‘దిగజారుడు’లో పరాకాష్ట

15 Aug, 2018 00:49 IST|Sakshi

డేట్‌లైన్‌ హైదరాబాద్‌

ఏపీలో ప్రతిపక్ష నాయకుడు జగన్‌ విషయంలో మొదటి నుంచీ దిగజారుడు రాజకీయాలే నడుస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీని ఛీకొట్టి బయటకు వచ్చాడనే కారణంతో జగన్‌ మీద అక్రమ కేసులు బనాయించి పదహారు మాసాలు జైలుపాలు చేసిన నాటి నుంచి ఏపీలో ఇవే రాజకీయాలు నడుస్తున్నాయి. కానీ ఏపీలో క్షేత్ర స్థాయిలో పరిస్థితి కానీ, ప్రజల మనోభావాలు కానీ రెండు జాతీయ పార్టీలకు ఇంకా అర్థం కాలేదు. టీడీపీ తోక పట్టుకుని ఎలాగోలా ఎన్నికల సముద్రం ఈదాలని జాతీయ పార్టీలు భావించవచ్చు కానీ ప్రజా సంకల్పయాత్రకు పోటెత్తుతున్న ప్రజాభిప్రాయం సాక్షిగా, రహస్య స్నేహ పాచికలు ఇక పారవన్న సత్యం ఆ మూడు పార్టీలు అర్థం చేసుకుంటే మంచిది.

సమకాలీన రాజకీయ పోకడలు చూస్తుంటే పదే పదే గురజాడ వారి ‘కన్యాశుల్కం’ తొలి అంకంలో మధురవాణి అన్న మాటలు గుర్తొ స్తాయి. గిరీశంతో పూర్తిగా తెగతెంపులు కాక ముందే తనను తాకచూసిన రామప్ప పంతులుతో మధురవాణి ‘‘వేశ్య అనగానే అంత చులకనా పంతులు గారు? సానిదానికి మాత్రం నీతి ఉండొద్దా? అయ్యా, ఇటు పయిని మీ తోవ మీది. నా తోవ నాది’’ అని అంటుంది. కొన్ని పార్టీ లను చూస్తే మధురవాణి ఎంత నీతిమంతురాలో కదా అనిపిస్తుంది. మొన్న ఒక సందర్భంలో బీజేపీకి చెందిన నాయకుడొకరు వైఎస్సార్సీపీ నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద నడుస్తున్న అక్రమ ఆస్తుల కేసులో ఏడేళ్ళ తరువాత ఆయన సతీమణి భారతి పేరు చేర్చే ప్రయత్నం గురించి ప్రస్తావించి ‘‘మా వాళ్లు కూడా దిగజారుడు రాజకీయాలాడటం విచారకరం’’ అని తన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ప్రధాని నరేంద్రమోదీ ద్వయాన్ని ఉద్దేశించి అన్నారు.

ఆయన చెప్పింది అక్షరాలా నిజం. ఏపీలో ప్రతిపక్ష నాయకుడు జగన్‌ విషయంలో, ఆయన పార్టీ విషయంలో మొదటి నుంచీ దిగజారుడు రాజకీయాలే నడుస్తున్నాయి. కాంగ్రెస్‌ రాజకీయాలు నచ్చక ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎంపీ పదవికి తానూ, ఎంఎల్‌ఏ పదవికి ఆయన తల్లీ రాజీనామా పారేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నాటి నుంచీ చూస్తున్నాం ఈ తరహా రాజకీయా లను. కాంగ్రెస్‌ విధానాలతో విభేదించాడు, తన దారి తాను చూసు కున్నాడు అని ఊరుకోకుండా జగన్‌ మీద అక్రమ కేసులు బనాయించి పదహారు మాసాలు జైలుపాలు చేసిన నాటి నుంచి ఏపీలో ఇవే రాజకీ యాలు నడుస్తున్నాయి. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ (ఆ అధి కారం కాంగ్రెస్‌కు జగన్‌ తండ్రి దివంగత సీఎం వైఎస్సార్‌ పెట్టిన భిక్ష), ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కలిసి ఈ దిగజారుడు రాజకీయాలకు తెర లేపాయి. నాటినుంచి నేటి వరకూ టీడీపీతో కలిసి కాంగ్రెస్, ఈ నాలు గేళ్ళుగా అదే టీడీపీతో కలిసి బీజేపీ జగన్‌ను రాజకీయంగా పరిమార్చ డానికి ఈ రాజకీయాలు ఆడుతూనే ఉన్నాయి. వాటిని ప్రజల్లోకి తీసుకు పోయి జగన్‌ను, ఆయన స్థాపించిన పార్టీని అప్రతిష్టపాలు చెయ్యడానికి బాబు కనుసన్నల్లో మెలిగే మీడియా మోహరించి ఉండనే ఉన్నది.

వైఎస్సార్సీపీ పెట్టినప్పటి నుంచే కుట్రలు
వైఎస్‌ జగన్‌ని, ఆయన పార్టీని బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నది రాజకీయ పక్షాలే అయితే అర్థం చేసుకోవచ్చు, ఏపీలోని మీడియా యాజ మాన్యం అంతా కూడా దాదాపు ఒక్కటై జగన్‌ను రాజకీయాల్లో లేకుండా చెయ్యాలనే కుట్ర 2011లో ఆయన కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్సీపీ స్థాపించినప్పుడే మొదలయింది. దేశానికి స్వతంత్రం వచ్చాక ఎన్నో పార్టీలు ఆవిర్భవించాయి, కొన్ని నిలబడ్డాయి, ఎన్నో కూలబడ్డాయి, సోదిలో లేకుండా పోయిన పార్టీలు, శక్తిచాలక వెళ్లి వేరే జాతీయ పార్టీ లతో చేతులు కలిపి పదవుల కోసం ప్రయాసపడిన పార్టీలు అనేకం చూశాం. నిజానికి అలా మఖలో పుట్టి పుబ్బలో మాయమైన పార్టీల న్నిటి నాయకులూ జగన్‌ కంటే వయసులోనూ, అనుభవంలోనూ చాలా పెద్దవారు. అలాకాకుండానే రాజకీయాల్లో నిలదొక్కుకుని ప్రజాదరణ పొందుతున్నాడు కాబట్టే అందరూ ఏకమై ఆయనను ఒంటరిని చేయ డానికే ఈ ప్రయత్నం. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించగానే తన పదవికి రాజీనామా చేసి కడప నుంచి లోక్‌çసభకు మళ్లీ పోటీకి దిగిన నాడే బాబు జగన్‌ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నాడని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేసి బోర్లా పడ్డారు. 5.45,672 ఓట్ల మెజారిటీతో గెలిపించారు ప్రజలు జగన్‌ను ఆనాడు. ఇంత చేస్తే బీజేపీతో తన పాత స్నేహాన్ని తిరిగి పునరుద్ధరించుకున్నది బాబే. రాజకీయాల్లో రహస్య స్నేహాలు చెయ్యడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య.

కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్న రోజుల్లో తనపై అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసుల విషయంలో అర్ధరాత్రి ఆనాటి ఆర్థిక మంత్రి పి.చిదంబరం శరణుజొచ్చిన విషయం అందరికీ తెలుసు. ఆ మాట చిదంబరమే స్వయంగా వెల్లడించారు. ఆ తర్వాత జగన్‌పై కేసులు పెట్టించడం, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాన్ని అవిశ్వాసం నుంచి గట్టెక్కించడానికి ఉమ్మడి అసెంబ్లీలో బల పరీక్ష సందర్భంగా టీడీపీని గైర్హాజరు పరచడం నుంచి మొదలై నిన్న కాక మొన్న రాజ్యసభలో పీఏసీ సభ్యుడిగా తన సభ్యుడు íసీఎం రమేష్‌ గెలుపు కోసం కాంగ్రెస్‌ మద్దతు తీసుకోవడం, అదే సభలో డిప్యూటీ చైర్మన్‌ పదవికి పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓటు వెయ్యడం దాకా కాంగ్రెస్‌తో చంద్రబాబు దోస్తీ కొనసా గుతూనే ఉంది. ఇప్పటికైతే చెప్పలేదుగాని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సాయంతో గట్టెక్కాలన్నదే బాబు ఆలోచన. ఎందుకంటే ఆయన రాజకీయ జీవితంలో ఏనాడూ ఒంటరిగా పోటీ చేసి గెలిచిన సందర్భాలు లేవు. 1983, 85, 94 ఎన్నికల్లో  ఎన్టీఆర్‌ కారణంగా గెలిచిన టీడీపీ బాబు చేతుల్లోకి వచ్చాక 1999లో ఏబీ వాజ్‌పేయి, 2014లో మోదీ ప్రభంజనాల్లో బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లి గెలిచింది. 2019 ఎన్నికల్లో కూడా ఒంటరి పోరుతో గెలవలేమన్న విషయం బాబుకు బాగా తెలుసు. ఇప్పుడు బీజేపీతో కలిసి వెళ్లే పరిస్థితి లేదు.

కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి బాబు సిద్ధం
కాబట్టి కాంగ్రెస్‌తో చేతులు కలిపైనా సరే ఎన్నికల్లో గెలవాలన్నది ఆయన అశ. మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో మీడియాతో ఇష్టా గోష్టి జరిపిన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ వచ్చే ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీతో పొత్తు అవకాశాలను ఖండించ లేదు సరికదా రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుల నిర్ణయానికి వదిలేస్తామన్నారు. ఏపీలో ఈ మధ్యనే బాబు మిత్రుడు, మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డిని తిరిగి పార్టీలోకి కాంగ్రెస్‌ తెచ్చుకున్నది బాబు సూచన మేరకే అనే ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్‌ పోకడలు చిత్రంగా ఉంటాయి. పార్టీకి విధేయుడై ఉండి రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన రాజ శేఖరరెడ్డి మరణిస్తే ఆ విషాదాన్ని తట్టుకోలేక చనిపోయిన వారిని ఓదా ర్చబోయిన జగన్‌ బయటికి పోయేదాకా పొగ పెడతారు, లాస్ట్‌ బాల్‌ ఇంకా ఉంది అని చివరి దాకా చెప్పి పార్టీని సోదిలోకి లేకుండా చేసి పోయిన కిరణ్‌ను మళ్లీ తెచ్చి నెత్తిన పెట్టుకుంటారు. కాంగ్రెస్‌కు ఇప్పుడు ఏపీలో స్వశక్తి మీద నాలుగు సీట్లయినా తెచ్చుకునే స్థితి లేదు. ఆ మాట రాహుల్‌ మీడియా ఇష్టాగోష్టిలో ఒప్పుకున్నారు. మరి ఇటలీ మాఫియా, సోనియా దయ్యం అని దూషించిన బాబుతో దోస్తీ ఎందుకు అంటే జగ న్‌ను రాజకీయంగా తుదముట్టించడానికే. ఏపీలో ఇవ్వాళ కాంగ్రెస్‌కు మరొక ఎజెండా లేదు. అయితే జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలపై నేడు ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అందరికీ తెలిసిన విషయమే.

చంద్రబాబుపై చావని బీజేపీ ఆశలు?
నలభై ఏళ్ల అనుభవం అని ఊదరగొట్టి నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను నాలుగు వందల సంవత్సరాల  వెనక్కు తీసుకుపోయిన చంద్రబాబు నిర్వాకమూ తెలుసు. కాంగ్రెస్‌ సరే. మరి బీజేపీ ఎందుకు తమ సహాయం తీసుకుని ఎన్నికల్లో గెలిచి, నాలుగేళ్లు కలిసి నడిచి గెలుపు రాజకీయాల ఎత్తుగడలో భాగంగా తెగతెంపులు చేసుకున్న తెలుగుదేశా నికే సాయం చేయాలనుకుంటోంది? జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించిన కేసుల్లో భారతిని కూడా నిందితురాలిగా చేర్చడం ద్వారా చంద్రబాబుకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నది బీజేపీ అన్నది నిర్వివాదాంశం. ‘బాబూ, ఇంకా మా తలుపులు తెరిచే ఉన్నాయి నీకోసం, జగన్‌ కేసుల విచారణను వేగిరపరిచి ఆయనను మళ్లీ జైలుకు పంపాలని, ఆయన బయట ఉంటే తట్టుకోలేనని నువ్వు ఎన్నోసార్లు అడిగావు, ఇదిగో ఆయన సతీమణిని కూడా ఈ కేసులో ఇరికించాం,’ అని ఈ చర్య ద్వారా బీజేపీ చెప్పకనే చెప్పింది.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బాబు అవసరం వస్తుందేమోనన్న భయంతోనే మోదీ, అమిత్‌ షాలు తమ తలుపులు చంద్రబాబు కోసం తెరిచి ఉంచారు. బాబు, మోదీ మధ్య రహస్య స్నేహం కొనసాగుతూనే ఉందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? లేకపోతే బీజేపీ నాయకులే స్వయంగా చెబుతున్న లెక్కల ప్రకారం వేలాది కోట్ల అవినీతి చంద్రబాబు ప్రభుత్వంలో జరిగితే జీవీఎల్‌ నరసింహారావు అనే ఎంపీతో టీవీ చర్చల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని, ఆయన అవినీతిని దుయ్యబట్టించారే తప్ప ఏ చర్యలూ ఎందుకు ఉండవు? భారతి  పేరు నిందితుల జాబితాలో చేర్చే ఆసక్తీ, ఉత్సాహం చంద్రబాబు అవినీతి విషయంలో ఏమైనట్టు? ఆంధ్రప్రదే శ్‌లో క్షేత్ర స్థాయిలో పరిస్థితి కానీ, ప్రజల మనోభావాలు కానీ రెండు జాతీయ పార్టీలకు ఇంకా అర్థం  కాలేదు. అవినీతిలో నిండా మునిగిన తెలుగుదేశం తోక పట్టుకుని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఎన్నికల సముద్రం ఈదాలనుకుంటున్న రెండు జాతీయ పార్టీలను ప్రజలు గమ నిస్తూనే ఉన్నారు. గత నవంబర్‌ ఆరో తేదీన జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ పాదయాత్ర ప్రారం భించిన నాటి నుంచి పది జిల్లాలు దాటి నిన్న విశాఖపట్నం జిల్లాలోకి ప్రవేశించే దాకా ఈ తొమ్మిది మాసాల్లో  ఇంతింతయి వటుడింతయి అన్నట్టుగా, పిల్ల కాలువగా మొదలయి మహానదిగా ఈ యాత్ర మారింది. జనంతో సాగుతున్న ఈ యాత్ర ప్రజాభిప్రాయానికి అద్దం పడుతోంది. రహస్య స్నేహ పాచికలు ఇక పారవన్న సత్యం ఆ మూడు పార్టీలు అర్థం చేసుకుంటే మంచిది.

దేవులపల్లి అమర్‌(datelinehyderabad@gmail.com)

మరిన్ని వార్తలు