చిత్తశుద్ధితో చెట్లు పెంచాలి

1 Feb, 2019 00:40 IST|Sakshi

అభిప్రాయం

‘‘రాష్ట్రంలో అడవులను సంరక్షించుకోవాలి. దీనికి సిబ్బంది, ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత తీసుకోవాలి’’  అని సీఎం చంద్రశేఖర్రావు అన్నారు. సీఎం ప్రకటన అమలు కావాలని కోరుకుందాం. తెలంగాణ రాష్ట్రం అడవులకు ప్రసిద్ధి. వందల ఏళ్ల వయసు కలిగిన అడవులలో అనేక రకాల చెట్లు ఉన్నాయి. అయితే, యథేచ్ఛగా సాగిన స్మగ్లింగ్‌ కారణంగా విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, చెన్నైలకు వేల టన్నుల కలప తరలి పోయింది. అటవీశాఖ అధికారులు కొన్ని కేసులు పెట్టినా, ఏ ఒక్క స్మగ్లర్‌కూ శిక్ష పడలేదు. నేడు అడవులలో 20 శాతం మాత్రమే చెట్లు ఉన్నాయి. అవి కూడా 20, 30 సంవత్సరాల వయసు కలిగినవి మాత్రమే. పరిశోధనలకు ఉపయోగపడటానికి వందల వయసు కలిగిన చెట్లు కానరావు.
 
రాష్ట్రంలో 70.18 లక్షల ఎకరాల అడవులు ఉన్నాయి. ఇందులో 50,45,760 ఎకరాలలో రిజర్వు ఫారెస్టు,  17,92,320 ఎకరాల్లో రక్షిత భూమి , 1.80 లక్షల ఎకరాలు నిర్ధారించని భూమి. ఈ రిజర్వు ఫారెస్టులో కొంతమేర అడవులున్నప్పటికీ మిగిలిన 20 లక్షల ఎకరాలలో ఎలాంటి అడవులు లేవు. రిజర్వు ఫారెస్టులో 20 శాతం కూడా అడవులు లేవని శాటిలైట్‌ సర్వే ద్వారా గుర్తించారు. అడవులు లేకపోవడంతో జంతువులు గ్రామాల్లోకి వస్తున్నాయి. లక్షల ఎకరాలలో పంటలను నాశనం చేస్తున్నాయి. నేడు కోతుల బెడద లేని గ్రామం లేదు. చిరుతలు, ఎలుగుబంట్లు కూడా గ్రామాలకు వస్తున్నాయి.
 
వనమహోత్సవాలలో మైదాన భూములలో చెట్లు నాటడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారే తప్ప, అడవులలో చెట్లు పెంచడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదు.  2016 జూలై నుండి రాష్ట్రంలో రానున్న మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 75:25 శాతం నిధులతోపాటు ఉపాధిహామీ పథకం 100 శాతం, 50 లక్షల ఎకరాలలో గ్రీన్‌ ఇండియా వారు 75 శాతం, గ్రామీణాభివృద్ధి శాఖ నిధులు సమకూర్చాలి. సామాజిక అడవులపై చూపిన శ్రద్ధలో సగం సాంప్రదాయ అడవుల పెంపకంలో చూపలేకపోయారు. చివరకు పాలకులు అడవులను నేటికీ రక్షిస్తున్న గిరిజనులపై అక్రమ కేసులు బనాయించి, వారి పంటలను నాశనం చేసి, వారి నుండి అక్రమంగా జరిమానాలు వసూలు చేస్తున్నారు. గిరిజనులను అడవుల నుండి మైదానాలకు పంపించే ప్రయత్నాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. అడవులలో గిరిజనులను లేకుండా చేస్తే 2, 3 సంవత్సరాలలోనే అడవులు అదృశ్యం కావడం ఖాయం.  

రాష్ట్రంలో 14 లక్షల ఎకరాల భూమిలో వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.  ఆదిలాబాద్‌ అడవిలో 2.20 లక్షల ఎకరాలు, ప్రాణ  హితలో 34 వేల ఎకరాలు, శివ్వారం అభయారణ్యం పేరుతో 7,500 ఎకరాలు సేకరిస్తున్నారు. ఇదికాక ఏటూరునాగారంలో  2 లక్షలు, పాకాల అడవులలో 2.12 లక్షలు, ఖమ్మం జిల్లాలో కిన్నెరసాని అడవులలో 1.57 లక్షలు, మంజీరకి 49 వేలు, మెదక్‌ జిల్లా, పోచారంలో 34 వేలు, మహబూబ్‌నగర్‌లో రాజీవ్‌ గాంధీ వన్యప్రాణ రక్షణ పేరుతో 5.35 లక్షల ఎకరాల చొప్పున సేకరించబోతున్నారు.  

అటవీ ఉత్పత్తుల ద్వారా ప్రభుత్వానికి 500 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. కానీ, అవినీతి అధికారువల్ల ఈ ఆదాయానికి గండిపడుతున్నది. గతంలో బీడీ ఆకుల వ్యాపారంతో 30 కోట్ల ఆదాయం వచ్చింది. అడవుల పెంపకానికి విదేశీ ఆర్థిక సహాయంతో పాటు ప్రపంచ బ్యాంకు నిధులు కూడా వస్తున్నాయి. ఔషద మొక్కల పెంపకానికి నిధులు ఇస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్‌ మేనేజ్‌మెంట్‌ కింద వనసంరక్షణ సమితులు నిర్వహించి, అడవుల పెంపుదలకు ప్రణాళికలు అమలు చేశారు. ఫలితాలు మాత్రం ఆశించినంత రాలేదు. నేడు గృహ నిర్మాణాల సమస్య తీవ్రంగా ముందుకొచ్చింది. పట్టణాల్లో గృహనిర్మాణాలు బాగా జరుగుతున్నాయి. వీటికి కలప వాడకం కూడా పెరుగుతున్నది. చివరికి గ్రామాల్లో తుమ్మ, వేప చెట్లను కూడా గృహ నిర్మాణాలకు వినియోగిస్తున్నారు. కలపకు ప్రత్యామ్నాయంగా మరో వస్తువు వినియోగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. 

ప్రస్తుతం సుబాబులు, జామాయిల్‌ తోటలు అడవుల్లో వేస్తున్నారు. 3,4 సంవత్సరాలు కాగానే వాటిని నరికివేస్తున్నారు. అడవులు స్థిరంగా పెరగాలి తప్ప, నరికేస్తే తిరిగి పెరుగుదలకు చాలా కాలం పడుతుంది. నేడు కార్పొరేట్‌ సంస్థలు అడవులలో ఖనిజ సంపదపై కన్నేశాయి. జిందాల్‌ లాంటి సంస్థలు ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆ ఒప్పందాలను రద్దుచేసి ఖనిజ సంపదను భవిష్యత్తు తరాల కోసం కాపాడుకోవాలి. ముడి ఖనిజం ఎగుమతిని నిషేధించాలి.
 
అటవీశాఖ అధికారులందరికీ అకౌంటబిలిటీ పెట్టి అడవుల పెంపకం బాధ్యతను అప్పగించాలి. అడవి జంతువుల వల్ల మైదానంలో పంటలు దెబ్బతిన్నచో అటవీశాఖ పరిహారం చెల్లించే బాధ్యతను  తీసుకునే విధంగా ఉండాలి. అప్పుడే అడవులు వృద్ధి చెందుతాయి.
 

సారంపల్లి మల్లారెడ్డి
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మొబైల్‌ : 94900 98666 

మరిన్ని వార్తలు