నిర్మల సాహితీమూర్తి నిర్మలానంద

25 Jul, 2018 02:28 IST|Sakshi

నివాళి

జనసాహితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రజా సాహితి గౌరవ సంపాదకులు, అనువాద రచ యిత నిర్మలానంద. ఆయన హిందీ సాహిత్య పరి చయంతో పెట్టుకున్న కలం పేరు– నిర్మలానంద వాత్సా్యయన్‌. ఇదొకటే కాదు– తెలుగుదాసు ఆయనే, విపుల్‌ ఆయనే, ఇలా ఎన్నెన్నో పేర్లతో అనువాదాలు చేసేవారు. ఆయన అసలు పేరు ముప్పన మల్లేశ్వరరావు. 1935లో అక్టోబరు 20న జన్మించారు. 84వ ఏట కూడా హైదరాబాద్‌లో సాహిత్య కృషిచేస్తూ 24.7.2018న మరణించారు.

తండ్రి సలహాతో హిందీలో పరీక్షలు పాస య్యారు. స్వగ్రామమైన అనకాపల్లిలోని ప్రసిద్ధ శారదా గ్రంథాలయం ఆయన్ను సాహిత్య రంగంలో ప్రవేశ పెట్టింది. ఆ తర్వాత రైల్వేలో రాష్ట్రేతర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తూ ఒరియా, బెంగాలీ, ఇంగ్లిష్‌ భాషల్లో ప్రవేశం సంపాదిం చారు. 1979లో విజయనగరంలో జన సాహితి రెండవ మహాసభల నాటికి ఆయన శృంగవరపు కోటలో ఉద్యోగం చేసేవారు. ఆ మహాసభల ఆహ్వాన సంఘ సభ్యులుగా కృషి చేశారు. ఆ సభల్లోనే ఆయన జనసా హితి సభ్యునిగా చేరారు. ఆ నాటికే నిర్మలానందగా ప్రసిద్ధుడు. 

1981లో గుడివాడలో జరిగిన జనసాహితి 3వ మహాసభలో ఆయన రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా చేరారు. 1981 సెప్టెంబర్‌లో చైనా ప్రజా రచయిత లూషన్‌ శతజయంతి సంద ర్భంగా ప్రజాసాహితి ప్రత్యేక సంచికను రూపుది ద్దటంలో ఆయన కృషే ప్రధానం. 1982 సెప్టెం బర్‌ నాటికి ఆయన సంపాదకత్వంలో ‘లూషన్‌ వ్యక్తిత్వం– సాహిత్యం’ పుస్తకం వెలువడింది. 1984లో పాలస్తీనా జాతీయ దినోత్సవం సంద ర్భంగా, పాలస్తీనాపై కథలు, కథనాలు, కవిత లతో ఆయన సంపాదకత్వంలో ‘నేను నేలకొరి గితే’ వెలువడింది. 1986 మార్చిలో సుమారు 300 పేజీల భగత్‌సింగ్‌ రచనలను మొట్టమొద టిగా తెలుగులోకి నిర్మలానంద చేసిన అశేష శ్రమ ఫలితంగా ‘నా నెత్తురు వృథా కాదు’గా విడుదలై ఇప్పటికి మూడు ముద్రణలు పొందింది.

1991 జనవరి నుంచి నిర్మలానంద ‘ప్రజా సాహితి’కి సంపాదకునిగా పూర్తికాలం పనిచేసే కార్యకర్తగా మారి మొత్తం 177 సంచికలకు సంపా దకత్వం వహించగల్గారు. ప్రజాసాహితి 200వ సంచికను 1998లో కడపలో ఆవిష్కరిస్తూ వల్లం పాటి వెంకటసుబ్బయ్య, ‘200 సంచికలు తేవడం ఎంతో విశేషం’ అన్నారు. ఆ సభలోనే ఉన్న నిర్మ లానంద దానికి స్పందిస్తూ ‘రెండు వందలేంటి, నాలుగువందల సంచికలు తెస్తాం’ అన్నారు. ఆయన మాట నిజమైంది. మొన్న 2017 జన వరిలో 400వ సంచిక విడుదలైంది.

జనసాహితి దృక్పథాన్ని ముందుకు తీసు కెళ్లటానికి ఏయే రచయితలు ఏయే రచనలు చేయ గలరో బేరీజు వేసు కొని వారితో రచనలు రాయిం చిన సంపాదకుడాయన. బద్ధకస్తుల బద్ధకాన్ని టెలిగ్రాములిచ్చి వదిలించేవారు. నిర్మలానందకు మహాశ్వేతాదేవితో ఉన్న సాన్ని హిత్యం చెప్పుకోదగినది. ఆమెపై 1997 మార్చిలో ప్రత్యేక సంచిక తెచ్చారు. అల్లూరి సీతారామరా జుపై శత జయంతి సందర్భంగా ప్రతినెలా సంవత్సరం పాటు ఆయ నపై ప్రచురించిన రచనల వ్యాస సంకలనం ‘మన్యం వీరుని పోరు దారి’ని మహాశ్వేతాదేవి చేత విజ యనగరం జిల్లా గిరిజన గ్రామమైన దుగ్గేరులో ఆవిష్కరింపజేశారు. ఆ వ్యాసాలన్నీ నిర్మలానంద పలువురిచేత రాయించినవే.

ఆయన కొత్త రచయితలను ప్రోత్సహించి రాయించటానికి ప్రాముఖ్యతనిచ్చారు. వారిని కవులుగా, అనువాదకులుగా, విమర్శకులుగా తీర్చిదిద్దారు. ఆయన పని రాక్షసుడు. నిర్మలా నంద లూషన్‌లాగా పనిచేయట మేగాక, జన సాహితి వారందరిచేత ప్రజల కొరకు ఎద్దులా పనిచేయించారు. భావ విప్లవ రంగంలో కృషి చేస్తున్న ప్రజా సాహిత్యకారులకు నిర్మలా నంద ఒక స్ఫూర్తి, ఒక ప్రేరణ. చివరి క్షణం వరకూ ప్రజాసాహితి గౌరవ సంపాదకునిగా సూచన లిస్తూ, పూర్తికాలం కార్యకర్తగా కొనసాగిన నిర్మలా నందకు జనసాహితి జోహార్లు పలుకుతోంది.
దివి కుమార్, అధ్యక్షులు, జనసాహితి
మొబైల్‌ : 94401 67891

 

మరిన్ని వార్తలు