తల్లిపాలు శిశువుకు ప్రాణాధారం

2 Aug, 2018 02:37 IST|Sakshi

తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం గణనీయంగా పెరిగి 91.5 శాతానికి చేరుకుందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–4, 2015–16) సూచిస్తోంది. కానీ పుట్టిన గంటలోపే పసిపిల్లలు తల్లిపాలు తాగడం ప్రారంభించడానికి సంబంధించిన కీలక సూచిక మాత్రం 37 శాతంగానే నమోదవడం ఆందోళనకరం. కేసీఆర్‌ కిట్లు, లేబర్‌ రూమ్‌ల ప్రామాణీకరణ వంటి చర్యల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు, జననాల పెరుగుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా మదుపు పెట్టింది. కానీ రాష్ట్రంలో శిశువులకు తల్లిపాలు పట్టే అంశంలో ఇదే స్థాయిలో పెరుగుదల నమోదు కావడం లేదు.
ప్రసవానంతరం తొలి 28 రోజుల్లో పిల్లలు బతికి బట్టగట్టడం పిల్లల జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. తెలంగాణలో ప్రతి వెయ్యి జననాల్లో 21 శిశువులు పుట్టిన తొలి 28 రోజుల్లోనే చనిపోతున్నారు. తల్లి పాలు పట్టడం ఎంత ఆలస్యమైతే, శిశు మరణాల రేటు అంత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం 8.2 లక్షలమంది పిల్లలు పుట్టిన 28 రోజులకే చనిపోతున్నారు. పిల్లలు పుట్టిన గంటలోపే తల్లి పాలు పట్టడం ద్వారా ఈ రకం మరణాల రేటును గణనీయంగా తగ్గించవచ్చు. బిడ్డపుట్టిన తర్వాత తల్లి పాలు పట్టే సమయం ఎంత ఆలస్యమైతే అంత ఎక్కువగా శిశుమరణాల రేటు పెరుగుతూ పోయే ప్రమాదం ఉందని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

తల్లి బిడ్డకు పట్టే తొలి పాలు అతి ముఖ్యమైన యాంటీబాడీస్‌ని కలిగి ఉంటాయి. వైరస్‌లు, బాక్టీరియాతో పోరాడే రోగనిరోధక వ్యవస్థ పెంపుదల విషయంలో బిడ్డకు ఇవి చాలా అవసరం. పైగా తల్లిపాలు పట్టడం అనేది పిల్లల ఐక్యూని 3 పాయింట్లు అదనంగా పెంచుతుంది. ఇది భారత స్థూల జాతీయ ఆదాయానికి రూ.4,300 కోట్లను అదనంగా చేరుస్తుందని ఒక అంచనా.  
పుట్టిన బిడ్డకు తొలి ఆరు నెలలనుంచి రెండేళ్లవరకు తల్లిపాలు పట్టడంలోని ప్రాధాన్యత గురించి గత రెండు దశాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది. కానీ భారత్‌లో మాత్రం ఈ దిశగా పురోగతి ఏమంత సంతృప్తికరంగా లేదు. దేశంలోని 93 శాతం గర్భిణీస్త్రీలకు తల్లిపాలు పట్టడం గురించి సకాలంలో సూచనలు చేస్తున్నప్పటికీ, ఇంట్లో, కమ్యూనిటీలో లేక పని స్థలంలో ఎక్కడ ప్రసవం జరిగినా అలా తల్లి తన బిడ్డకు తానే పాలు పట్టడానికి అవకాశమిచ్చే వాతావరణ కల్పనపై తగినంత శ్రద్ధ పెట్టడం లేదు. 

తల్లి బిడ్డకు తన పాలు పట్టడాన్ని పలురకాల సామాజిక, సాంస్కృతిక ఆచారాలు, భయాలు అడ్డుకుంటున్నాయి. దీనికి తోడుగా తల్లి సొంతంగా బిడ్డకు పాలు పట్టేలా చేయడంలో ఎవరూ చొరవ తీసుకోవడం లేదు. మురుగుపాలు పట్టడంపై సమాజంలో విశ్వాసాలు ఎలా ఉన్నప్పటికీ, బిడ్డ పుట్టిన వెంటనే వారికి తల్లిపాలు పట్టడం చాలా మంచిదని నిపుణుల వ్యాఖ్య.


ప్రతి సంవత్సరం ఆగస్టు తొలి వారంలో ప్రపంచమంతటా తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. తల్లిపాలు అనేవి అన్ని రకాల పోషక విలువల లేమిని నిరోధిస్తాయి. పిల్లల ఆహార భద్రతకు, మంచి ఆరోగ్యానికి తల్లి పాలు అత్యంత శ్రేయస్కరమైనవి. ఒక్కమాటలో చెప్పాలంటే తల్లిపాలు జీవితం మొత్తానికి మూలాధారం వంటిది.

ఇంటిలో ఉన్నా, కమ్యూనిటీలో ఉన్నా, పనిస్థలంలో ఉన్నా తమ బిడ్డలకు తామే పాలు పట్టేవిషయంలో మహిళలను ప్రోత్సహించాలని ఈ సంవత్సరం తల్లి పాల వారోత్సవం పిలుపునిస్తోంది.  ఈ విషయంలో తండ్రులు, యజమానులు, కమ్యూనిటీ, ఎకోసిస్టమ్‌లు సమాన భాగస్వామ్యం చేబూనాలని ఈ వారోత్సవం పేర్కొంటోంది.

తల్లి పాల విధానంలో మంచి ఫలితాలు రావాలంటే రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవగాహన, విధానాలలో మార్పు రావలసిన అవసరముంది. ఆసుపత్రుల్లో స్టాఫ్‌ నర్సులు, రాష్ట్ర స్థాయిలో ఏఎన్‌ఎమ్‌లు బిడ్డ పుట్టిన గంటలోపే పాలు పట్టేలా తల్లులను ప్రోత్సహించాలి. తల్లి పుట్టిన బిడ్డలకు పాలు పట్ట డంలో కుటుంబంలోని తల్లులు, భర్తలు, అత్తలకు తప్పనిసరిగా కౌన్సెలింగ్‌ ఇవ్వాల్సి ఉంది. దీని కోసం ప్రధానమంత్రి సురక్షిత్‌ మాతృత్వ అభియాన్‌ వంటి వేదికలను ఉపయోగించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తల్లిపాలకు ప్రోత్సాహం ఇవ్వడానికి సంబంధించి ప్రయత్నాలు చేపట్టింది. దీన్ని ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కూడా అమలు చేయాల్సి ఉంది. పిల్లల్లో పోషక విలువలు దెబ్బతినకుండా చేయడానికి ఇలాంటి కార్యాచరణ చక్కగా ఉపయోగపడుతుంది.

(ఆగస్టు తొలివారం ప్రపంచ తల్లిపాల వారోత్సవం)
విజయేందిర బోయి, ఐఏఎస్, డైరెక్టర్, మహి ళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, తెలంగాణ 

 

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా