తీర్పును ఇలా అడ్డుకుంటారా?

18 Oct, 2018 01:20 IST|Sakshi

ఈ నెల 18 నుంచి శబరిమల ఆలయాన్ని భక్తుల సందర్శనార్ధం తెరవనున్నారు. అన్ని వయసుల మహిళలను అనుమతించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అమలు నిలిపివేసి, తక్షణమే పునర్విచారణ జరపాలని దాఖలు చేసిన పిటీషన్లను వరుస క్రమంలోనే పరిశీలనకు తీసుకుంటాం తప్ప అత్యవసరమైనవిగా పరిగణించబోమని సుప్రీం కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో తీర్పును అడ్డుకుంటామని, మహిళలను ససేమిరా ఆలయంలోకి అనుమతించమని మితవాద, మతవాద శక్తులు చేస్తున్న ప్రకటనలు, చర్యలు మన రాజ్యాంగ స్ఫూర్తిని అవహేళన చేస్తున్నాయి. మహిళలు ఎవరైనా ఆలయంలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే అలాంటి వారిని రెండు ముక్కలుగా నరికి ఒకదానిని ఢిల్లీకి, మరొకదానిని సీఎం విజయన్‌కు పంపుతామని కేరళ బీజేపీ నేత, సినీనటుడు కొల్లం తులసీ బెది రించాడు. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులను ఇడియట్స్‌ అని నిందించాడు. ఎవరైనా మహిళలు ఆలయ ప్రవేశం చేస్తే ఏడుగురు సభ్యులున్న తమ బృందం ఆత్మాహుతి చేసుకుం టుందని కేరళ శివసేన ప్రకటించింది. శబరిమల వైపు ప్రయాణించే ప్రతి వాహనాన్ని అడ్డుకుని వయసులో ఉన్న మహిళలను కిందికి దింపేసే చర్యలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దీనంతటికీ కారణం.. శబరిమల తీర్పు ఆ విధంగా వస్తుందని మతశక్తులు వూహించలేకపోవడమే. అలాగే పునర్విచారణకు తక్షణమే స్వీకరించే అవకాశం లేదని సుప్రీంకోర్టు చెబుతుందని కూడా వూహించకపోవటంతో ఆ శక్తులు హతాశులై మనోభావాల పేరుతో శాంతి భద్రతల సమస్యల సృష్టికి పూనుకున్నాయి, దానిలో భాగంగా మహిళలను ముందుకు తెస్తున్నాయి.

ఇటీవల అనేక దేశాలలో జరుగుతున్న పరిణామాలను చూసినపుడు మితవాద శక్తులు మహిళలను రంగంలోకి దించే ధోరణి పెరిగింది. భారతదేశంలోనూ, మేము నమ్మినదాని కోసం ప్రాణాలిస్తాం, మాదారికి అడ్డు వచ్చిన వారిని అంతమొందించటానికి కూడా వెనుకాడబోమని మతఛాందసవాద శక్తులు ప్రకటించడమే కాకుండా ఆచరించడం కూడా తెలిసిందే. శబరిమలలో కూడా ప్రస్తుత వివాదంపై మహిళలనే ముందుపీటిన పెట్టి సుప్రీంకోర్టు తీర్పును అడ్డుకునే వ్రయత్నాలు జరుగుతున్నాయి. సుప్రీంకోర్టే దీనిపై తగు చర్యలు తీసుకోవడం అవశ్యం.
-ఎం. కోటేశ్వరరావు, హైదరాబాద్‌
 

మరిన్ని వార్తలు