మానవాన్వేషి.. పాఠక కవి

13 Aug, 2019 01:36 IST|Sakshi

‘‘అంతర్మథనంలో స్పందించిన నాలుగు రచనల్నీ, 
గాలిపటాల్లా ఎగరేసి, 
కాలాన్నీ మామతాన్నీ తట్టుకొని 
ఎన్ని నిలుస్తవో అన్నదే గమనించాలి 
ప్రతి పదాన్నీ పాదాన్నీ కాలం వస్త్రకాయితం పడుతుంది’’   – సి.వి.కృష్ణారావు ‘కల్పన’ లోంచి. 

మృత్యువంచులోని కొస వెలుతురుని కూడా జీవ శ్వాసగా బంధించి అక్షరాల్లోకి వంపుకున్న కవి ఆయన. సత్యనిష్ట కలిగిన కవి. ఆయన రాసిన ప్రతి వాక్యమూ ఆచరణలోంచి, స్వీయానుభవం లోనుంచి పలికిన జీవ కవిత్వం. సాధారణంగా అగుపడే ఆయన కవిత్వమంతా అసాధారణ అనుభవాల చిక్కదనాన్ని ప్రసారం చేసింది. తన వ్యక్తిత్వానికీ, కవిత్వానికీ మధ్య సరిహద్దు రేఖను ఆయన ఎప్పుడో చెరిపివేసుకొని జీవించాడు. ‘వైతరణి’, ‘మాది మీ వూరే మహరాజ కుమారా’, ‘అవిశ్రాంతం’, ‘కిల్లారి’ కవిత్వ సంకలనాలలో తను ఆకాంక్షించిన మానవీయ అస్తిత్వ అన్వేషణ, ఆచరణ దృష్టే పాఠకుల అంతరంగాలను ఆర్ధ్రపరుస్తుంది. స్వభావరీత్యా.. శాంత స్వభావి. సమాజం లోని అన్ని రకాల సామాజిక, సాంఘిక అసమానతల పట్ల తీవ్రమైన ఆగ్రహం ఉంటుంది ఆయన కవిత్వంలో. అయితే, ఆయన ఉగ్రత్వం.. శాంతత్వంలోకి మారువేషం వేసుకొని వచ్చి మనల్ని అస్థిరపరుస్తుంది. ఇదే కృష్ణారావుగారి కవిత్వంలోని ప్రత్యేకత.

కృష్ణారావుగారు 1926లో నల్లగొండ జిల్లా రేవూరు గ్రామంలో జన్మించిన తెలంగాణ తొలితరం కవుల్లోని విశిష్ట కవి. లోకంలోని అనేకానేక ప్రశ్నలకు కృష్ణారావుగారి వంటి వారి దగ్గర ఒకటో రెండో సమాధానాలు మాత్రమే ఉంటాయి. అవి అనేక ప్రశ్నలను బ్యాలెన్స్‌ చెయ్యగలిగినవే అయి ఉంటాయి. రాబోయే తరాల ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పగలిగిన బతుకు సత్తా కలిగినవే అయి ఉంటాయి. జీవితం తాలూకు దెబ్బల్ని తట్టుకొని, దెబ్బదెబ్బకూ బలాన్ని పుంజుకొని బతికిన కవి యోధుడు తను. ఆయనను అందరూ వెన్నెల కృష్ణారావుగారంటారు. నేను కవిగా 1990లో
నా దారిని వెతుక్కుంటూ ‘నెలనెలా వెన్నెల’లోకి ప్రవేశించాను. ఇందులో సభ్యత్వమూ సభ్యత్వ రుసుములూ ఉండవు. కవులకూ, పాఠకులకూ ఎజెండాల ఆంక్షలుం డవు. అక్కడ ఏ జెండాల రంగులు పొంగులు ఉండవు. ఏ కవికయినా వారి వారి స్వీయ మానసిక ఎజెండాల రాజకీయాల దృష్టి ఉండొచ్చు. అది తమ కవిత్వాన్ని సాంద్రపరిచి, సునిశితం చేయ గలిగితే చాలు. అక్కడి పాఠకమ్మన్యులు మనసారా అక్కున చేర్చుకుంటారు. అదీ నెలనెలా వెన్నెల ప్రత్యేకత. అటువంటి వేదికకు నిర్వాహకుడు, సేవకుడూ కృష్ణారావుగారు. 
90వ దశకంలో అస్తిత్వ ఉద్యమాలు ఊపుగా తెరమీదికి వస్తున్నాయి. అంతే బలంగా మరొక వైపు, తెలుగు సాహిత్యంలో ముఠాల, మఠాల మాఫియా బెదిరింపులు ఎక్కువవుతున్నాయి. కొత్తగా కవిత్వం రాస్తూ బలపడుతున్న కవులను రాజకీయ, అరాజకీయ, స్వరాజకీయ ఎత్తుగడ లతో భయపెట్టేవాళ్లు. కొత్త కవుల్ని.. హైదరాబాద్‌లో ‘రాంపురి చాకుల (సిద్ధాంతాల పేరుతో) వంటి విన్యాసాలతో పొడిచి చంపుతూన్న సంద ర్భం. సరిగ్గా అటువంటి అయోమయంలో నెలనెలా వెన్నెలతో చల్లగా సాయంకాలాల ఇరానీ హోటళ్ల సగం కప్పు జిందగీతనంతో నెనరుగల నాయ నగా, సహృదయుడిగా కొత్త కవుల వేదికతో తెర మీదికి వచ్చారు కృష్ణారావుగారు. అప్పుడు ‘నెలనెలా వెన్నె ల’ది ఉత్తమమైన  ఛీజ్ఛ్టీ్చటy ఛిౌn్టటజీbu్టజీౌn అని కూడా నాకు తెలిసి వచ్చింది. దళిత, స్త్రీవాద, బహుజన, మైనార్టీ ప్రాంతీయ అస్తిత్వాలు వేళ్లూనుకొని విస్తరిం చడానికి నెలనెలా వెన్నెలలోని ప్రజా స్వామ్యం ఎంతో దోహదపడింది. ఆయా కవుల తొలి సంకలనాల ఆరంగేట్ర స్థలమ య్యింది. సభల్లో ఛాయ, బిస్కెట్‌ ‘తెహ జీబ్‌’ని సాంప్రదాయంగా ముందుకు తెచ్చారు. పైసల ప్రస్తావనే ఉండేది కాదు. ఆయన డిమాండ్‌ అంతా కవులను కొత్త కవితలు పట్టుకుని రమ్మ నడమే. తను కొత్త కవిత రాయగానే వెంటనే పట్టుకు వచ్చి వినిపించేవారు. ఆయన పాఠకులకు శక్తినీ, సహనాన్నీ ఇవ్వగలిగిన సాహిత్య తత్వ విజ్ఞత ఉన్న గొప్ప మనిషి. తరతరాలు గుర్తుండి పోయే కవి.  
(ఆదివారం కనుమూసిన ప్రముఖ కవి సి.వి.కృష్ణారావు స్మృతిలో..) 
– సిద్ధార్థ, ప్రముఖ కవి 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు