పరువు తీసిన విశ్వసనీయత

10 Apr, 2018 01:39 IST|Sakshi

విశ్లేషణ

ఎన్నికలు, రాజకీయ ఎత్తుగడలు, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను వాడుకోవడం ద్వారా సాధించలేని ప్రయోజనాలను ప్రత్యర్థులు కేజ్రీవాల్‌ క్షమాపణలతో సాధించారు. దీంతో ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వం చేసిన మంచి పని అంతా గాలికి కొట్టుకు పోయింది.

తెలుగుదేశం కుట్రపన్నుతోం దని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కాంగ్రెస్‌ నాయకుడు 1980ల ఆరంభంలో ఆరోపించారు. దానికి సంబంధించిన లిఖిత పూర్వక వివరాలు ‘తగిన సమయంలో’ వెల్లడిస్తానని తర్వాత ముఖ్యమంత్రి, గవ ర్నర్‌ పదవులు చేపట్టిన ఈ నేత ప్రకటించారు. అయితే, తర్వాత ఆయన ఆ పని చేయ లేదు. ‘‘ మీ దగ్గర సాక్ష్యాధారాలుంటే ఇప్పుడే ఈ ఆరోప ణను నిరూపించడానికి ఎందుకు వెనుకాడుతున్నారు?’’ అని కర్నూలు విలేకరుల సమావేశంలో ప్రశ్నించాను. ఈ విషయం నేతల విశ్వసనీయతకు సంబంధించినది. అనేక పత్రికలు ఆయన ఆరోపణను ప్రచురించాయి. కానీ, ఆయన చెప్పిన విషయాన్ని నేను పనిచేస్తున్న ‘ద హిందూ’ పత్రికలో రాయడానికి నేను ఇష్టపడలేదు.

అప్పట్లో సామాజిక మాధ్యమాలు లేవు. పుకార్లు వ్యాప్తి చేసే సంస్థలు కూడా నెమ్మదిగానే పనిచేసేవి. ఇప్పటిలా ఇంటర్నెట్‌లో నిరాధార ఆరోపణలు, వార్తలు వ్యాప్తి చేయడం నాడు ఊహించడానికి కూడా అసాధ్యం. అబ ద్ధాలు, అవాస్తవాలతో ప్రజాభిప్రాయాన్ని విజయవం తంగా  కోరుకున్న విధంగా మలచుకోవడం ఇప్పుడు పద్ధతి ప్రకారం జరుగుతోందనే వాస్తవం మనకు తెలుసు. పరిస్థితులు ఎంతగా మారిపోయాయంటే నేడు ఏది సత్యమో కనీసం నమ్మదగిన సమాచారంగా కూడా మనకు తెలియడం లేదు. అంటే, నిజం అనేది నిర్ధారిం చుకోదగిన లేదా అందుబాటులో ఉన్న వాస్తవం స్థాయికి దిగజారిపోయింది. ప్రభుత్వ విధానాలకు సంబంధించి ప్రజలు అర్థం చేసుకుని, నిర్ణయించుకునే సమాచారం ఇలా పంపిణీ అవుతోంది. ఇక వాట్సాప్‌ ద్వారా వాయు వేగంతో వచ్చిపడే అంశాల్లో ఏది సమాచారం? ఏవి గాలి కబుర్లో తేల్చుకోవడం కష్టం. ఈ ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరం.

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కిందటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడు తప్ప మొత్తం సీట్లను కైవసం చేసుకున్నాక దేశంలో అత్యంత నమ్మదగిన రాజకీయ నాయకుడిగా అవతరించారు. అన్ని పార్టీలూ ఆప్‌కు వ్యతిరేకంగా కుమ్మక్కయ్యాయనే కారణంగా ప్రజలు కేజ్రీవాల్‌ మాటలు నమ్మారు. అప్పట్లో ఆప్‌ను అప్రదిష్ట పాల్జేయడానికి స్టింగ్‌ ఆపరేషన్‌ పేరిట రూపొందించిన వీడియోలను ఇష్టారాజ్యంగా మార్చేసి అన్ని రాజకీయపక్షాలూ చేయని ప్రయత్నాలు లేవు. సామాన్యుడికి నిర్ణాయక శక్తి ఉండే కొత్త తరహా రాజకీయాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్న రోజులవి. కేజ్రీవాల్‌ అప్పుడు చేసిన ఆరోపణలన్నిటినీ జనం విశ్వ సించారు. రాజకీయనాయకులు, పార్టీలు మోసపూరిత కుయుక్తులతో ఓట్లు సంపాదించి అధికారంలో కొన సాగుతూ ఆటలాడుకుంటారన్న విషయం మనలాంటి సామాన్య ప్రజానీకానికి తెలుసు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్రను దెబ్బదీయడం తప్ప మరొకటి కాదు. 


