నాగరిక చట్టం అడవికి వర్తించదా?

14 Jun, 2019 00:47 IST|Sakshi

విశ్లేషణ

ఆదివాసులు, మరికొన్ని సంప్రదాయ జాతులు అడవుల్లో తరతరాల నుంచి ఉంటున్నారు. అభివృద్ధి పేరుతో, వారిని ‘అభివృద్ధి చేస్తా’మనే సాకుతో, మనం అభివృద్ధి కావడానికి వారిని వెనుకకు, ఇంకాఇంకా వెనుకకు తోసేస్తున్నాం. తరతరాలుగా అక్కడే ఉండి బతుకుతున్నవారిని నోటీసు లేకుండా తొలగించడం న్యాయమా? ‘మీరు ఇక్కడి నించి వెళ్లిపొండి’ అని వారిని గద్దిస్తే రెండు ప్రశ్నలు వేస్తారు. ‘ఈ నేల ఎందుకు వదలాలి? ఎక్కడికి వెళ్లాలి?’ ఈ ప్రశ్నలకు ఎవరు జవాబిస్తారు?  

1927లో బ్రిటిష్‌ పాలకులు అడవులను రక్షిం చడానికేనని  అంటూ, అడవి చట్టం తెచ్చారు. అటవీ అధికారులు, గార్డులు, జవాన్లు తదితర ఉద్యోగులతో ఒక పెద్ద క్యాడర్‌ తయారైంది. ప్రభుత్వం ఫలానా హద్దుల్లోని ప్రాంతం అడవి అని ప్రకటిస్తే చాలు, అటవీ అధికారులు అక్కడ రాజ్యం ఏలడం మొదలుపెడతారు. 

మన హక్కులను అమలుచేసుకోవడానికి కాల పరిమితులచట్టం పరిమితులు నిర్దేశించింది. భూమి, ఇల్లు వంటి స్థిరాస్తులను ఎవరైనా కబ్జా చేస్తే ఆ కబ్జా చేసినవారిని ఖాళీ చేయించడానికి ఈ చట్టం 12 సంవత్సరాల కాలపరిమితి విధించింది. ఈలోగా రాకపోతే కబ్జాదారుడే ఆ కబ్జాలో దర్జాగా కొనసాగే వీలు ఏర్పడుతుంది. ప్రభుత్వ భూమి అయితే 30 సంవత్సరాల పాటు ఆక్రమణల్లో ఉంటే  ప్రభుత్వం అది నా భూమి అని క్లెయిమ్‌ చేయకపోతే ఆ తరువాత అవకాశం లేకుండా పోతుంది. ఆదివాసులు, తదితరులు తరతరాలనుంచి కొంత అడవి భూమిని తమ అధీనంలో ఉంచుకుంటే, ప్రభుత్వం ఆ భూమి తనదే అని ఏ విధంగా క్లెయిమ్‌ చేయగలుగుతుంది? నాగరికుల చట్టం అడవిలో వారికి వర్తించదా?  

1927నుంచి అడవి చట్టం కింద అటవీ అధికారులకు తీవ్రమైన అధికారాలు ఇవ్వడం వల్ల తగా దాలు మొదలైనాయి. ఫారెస్ట్‌ గార్డ్‌ ఈ అటవీవాసు లకు గాడ్‌ కన్నా భయంకరుడు. ఈ గార్డ్‌ చెప్పుచేతల్లో అడవి మనుషుల హక్కులు ఉంటాయి. ఈ నిరంకుశ అటవీ పాలనలో జనం పడ్డబాధల పునాదుల మీద తీవ్రవాదం, నక్సలిజం పుట్టి పెరిగాయి. విభజనవాదం, వేర్పాటువాదం కూడా వచ్చింది.  

అడవిపైన ఆదివాసులకు యాజమాన్యపు హక్కు ఇవ్వకపోయినా, కనీసం అడవిలో ఉండే హక్కు వారికి ఇవ్వాలని ఎన్నో ఏళ్లుగా పోరాటాలు, ఉద్యమాలు సాగుతున్నాయి. చివరకు ప్రభుత్వం ఈ ప్రజాందోళనలకు తలొగ్గి 2006లో అడవి హక్కుల చట్టం తెచ్చింది. ఈ చట్టం ప్రకారం ఆదివాసులు 2005 డిసెంబర్‌ 13 నాటికి తాము అడవిలో ఫలానా హద్దుల మధ్య ఉంటున్నట్టు రుజువుచేస్తే ఆ హద్దుల మధ్య నివసించే హక్కు ఉందని పత్రం ఇస్తారు. ఈ చట్టంద్వారా కొత్త హక్కులు ఇవ్వడం లేదు, ఇదివరకు నుంచి వారి హక్కులను గుర్తించి, రక్షించి, పరిధులను నిర్ణయించడం ఈ చట్టం ఉద్దేశం.  

ఈ హక్కులను గుర్తించడానికి ఒక ప్రక్రియను నిర్దేశించారు. గ్రామసభకు ఆదివాసులు తమ క్లెయి మ్‌లను సమర్పించాలి. ఆ హక్కు అభ్యర్థన పత్రాలను, రుజువులను సబ్‌ డివిజినల్‌ స్థాయి అధికారుల కమిటీ పరిశీలిస్తుంది. ఈ కమిటీకి ఒక అధికారి అధ్యక్షుడు. వీరి నిర్ణయాన్ని సమీక్షించడానికి కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ ఉంటుంది. క్లెయిమ్‌లను పరిశీలించి న్యాయంగా నిర్లక్ష్యం లేకుండా వ్యవ హరిస్తే అటవీ నివాసులకు హక్కులు లభిస్తాయి. నిర్లక్ష్యంగా ఆ క్లెయిమ్‌లు తిరస్కరిస్తే అప్పీలులో కూడా న్యాయం జరగకపోతే వారేమవుతారు? అనేక రాష్ట్రాలలో నవంబర్‌ 2018 నాటికి 42 లక్షల 24 వేల క్లెయిమ్‌లు వచ్చాయని, అందులో 18 లక్షల 94 వేల మందికి హక్కు పత్రాలు ఇచ్చారని, 19 లక్షల 39 వేల క్లెయిమ్‌లు తిరస్కరించారని కేంద్ర అటవీ శాఖ లెక్కలు వివరిస్తున్నాయి. దాదాపు 44.8 శాతం మంది క్లెయిమ్‌దారులకు హక్కు పత్రాలు ఇచ్చారు.

కానీ మిగిలిన 55 శాతం మంది గతేమిటి? వారిని ఆక్రమణదారులంటారా? అక్కడ నివసిస్తున్నామనడానికి రుజువులు చూపలేకపోతేనో, చూపిన రుజువులు నమ్మకపోతేనో, అవి చెల్లవంటే వారి క్లెయిమ్‌ ఒప్పుకోరు. అందువల్ల ఆక్రమణదారుడని నిందించి అడవి వదిలి వెళ్లిపోవాలంటారా? అది న్యాయమా? అనేది ధర్మాసనం ముందున్న ప్రశ్న. అర్హులందరికీ పట్టాలిచ్చారా? ఇవ్వని వారంతా అనర్హులైన ఆక్రమణదారులా అని సుప్రీంకోర్టు అడిగింది. ప్రభుత్వాలు ఇచ్చిన ప్రమాణ పత్రాల ఆధారంగా 16 రాష్ట్రాలలో ఉన్న 11 లక్షల మంది గిరిజనులు, ఇతర సంప్రదాయ నివాసులను తొలగించాలని సుప్రీం కోర్టు ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఆదేశించింది. ఒకవేళ 11 లక్షలమందిని అడవుల నుంచి వెళ్లిపొమ్మంటే ఎక్కడికి వెళ్తారు, ఎలా బతుకుతారు? సమస్య చాలా తీవ్రమైందని గుర్తించి సుప్రీంకోర్టు ఫిబ్రవరి 13 తీర్పుపైన తానే ఫిబ్రవరి 28న స్టే ఇచ్చింది. అటవీ వాసుల సమస్య అంతటితో తీరుతుందా?


మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్‌
madabhushi.sridhar@gmail.com

మరిన్ని వార్తలు