ఆ ‘సవరణ’ బిల్లు ఎవరి లబ్ధికోసం?

7 Feb, 2019 00:18 IST|Sakshi

విశ్లేషణ

ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకి పరాభవం కలిగిన నేపథ్యంలో, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయంపై కలిగిన కలవరం ఫలి తంగానే అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. ఈబీసీలకు రిజర్వేషన్‌ రేపటి ఎన్నికలాట కోసం విప్పిన వరాలమూటే తప్ప మరేం కాదు. అడుగంటిపోయిన ఉపాధి, ఉద్యోగ అవకాశాల మధ్య అగ్రకులాలకు రిజర్వేషన్‌ ఎవరికీ మేలుకలిగించేది కాదు. జనాభా ప్రాతిపదికన 85 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తే అన్ని వర్గాల, కులాలకు మేలు జరుగవచ్చు. రాజకీయ ప్రయోజనాలకై తీసుకొచ్చిన ఈ రాజ్యాంగ సవరణ ఎవరికీ లబ్ధి కలిగించదు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొద్దిమంది ఎంపీలు తప్ప మిగిలిన అందరు సభ్యుల మద్దతుతో, దాదాపు ఏకగ్రీవమైన ఆమోదంతో, మన రాజ్యాంగానికి 124వ సవరణ ద్వారా కొత్త చట్టాన్ని తెచ్చింది. ఇప్పుడు ఎస్టీ, ఎస్సీ, బీసీలకు ఉన్న రిజర్వేషన్‌ దాదాపు 50 శాతంగా ఉండగా, ఈ  కొత్త రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణాలలోని ఆర్థికంగా వెనుకబడిన (ఈబీఎస్‌) వారికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు మొదలైన వాటిలో మరో 10 శాతం మందికి రిజర్వేషన్‌ లభిస్తుంది. అంతేకాదు, వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న అగ్రవర్ణాల వారందరికీ ఈ రిజర్వేషన్‌ అమలవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అనుకూలంగా ప్రభుత్వాలు వ్యవహరించడం వలన ఈ కులప్రాతిపదిక రిజర్వేషన్ల వల్ల తమకు అవకాశాలులేకుండా పోతున్నాయని అగ్రవర్ణాలు బలంగా విశ్వసిస్తున్నారు. మేధాసంపత్తి కాకుండా, కులం ఆధారంగా రిజర్వేషన్ల వలన దేశ ప్రగతి కుంటుపడుతున్నదనీ తమలో ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆ వెసులుబాటు లేకపోవడం వల్ల, తాము నష్టపోతున్నామన్న భావన అగ్రవర్ణాల్లో ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఓబీసీలకు 10 శాతం రిజర్వేషన్‌ వలన తమకూ విద్య, ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో వీరున్నారు. ఈ భావన, ఆశ ప్రభావమెంతో ముందు పరిశీలిద్దాం.

ఈ రిజర్వేషన్‌ ప్రస్తుతానికి ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే వర్తిస్తుంది. ప్రైవేట్‌ సంస్థలకు వర్తించదు. అసలు వాస్తవమేమిటంటే, మొత్తం ఉద్యోగ మార్కెట్లో ప్రభుత్వ ఉద్యోగాల వాటా 3.5 శాతం మాత్రమే. ఇందులో 10 శాతం అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల కంటే 0.35 శాతం మాత్రమే మేలు జరగవచ్చేమో! అయితే మోదీ ప్రభుత్వ హయాంలో ఈ ఉద్యోగ కల్పన దిగజారుతున్నది. నిజానికి మూడు నెలల క్రితమే విడుదల చేయవలసిన దేశ నిరుద్యోగ పరిస్థితిని మోదీ ప్రభుత్వం వెల్లడించడానికే భయపడుతోందనిపిస్తోంది. కొత్త ఉద్యోగాలు కల్పించలేకపోగా, పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి విధానం వలన దేశవ్యాప్తంగా ఉద్యోగులు చిరుద్యోగులవుతున్నారు. చిరుద్యోగులు నిరుద్యోగులయ్యారు. వీరి సంఖ్య లక్షల్లో ఉంటోంది. మన చంద్రబాబు విషయానికివస్తే బాబు వస్తే జాబు వస్తుందని చేసిన ఊకదంపుడు ప్రచారం ఆచరణలో ఉన్న జాబులు ఊడిపోవడంగా ప్రతిఫలిం చింది. కనుక రిజర్వేషన్‌ వల్లనే తమ నిరుద్యోగ సమస్య తీరుతుందనుకోవడం భ్రమ. ప్రధానంగా కావలసింది కోట్లలో ఉద్యోగ కల్పన. ఇది చాతగాని ప్రభుత్వాలు ఏదో గోసాయి చిట్కాల వంటి సవరణ ద్వారా ఉద్యోగ కల్పన చేస్తున్నట్లు ప్రజలను మభ్యపెట్టి ప్రయోజనం లేదు.

