గుంజాల గోండి లిపిని బతికించండి

7 Feb, 2019 00:55 IST|Sakshi

నేషనల్‌ మానుస్క్రిప్ట్‌ మిషన్‌ (న్యూఢిల్లీ), ఆంధ్రప్రదేశ్‌ రాతప్రతుల గ్రంథాలయం, పరిశోధనాలయం కలిసి 2006లో  జాతీయ స్థాయిలో రాతప్రతుల సర్వే జరి పారు. ఆ సందర్భంగా గుంజాల గ్రామంలో కొన్ని గోండి రాతప్రతులు బయటపడ్డాయి. ఈ రాతప్రతులు గోండి ప్రజల లిపిగా అప్పుడు తెలియరాలేదు. 2010లో మాత్రమే ఆనాటి సర్వేకి కోఆర్డినేటర్‌గా పనిచేసిన ఆచార్య జయధీర్‌ తిరుమలరావు ఆదిలాబాద్‌ జిల్లా నార్నూరు మండలంలోని గుంజాల గ్రామానికి వెళ్ళి వాటిని పరిశీలించిన తర్వాతే ఈ లిపి ప్రత్యేకత, విశిష్టత లోకానికి తెలియవచ్చింది. అప్పటి నుండి ఈ లిపిని చదివేవారి సంఖ్య ముగ్గురి నుండి 500 మందికి చేరింది.పెద్ద పెద్ద భాషలు, లిపులు అంతరించి పోతున్న వేళ ఒక ఆదివాసీ లిపి పునర్జీవించటం ఒక అద్భుతం. ఆదివాసీ భాషలకు లిపులు చాలా తక్కువ. కాని 8 రాష్ట్రాలలో గల గోండి భాషకు రెండు లిపులు ఉన్నట్లుగా తెలియవస్తుంది. అందులో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని రెండు లక్షల డెబ్భైవేల మంది గోండి ప్రజలకు సంబంధించిన ఈ ‘‘గుంజాల గోండి లిపి’’ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన లిపి అని నిపుణుల భావన. దీనికి హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం, సిడాస్ట్‌ కేంద్రం వారి నిర్వహణలో ఈ లిపికి సాఫ్ట్‌వేర్‌ తయారుచేశారు. ఆ తరువాత ఈ లిపి ప్రపంచ లిపుల సరసన యునికోడ్‌ కన్సార్టియంలో చేరింది.

‘గుంజాల గోండి లిపి భాష అధ్యయన వేదిక’ నిర్వహణలో 2010 నుండి 2014 వరకు గుంజాల గ్రామం కేంద్రంగా ఎన్నో గోండి గూడెం లలో ఈ లిపిని నేర్పించారు. అలా గోండి భాషను బతికిస్తూ వచ్చారు. ఉట్నూరు ఐటిడిఏ వారు, యునివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్, సిడాస్ట్‌ వారు 2014లో గోండి భాషలో గుంజాల గోండి లిపిలో మొదటి వాచకం ప్రచురించి చరిత్ర సృష్టించారు. 2017లో రెండవ వాచకం అచ్చువేశారు. ప్రస్తుతం మూడో వాచకం తయారీలో ఉంది. ఉట్నూరు ఐటిడిఏ వారు ఈ లిపిలో గోండి భాష నిఘంటువుని తయారు చేయడానికి అంగీకరించారు. గతంలో ఆదిలాబాద్‌ జిల్లాలో కలెక్టర్లుగా పనిచేసిన వారిని, ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్లుగా పనిచేసిన వారిని, గుంజాల గోండి లిపి అధ్యయన వేదికని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. ఈ సంప్రదాయం ఇక ముందు కూడా కొనసాగించాలని ఆశిస్తున్నాం.  సీఎం కేసీఆర్‌ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కూడా కోరుతున్నాం. ఈ లిపి బోధిస్తున్న 15 మంది ఇన్‌స్ట్రక్టర్లకి అందాల్సిన నెలసరి జీతాన్ని వెంటనే అందించవలసిందిగా కోరుతున్నాం. 
-జయధీర్‌ తిరుమలరావు(గోండి లిపి అధ్యయన వేదిక)
మొబైల్‌ : 9951942242
 

మరిన్ని వార్తలు