ఈ చీకటి రోజులు సమసిపోతాయి

16 Nov, 2018 01:36 IST|Sakshi

అభిప్రాయం

భారత్‌లోనూ మేధోచింతనపై ఇలాంటి దాడి సర్వసాధారణమైపోయింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద విద్యార్థులు, లాయర్లు, విద్యావేత్తలతో సహా వందలాదిమందిని వరుసగా అరెస్టు చేస్తూ వస్తున్నారు. బంగ్లాదేశ్‌లో మీకు మల్లే, భారత్‌లోనూ మీలాంటివారిపై మోపిన కేసులు కూడా పరిహాసాస్పదమైనవి. ఇలాంటి అరెస్టులూ, నిర్బంధాలూ ఎగువ కోర్టుల్లో నిలబడవని సంబంధిత పోలీసులకు తెలుసుకూడా. కానీ ఈలోపు ఏళ్లతరబడి వారి నైతిక స్ఫూర్తి జైళ్లలో మగ్గిపోవాల్సి ఉంటుంది. ఈ క్రమానికి మరోపేరు దండన. వ్యతిరేకులపై రాజ్యం తీసుకునే ప్రతీకారం. ఇలాంటి చట్టాల బారినపడిన వ్యక్తులు తమను తాము కాపాడుకోవడమెలా?

ప్రియమైన షహీదుల్,
వారు మిమ్మల్ని తీసుకెళ్లి ఇప్పటికి వందరోజులపైనే అయింది. మీ దేశంలోనూ, మా దేశంలోనూ రోజులు బాగా లేవు, కాబట్టే మీ ఇంటి నుంచి గుర్తు తెలి యని వ్యక్తులు మిమ్మల్ని అపహరించుకుపోయారని వినగానే, జరగరానిది జరిగినట్లు మేం భయపడ్డాం. మిమ్మల్ని ‘ఎన్‌కౌంటర్‌’ చేశారా (భద్రతా బలగాలు చేసే చట్ట వ్యతిరేక హత్యలకు భారత్‌లో మేం పిలుచుకునే పదం ఇది) లేక ‘రాజ్యేతర శక్తులు’ చంపివేశాయా అని మేం భయపడ్డాం. ఇరుకైన వీధి సందులో మీ శవం కనబడనుందా లేక ఢాకా శివార్లలో లోతులేని నీటి కుంటలో తేలియాడనుందా అని భీతిల్లాం. కానీ మీ అరెస్టు గురించి ప్రకటించాక, పోలీసు స్టేషన్లో మిమ్మల్ని సజీవంగా చూశాక, మా తొలి స్పందన ఏమిటంటే అపరిమితానందానుభూతి.

మీ గురించి నిజంగానే ఏదైనా రాయబోతున్నానా? బహుశా రాయకపోవచ్చు. నేను నిజంగా రాయాలనుకుంటే మాత్రం దీనికంటే ఎక్కువ రాయాల్సిన అవసరం ఉండేది కాదు. ‘ప్రియాతిప్రియమైన షíహీదుల్, మీరు జైలుగదిలో ఎంత ఒంటరిగా ఉంటున్నప్పటికీ, మా కళ్లు మీపైనే ఉన్నాయని తెలుసుకోండి. మేం మిమ్మల్ని జాగ్రత్తగా గమనిస్తున్నాం’మీ గురించి నేను నిజంగానే రాయదల్చినట్లయితే, మీ పని, మీ ఫొటోగ్రాఫ్‌లు, మీ మాటలు దశాబ్దాలుగా మన ప్రపంచంలో మానవజాతికి చెందిన వైవిధ్యపూరితమైన రేఖాచిత్రాన్ని గీశాయని.. మానవుల బాధ, సంతోషం, హింస, దుఃఖం, ఒంటరితనం, మూర్ఖత్వం, క్రూరత్వం, మతిలేని సంక్లిష్టతలను మా చైతన్యంలో ఇంకింపచేశాయని నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మీరు చూసిన దృశ్యాలకు చెందిన ప్రాథమిక సాక్ష్యం నుంచి పుట్టుకొచ్చినటువంటి పరిశోధనతో కూడిన ఆగ్రహావేశ ప్రశ్నను మీ కృషి వెలిగిస్తుంది, మనిషి పట్ల ప్రేమభావాన్ని అది ఉద్దీప్తం చేస్తుంది.

మిమ్మల్ని నిర్బంధించినవారికి మీరు చేసిన పని గురించి కనీసమాత్రంగా కూడా అర్థమై ఉండకపోవచ్చు. వారి క్షేమం కోసమైనా సరే ఏదో ఒక నాటికి వారు మీ కృషిని అర్థం చేసుకుంటారని మాత్రమే మేం ఆశిస్తున్నాం. మీ అరెస్టు మీ తోటి పౌరులకు హెచ్చరిక కావాలి. ‘మేం షహీబుల్‌ ఆలమ్‌నే ఇలా చేయగలిగామంటే, అనామకులూ, అంగుష్టమాత్రులూ, సామాన్యులు అయిన మీ అందరినీ ఏం చేయగలమో ఆలోచించుకోండి. చూస్తూ ఉండండి. భయంతో బతకండి’. పాలకులు కోరేది ఇదే కదా.మీ దేశం గురించి మీ ఫేస్‌బుక్‌ పోస్టుల్లో విమర్శించారన్నది వారి సాధారణ ఆరోపణ. పేరుమోసిన బంగ్లాదేశ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ టెక్నాలజీ యాక్ట్‌ (ఐసీటీ) సెక్షన్‌ 57 కింద మిమ్మల్ని అరెస్టు చేశారు. తన శ్రోతలను కల్మషపరిచే, కలుషితపర్చే ఉద్దేశంతో, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ, ప్రభుత్వం లేక వ్యక్తి ప్రతిష్టకు భంగం కలిగిస్తూ, మతపరమైన విశ్వాసాలను దెబ్బతీస్తూ ఎలక్ట్రానిక్‌ లేదా ప్రింట్‌ రూపంలో బూటకపు, అశ్లీలమైన, పరువునష్టం కలిగించే వార్తలను ప్రచురించే వ్యక్తిని ప్రాసిక్యూషన్‌ చేయడానికి ఈ చట్టం అధికారాన్ని కల్పిస్తోంది.

ఈ అసంగతమైన, వివక్షాపూరితమైన, అందరినీ ఒకటిగా కలిపేసే చేపల ట్రాలర్‌ లాంటి ఈ చట్టం ఎంత ఘనమైందో కదా. ప్రజాస్వామ్యం అని పిలుచుకునే దేశంలో ఇలాంటి చట్టాలకు తావెక్కడుంది? సరైన ప్రభుత్వ ప్రతిష్ట ఏమిటి అని నిర్ణయించే హక్కు ఎవరి కుంది? ఎవరికుండాలి? బంగ్లాదేశ్‌ గురించి చట్టబద్ధంగా ఆమోదం పొందిన, ఆమోదనీయమైన ప్రతిష్ట ఎక్కడైనా ఉందా? ఇచ్ఛకాలు ఆడటం మినహా, అన్ని రకాల వాక్‌ స్వేచ్ఛను ఈ సెక్షన్‌ 57 చట్టవిరుద్ధమైనదిగా ముద్రవేస్తోంది. ఇది మేధావులపైన కాదు మానవ మేధస్సుపైనే దాడి. ఈ చట్టం కింద గత అయిదేళ్లలో బంగ్లాదేశ్‌లో 1200మందికి పైగా జర్నలిస్టులపై నేరారోపణ చేశారని, వీరిలో 400మందిపై విచారణ ఇప్పటికే జరుగుతోందని విన్నాం.భారత్‌లోనూ మా మేధోచింతనపై ఇలాంటి దాడి సర్వసాధారణంగా మారిపోయింది. బంగ్లాదేశ్‌లోని ఐసీటీ చట్టానికి భారత్‌లో సమానమైనది చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ). ఈ చట్టం కింద విద్యార్థులు, లాయర్లు, విద్యావేత్తలతో సహా వందలాదిమందిని వరుసగా అరెస్టు చేస్తూవస్తున్నారు. మీపై మోపినట్లుగానే వారిపై మోపిన కేసులు కూడా హీనాతిహీనమైనవి, పరిహాసాస్పదమైనవి.

ఇలా తాము అరెస్టు చేసినవారిని ఉన్నత న్యాయస్థానాలు నిరపరాధులుగా విడుదల చేస్తారని సంబంధిత పోలీసులకు తెలుసుకూడా. కానీ ఈలోపు సంవత్సరాలపాటు వారి నైతిక స్ఫూర్తి జైళ్లలో మగ్గిపోవలసి ఉంటుంది. ఈ క్రమానికి మరోపేరు దండన. వ్యతిరేకించినవారిపై రాజ్యం తీసుకునే ప్రతీకారం.కాబట్టి ప్రియమైన షహీదుల్, మీకు నేను ఈ ఉత్తరం రాస్తున్నప్పుడు, మా దేశంలో రాజ్యనిర్బంధంలో మగ్గిపోతున్న మా ప్రియతములు సాయిబాబ, సుధ, సురేంద్ర, షోమా, మహేశ్, సుధీర్, రోనా, అరుణ్, వెర్నొన్‌లతో పాటు తారిఖ్, అజీజ్, అమీర్, కోపా, కమ్లా, మాధవి, మాసే, రాజు.. ఇంకా వందలాది మా ప్రియతములందరినీ ఈ జాబితాలో చేర్చాలని ఆతృతపడుతున్నాను. ఇలాంటి చట్టాల బారినపడిన వ్యక్తులు తమను తాము కాపాడుకోవడం ఎలా సాధ్యం? ఇది అధికారిక గుర్తింపు పొందిన అహేతుకమైన అపనమ్మకం కలిగిన వ్యక్తుల ప్యానెల్‌ ముందు పౌరులు తమ అమాయకత్వాన్ని నిరూపించుకోవడమే అవుతుంది. నేరారోపణకు గురైన వ్యక్తులు తమను తాము సమర్థించుకుంటూ చేసే ప్రతి వాదనా ఈ ప్యానెల్‌ సభ్యుల ఉన్మత్తతను మరింత పెంచుతుంది. వారి కాల్పనిక భ్రమలను అధికం చేస్తుంది.

మన రెండు దేశాలూ ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలవైపు అడుగులేస్తున్నందున, మరిన్ని అరెస్టులు జరుగుతాయని, మరింతమందిని చితకబాదుతారని, చంపుతారని, మరింతమంది బ్లాగర్లను కొట్టి చంపుతారని, జాతిపరమైన, మతపరమైన, కులపరమైన దహనకాండను మరింతగా ప్రేరేపిస్తారని, మరిన్ని కుహనా ఉగ్రవాద దాడుల గురించి ప్రచారం పెంచుతారని, జర్నలిస్టులను, రచయితలను హత్యచేసే ఘటనలు ఇంకాస్త పెరుగుతాయని మనకు తెలుసు. తనను తాను లౌకిక ప్రజాస్వామికవాదిగా చెప్పుకుంటున్న మీ ప్రధానమంత్రి, బంగ్లాదేశ్‌కు సౌదీ అరేబియా ప్రభుత్వం అందించిన బిలియన్లాది డాలర్లతో 500 మసీదులు నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఈ మసీదులు ఇస్లాం సవ్యదిశను వ్యాప్తి చెందిస్తాయని ఆమె భావన. ఇక్కడ మా భారత్‌లో మా పాలకులు మా రాజ్యాంగం ఎత్తిపట్టిన లౌకికవాదం, సోషలిజం భావనలకు చెందిన అన్ని నటనలను ప్రస్తుతం వదిలేశారు. ప్రభుత్వ పాలన చవిచూస్తున్న ఘోర వైఫల్యాలనుంచి, తీవ్రమైన జనాగ్రహం నుంచి దృష్టి మరల్చడానికి మా కోర్టులు, యూనివర్సిటీలు, బ్యాంకులు, నిఘా సంస్థలు ఒకటి తర్వాత ఒకటిగా సంక్షోభంలో కూరుకుపోతున్నాయి.

రాజ్యాధికారం (ప్రభుత్వం అని కాదు, దాన్ని నిర్వహిస్తున్న సంస్థ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌) బాబ్రీమసీదు స్థానంలో హిందూ ఆలయాన్ని నిర్మించడంపై ఉన్న చట్టపరమైన అడ్డం కులను తొలగించాలంటూ నేరుగా సుప్రీం కోర్టునే హెచ్చరిస్తోంది. పాతి కేళ్ల క్రితం ఆ మసీదును ఉన్మత్త మూక కూల్చివేసిన విషయం తెలిసిందే. రాజకీయ నాయకుల భక్తివిశ్వాసాలు ఎన్నికల సమయంలో ఎంత పరాకాష్టకు చేరుతుంటాయో చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంటుంది. సంపూర్ణమైన జాతి, మనిషి, పౌరుడు, హిందూ,  ముస్లిం అంటూ తీసుకువస్తున్న సరికొత్త నిర్వచనాలకు వ్యతిరేకంగానే మనం వ్యవహరించాల్సి ఉంది. దీనికి వెనక ఉంటున్నది సంపూర్ణ మెజారిటీ, పాపిష్టి మైనారిటీ అనే అభిప్రాయమే. యూరప్, సోవియట్‌ యూనియన్‌ ప్రజలు ఇలాంటి భావాలు కలిగించిన విధ్వంసం నడుమనే వాళ్లు కొన్నాళ్లు జీవించాల్సి వచ్చింది. ఈ పరిశుద్ధ భావం సృష్టించిన అంతులేని బీభత్సంతో వారు తీవ్ర బాధలకు గురయ్యారు. ఇటీవలే యూరప్‌ నాజీల మారణహోమం ప్రారంభమైన 80వ సాంవత్సరికాన్ని జరుపుకుంది. ఆ మారణకాండ అక్కడ  కూడా చడీచప్పుడు లేకుండా మొదలైంది.

అది కూడా ఎన్నికలతోనే మొదలైంది. బాధాకరమైనదేమిటంటే పాతకాలపు జాఢ్యాలు అక్కడ మళ్లీ తలెత్తుతున్నాయి.ఇక్కడ భారత్‌లో రాబోయే రోజుల్లో ప్రతి దాన్నీ ధ్వంసం చేసుకుంటూ పోయే తరహా ఎన్నికలకు సాక్షీభూతులమై ఉండబోతున్నాం. వారు తమ నియంతృత్వ చట్టాలన్నింటినీ ఉపయోగించబోతున్నారు. ప్రతిపక్షాన్ని ఏకాకిని చేయడానికి నీడలతో యుద్ధం చేయబోతున్నారు. అదృష్టవశాత్తూ మనం పాలకుల విధానాలకు అనుగుణంగా మారలేని, వారు చెప్పినట్టల్లా ఆడలేని ప్రజలం. మన వైవిధ్యపూరితమైన, క్రమవిరుద్ధమైన మార్గాల్లో పాలకులకు ఎదురు నిలబడతామన్న ఆశ మాత్రం ఉంది. ప్రియమైన షహిదుల్, ఎగిసిపడిన సముద్రపు అల విరిగి పడక తప్పదని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అది జరుగుతుంది. ఆ పరి ణామం జరిగి తీరుతుంది. ఈ మూర్ఖత్వపు, హ్రస్వదృష్టి కలిగిన క్రూరత్వం స్థానంలో కాస్త దయ, మరింత భవిష్యద్దర్శనం చోటుచేసుకుం టుందని నమ్మకం. మన భూమిని ఆవరించి ఉన్న ఈ నిర్దిష్టమైన, ప్రత్యేకమైన అశాంతి, వ్యాకులత, కాలం తీసుకొచ్చిన ఈ అనారోగ్యం తప్పకుండా గతించిపోనున్నాయి. ఢాకాలో త్వరలో మిమ్మల్ని చూస్తానని నమ్ముతున్నాను.
ప్రేమపూర్వకంగా, అరుంధతి
(అరుంధతీ రాయ్‌ ఈ లేఖ రాసిన రోజే (15–11–2018) షహీదుల్‌ ఆలమ్‌కి 102 రోజుల నిర్బంధం తర్వాత బంగ్లాదేశ్‌ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఆయన వయస్సును (63 ఏళ్లు) దృష్టిలో ఉంచుకుని బెయిల్‌ ఇస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు)

అరుంధతీ రాయ్‌
వ్యాసకర్త ప్రముఖ భారతీయ రచయిత్రి, విమర్శకురాలు

మరిన్ని వార్తలు