ఉల్లి పతనంతో రైతుకు కన్నీళ్లు

21 Dec, 2018 00:49 IST|Sakshi

విశ్లేషణ 

గత మూడేళ్లుగా తాము పండిస్తున్న పంటలకు ధరలు పడిపోవడంతో ఆగ్రహావేశాలకు గురైన రైతులు ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, టమేటోలు, క్యాబేజీ, కాలీఫ్లవర్, బఠానీ వంటి కూరగాయలును వీధుల్లో పారేయడం నిత్యం వార్తలకు ఎక్కుతూనే ఉంది. కానీ అమెరికాలో అధిక ఉత్పత్తితో వ్యవసాయ ధరలు పతనమైనప్పడు అమెరికా వ్యవసాయ విభాగం రైతులనుంచి నేరుగా ఉత్పత్తులను కొంటూ సమస్యను పరిష్కరిస్తున్న పద్ధతిని భారత్‌లో ఎందుకు అమలు చేయరు? వినియోగదారుకు మాత్రమే ప్రాధాన్యమిచ్చే వ్యవస్థ నుంచి రైతుకు ప్రాధాన్యమిచ్చే తరహా వ్యవస్థకు భారత్‌ చోటు కల్పించాలి.

గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మద్‌నగర్‌లో ఉన్న సంగమ్నెర్‌కి చెందిన యువరైతు శ్రేయస్‌ అభాలే. ఇతడి వయస్సు 21 సంవత్సరాలు. 53.14 క్వింటాళ్ల ఉల్లిపాయలు అమ్మిన తర్వాత తాను సంపాదించిన మొత్తం కేవలం రూ. 6 (ఆరు రూపాయలు) మాత్రమే అని తెలుసుకుని ఒక్కసారిగా నివ్వెరపోయాడు. తీవ్రమైన నిరాశా నిస్పృహలతో అతడు తను సంపాదించిన ఆ ఆరు రూపాయలను చెక్కురూపంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవీందర్‌ ఫడణవీస్‌కు పంపాడు. కొద్ది రోజుల తర్వాత మహారాష్ట్రలోని యోలా తాలూకాలో ఉన్న అండర్సుల్‌ ప్రాంతానికి చెందిన చంద్రకాంత్‌ బైకన్‌ దేశ్‌ముఖ్‌ అనే మరొక రైతు తాను పండించిన ఉల్లి పంటకు కిలోకి 51 పైసలు మాత్రమే ధర పలకడంతో హతాశుడయ్యాడు. దారుణంగా పడిపోయిన ఉల్లిపాయల ధరకు నిరసనగా అతడు 216 రూపాయలను మహారాష్ట్ర ముఖ్యమంత్రికి మనీఆర్డర్‌ రూపంలో పంపాడు. మండీ చార్జీలు, రవాణా ఖర్చులు మినహాయిస్తే ఈ సీజన్‌లో తాను పండించిన ఉల్లిపాయలకు వచ్చిన రాబడి అంతే మరి.

ఎంవో వద్దట.. ఆన్‌లైన్‌లో పంపాలట..!
మహారాష్ట్రలోని నాసిక్‌ రైతు సంజయ్‌ సాఠేను వీరిద్దరూ ఆదర్శంగా తీసుకున్నట్లుంది.  సాఠే కూడా ప్రధాని విపత్తు సహాయ నిధికి రూ. 1,066ల మనీఆర్డర్‌ను పంపి వార్తలకెక్కాడు. 750 కిలోల ఉల్లిపంటను అమ్మగా, ఖర్చులన్నీ మినహాయించుకున్న తర్వాత సాఠేకి దక్కిన రాబడి ఇదే. ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు ఆ మనీఆర్డర్‌ను స్వీకరించకుండా, మళ్లీ తనకే వెనక్కు పంపడంతోపాటు ఆ సొమ్మును  ఆన్‌లైన్‌లో పంపమని ఉచిత సలహా ఇవ్వడం చూసి సాఠే విస్తుపోయాడు.

ఉల్లి ధర దారుణంగా పడిపోవడంతో, పంటపొలాల్లో నిజంగా రక్తస్నానం చోటు చేసుకుంది. దేశంలోనే ఉల్లిపాయలకు అతిపెద్ద వ్యాపార కేంద్రమైన లసల్‌గావ్‌ మండీలో ఉల్లి ధర క్వింటాలు (వంద కేజీలు)కు రూ. 100 నుంచి రూ. 300 వరకు పడిపోయింది. సగటున ఉల్లిరైతులు ఉల్లిసాగుకు అయిన ఖర్చుల్లో 15 శాతానికి మించి రాబడి పొందలేకపోయారు. ఈ ఉత్పాతం కలిగించిన ప్రకంపనలను తట్టుకోలేక నాసిక్‌ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు.

