ఆలస్యంగా అయినా దక్కిన న్యాయం

18 Dec, 2018 00:43 IST|Sakshi

వటవృక్షం నేల కూలితే భూమి ఆమాత్రం కంపిం చదా? ఇది 1984లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యా ఘటన అనంతరం దేశవ్యాప్తంగా, ప్రత్యేకించి ఢిల్లీలో సిక్కులపై ఊచకోత ఘటనల నేపధ్యంలో తదనంతర ప్రధాని రాజీవ్‌గాంధీ చేసిన సంచలన ప్రకటన. ఆ ఊచకోత ఘటనలో 3000 మంది పైగా తమ ప్రియతములను కోల్పోయిన బాధిత కుటుంబాలను మాత్రం ఈ అసాధారణ ప్రకటన రూపంలోని ప్రశ్న ఇప్పటికీ వెంటాడుతోంది. నేల కూలిన వటవృక్షానికి, ఆ కాళరాత్రి ఊచకోతల్లో తాముకోల్పోయిన వారికి ఏ సంబం ధం ఉందని బాధిత కుటుంబాలు వేస్తున్న ప్రశ్న ఇప్పటికీ అరణ్య ఘోషలాగే ఉంది. ఆ మారణ కాండ జరిగిన 34 ఏళ్ల తర్వాత నాటి అల్లర్లకు బాధ్యుడిగా ఆరోపణలకు గురైన కాంగ్రెస్‌ నేత సజ్జన్‌ కుమార్‌ని దోషిగా గుర్తిస్తూ ఢిల్లీ హైకోర్టు శిక్ష విధించడం కారుచీకట్లో  కాంతిరేఖ మాత్రమే.

మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ముగ్గురు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజునే, 1984 కాళరాత్రి మచ్చకు కారకుడిగా మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సజ్జన్‌ కుమార్‌కి ఢిల్లీ హైకోర్టు యావజ్జీవ శిక్షను విధించింది. అతడిపై వచ్చిన ఆరోపణలను జాతి హత్యాకాండగా, సామూహిక హత్యాకాండగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుతం 73 ఏళ్ల సజ్జన్‌ కుమార్‌ 1984 నవంబర్‌ 1 రాత్రి ఢిల్లీలోని రాజ్‌ నగర్‌లో ఒక గురుద్వారాను తగులబెట్టిన ఘటనలో ఒక కుటుంబంలోని అయిదుగురు సభ్యుల హత్యకు కారకుడయ్యాడనే ఆరోపణను కోర్టు ధృవీకరించింది. ఈ సందర్భంగా ఎన్నిసవాళ్లు ఎదురైనా సత్యం రుజువవుతుందని బాధితులకు హామీ ఇవ్వడం చాలా ముఖ్యం అని కోర్టు చేసిన వ్యాఖ్య బాధితులకు కాస్త ఉపశమనం కలిగించింది. ఎందుకంటే తమ వారిని కోల్పోయిన బాధ కంటే న్యాయం జరగాలని చేసిన పోరాటం సందర్భంగా గత 34 ఏళ్లుగా బాధితులు ఎదుర్కొన్న బెదిరింపులు, దౌర్జన్యాలు మరింత భీతి కలిగించేలా తయారయ్యాయి.

నాటి ప్రధాని ఇందిరాగాంధీని 1984 అక్టోబర్‌ 31న సిక్కు బాడీగార్డులు కాల్చి చంపిన ఘటన అనంతరం చెలరేగిపోయిన మూకలు నవంబర్‌ 1 నుంచి 4 దాకా 3 వేలమంది సిక్కులను టార్గెట్‌ చేసి మరీ చంపారు. దేశరాజధాని ఢిల్లీలోనే 2,733 మంది సిక్కులను ఊచకోత కోశారు. ఇదే కేసులో సజ్జన్‌ కుమార్‌ని నిర్దోషిగా పేర్కొంటూ అయిదేళ్ల క్రితం ఢిల్లీలోని ట్రయల్‌ కోర్టు అతడిపై కేసు కొట్టేయడం జరిగింది. 2002 డిసెంబర్‌ నెలలో సెషన్స్‌ కోర్టు సజ్జన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. కానీ సీబీఐ 2005 అక్టోబర్‌ 24న అతడిపై మరొక కేసును నమోదు చేసింది. 2010లో ఈకేసును ఢిల్లీ ట్రయల్‌ కోర్టుకు బదలాయించారు. 2013 ఏప్రిల్‌ 30న ట్రయల్‌ కోర్టు సజ్జన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ మరో అయిదుగురిని దోషులుగా నిర్ధారించింది. తీర్పుచెప్పిన న్యాయమూర్తిపై కోర్టు హాలులోనే నిరసనకారులు చెప్పులు విసిరిన ఘటన సంచలనం రేపింది.

తర్వాత సీబీఐ, బాధితురాలు, నాటి ఘటనకు సాక్షి అయిన జగదీష్‌ కౌర్‌ ట్రయల్‌ కోర్టు  తీర్పుకు నిరసనగా అపీల్‌ చేశారు. మరొక ప్రధాన సాక్షి చామ్‌ కౌర్‌ 1984లో రాజధాని ఢిల్లీలోని  సుల్తాన్‌ పురి ప్రాంతంలో మూకను ఉద్దేశించి మాట్లాడుతున్న సజ్జన్‌ని తాను స్వయంగా చూశానని, మన అమ్మను చంపారని, సిక్కులను మనం కూడా చంపుదామని చెబుతున్న అతడి మాటలను విన్నానని చెప్పడంతో సాక్ష్యానికి బలం చేకూరింది. నవంబర్‌ 2న గుంపు తన కుమారుడు కపూర్‌ సింగ్‌ని, తండ్రి సర్దార్జీ సింగ్‌ను దాక్కున్న చోటినుంటి లాగి చితకబాది తగులబెట్టారని కౌర్‌ చెప్పారు.

ఈ సాక్ష్యం ఆధారంగా 2018 డిసెంబర్‌ 17న ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. మనుషుల్ని సజీ వంగా తగులబెట్టి చంపిన ఘటనకు బాధ్యులైన నేరస్తులు రాజకీయ అండదండలను పొంది ప్రాసిక్యూషన్‌ని, శిక్షను కూడా ఇన్నాళ్లుగా తప్పించుకుంటూ వచ్చారని కోర్టు వ్యాఖ్యానించడం న్యాయానికి ఈ దేశంలో పడుతున్న గతి ఏమిటో తేటతెల్లం చేస్తోంది. రాజకీయంగా బలంగా ఉన్న శక్తులు మైనారిటీలను లక్ష్యంగా చేసుకుని తలపెట్టిన సామూహిక నేరాలకు కారకులైనవారిని శిక్షించడానికి దశాబ్దాల కాలం పట్టడం విషాదకరమని మన న్యాయవ్యవస్థను బలోపేతం చేయవలసిన అవసరాన్ని ఈ సుదీర్ఘ జాప్యం సూచిస్తోందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఈ దేశంలో న్యాయం రాజకీయనేతలకు, పలుకుబడి కలవాళ్లకు చుట్టంగా ఎలా మారిపోయిందో సజ్జన్‌ కుమార్‌ ఉదంతం తెలుపుతోంది.
కె. రాజశేఖరరాజు

మరిన్ని వార్తలు