అగ్రవర్ణ విద్యావంతులు సైతం ఆలోచించవలసిన విషయం మరొకటి. కేవలం తమ కులం ఆధారంగానే, తగిన విద్య మేధాసంపత్తి లేకపోయినా ఐఏఎస్, ఐపీఎస్‌ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారు ప్రతిభ లేకపోయినా నెగ్గుకొస్తున్నారన్న అభిప్రాయం వీరిలో ఉంది. సివిల్‌ సర్వీసెస్‌ ఉద్యోగాల కోసం ఒక లెక్కప్రకారం ఏటా 4,50,000 మంది ప్రయత్నిస్తుంటారు. కానీ వారిలో అంతి మంగా 1100 మంది అర్హత సాధిస్తారు. ఇలాంటి పరిస్థితిలో, ఏదో పరీక్ష రాస్తే చాలు, రిజర్వేషన్‌ వర్తించే విద్యార్థులకు ఉద్యోగాలు వస్తున్నాయని భావింపగలమా? అంతే కాదు. ప్రతిభ, మేధోసంపత్తులకు ఈరోజుల్లో పరీక్షలో వారు సాధించిన మార్కులే కొలబద్ద! అసలీ మార్కుల కొలబద్దే వాస్తవానికి ప్రశ్నార్థకం కూడా.  ఈ మార్కుల విషయం ఆలోచిస్తే, ప్రస్తుత పరిస్థితిలో ఈ మార్కుల సాధన, ఆ విద్యార్థి కుటుంబ పరిస్థితి, చదువుకునే వెసులుబాటు, వాతావరణం, తగిన ప్రోత్సాహం, దానితో పాటు వ్యక్తిగత మేధోసంపత్తి వీటన్నింటిపై ఆధారపడి ఉంటుంది. 

ఈ వర్ణవ్యవస్థ దుర్మార్గం కారణంగా అంబేడ్కర్, ఎన్నో కష్టాలు, అవమానాలు స్వయంగా అనుభవించవలసి వచ్చింది. తన గురువు గారి ప్రోత్సాహం, ఆయన సమకూర్చిన సాయం, తన వ్యక్తిగత ప్రతిభ వలన ఆయన ఇంగ్లండ్, అమెరికా, దేశాలకు విద్యార్జన కోసం వెళ్లి రెండు డాక్టరేట్‌ డిగ్రీలు తీసుకుని భారతదేశం తిరిగొచ్చారు. కానీ మనదేశం తిరిగి వచ్చిన తర్వాత మామూలు కిరాయిబండి తోలుకునే వ్యక్తి కూడా, అంబేడ్కర్‌ని తన బండి ఎక్కించుకోలేదు. కారణం దళితుడి నీడ సైతం అంటరానిదే అనే తరతరాల భావదాస్యంలో ఉన్నవాడే ఆ వ్యక్తి కూడా. అంబేడ్కర్‌కు దాహం తీర్చుకోవడానికి మంచినీళ్లు ఇచ్చేందుకు సైతం మిగిలిన కులాలవారెవరూ సిద్ధపడలేదు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ మతస్థులు కూడా ఎవరూ అంబేడ్కర్‌కు ఒక గది ఇచ్చేందుకు అంగీకరించలేదు. చివరకు తన ఆఫీసులో తన కింద పనిచేసే ఫ్యూన్‌ ఆఫీసు ఫైల్‌ సైతం అంబేడ్కర్‌ చేతికి అందించేవాడు కాడట. మైలపడిపోతామన్న మూఢవిశ్వాసమే కారణం. అందుకే అంబేడ్కర్‌ ఈ వర్ణ వ్యవస్థ అంతమయితే గానీ మన దేశానికి విముక్తి ఉండదని ‘కులనిర్మూలన’ అనే గొప్ప గ్రంథం రచించారు. 

