ఇంతకూ ఎవరిదీ అడవి?

20 Mar, 2019 00:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సందర్భం

అడవులను రక్షించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, స్మగ్లర్లకు సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో అటవీశాఖ అధికారులు స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే అభియోగాలతో ఇటీవలి కాలంలో 11 మందిని అటవీశాఖ సస్పెండ్‌ చేసింది. సస్పెండైన వారిలో ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ స్థాయి నుంచి గార్డు వరకున్నారు. విధుల  పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి మెమో జారీ చేశారు. కానీ అడవి సర్వనాశనం కావడానికి ఎవరు కారణమో ఆ  స్మగ్లర్లు, వారి వెనుకవున్న రాజకీయనేతలు మాత్రం హాయిగా ఉన్నారు. వడ్రంగం మీద అధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలు ఇప్పటికే రోడ్డున పడ్డాయి. వారికి చేతి వృత్తి తప్ప మరో జీవనాధారం లేదు.

వారి పనిముట్లను అధికారులు సీజ్‌ చేస్తున్నారు. వరంగల్‌ జిల్లాలో కార్పెంటర్‌ లక్ష్మీకాంతం అధికారుల దాడిలో గుండెపోటుతో మరణించాడు. పెద్ద పెద్ద దొంగ వ్యాపారం చేస్తున్న వారిని వదిలి  నాగళ్ళూ, ఇతర వ్యవసాయ పరికరాలు, పేద మధ్యతరగతికి అవసరమయ్యే మంచాలు, కుర్చీలు, తలుపులు, కిటికీలు,  రోకలిబండ, ఇసుర్రాతి బొడ్దె వంటివి తయారు చేస్తూ బతికే వారిని నేరస్తులుగా చూపించడంకన్న దుర్మార్గం మరోటి ఉండదు. ఇప్పటికే అడవిని ఆదివాసులు నాశనం చేస్తున్నారని పెద్ద గోల  చేసిన పాలకులు అవసరమైతే పీడీ చట్టం క్రింద కేసు పెడతామని బహిరంగ హెచ్చరికలు చేస్తున్నారు. పంట సంరక్షణ కోసమైనా సరే రైతాంగం అడవి జంతువుకు నష్టం కలిగిస్తే ఏడేళ్ల జైలు శిక్ష ఉంటుందని అంటున్నారు. అసలు అటవీ దొంగలు ఎవరూ? ఎవరిని శిక్షించాలని ప్రభుత్వం చూస్తోందనేది ప్రశ్న. 

‘‘జంగిల్‌ బచావో  జంగిల్‌ బడావో’’ నినాదంతో పోలీసు, ఫారెస్టు శాఖలు కలిసి పని చేస్తాయని  ఇకమీదట ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ రంగంలోకి దిగుతాయని తెలంగాణ ప్రభుత్వం అంటున్నది. ప్రభుత్వ నిర్ణయం అకస్మాత్తుగా తీసుకొన్నట్టు కనిపించినా, అడవిపై పట్టుకోసం శతాబ్దాలుగా పాలకులు  చేస్తున్న ప్రయత్నాలకు కొనసాగింపే ఇది. అటవీ సంరక్షణ అనేది కేంద్రం అధీనంలో ఉన్న ఉమ్మడి జాబితాలోని అంశం. రాష్ట్రంలోగానీ కేంద్రంలోగానీ ఇప్పటివరకు తీసుకొన్న విధాన నిర్ణయాలు, చేసిన చట్టాలు పరిశీలిస్తే ఏ పేరు మీద చట్టాలు తయారు చేయబడతాయో... చివరికి ఆయా చట్టాలు ఎవరికి వ్యతిరేకంగా పని చేస్తాయో కూడా తెలుస్తుంది. 

అడవి ప్రకృతి సంపద. పాలకుల దాష్టీకానికి పర్యావరణం బలైపోయింది. కానీ ప్రకృతి సిద్ధంగా రావలసిన ప్రాణవాయువును అడవిలో జీవిస్తున్న వారు అందకుండా చేసే ప్రమాదాన్ని అరికడతామని పాలకులు  ప్రకటించడం కన్నా సిగ్గుచేటు మరోటి ఉండదు. చిన్నాచితక పచ్చ మొక్కలను కూడా కీకారణ్యాలుగా తప్పుడు నివేదికలు ఇచ్చే సంస్కృతి దేశ అటవీ శాఖకు ఉంది. అది లంచాలకు, బ్రోకర్లకు పేరు మోసిన అడ్డా. దేశంలోనే అతిపెద్ద చట్టబద్ద భూస్వామి. బహుళజాతి కంపెనీలకు కట్టబెట్టడానికి భూములు ఉంటాయి కానీ పేదల వ్యవసాయ భూమి మాత్రం ఆక్రమిత భూమిగా కనిపిస్తుంది.

బంగారు తెలంగాణ భ్రమలో జీవించేది ఎవరన్నది మరిచిపోయి.. ఇక తెలంగాణలో అడవులు పెరిగి పచ్చదనంతో కళకళలాడుతుంది... ప్రకృతిలో పరవశించిపోవచ్చుననే పగటి కల కంటే అది తెలివి తక్కువతనమే అవుతుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసులు, పేద జనం విచక్షణారహితంగా అడవిని ధ్వంసం చేస్తున్నారనే అబద్ధాల ప్రచారాన్ని మధ్యతరగతి వర్గం ముఖ్యంగా పట్టణవాసులు బాగా నమ్ముతున్నారు. అడవిని నమ్ముకొని జీవిస్తున్న వారిపై అడవిని అమ్ముకుని సంపద పోగు చేసుకునే నేరస్తుల గుంపు పెత్తనం చలాయిస్తోంది. ఇకనుండి అటవీ చట్టాలకు పోలీసు తుపాకీ అండ ఉంటుంది. ఇలాంటి నిరంకుశ చట్టంతో పేద జీవనం కష్టమౌతుంది. హక్కును అనుభవించడం చట్టం ఉల్లంఘన అవుతుంది. అక్కడే పుట్టి, అక్కడే చచ్చే జనం అడవిలోకి వెళితే చాలు.. నేరస్తులు  అవుతారు. నల్లధనం మీ బ్యాంక్‌ ఖాతాలో  వేస్తాను అని బూటకపు మాటలు చెప్పినవాడు రేపు అడవికి కూడా చౌకీదార్‌ అవుతాడు. 

అడవి జంతువు మాంసం తిని బొర్రపెట్టి తిన్నది అరగక జబ్బున పడ్డవారు. లంచాలు మేసే ప్రభుత్వ అధికారులు, బినామీ కాంట్రాక్టర్లు, కలప స్మగ్లర్లు, రాజకీయ నాయకులు, సినిమా తారలు, సెలబ్రిటీలు జంగిల్‌ బచావో.. జంగిల్‌ బడావో అంటారు. మరి బంగారు తెలం గాణలో ఎవరు నేరస్తులు?

నలమాస కృష్ణ
వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షులు,
తెలంగాణ ప్రజా ఫ్రంట్‌-98499 96300

మరిన్ని వార్తలు