంతంలో ఇటీవలి ఎన్నికల్లో అధికార బీజేపీ కుప్పగూలిన నేపథ్యంలో తమకు అధికారమిస్తే వ్యవసాయ రుణాలను రద్దుచేస్తామంటూ కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న వాగ్దానాలతో భీతిల్లిన కారణం కావచ్చు.. ఒడిశాలో రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులను బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వం రైతులకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. అయితే రుణమాఫీకి బదులుగా రైతుకు సహాయ పథకం పేరిట మూడేళ్లపాటు రూ. 10,180 కోట్ల ప్యాకేజీని ఒడిశా ప్రభుత్వం భూ యజమానులకు, కౌలురైతులకు, భూమి లేని కూలీలకు ప్రకటించింది. దీంతో ఒడిశాలో 57 లక్షల వ్యవసాయ కుటుం బాలకు మేలు చేకూరనుంది. 

ఇక జార్ఖండ్‌ ప్రభుత్వం కూడా అయిదు ఎకరాల లోపు భూమి ఉన్న 22.76 లక్షలమంది సన్న, చిన్న కారు రైతులకు సంవత్సరానికి రూ.5,000ల ఆర్థిక సహాయం అందించినున్నట్లు శరవేగంగా ప్రకటిం చింది. ఇక హరియాణా ప్రభుత్వం రైతులకు పెన్షన్‌ పథకం ప్రకటిం చగా, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం తానేం తక్కువ తినలేదన్నట్లుగా కృషిక్‌ బంధు పథకంతో ముందుకొచ్చింది. దీంట్లో భాగంగా ఆ రాష్ట్రంలోని ప్రతి రైతూ సంవత్సరానికి ఎకరాకు రూ. 10,000ల నగదు ప్రోత్సాహకం లభించనుంది. దీంతోపాటు 18 నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న ప్రతి రైతుకూ రూ.2 లక్షల మేరకు జీవిత భీమాను మమత ప్రభుత్వం ప్రకటించింది. ఈ బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది.

ఈ వరుస రుణమాఫీలను పరిశీలిద్దాం. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం రైతు రుణమాఫీని ప్రకటించాక, తొలి దశలో 3.5 లక్షల రైతుల బ్యాంకు ఖాతాలలోకి రూ. 1,248 కోట్లను ఇప్పటికే బదలాయించారు. అంటే ప్రతి రైతుకూ గరిష్టంగా రూ. 2 లక్షలవరకు రుణమాఫీ చేశారు. పంజా బ్‌లో పురోగతి మందగించినప్పటికీ, కోఆపరేటివ్, వాణిజ్యబ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించలేకపోయిన 4.14 లక్షలమంది చిన్న, సన్నకారు రైతులకు దాదాపు రూ.3,500 కోట్ల రుణాలను మాఫీ చేశారు. దేశవ్యాప్తంగా చూస్తే కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు రాష్ట్రాల ప్రభుత్వాలు మొత్తం మీద రూ. 2.3 లక్షల కోట్ల మేరకు రైతురుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో 3.4 కోట్ల వ్యవసాయ కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. 

వీటిని కార్పొరేట్‌ సంస్థల రుణమాఫీలతో పోల్చి చూద్దాం. మన దేశంలోని డబ్బును ఎవరు దారి మళ్లిస్తున్నారో ఇది మనకు తేల్చి చెబు తుంది. భారతీయ రిజర్వ్‌ బ్యాంకు ప్రకారం, 2014 ఏప్రిల్‌ నుంచి 2018 ఏప్రిల్‌ వరకు నాలుగేళ్ల కాలంలో రూ.3.16 లక్షల కోట్ల కార్పొరేట్‌ రుణాలను రద్దు చేయగా, దానిలో రూ. 32,693 కోట్లను మాత్రమే రాబ ట్టుకున్నారు. పబ్లిక్‌ సెక్టార్‌ అండర్‌ టేకింగ్‌లను మినహాయిస్తే, 528 మంది కార్పొరేట్‌ రుణగ్రహీతల వద్ద రూ. 6.28 లక్షల కోట్ల నిరర్ధక ఆస్తులు నమోదయ్యాయి. వీరిలో 95 మంది ఒక్కొక్కరు వెయ్యి కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంది. అయితే అతి కొద్దిమంది కార్పొరేట్‌ రుణ గ్రహీతలకు ఇంత భారీ స్థాయిలో రుణమాఫీ చేయడంలోని ఆర్థిక అరాచకత్వ గురించి ఏ ఒక్కరూ అడిగిన పాపాన పోలేదు. కానీ అదే సమయంలో వ్యవసాయ రుణమాఫీలపై తీవ్రమైన చర్చలు, వాదోపవా దాలకు మాత్రం అందరూ సిద్ధపడిపోవడం గమనార్హం.

ఈలోగా, నికర నిరర్ధక ఆస్తులు 2017–18 ఆర్థిక సంవత్సరంలో 11.2 శాతానికి మరింతగా పెరిగి రూ. 10.39 లక్షల కోట్లకు చేరుకు న్నాయి. అయితే ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ఇన్‌సా ల్వెన్సీ అండ్‌ బ్యాంకింగ్‌ కోడ్‌ (ఐబీసీ), సర్ఫేసీ యాక్ట్‌ ద్వారా కేవలం రూ. 40,400 కోట్లను మాత్రమే ప్రభుత్వం స్వాధీనపర్చుకుంది. దేశీ యంగా నికర నిరర్ధక ఆస్తులు ఇంత భారీగా పెరిగిపోవడానికి గత పదేళ్లుగా పరిశ్రమకు కల్పించిన రూ. 18.60 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనే కారణం. 2008–09 సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక పతనం సమయంలో భారతీయ పరిశ్రమలకు 1.86 లక్షల కోట్ల మేరకు ఆర్థిక ఉద్దీపన ప్యాకే జీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ తరహా ప్యాకేజీ నేటికీ కొనసా గుతోండటం గమనార్హం. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతి సంవత్సరం పారిశ్రామికరంగం ప్రత్యక్ష నగదు ప్రోత్సాహకాన్ని పొందుతూనే ఉంది. 

వ్యవసాయ రుణ మాఫీల కంటే తక్కువ మొత్తంలో దేశంలోని రైతులందరికీ ప్రత్యక్షంగా తలొక రూ. 4,000 ప్రత్యక్ష నగదు సహా యాన్ని అందించే అవకాశం గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సూచనలు వస్తున్నాయి. ఈ ప్రత్యక్ష నగదు ప్రోత్సాహకం వల్ల కేంద్రంపై మరొక 2 లక్షల కోట్ల రూపాయల భారం పడుతుంది. ఈ మొత్తం చూడ్డానికి కాస్త పెద్ద మొత్తంగానే కనిపించవచ్చు కానీ సంవత్సరానికి రైతుకు నాలుగు వేల రూపాయల నగదు సహాయం అంటే నెలకు వారికి దక్కేది  రూ. 340 మాత్రమే. అంటే ఏ ట్రెండీ కాఫీ షాపులో అయినా మనం రెండు కప్పుల కాఫీ లేక టీ తాగినదాంతో సమానం. నిస్సహా యస్థితిలో ఉన్న రైతాంగానికి నెలకు రూ. 340ల సహాయం చేయడం ఆర్థికపరంగా సరైన చర్య అనుకుంటే దేశంలో ఆదాయాల మధ్య అస మానతకు ఇంతకు మించిన ఉదాహరణ ఉండదు గాక ఉండదు.

వ్యవసాయ రుణమాఫీలు ఆర్థిక అవసరంగా ఉంటూ, వాటికోసం రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని వనరులను వెతకాల్సి ఉంటున్న నేపథ్యంలో, ప్రత్యక్ష నగదు మద్ధతును వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కా రంగా చూడకూడదు. తక్షణ ఉపశమన చర్యలను చేపడుతూనే, వ్యవ సాయ రంగానికి పలు గట్టి సంస్కరణలను అమలు చేయడం ఎంతైనా అవసరం. అందుకే ఈ 2019 సంవత్సరం వ్యవసాయ సంస్కరణల సంవత్సరంగా మారుతుందని ఆశిద్దాం. చిన్న, పెద్ద తరహా  వ్యాపా రాన్ని  సులభతరం చేసే అవకాశాలను కల్పించడానికి ప్రభుత్వాలు 7,000 రకాల చర్యలు చేపడుతున్నప్పుడు, వ్యవసాయాన్ని సులభతరం చేసే అవకాశాలను కల్పించడానికి చిన్న మొత్తాన్ని కేటాయించడం తప్పెలా అవుతుందో నాకు చిన్న కారణం కూడా కనిపించడం లేదు. అయినా వ్యవసాయం దేశీయ జనాభాలో 52 శాతానికి సంబంధించి నది. ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్‌’ నిజంగా సిద్ధించాలంటే ఇది మాత్రమే సరైన ఆర్థిక చికిత్స అవుతుంది.

దేవిందర్‌శర్మ
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్‌ :hunger55@gmail.com

మరిన్ని వార్తలు