కానీ మన సామాజిక జీవనంలో నేటికీ ఈ కులోన్మాద వికృత రూపం కనబడుతున్నది. భారతదేశం ప్రపంచంలోనే 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా పురోగమించినా, నేటికీ సామాజిక జీవనంలో, ఈ కులవ్యవస్థ అలాగే ఉంది. అందుకే సామాజిక న్యాయ సాధన అవసరం నేటికీ ఉంది. నిజానికి దళితుల ఆర్థికపరిస్థితి చెప్పనక్కరలేదు. నేడు విద్య, ఉద్యోగ, రాజకీయ పదవుల్లో ఈ మేరకైనా దళితుల అభివృద్ధి సాధ్యమైందంటే అందుకు రిజర్వేషన్లే ప్రధాన కారణం. గతంతో పోలిస్తే చాలామంది దళితులు మధ్యతరగతి స్థాయికి వచ్చారు. కానీ ఇంకా ఎంతటి వ్యత్యాసం ఉందంటే పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన దళిత, గిరిజనులు 0.4 శాతం కూడా లేరు. కనుక ఆర్థిక సమానత్వం పేరుతో, సామాజిక అన్యాయాన్ని తోసిరాజనడం సబబు కాదు.

ఈ స్థితిలో కొత్తగా వచ్చిన ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా ప్రభుత్వం తెచ్చిన 10 శాతం రిజర్వేషన్‌ కల్పించే చట్టాన్ని కూడా స్థూలంగా పరిశీలిద్దాం. బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, వెలమ, వైశ్య, క్షత్రియ ఇత్యాది అగ్రకులాలు జనాభాలో 23 శాతం మించి ఉండరు. మామూలుగా ఈ చట్టం చేయబోయేముందే అలాంటి కులాల గణాంకాలు, వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులు అన్నింటినీ సాధికారంగా ప్రభుత్వాలు ఇచ్చి ఉండాల్సింది. నిరుద్యోగ పరిస్థితిపై అంచనాను కేంద్రంలో మోదీ నేతృత్వంలో ఉన్న బీజేపీ (ఎన్డీఏ) ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాచి ఉంచింది. కొత్తగా దళితులపై మైనారిటీలపై గోరక్షణ పేరుతోనో, మరో వంకతోనో బీజేపీ, వీహెచ్‌పీ వంటి మతతత్వ సంస్థల మూకదాడులు పెరిగిపోయాయి. దానికితోడు సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు తరి గిపోతున్నాయి. మోదీ డబ్బా వాయించుకున్న అవినీతి, అధికార కేంద్రీకరణ మరింతగా పెరిగిపోతోంది. మన రాజ్యాంగ వ్యవస్థలు చివరకు సర్వోన్నత న్యాయవ్యవస్థ సైతం ఈ విలువలు దిగజారుతున్న ఆరోపణలకు గురవుతున్నాయి. అన్నిటికీ మించి ఒకే దేశం, ఒకే జాతి, ఒకే పన్నుల విధానం, ఒకేసారి ఎన్నికలు, రాష్ట్రాల్లో, కేంద్రంలో ఒకే పార్టీ పాలన వంటి ప్రచారంతో ప్రజల్లో మోదీ ప్రతిష్ట మసకబారుతోంది. అందుకు ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే నిదర్శనం. దీనిపై తమ విజయంపై ఆందోళన చెందుతున్న బీజేపీ నేతలు, అగ్రవర్ణాల ఓటర్లను మరింతగా ఆకర్షించడమే మార్గం అని తన విశ్వసనీయమైన సర్వేల ద్వారా నిజనిర్ధారణకు వచ్చిందట! ఆ ఎన్నికలాటలో, వరాల మూటలో రూపొందినదే ఆర్థికంగా వెనుకబడిన కులాల రిజర్వేషన్‌ పేరుతో వచ్చిన చట్టం. 

పార్లమెంటు ఆమోదం పొందిన ఈబీసీ రిజర్వేషన్‌ వల్ల 8 లక్షల వార్షికాదాయం ఉన్న అగ్రవర్ణాల వారందరికీ విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాల్లో రిజర్వేషన్లు లభించినట్లే. ఆమేరకు రిజర్వేషన్‌ అనుభవిస్తున్న దళిత, ఆదివాసీ, బీసీలకు ప్రాధాన్యత తగ్గుతుంది. ఆర్థిక సమానత్వం ఉంటేనే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని చెబుతూనే ఇంకా ఆ స్థాయికి మన దేశం చేరుకోలేదు కాబట్టి అది సాధించాలని రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లో దాన్ని చేర్చారు. ఇప్పుడు ఈ కొత్త చట్టం వల్ల సామాజిక న్యాయం మరింత దిగజారే అవకాశం ఉంది కనుక, విరుగుడుగా మరో 25 శాతం రిజర్వేషన్లను పెంచితే ఇప్పుడు కొత్తగా చేరినవారితో కలిపి దేశంలో 85 శాతం రిజర్వేషన్‌ అమలవుతుంది. నిజానికి వివిధ వర్గాల జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తే అణగారిన వర్గాలకే కాదు.. జనాభా మొత్తానికి సామాజిక న్యాయం తగురీతిలో జరుగుతుంది. ఇప్పటికే తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు 69 రిజర్వేషన్లను కల్పిం చాయి కాబట్టి 85 శాతం రిజర్వేషన్‌ అసాధ్యం అని కొట్టిపారవేయాల్సిన అవసరం లేదు. నిజానికి ప్రతి వ్యక్తికీ పని కల్పించి, కనీన అవసరాలు తీర్చే తరహా సామాజిక వ్యవస్థను నెలకొల్పడం ఈ ప్రభుత్వాలకు అసాధ్యం కాబట్టే దేశంలో నిరుద్యోగుల సంఖ్య హనుమంతుని తోకలాగా పెరిగిపోతోంది. 

ఈ స్థితిలో దళిత, గిరిజన, ఇతర వెనుకబడిన కులాలకు కనీసం ఇప్పుడున్న రిజర్వేషన్‌కి ఏదో మేర నష్టం కలుగకుండా నిలబెట్టుకోవాలి. కమ్యూనిస్టులు, ఎస్పీ, బీఎస్పీ తదితర పార్టీలు సైతం రిజర్వేషన్‌ చట్టానికి సవరణలు కావాలని కోరుతూ పార్లమెంటులో ఓటింగులో పాల్గొనకుండా ఉండాల్సింది. కానీ దాదాపుగా అన్నిపార్టీలూ ఈ 124వ రాజ్యాంగ సవరణకు మద్దతు ఇచ్చాయి. సామాజిక న్యాయ అంశాన్ని కూడా ఓటు బ్యాంకు రాజకీయాల దృష్టితో చూడటం సరికాదు. ఓట్లాటలో మధ్యతరగతి ముఖ్యం కనుక వారి ఓట్లకోసమే అన్ని పార్టీలు రాజ్యాంగ సవరణను ఏకగ్రీవంగా అంగీకరించాయని అనుకోవాలి. ఈరోజు ప్రగతిశీల శక్తులు ఎన్నికల విజయాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకోకూడదు. సామాజిక న్యాయసాధన అవసరమైన అన్ని వర్గాల, అస్తిత్వ పోరాట శక్తుల ఐక్యత పునాదిగా సమరశీల ప్రజా ఉద్యమమే సామాజిక న్యాయ సాధనకు పరిష్కారం.


డాక్టర్‌ ఏపీ విఠల్‌
వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్‌ : 98480 69720

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా