సంక్లిష్టతా యుగ ప్రతినిధి

14 Aug, 2018 01:41 IST|Sakshi

వలస ప్రజల వ్యథలను, వలసవాద రాజకీయాలను, మతఛాందసవాదపు దుష్టపోకడలను ఎలుగెత్తి చాటిన అపురూపమైన కలం కనుమరుగైపోయింది. సామాన్యుడినే కథా వస్తువుగా స్వీకరించి నోబెల్‌ కిరీ టాన్ని అందుకున్న ప్రముఖ రచయిత వీఎస్‌ నైపాల్‌ (85) శనివారం లండన్‌లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన పూర్తి పేరు విద్యాధర్‌ సూరజ్‌ ప్రసాద్‌ నైపాల్‌. వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్‌లో భారతీయ హిందూ కుటుంబంలో జన్మించినా, ఇంగ్లండ్‌లోనే ఎక్కువగా గడిపిన నయపాల్‌ జీవితం సంక్లిష్టమైన సాంస్కృతిక వైవిధ్యతల మధ్య కొట్టుమిట్టులాడింది.

కొనార్డ్, చార్లెస్‌ డికెన్స్, టాల్‌స్టాయ్‌ల జీవితాలతో పోలిస్తే నైపాల్‌ సాహిత్య జీవితాన్ని వలసవాదానికి బలైన మూడో ప్రపంచ దేశాల అవ్యవస్థత పట్ల విమర్శకు ప్రతిబింబంగా చెప్పవచ్చు. పాశ్చాత్య నాగ రికతకు బలమైన మద్దతుదారుగా నిలబడినప్పటికీ విశ్వజనీనవాదమే ఆయన తాత్వికత. అందుకే ‘వెస్టిండియన్‌ నవలాకారుడి’గా తన పేరును కేటలాగ్‌లో చేర్చిన ఒక ప్రచురణకర్తతో తన సంబంధాలనే తెంచుకున్నాడు నైపాల్‌.

భారతీయ మూలాలు :  వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్‌లో 1932 ఆగస్టు 17న జన్మించిన విద్యాధర్‌ సూరజ్‌ ప్రసాద్‌ నైపాల్‌ మూలాలు భారతదేశంలో ఉన్నాయి. ఆయన తాత 1880లో ఇండియా నుంచి వలస వచ్చి ట్రినిడాడ్‌లోని చెరకు తోటల్లో పనిచేశారు. తండ్రి శ్రీప్రసాద్‌ ట్రినిడాడ్‌లో గార్డియన్‌ పత్రికకు విలేకరిగా పనిచేశారు. బాల్యంలో పేదరికం అనుభవించిన నైపాల్‌ 18 ఏళ్ల వయస్సులో లండన్‌ లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఉపకార వేతనం అందుకున్న తర్వాత మిగిలిన జీవితంలో ఎక్కువకాలం అక్కడే గడిపారు. చదువుకునే రోజుల్లోనే నవల రాయగా ప్రచురణ కాలేదని కినిసి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశాడు. కానీ 1955లో పాట్రీసియా ఆన్‌ హేల్‌ను పెళ్లాడిన తర్వాత ఆమె ప్రేరణతో సాహిత్య కృషిలో కుదురుకున్నారు.

1954లో ఆక్స్‌ఫర్డ్‌ విడిచిపెట్టి ఉద్యోగ రీత్యా లండన్‌ చేరిన నైపాల్‌ అక్కడే స్థిరపడ్డారు. అనంతరం కాల్పనిక, కాల్పనికేతర సాహిత్యంలో 30కి పైగా పుస్తకాలు రచించిన లబ్దప్రతిష్టుడయ్యారు. ద హౌస్‌ ఫర్‌ మిస్టర్‌ బిశ్వాస్, ఎ బెండ్‌ ఇన్‌ ది రివర్, ది ఎనిగ్మా ఆఫ్‌ ఎరైవల్‌ లాంటి ప్రఖ్యాత రచనలు ఆయన జీవి తాన్ని మలుపుతిప్పాయి. ‘‘ఇన్‌ ఏ ఫ్రీ స్టేట్‌’’ పుస్తకానికిగాను బుకర్‌ ప్రైజ్‌ను అందుకున్నారు. 2001లో ప్రఖ్యాత నోబెల్‌ సాహితీ పురస్కారం గెలిచారు.

రాయడం అంటే జీవితంలో వెనక్కు వెళ్లి తరచి చూడటమే, స్వీయ జ్ఞానానికి అది ప్రారంభం అని చెప్పుకున్న నైపాల్‌ తొలి నవల ది మిస్టిక్‌ మసాయిర్‌ 1957లో వెలువడి బాగా ప్రజాదరణ పొందింది. తన జీవితనేపథ్యం ఆధారంగా రాసిన ఎ హౌస్‌ ఫర్‌ మిస్టర్‌ బిశ్వాస్‌ (1961), ఆర్థికంగా తన భార్యపై ఆధారపడవలసి వచ్చిన ఒక నడివయస్సులోని జర్నలిస్టు విముక్తి పయనం గురించి వర్ణిస్తుంది. అది తన జీవితమే. ఉద్యోగంలేని స్థితిలో భార్య నైపాల్‌ను కొంతకాలం పోషించింది. ఈ పరాధినతా భారాన్ని తప్పించుకునే ప్రయత్నంలో ఆయన రాసిన తన జీవిత చరిత్ర సమకాలీన తరంలో అత్యంత ప్రముఖ రచయితల్లో ఒకరిగా మార్చింది. 1960లనాటికి కాల్పనికేతర సాహిత్యంపై మక్కువ పెంచుకున్నాడు. మనకు తెలియని కొత్త ప్రపంచానికి కాల్పనికేతర సాహిత్యమే తలుపులు తెరుస్తుందని పేర్కొన్నాడు. 1962లో వెస్టిండీస్‌కి తిరిగి వెళ్లినప్పుడు తాను రాసిన ది మిడిల్‌ ప్యాసేజ్‌ రచనలో ట్రినిడాడ్‌లోని జాతి వివక్షాపరమైన ఉద్రిక్తతలను చిత్రించాడు. వలసవాదం నుంచి విముక్తి పొందిన కరీబియన్‌ చిన్న దీవుల్లో పర్యాటకరంగం ముసుగులో కొత్త బానిసత్వానికి ప్రజలు అమ్ముడుపోవడం జరుగుతోందని పసిగట్టాడు. 1964లో రాసిన తొలి పర్యాటక నవల ‘యాన్‌ ఏరియా ఆఫ్‌ డార్క్‌నెస్‌’లో భారత్‌ గురించి రాశాడు. తన మూలాలు భారత్‌లో ఉన్నప్పటికీ తాను ఇప్పుడు భారత్‌కు చెందడం లేదని కనుగొన్నాడు. పైగా జాతీయవాదం పేరిట భారతీయులు బ్రిటిష్‌ వారినే అనుకరిస్తున్నారని విమర్శించాడు.

తాను పుట్టిపురిగిన ప్రాంతాలకు కూడా దూర మైన నైపాల్‌ను ఆఫ్రికన్‌ రచయితలు చాలామంది వ్యతిరేకించారు. పాశ్చాత్య ప్రపంచం నల్లవారిపై మోపిన కాల్పనికతలవైపే నైపాల్‌ మొగ్గు చూపుతున్నాడని నైజీరియన్‌ రచయిత చినువా అచెబె పేర్కొన్నారు. అయితే విశ్వజనీన నాగరికత ఎప్పటిౖకైనా భూమిపై విల్లసిల్లుతుందన్న నమ్మకాన్ని చివరికంటా పాదుకున్న నైపాల్‌ మానవ సంక్లిష్టతా వైరుధ్యాల మధ్యే జీవితం గడిపాడు, ముగించాడు కూడా.
-కె. రాజశేఖరరాజు
 

మరిన్ని వార్తలు