మరణానంతర ప్రేమకు విలువుందా?

7 Sep, 2018 00:33 IST|Sakshi

విశ్లేషణ

సోమ్‌నాథ్‌ ఛటర్జీ భౌతిక కాయంపై అరుణ పతాకం కప్పేందుకు సీపీఎం నాయకత్వం వెళ్లింది. కానీ ఆయన కుమారుడు, కుమార్తె తిరస్కరించారు. తనను సీపీఎం పార్టీ సభ్యత్వం నుంచి తొలగించిన రోజున ‘నా జీవితంలో ఇది అత్యంత దుర్దినం అని ఆయన క్షోభ చెందారు. ఆ క్షోభ నుంచి ఆయన కోలుకోలేదు. మాకు తెలుసు ఆయన హృదయం ఎంత గాయపడిందో..’ అంటూనే వారు సీపీఎం నేతల ప్రయత్నాన్ని అంగీకరించలేదు. ఇక్కడ హరికృష్ణ, అక్కడ సోమ్‌నాథ్‌ ఉదంతాలు ఒకేలా ఉన్నాయని అనలేం. కానీ జీవించి ఉన్నప్పుడు వారితో అమర్యాదగా వ్యవహరించి, మరణించిన తర్వాత వారితో తమకు వైరుధ్యాలే లేనట్లు కృత్రిమ ప్రేమను నటించడం సబబేనా?

హరికృష్ణ మరణవార్త ఆయన కుటుంబసభ్యు లను, సినిమా ప్రపంచానికి చెందినవారినే కాదు... హరికృష్ణ, ఎన్టీఆర్‌ అభిమానులను కూడా ఎంతో కలవరపరిచి ఉంటుంది. సాధారణ మానవునిగా ఆయన ఎన్నో ఆటుపోట్లకు గురై ఉండవచ్చు. అదే సమయంలో అక్రమాలను, అన్యాయాలను ఆమోదించకపోవడం.. తనను నమ్ముకున్నవారిని, తాను నమ్మిన వారిని ఆదుకోవడం హరికృష్ణ నైజం. ఎలాంటి అవాంతరాలు ఎదురైనా తలవంచకుండా విలువల కోసం కొన్ని సందర్భాల్లోనైనా గట్టిగా నిలబడిన వ్యక్తి. అన్నిటికీమించి తన తండ్రి ఆచరించిన ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని తెలుగు నేల నాలుగు చెరగులా విస్తరింపజేయడంలో రథసారథిగా భాగస్వామి అయినాడు. తండ్రి ఆయన ఆశయ సాధనలో ఆత్మీయునిగా, పుత్రుడు అనే పదానికి తండ్రి జీవించి ఉన్నంతవరకూ న్యాయం చేశాడన్నదాన్ని ఎవరూ కాదనలేరు.

హరికృష్ణది ఒక ప్రత్యేక అసాధారణ వ్యక్తిత్వం. ఆయన తనయులు జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌రాంలు ఇద్దరూ తెలుగుదేశం పార్టీలో తండ్రికి ఎలాంటి గౌరవం లభిస్తున్నా మారు మాట్లాడకుండా ఆయన మనోగతానికి తగినట్టుగా ఆ పార్టీవైపే మొగ్గుచూపేవారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ చరిష్మా, వాగ్ధాటి తెలుగు ప్రజలందరికీ పరిచితమే. రూపంలో సైతం అచ్చుగుద్దినట్టు ఎన్టీఆర్‌లా ఉండే జూనియర్‌ ఎన్టీఆర్‌ను చూసి చంద్రబాబులో కాస్త బెరుకు ఉండేదని, ఇతడివల్ల ఇప్పటికిప్పుడు ఏ నష్టమూ లేకపోయినా, ప్రోత్సహించటం మొదలుపెడితే క్రమేపీ పార్టీ సమస్తం అతడివైపు మొగ్గవచ్చునని, ఫలితంగా లోకేష్‌ పూర్తిగా తెరమరు గవటం ఖాయమని బాబు అనుకునేవారని అంటారు. అందుకే ఆయన జూనియర్‌ ఎన్టీఆర్‌ పట్ల ముభావంగా వ్యవహరించేవారని ఒక అభి ప్రాయం ఉంది.

హరికృష్ణ విషయంలోనూ ఇంతే. ఆయన తనకు విధే యుడిగా ఉంటాడన్న విశ్వాసం చంద్రబాబుకు లేదు. అందుకే హరికృష్ణ బదులు బాలకృష్ణను చేరదీసి వియ్యంకుణ్ణి చేసుకుని, ఆయన తన పట్టు నుంచి జారిపోకుండా శాసనసభ్యుని చేసి ఆయనతోపాటు ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులనూ, తెలుగు ప్రజలనూ ఎల్లకాలమూ తనవైపు నిలబె ట్టుకోవటం బాబు ఎత్తుగడ. అదే సమయంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యత్వం మినహా హరికృష్ణకు మరే ఇతర బాధ్యతలు అప్పగించకుండా ఆయన్ను నిరాదరించారు. అందుకే హరి పార్థివ దేహాన్ని తెలుగుదేశం కార్యాలయంలో ఉంచేందుకు చంద్రబాబు కొందరు కుటుంబసభ్యులను రాయబారులుగా పంపినప్పుడు హరికృష్ణ తనయులిద్దరూ నిర్ద్వం ద్వంగా తిరస్కరించినట్టు కొన్ని కథనాలు వెలువడ్డాయి. ఏదేమైనా జూని యర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌రాంలు తమ తండ్రికి పార్టీలో జరిగిందేమిటో, ఇప్పుడు చేస్తున్న ప్రతిపాదనలోని ఆంతర్యమేమిటో గ్రహించలేని అమా యకులేమీ కాదు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించటానికి చంద్రబాబు లేఖ ఇచ్చినప్పుడు హరికృష్ణ సమైక్యాంధ్ర గళమెత్తారు. అందుకోసం తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. అంతేకాదు.. రాజీనామా చేసిన సందర్భంగా రాజ్యసభలో తెలుగులోనే తన స్వరం వినిపించారు. తన తండ్రి ఆత్మగౌరవ నినాదానికి ఒక రూపుగా వ్యవహరించారు. అలాంటి ఉన్నతుడి పార్థివదేహాన్ని తెలుగుదేశం కార్యాలయంలో ఉంచేందుకు అనుమతినిస్తే, చంద్రబాబు, లోకేశ్‌ అక్కడ నిలబడి ‘ఓట్లాట’ ఆడుకుం టారని హరికృష్ణ తనయులు గ్రహించబట్టే దాన్ని సాగనీయలేదని నా భావన. కానీ జీవించి ఉన్నప్పుడు వారితో అమర్యాదగా వ్యవహరించి మరణించిన తర్వాత వారితో తమకు వైరుధ్యాలే లేనట్లు కృత్రిమ ప్రేమను నటించడం సబబేనా? ఈ మరణానంతర ప్రేమలు ఏమిటి?

రాజకీయాలలో, సినిమాలలో, వివిధ వృత్తులలో ఉన్నవారికి కనీసం మనిషి అనిపించుకునేందుకు అన్ని సద్‌ లక్షణాలూ కాకున్నా... కొన్ని మౌలిక విలువలు ఉండితీరాలి. అందులో కృతజ్ఞత ఒక ప్రధాన లక్షణం. మహాభారత సంగ్రామానికి ముందు కర్ణుడి వద్దకు వచ్చిన ద్రౌపది ‘అసలు నువ్వు కూడా కుంతీపుత్రులలో ఒకడివి. పైగా అందరి కన్నా పెద్దవాడివి. పాండవపక్షం చేరితే నువ్వే పట్టాభిషిక్తుడివి అవు తావు’ అని చెప్పడంతోపాటు ‘నిన్ను ఆరో భర్తగా స్వీకరిస్తాను కూడా’ అని ఎరవేసినప్పుడు  ద్రౌపదికి కర్ణుడు ఎంతో ఉదాత్తమైన సమాధానం ఇస్తాడు.

‘ఎంతో దీక్షతో నన్నాదరించి, విద్యాబుద్ధులు నేర్పి, అండదండ లందించిన దుర్యోధన సార్వభౌముణ్ణి విడిచిపెట్టి పాండవులతో చేరే రాక్షసకృత్యానికి నేను ఒడిగడితే చివరకు జరిగేదేమిటి... అంతకన్నా బిచ్చమెత్తుకోవడం మేలు కదా’ అంటాడు. ఇది అభినవ తిక్కనగా పేరు గాంచిన తుమ్మల సీతారామమూర్తి చౌదరి తన ‘శబల’ అన్న కావ్య ఖండికలో రాసిన కథనం. ‘దాన వీర శూర కర్ణ’లో దుర్యోధనుడి పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసిన తాతకు తగ్గ వారసులమని జూనియర్‌ ఎన్టీఆర్, కల్యాణ్‌రాంలు నిరూపించుకున్నారు. బాబు చెప్పినట్టు చేయకపోతే మహా అయితే ‘గౌతమి పుత్ర శాతకర్ణి’కి ఇచ్చినట్టు తమ సినిమాలకు ఈ ప్రభుత్వం రాయితీ ఇవ్వకపోవచ్చు. 

పాశుపతాస్త్రాన్ని నిందించిన ధర్మరాజును గత శపథం ప్రకారం సంహరించకపోతే ఆత్మహత్యే శరణ్యం అనుకున్న అర్జునుడు తర్వాత శ్రీకృష్ణుడి సలహాతో తనపై తాను ఆత్మస్తుతి చేసుకుని సమస్యను పరి ష్కరించుకుంటాడు. అతిశయోక్తి వల్లించటం ఆత్మహత్యతో సమానమే అన్న నేపథ్యం నుంచే ‘తనను తాను పొగుడుకుంటే తన్నుకు చచ్చినట్టే’ అన్న నానుడి వచ్చింది. ఈరోజు ఇలా ఆత్మస్తుతి చేసుకునే నేతలు మనకు కొత్తకాదు. ‘నా దూరదృష్టి, ముందు చూపు లేకపోతే దేశం అనా గరికంగా ఉండేది. శాస్త్ర సాంకేతిక విప్లవం సాధ్యమయ్యేదికాదు. నేను లేనప్పుడు ఈ హైదరాబాద్‌ ఉన్నదా... పుష్కరాలు జరుపుకుంటున్న కృష్ణా గోదావరి నదులు సైతం ప్రవహించేవా’ అని అతిశయోక్తులు చెప్పు కుంటూ ఆత్మస్తుతి చేసుకునే నేతలను చూస్తున్నాం! 

మంచి చేయపోయినా, చెడు చేయకపోవడం కనీస మానవ లక్షణం. కానీ తమను విమర్శించినవారిని భయభ్రాంతులకు గురిచే యడం, లొంగదీసు కోవాలనుకోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండిం టిలో కనబడుతోంది. ఈమధ్య తెలుగుదేశం ఆర్భాటంగా చేద్దామను కున్న బహిరంగ సభ అభాసుపాలైన తీరు ఇందుకు ఉదాహరణ. ఆ సభలో కొందరు ముస్లిం యువకులు తమకు జరిగిన అన్యాయాన్ని నేతలకు వివరించటం కోసమని ప్లకార్డులు పట్టుకుని మౌనంగా నించు న్నారు. కానీ రాజుగారికి ఆగ్రహం వచ్చింది. వారి భటులు తమ రాజభక్తి ప్రదర్శించుకునేందుకు అక్రమంగా ఆ ముస్లిం యువకులను లాఠీలతో తమ చేతులు నొప్పి పెట్టేంతవరకూ కొట్టి పోలీస్‌స్టేషన్‌లన్నీ తిప్పి వారిపై తప్పుడు కేసులు పెట్టిన వైనం ఇది. అందుకే రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదువా అన్న నానుడి వచ్చింది. 

ఇదే సందర్భంలో, లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమ్‌నాథ్‌ ఛటర్జీ ఉదంతం గుర్తుకురావడం సహజం. ఆయన సీపీఎం తరఫున పార్లమెం టుకు ఎన్నికయ్యారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డు ఏర్పాటు చేసి నప్పుడు తొలిసారి ఆయనకే లభించింది. ఆయనే అన్నివిధాలా అర్హుడని అన్ని పార్టీల నేతలూ ముక్తకంఠంతో అభినందించారు కూడా. అయితే 2008లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అమెరికాతో అణ్వస్త్ర ఒప్పందం కుదుర్చుకోవడాన్ని నిరసిస్తూ సీపీఎంతో పాటు విపక్షాలన్నీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాయి. అన్ని పార్టీలు విప్‌ జారీ చేశాయి. కానీ సోమ్‌నాథ్‌ ఛటర్జీ మాత్రం సీపీఎం ఆదేశాన్ని శిరసా వహించనని చెప్పారు. ‘నేను ఏ పార్టీవాడిని అయినా ఆ స్థానం (స్పీకర్‌)లో ఉన్నం తవరకూ తన, పర అన్న భేదభావం లేకుండా నిష్పాక్షికంగా వ్యవహ రిస్తానని రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవి స్వీకరించాను. కనుక నేనిపుడు పాలకపక్షం వైపు మొగ్గు చూపడమో, ప్రతిపక్షం కొమ్ము కాయ డమో సరికాద’ని వివరించారు. అయినా సీపీఎం నేతలు తమ నిబంధ నావళి ప్రకారం ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారు. 

ఇటీవల ఆయన కన్నుమూశారు. సోమ్‌నాథ్‌ భౌతిక కాయంపై అరుణ పతాకం కప్పేందుకు సీపీఎం నాయకత్వం వెళ్లింది. కానీ ఆయన కుమారుడు, కుమార్తె అందుకు తిరస్కరించారు. తనను సీపీఎం పార్టీ సభ్యత్వం నుంచి తొలగించిన రోజున ‘నా జీవితంలో ఇది అత్యంత దుర్దినం అని క్షోభ చెందారు. ఆ మానసిక క్షోభ నుంచి ఆయన కోలు కోలేదు. మాకు తెలుసు ఆయన హృదయం ఎంత గాయపడిందో. మాకు మరొకటి తెలుసు ఆయన అంతరాల్లో శ్రామిక వర్గం పట్ల పేదల పట్ల ఎంతటి ప్రేమ ఉన్నదో’ అంటూనే సీపీఎం నేతల ప్రయత్నాన్ని అంగీకరించలేదు.

ఇక్కడ హరికృష్ణ ఉదంతం, సోమ్‌నాథ్‌ ఉదంతం నూటికి నూరుపాళ్లూ ఒకే రీతిన ఉన్నాయని అనలేం. కానీ సీపీఎం నేతలు కూడా ఒక అంశం గుర్తించాలి. పార్టీ నిర్మాణ నిబంధనావళి కూడా భౌతిక వాస్తవికతపై ఆధారపడి ఉండాలి. కేంద్రీకృత నియం తృత్వం అన్న నిర్మాణసూత్రం ఆచరణలో వ్యక్తుల నియంతృత్వానికి దారితీస్తుందని రష్యా, చైనా వంటి దేశాలలో కొన్ని అనుభవాలున్నాయి.

అవి మార్క్సిస్టు పార్టీ నేతలకు తెలియనివి కాదు. నిబంధనావళి ‘రోడ్డు రోలర్‌’ మాదిరిగా కాక, కేంద్రీకృత ప్రజా స్వామ్యంగా ఉండాలని వారు గ్రహించాలి. పార్టీకి సోమ్‌నాథ్‌ ఛటర్జీ చేసిన సేవలు నాయకత్వం మరి చిందా? చర్య తీసుకునేముందు పార్టీకి మానవీయ దృక్పథం ఉండాలి కదా! అలా సమతుల్యంగా అంచనా వేయటం ఇంకా కమ్యూనిస్టులు నేర్చుకోవలసే ఉంది. ఏంగెల్స్‌ చెప్పిన ఉటంకింపుతో దీన్ని ముగిస్తాను. ‘‘ఎవరి గురించి ఎవరేమనుకున్నా, అంతిమంగా చరిత్ర తన గమనంలో ఎవరి పాత్రేమిటో నిర్ధారిస్తుంది. అయితే అప్పటికి ఆ వ్యక్తి తనపై చరిత్ర ఇచ్చిన తీర్పు పట్టనట్లు సమాధిలో దీర్ఘ నిద్ర పోతూ ఉంటాడు’’.

డాక్టర్‌ ఏపీ విఠల్‌
వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు
మొబైల్‌ : 98480 69720

మరిన్ని వార్తలు