మధ్యప్రదేశ్‌లోని నీముచ్‌ మండీలో, ఉల్లి ధరలు కిలో 50 పైసలకు పడిపోయాయి. ఇలాంటి అనేక ఘటనల్లో, విసిగిపోయిన రైతులు తమ పంటను వీధుల్లో పారవేశారు. కొంతమంది రైతులు ఉల్లి పంటను రహదారుల పైన కుమ్మరించి ఆ దారెంట వెళుతున్న జనాలకు ఉచితంగా పంచిపెట్టారు. చివరకు వెల్లుల్లి పంటకు కూడా ఇదే గతి పట్టింది. గత సంవత్సరం రాజస్థాన్‌లోని హడోటి (కోటా, బుండి, బరన్, ఝళవర్‌ అనే నాలుగు జిల్లాలు) రీజియన్‌లోని రైతులు ధర బాగా పలుకుతోందని వెల్లుల్లి పంట సాగుకు మళ్లారు. ఈ సంవత్సరం మార్చి నెలలో పంట చేతికొచ్చింది. కానీ మార్కెట్లో ధర కిలోకు 1 రూపాయి మేరకు పడిపోయింది. మండీకి రవాణా చేయడం కూడా సాధ్యం కాని దుస్థితి ఏర్పడింది. వెల్లుల్లిధరలు అనూహ్యంగా పడిపోవడంతో ఈ ప్రాంతంలో అయిదుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలొచ్చాయి.

ఉల్లి, వెల్లుల్లి సాగుదారుల  దుస్థితి అసాధారణమైన విషయం కాదు. కొన్ని నెలల క్రితం నాసిక్‌ మార్కెట్లో టొమేటో టోకు ధరలు 65 శాతం పతనమైనప్పుడు చాలామంది రైతులు తాము పండించిన టొమేటో పంటను రోడ్లమీదే కుప్పపోశారు. ఇలా ధరలు కుప్పకూలే ధోరణి మన దేశానికి కొత్తేమీ కాదు. గత మూడేళ్లుగా తాము పండిస్తున్న పంటలకు ధరలు పడిపోవడంతో ఆగ్రహావేశాలకు గురైన రైతులు ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, టొమేటోలు, క్యాబేజీ, కాలిఫ్లవర్, బఠానీ వంటి కూరగాయలను వీధుల్లో పారేయడం నిత్యం వార్తలకు ఎక్కుతూనే ఉంది. నిజానికి గతంలో ఒక రైతు తాను పండించిన దానిమ్మకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రోడ్డుమీద కూర్చుని దానిమ్మ పళ్లను ఒకదాని తర్వాత ఒకటిగా పగులగొడుతూ తన నిస్పృహను వ్యక్తపరుస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. పంట చేతికి వచ్చాక మార్కెట్లో ధరలు కుప్పగూలిపోవడం అనేది వేలాది వ్యవసాయదారుల జీవితాలను ఎలా దెబ్బ తీస్తోందో తెలుసుకోవడానికి ఇలాంటి ఉదాహరణలు నిత్యం సమాజం అనుభవంలోకి వస్తూనే ఉన్నాయి.

కనీస మద్దతు ధరను వెక్కిరిస్తున్న వ్యవసాయ ధరల పతనం
నవంబర్‌ నెలలోనే కనీస మద్దతు ధరకంటే కనిష్ట స్థాయికి బహిరంగ మార్కెట్లో ధరలు పతనమైపోయినప్పుడు మన దేశ రైతులు ఇంతకు మించి ఏం చేయగలరని ఆశించాలి? రైతులు పండించే పంటల ధరలు మొత్తంగా 15 నుంచి 25 శాతం వరకు పడిపోవడం ప్రస్తుతం సాధారణ కృత్యమైపోయింది. చివరకు వరిధాన్యం విషయంలో కూడా కనీస మద్దతు ధర కింద అదనపు వరి ధాన్యాన్ని సేకరించడానికి ప్రభుత్వం సిద్ధపడుతున్న దశలోనూ వరి ధర 20 శాతం మేరకు పడిపోయింది. ప్రతి సంవత్సరం 23 వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తున్న నేపథ్యంలో వీటిలో 21 పంటల ఉత్పత్తి అనూహ్య స్థాయిలో మిగులు రూపంలో పోగుపడటం ఫలితంగానే ధరలు కుప్పకూలుతున్నాయని కొన్ని అధ్యయనాలు తెలిపాయి.