ఇప్పుడు కేజ్రీవాల్‌ తన ఆరోపణలను రుజువు చేసు కోలేకపోయారు. ఫలితంగా వీటికి సంబంధించి దాఖ లైన పరువునష్టం దావాలపై విచారణ ముగియక ముందే ఆయన ముగ్గురు రాజకీయ ప్రత్యర్థులకు క్షమాపణ చెప్పుకోవాల్సివచ్చింది. సామాన్య ప్రజానీకం ముఖ్య విషయాలను రాజకీయ నాయకుల దయా దాక్షిణ్యాలకు వదిలేయకుండా తామే స్వయంగా నిర్ణ యించే వేదికలా ఆమ్‌ఆద్మీ పార్టీ నాకు కనిపించింది. కేజ్రీవాల్‌ నేడు విశ్వసనీయత కోల్పోవడంతో ఓ ఆదర్శ రాజకీయ వేదికగా ఆప్‌ బలహీనమైంది. ప్రత్యర్థులకు క్షమాపణ చెప్పిన కేజ్రీవాల్‌ను పూర్తిగా లొంగిపోయిన నేతగా చిత్రిస్తున్నారు. 

నలుగురికి క్షమాపణలతో కేజ్రీవాల్‌ పరువు పోయింది! ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీకి కేజ్రీవాల్‌ క్షమా పణ చెప్పారు. అంతకు ముందు పంజాబ్‌ మాజీ మంత్రి బిక్రమ్‌ సింగ్‌ మజీఠియాకు, మరో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి, కాంగ్రెస్‌ నేత కపిల్‌ సిబ్బల్‌ కొడుకు అమిత్‌ సిబ్బల్‌కు ఆయన క్షమాపణలు చెప్పుకోవాల్సివచ్చింది. జైట్లీ–ఢిల్లీ క్రికెట్‌ క్లబ్‌ సంబంధంపైన, పంజాబ్‌లో మాదకద్రవ్యాలకు మజీఠియాకు ఉన్న వ్యవహారంపైన తాను చేసిన ఆరోపణలను కేజ్రీవాల్‌ నిరూపించు కోలేకపోయారు. ఆయనపై ఇంకా ఇలాంటి కేసులు చాలా ఉన్నందున పరిపాలనపై దృష్టి పెట్టడానికే  ప్రత్య ర్థులకు కేజ్రీవాల్‌ క్షమాపణ చెప్పారని సమర్థించు కోవడం తేలికే.

ఆప్‌లో నానాటికీ పెరుగుతున్న అంతర్గత కీచు లాటలను అదుపు చేసి పార్టీని సమైక్యంగా ఉంచ డానికి పరువునష్టం కేసుల నుంచి త్వరగా బయటపడితే మేలని కేజ్రీవాల్‌ భావించి ఈ పనిచేశారని కూడా వివరించ వచ్చు. అయితే, కేజ్రీవాల్‌ ఇతర రాజకీయ నాయకుల మాదిరి ఎదిగిన నేత కాదు. ఆయన అనుసరించిన కొత్త తరహా రాజకీయాలను ఓడించడానికి అన్ని పార్టీలూ రహస్యంగా చేతులు కలిపాయి. ఆయన అందరికీ సవా లుగా, ముప్పుగా నిలబడ్డారు. కాబట్టి ఇప్పుడు కేజ్రీ వాల్‌ క్షమాపణల కారణంగా అన్ని పక్షాలూ లబ్ధిపొందు తాయి. ఎన్నికలు, రాజకీయ ఎత్తుగడలు, లెఫ్టినెంట్‌ గవ ర్నర్‌ను వాడుకోవడం ద్వారా సాధించలేని ప్రయోజనా లను ఆయన క్షమాపణలతో ప్రత్యర్థులు సాధించారు. దీంతో ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వం చేసిన మంచి పని అంతా గాలికి కొట్టుకుపోయింది.


మహేశ్‌ విజాపుర్కర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
 mvijapurkar@gmail.com

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా