చీపురు వజ్రాయుధమై...

15 Feb, 2020 04:08 IST|Sakshi

అక్షర తూణీరం 

సొంత చాప కిందికి నీళ్లొచ్చిన వైనం ఆ జంట పసిగట్టలేకపోయింది. అమిత్‌ షాకి గజకర్ణ గోకర్ణ, టక్కు టమారాది విద్యలు క్షుణ్ణంగా వచ్చుననీ, మనుషుల మెదళ్లని బొంగరాలుగా తిప్పి ఆడుకుంటా డని ఒక వాడుక. మోదీ అమిత్‌ షా చేసిన, చేస్తున్న తప్పులతో సహా సమాదరించి విశ్వసిస్తారని ప్రపంచం అనుకుంటుంది. మోదీకి మోదీపై భయంకరమైన ఆత్మవిశ్వాసం ఉంది. నిన్న మొన్నటి ఢిల్లీ ఎన్నికలు మహా మాంత్రికులిద్దరినీ పొత్తిళ్లలోకి తీసికెళ్లాయి. ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ సోదిలోకి కూడా రాలేదు. కమలం రెక్కలైనా సాంతం విప్పలేకపోయింది. పీఠం కిందనే ఉండి పూర్తిగా అందుబాటులో ఉన్న హస్తినలోనే పాగా గురితప్పిందంటే ఆ ద్వయం ఆలోచనలు అధ్వాన్నంగా ఉన్నాయనడానికి కొండ గుర్తు. కశ్మీర్‌ పరిష్కారం, రామాలయం, పౌరసత్వ క్షాళన ఇవేమీ బీజేపీని పీఠంపై గట్టిగా పదిమెట్లు కూడా ఎక్కించలేక పోయాయి. అంతమాత్రం చేత కమలానికి రాముడి రక్ష లేదని నాస్తికుల్లా కొట్టిపారెయ్యరాదు.

క్షాళనకి ప్రతీకగా నిలబడ్డ ఆప్‌ పార్టీ ముత్యం మూడోసారి చెక్కు చెదరలేదు. కారణాల్లో మొదటిది ఏలికలపై అవినీతి ఆరోపణలు లేకపోవడం. ప్రజల సామాన్య అవసరాలపై దృష్టి సారించడం చీపురు గెలుపునకు కారణంగా చెబుతున్నారు. ఒకప్పుడు నీళ్లు, కరెంటు లాంటి ప్రాథమిక అవసరాల ప్రస్తావన ఉంటే ఆ పార్టీలను గెలిపించేవారు. కేవలం ఈ వాగ్దానాలతో దశాబ్దాలపాటు గద్దెమీద కూచున్నవారున్నారు. బీజేపీ దేశంలో పూర్తి పవర్‌లో ఉంది. మొత్తం బలాలు, బలగాలు యుద్ధప్రాతిపదికన ఢిల్లీ ఎన్నికల సంరంభంలోకి దిగాయి. ఒక పెద్దాయన ‘ప్రభుత్వ వాహనాలే కాదు మిలట్రీ ట్యాంకర్లు సైతం ఎన్నికల్లో సేవలందించాయ్‌. అయినా పూజ్యం’ అని చమత్కరించాడు. ఢిల్లీ చౌరస్తాలో పానీపూరీ జనంతో తింటూ వారి మాటలు వినాలి. టాంగా, ఆటో ఎక్కినప్పుడు సామెతల్లా వినిపించే మాటలుంటాయ్‌. అందులో గొప్ప చమత్కారం ఉంటుంది. సత్యం ఉంటుంది.

‘ఈసారి ఢిల్లీలో మోదీ సాబ్‌ని ఒడ్డెక్కించడం బాబామాలిక్‌ వల్ల కూడా కాదు. అందుకే బాబా కాలుమీద కాలేసుకుని ప్రశాంతంగా కూచున్నాడు’ అన్నాడొక పకీర్‌ మధ్యలో పాట ఆపి. ఆప్‌ పార్టీ చిన్న చిన్న సౌకర్యాలమీద శ్రద్ధ పెట్టిందనీ, దానివల్లే కాషాయపార్టీని ఊడ్చేయగలిగిందని అంతా అనుకున్నారు. స్కూళ్లమీద పిల్లల చదువులమీద దృష్టి నిలిపింది. హెల్త్‌ సెంటర్లని జన సామాన్యానికి అందుబాటులోకి తెచ్చింది. సామాన్య ప్రజ సంతృప్తి చెందింది. నిశ్శబ్దంగా కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెల్పుకున్నారు. మనుషులు దేవుడి విషయంలో అయినా అంతే. నిదర్శనం కావాలి. ఫలానా మొక్కు మొక్కాం. అది జరిగితే ఆ దేవుణ్ణి మర్చిపోరు. తిరుమల వెంకన్న కావచ్చు, షిర్డీ సాయిబాబా కావచ్చు. వరుస విజయాలవల్ల మోదీ, షా బ్రహ్మాండ నాయకులమని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఢిల్లీ ఫలితాలు గట్టి మొట్టికాయగా చెప్పుకోవచ్చు.
 
ఢిల్లీ కాలుష్యకాసారంగా పేరుపడింది. అందుకు బోలెడు కారణాలు. వీధులు పట్టనన్ని మోటారు వాహనాలు మరొక సమస్య. వీటిని ఓటర్లు నొచ్చుకోకుండా ఎలాగో అధిగమించారు. పాలకులు చిన్న చిన్న సమస్యల పరిష్కారంతోనే ప్రజల మనసుల్ని గెలవచ్చునని పూర్వం నుంచీ వింటున్నాం. అశోకుడు మహా చక్రవర్తి. అయినా మనం చెప్పుకునేవి చెట్లు నాటించెను, చెరువులు తవ్వించెను అనే రెండు అంశాల గురించి మాత్రమే. చాలా ఏళ్ల క్రితం రుషి లాంటి ఒక పెద్దాయనని కలిశాను. ‘అన్నిటికంటే ప్రజల్ని గెల్చి పవర్‌లోకి రావడం బహు తేలిక’ అని స్టేట్‌మెంట్‌ ఇస్తే ఉలిక్కిపడ్డాను. నా మొహం చూస్తూనే నా మనసు గ్రహించాడు. ‘నీకు కుర్చీమీద మోజుంటే చూస్కో. మన రాష్ట్రంలో లేదా మన దేశంలో అంటువ్యాధులు, వీధి కుక్కలు మచ్చుకి కూడా లేకుండా చేయగలిగితే చాలు. జనం పట్టం కడతారు’ అన్నాడు. ‘అంతేనా’ అన్నాను అవి చాలా తేలిక అన్నట్టు. రుషి నా మాటకి నవ్వాడు. ‘నాయనా! మన దేశంలో మంచిపని ఏదీ అంత తేలిక కాదు. పనిచేయక మూలపడిన బోర్లను శ్రద్ధగా మూసేస్తే బోలెడు మరణాలు నిత్యం నివారించవచ్చు. కానీ జరగడం లేదు. తప్పులకి శిక్షలు లేకపోవడం మనకున్న గొప్ప అదృష్టం’ అన్నాడు.

శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

 

>
మరిన్ని వార్తలు