ఒక సంవత్సరం ఏదైనా పంటకు అధిక ధర లభించడం, వాతావరణం అనుకూలించడం పట్ల ఆకర్షితులైన రైతులు ఆ మరుసటి సీజ నులో రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తికి తీవ్రంగా శ్రమిస్తుంటారు. కానీ వారి ఆ ఉత్సాహం, చొరవ తాత్కాలికం మాత్రమే. ఎందుకంటే గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కుప్పకూలి పోతూ రైతులను సంక్షోభంలో ముంచెత్తుతున్నాయి. మన ఎగుమతులకు సుస్థిర మార్కెట్‌ను కల్పించడంలో వైఫల్యానికి కారణంగా దేశీయ ఎగుమతి, దిగుమతి పాలసీని తప్పుపట్టడం సహజమే. అదే సమయంలో మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీమ్‌ ప్రవేశపెడతామని ప్రభుత్వం చేస్తున్న వాగ్దానం రైతులను నష్టాల బారినుంచి గట్టెక్కించడంలో విఫలమయింది. వాస్తవానికి ఆపరేషన్‌ ఫ్లడ్‌ విధానాలకు అనుగుణంగా ఆపరేషన్‌ గ్రీన్‌ని ప్రారంభించినప్పుడు టొమేటో, ఉల్లి, బంగాళాదుంప అనే మూడు కీలక పంటల విషయంలో మార్కెట్‌ జోక్యానికి వీలుకల్పించాలని నిర్ణయించారు. ధరలు పెరిగే అవకాశముందనేది వార్తల రూపంలో ఉన్నప్పుడే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. కానీ పాలు వంటి అతిత్వరగా పాడైపోయే ఉత్పత్తి కోసం సమర్థవంతంగా సహకార వ్యవస్థను దేశంలో ఏర్పర్చుకోగలిగినప్పుడు, ఇదే వ్యూహాన్ని ఇతర కీలక వ్యవసాయోత్పత్తుల విషయంలో ఎందుకు అమలు చేయలేరన్నది ప్రశ్న.

అమెరికాలో, ధరల పతనం నుంచి రైతులను కాపాడటంలో ప్రైవేట్‌ మార్కెట్లు విఫలమైనప్పుడు అమెరికా వ్యవసాయ విభాగం (యుఎస్‌డిఎ) రైతుల వద్ద ఉన్న మిగులుపంటకు ధర కల్పించే విషయమై పదే పదే చర్యలు తీసుకుంటుంది. 2016లో మార్కెట్‌ధరలు పతనమైనప్పుడు అమెరికా రైతులనుంచి 20 మిలియన్‌ డాలర్ల విలువైన కోటి పది లక్షల టన్నుల చీజ్‌ని (జున్నుగడ్డలాంటిది) యుఎస్‌డిఎ సేకరించింది. ఆ సందర్భంగా అమెరికా వ్యవసాయ కార్యదర్శి టామ్‌ విల్‌శాక్‌ మాట్లాడుతూ ‘‘వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు అనేది సమగ్రమైన భద్రతా నెట్‌వర్క్‌లో భాగమని, 30 ఏళ్ల కాలంలో కనివీనీ ఎరుగని రీతిలో ఉత్పత్తయిన చీజ్‌ మిగులును తగ్గించడానికి, సమాజంలో అత్యవసరమైన వారికి ఈ అత్యధిక ప్రొటీన్‌ విలువలున్న ఆహారాన్ని అందించడానికి ఈ నెట్‌వర్క్‌ తోడ్పడుతుంద’’ని చెప్పారు.
రైతు కేంద్రక భద్రతా వ్యవస్థ అవశ్యం

అంతకుముందు కూడా, యుఎస్‌డిఎ కోటి పౌండ్ల స్టాబెర్రీలను కొనుగోలు చేసి వాటిని పాఠశాలలకు, సమాజంలో అవసరమైన వారికి పంపిణీ చేసింది.  అధిక మిగులుతో సతమతమవుతున్న టొమేటో రైతులనుంచి 2011లో తాజా టొమేటాలను 6 మిలియన్‌ డాలర్ల విలువైన టొమేటాలను కొనుగోలు చేసింది. ఇదేవిధంగా భారత ఆహార, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ అదనంగా ఉత్పత్తయిన టొమేటో, ఉల్లి, బంగాళాదుంపలను ఎందుకు కొనలేదు అని నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. అలాగే త్వరగా పాడైపోయే అదనపు ఆహార పదార్థాలను ఆహార భద్రత వలయంలో లేని వారికి మనం ఎందుకు పంపిణీ చేయలేకపోతున్నట్లు? ఈ దేశంలో ప్రతి రాత్రీ 2 కోట్లమంది ప్రజలు పస్తులతో నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే అదనపు టొమేటాలను వీధుల్లో పారవేస్తుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
అలాగని, అమెరికా ప్రతి సందర్భంలోనూ ఈ వ్యవసాయ ధరల పతనాన్ని పరిష్కరిస్తూ వచ్చిందని చెప్పలేం. 2002లోనే అమెరికా ప్రైజ్‌–లాస్‌ కవరేజ్‌ సిస్టమ్‌ పేరిట రైతులకు మద్దతు ప్రకటించేందుకు యుఎస్‌ ఫార్మ్‌ బిల్‌ తోడ్పడింది. 2014లో కూడా వేరుశనగ ఉత్పత్తిదారులు ధరల పతనం సంక్షోభంలో కూరుకుపోతున్నప్పుడు  ఈవిధమైన ఇన్‌కమ్‌ సపోర్టు వ్యవస్థ సంబంధిత రైతులను ఎంతగానో ఆదుకుంది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం పెరిగిపోయినప్పుడు వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకునే భారతీయ మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ సిస్టమ్‌లా కాకుండా, అమెరికాలో రైతులకు భద్రతా నెట్‌ వ్యవస్థను పకడ్బందీగా అమలు చేస్తుండటం గమనార్హం.

దేవిందర్‌శర్మ
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్‌ : hunger55@gmail.com

మరిన్ని వార్తలు