అఖండ విజయం నుంచి అద్భుత పాలన దాకా... 

24 May, 2020 00:40 IST|Sakshi

సందర్భం

2014లో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారానికి అడుగు దూరంలో ఆగితే, 2019లో చంద్రబాబునాయుడు అధికార పీఠానికి ఆమడ దూరంలో ఆగిపోవడం ప్రజాస్వామ్యంలో ఉన్న చమత్కారం అనిపిస్తుంది.  కిందటేడాది ఏప్రిల్‌ 11వ తేదీన జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద పరీక్ష రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. మే 23న ఫలితాలు వెలువడ్డాయి. ఆయన పెద్ద పరీక్షే రాసి పాసయ్యారు. అదీ అత్తెసరు మార్కులతో కాదు, మొత్తం 175 స్థానాల్లో  151 సీట్లలో తన అభ్యర్ధులను గెలిపించుకుని కొత్త రాష్ట్ర చరిత్రలో నూతన  అధ్యాయం లిఖించారు. 

విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ పదవిని స్వీకరించి మే 30 నాటికి సరిగ్గా ఏడాది. ఆయన ఏ దిశగా సాగుతున్నారు, ఏ మార్గంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అనేది స్థాలీపులాక న్యాయంగా పరిశీలించుకోవడానికి ఈ సంవత్సర కాలం అక్కరకు వస్తుంది. తమది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అనిపించుకునే నిర్ణయాలను ఎన్నింటినో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి జగన్‌ ప్రకటిస్తూ వచ్చారు. ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు సమర్ధులైన అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

ముందే రాసిపెట్టుకున్న స్క్రిప్ట్‌ మాదిరిగా,  జరిగేవన్నీ ఒక పద్ధతి ప్రకారం చకచకా సాగిపోతూవుండడం జగన్‌ పాలనలోని ఓ ప్రత్యేకత. అసెంబ్లీ సమావేశం, మంత్రివర్గ నిర్మాణం, శాఖల పంపిణీ, స్పీకర్‌ ఎన్నిక, పదమూడు జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు, గ్రామ సచివాలయాల ఏర్పాటు, గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు అమలు చేసిన అన్నదాతా సుఖీ భవ ప«థకం రద్దు, దాని స్థానంలో రైతు భరోసా పథకం, పారిశుధ్య పనివారు, అంగన్‌వాడీ మహిళల వేతనాల పెంపు, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు అనే వివక్ష లేకుండా ఇంటర్‌ విద్యార్థులకు కూడా అమ్మఒడి పథకం వర్తింపు, ఢిల్లీ యాత్రలు, ప్రధాని నరేంద్ర మోదీతో ఇతర కేంద్ర మంత్రులతో భేటీలు ఇలా అలుపూసొలుపూ లేని పనులతో, ప్రతిరోజూ ఏదో ఒక కొత్త నిర్ణయం ప్రకటిస్తూ మొదటి నెల ఇట్టే గడిచిపోయింది. అధికారుల సమీక్షా సమావేశాల్లో కొత్త ముఖ్యమంత్రి మార్కు మార్పు స్పష్టంగా కానవస్తోంది. 

పార్టీ మార్పిళ్ల విషయంలో అసెంబ్లీ సాక్షిగా వైఎస్‌ జగన్‌ చేసిన ప్రకటన ప్రజాస్వామ్య ప్రియులను ఎంతగానో అలరించింది. తమ పార్టీలోకి  వేరేవారు ఎవరు రావాలన్నా ముందు పదవులకు రాజీ నామా చేయాలని పునరుద్ఘాటించారు. అలా గీత దాటే వారిని ఏమాత్రం ఉపేక్షించకుండా వారిపై అనర్హత వేటువేయాలని కొత్తగా స్పీకర్‌గా ఎన్నికయిన తమ్మినేని సీతారాంకు సభానాయకుడి స్థానం నుంచి సీఎం జగన్‌ సూచించడం ముదావహం.

వై.ఎస్‌. జగన్‌ పాలన కొన్ని శుభశకునాలతో మొదలయింది. దేశ ప్రధాని మోదీతోనూ, పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనూ చక్కటి స్నేహపూర్వక సంబంధాలు గత ఏడాది కాలంలో పెరుగుతూ రావడం ఆహ్వానించదగిన పరిణామం. వైఎస్‌ జగన్‌తో తన సమావేశం అద్భుతంగా జరి గిందని ప్రధాని వర్ణించడం మోదీ వ్యవహార శైలి తెలిసిన వారికి గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించి ఉంటుంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌. గతంలో అయన బాబుతో వ్యవహరించిన తీరు గుర్తున్న వారికి, ఇప్పుడు జగన్‌తో ఆయన వ్యహరిస్తున్న విధానం ఒకింత అచ్చెరువు కొలిపేదిగా ఉంది.  ప్రతియేటా సముద్రంలో వృ«థాగా కలుస్తున్న గోదావరి నదీ జలాల సమగ్ర వినియోగం, నానాటికీ తగ్గిపోతున్న కృష్ణానదీ జలాల గరిష్ట వాడకం. వీటిని సుసాధ్యం చేసుకోగలిగితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సేద్యపు నీటి సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది. ఈ రెండు నదుల అనుసంధానానికి ఉన్న అవకాశాలను పరిశీలించి ఆచరణలోకి తేగలిగితే రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు ఊహించలేనంతగా మారిపోతాయి.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. చేసిన వాగ్దానాలు కొండంత. నవరత్నాలు ఏమైనా సరే నెరవేర్చి తీరాల్సిందే అనే పట్టుదల. మరో పక్క పెరుగుతున్న విపక్షాల స్వరం. చేసే ప్రతిపనిలో తప్పులు ఎన్నేవారే కానీ, ఇదిగో ఇదీ పొరబాటు... సవరించుకోమని చెప్పేవారే లేరు. వెళ్ళాల్సిన మార్గాన్ని నిర్ణయించుకుని, చేయాల్సిన పనులను నిర్దేశించుకుని, అందుకు అవసరమైన కాలపట్టికను రూపొందించుకుని, ఇదిగో ఈ నెలలో ఇది చేయగలిగాను అని టిక్కు పెట్టుకుని, ఆ పని పూర్తి చేసినట్టు తను మాటిచ్చిన జనాలకు  చెప్పుకుంటూ పోతున్న తరుణంలో ఈ కరోనా భూతం ఆకస్మికంగా విరుచుకుపడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత అస్తవ్యస్తం చేసింది. ఏడాది తిరుగుతూనే తిరిగి మార్చి నెలలోనే మరో ఊహించని పరీక్ష కరోనా రూపంలో ఎదురయింది. కరోనాతో సహజీవనం చేయక తప్పదని జగన్‌ చేసిన వ్యాఖ్య పెద్ద దుమారాన్నే లేపింది. అందరూ ఆక్షేపించేలా చేసింది. చివరికి పాలకులు అందరూ అదేమాట చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కరోనాకు తోడు పులిమీద పుట్రలా విరుచుకుపడిన వైజాగ్‌ విష వాయువు దుర్ఘటన దరిమిలా బాధితులకు కనీవినీ ఎరగని పరిహారం ఇవ్వడం ద్వారా జగన్‌ అసాధారణ వ్యూహంతో ముందుకెళ్లారు. 

బహుళ ప్రజాదరణ కలిగిన నాయకులకు ఒక రక్షాకవచం ఉంటుంది. వారిపై వచ్చే విమర్శలను, ఆరోపణలను జనం తేలిగ్గా తీసుకుంటారు. ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పుడు ఆయన గురించి వెలువడిన నిందాప్రచారాలు అన్నీ ఇన్నీ కావు. అయినా ప్రజలు  పట్టించుకోలేదు. పరిపాలనలో లోటుపాట్లని లెక్కపెట్టకుండా ప్రతిసారీ ఆయన్ని గెలిపిస్తూ వచ్చారు. అలాంటి నాయకుడికి 1989లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. అంతగా అభిమానించిన ఎన్టీఆర్‌ వంటి మహానాయకుడినే ఒక నియోజకవర్గం, కల్వకుర్తిలో ఓడించారు. కాబట్టి మంచి ప్రజాదరణ కలిగిన జగన్‌ వంటి నాయకులు గతం బోధించే పాఠాలను గుర్తుచేసుకుంటూ భవి ష్యత్తుకు గట్టి పునాదులు వేసుకోవాలి.

తోక టపా: వైఎస్‌ జగన్‌ వ్యవహార శైలి గురించి సోషల్‌ మీడియాలో కనబడిన వ్యాఖ్య: ‘రైల్వే ప్లాట్‌ఫారం ప్రయాణికుల సందడితో, తినుబండారాలు అమ్మేవారి కేకలతో నానా గోలగా ఉన్నా, వచ్చిపోయే రైళ్ళు రణగొణధ్వనులు చేస్తున్నా ఆ గోలని (ప్రతిపక్షాల వ్యతిరేక ప్రచారం) ఏమాత్రం  పట్టిం చుకోకుండా ఏకాగ్రతతో తన పని తాను చేసుకునే స్టేషన్‌ మాస్టర్‌ వంటివాడు జగన్‌ మోహన్‌ రెడ్డి’.

వ్యాసకర్త : భండారు శ్రీనివాసరావు,సీనియర్‌ జర్నలిస్టు!
98491 30595

మరిన్ని వార్తలు