వలసల దుస్థితికి పరిష్కారమెలా?

28 May, 2020 00:31 IST|Sakshi

విశ్లేషణ

కరోనా వైరస్‌ పుట్టుక, పర్యవసానంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌లో భాగంగా తీసుకుం టున్న చర్యలు గ్రామీణ వ్యవసాయ రంగ దుస్థితిని మరింతగా పెంచివేశాయి. పట్టణాల నుంచి తమ తమ సొంత గ్రామాలకు తరలివచ్చిన లక్షలాదిమంది వలస కార్మికులు వ్యవసాయరంగంలోని దుస్థితికి సరికొత్త బాధితులు కాబోతున్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధిం పువల్ల ఏర్పడిన దుర్భర పరిస్థితి ఫలితంగా.. దారిద్య్ర నిర్మూలన కోసం గత కొన్ని దశాబ్దాలుగా సాగుతూ వచ్చిన కృషి మళ్లీ వెనక్కు పోయేటట్టుంది. దీంతో గ్రామీణ కుటుంబాలు మళ్లీ దారిద్య్రంలో కూరుకుపోనున్నాయి. ఇప్పటికే పతనం అంచుపై నిలబడి ఉన్న కుటుంబాలు లాక్‌డౌన్‌ కారణంగా తీవ్రమైన ఆహార కొరత బారిన పడుతున్నాయి. ఇప్పుడు దేశం ముందున్న సవాలు ఏమిటంటే, గ్రామీణ కుటుంబాలు దారిద్య్రంలో కూరుకుపోకుండా చేయడం, గ్రామీణ ఆర్థిక ముఖచిత్రాన్ని పునరుద్ధరించి, పునర్నిర్మాణం చేయడమే.

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల భారీ మొత్తం కానీ, తదనుగుణంగా ఆర్థిక మంత్రి ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలు కానీ ప్రస్తుత సంక్షోభంలో తలెత్తుతున్న భయాందోళనలను కనీసంగా కూడా పారదోలడం లేదు. ఈ పథకాలు, ప్యాకేజీలను అనుకున్న విధంగా అమలు చేయగలిగితే గ్రామీణ మౌలిక వసతి కల్పనను ప్రోత్సహించడం, గ్రామీణ పరిశ్రమలకు వేగంగా రుణాలు మంజూరు చేయడం, వ్యవసాయ మార్కెట్లను అనుసంధానించడం వంటి చర్యలు దీర్ఘకాలంలో మేలు చేయవచ్చు.  
గ్రామీణ జీవితాలను పునరుద్ధరించి, వారికి మెరుగైన జీవితాన్ని అందించడానికి నాలుగు సూత్రాల ఎజెండా ఉంది.  

వీటిలో మొదటిది... జాతీయ ఉపాధి పథకమేనని ఏకగ్రీవంగా చెప్పవచ్చు. ప్రస్తుతం దేశంలో గ్రామీణ ఉపాధి కల్పన పథకంలో భాగంగా దాదాపు 7.65 కోట్లమంది క్రియాశీలక ఉపాధి కార్డుదారులు ఉంటున్నారు. వీరందరికీ ఉపాధి హామీ పథకంలో భాగంగా 100 రోజుల పనిని కల్పించినట్లయితే బడ్జెట్‌లో కల్పించిన రూ. 40,000 కోట్లు ఏమూలకూ సరిపోవు. వలస కార్మికుల రాక కారణంగా ఈ సంవత్సరం ఉపాధి హామీ పథకంలో అధిక సంఖ్యలో కార్మికులు నమోదయ్యే పరిస్థితిని తోసిపుచ్చలేం. గత కొన్నేళ్లుగా ఒక్కో కుటుం బానికి సగటు పనిదినాలు 45 నుంచి 50 రోజుల వరకే లభిస్తున్నాయి. గ్రామీణ కుటుంబాలు తాము కోరుకుంటున్న పనిదినాలు ఇవే అని చెప్పడానికి లేదు. ఉపాధికి డిమాండ్‌ తగ్గించిన కారణంగానే ఇన్ని తక్కువ పనిదినాలు వారికి అందుబాటులో ఉంటున్నాయి. గ్రామాల్లో తగినంత పనిని కల్పించడంలో విఫలమైన కారణంగానే ప్రభుత్వం సీజనల్‌ వలసను ప్రతి సంవత్సరం ప్రోత్సహిస్తోంది. 

అందుచేత, గ్రామీణ ఉపాధి పథకం అమలులో మొదట్లో జరిగిన అన్యాయాలను తొలగించడానికి రెండు మార్గాలున్నాయి. సాధారణంగా శ్రామిక కుటుంబాలు వేసవి కాలంలోనే ఎక్కువ పనిదినాలను పొందుతుంటాయి కానీ ఈ సంవత్సరం లాక్‌డౌన్‌ కారణంగా ఆ అవకాశాన్ని పూర్తిగా పోగొట్టుకున్నాయి. కాబట్టి పనిచేసినా చేయకున్నా వీరికి కనీసం 20 పనిరోజులకైనా పరిహారం అందించాల్సి ఉంటుంది. అవసరమైన కుటుంబాలకు నగదు బదిలీ చేయడానికి ఇది ఒక సమర్థవంతమైన మార్గం. 

రెండు... ఈ సంవత్సరం ప్రతి కుటుంబానికి పనిదినాలను వంద నుంచి 200కి పెంచాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. కరువు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల కాలంలో ఉపాధి పనిదినాలను 150 రోజులకు పెంచడం రివాజు. మరొక మార్గం ఏదంటే, ప్రతి కుటుంబానికి పనిదినాల సంఖ్య సగటున వందరోజులను మించని పరిస్థితిలో తాము కోరుకున్నన్ని రోజులు కుటుంబాలకు పని కల్పించడమే. ప్రభుత్వ సగటు అయిన 100 రోజుల పరిమితిని మించిపోయినా సరే ఈ సంవత్సరం గ్రామీణ కుటుంబాలు కోరుకున్న పనిదినాలను కల్పించడం అవసరం. లాక్‌డౌన్‌ కలిగించిన దుర్భర పరిస్థితుల్లో ప్రభుత్వం పాటించవలసిన కనీస విధానమిది. 

ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా జాతీయ ఆహార భద్రతను అమలుచేయడం. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో అదనపు కోటా, ముందస్తు కోటా, అదనంగా కిలో పప్పు ఇవ్వడం వంటివి ప్రకటించారు (అయితే ఆరువారాల తర్వాత కూడా ఈ అదనపు కోటా ఇంకా ప్రజలకు అందలేదు). వన్‌ నేషన్‌ ఒక రేషన్‌ కార్డు విధానం ద్వారా ఇది మరింత సమర్థంగా అమలు చేస్తామని చెబుతున్నారు. అయితే దరఖాస్తు చేసుకుని సంవత్సరాలు గడుస్తున్నా రేషన్‌ కార్డు అందని వారికి తక్షణం కార్డులు అందించే ఏర్పాటు చేయాలి. 2011లో ఎస్‌ఈసీసీ సర్వే ప్రకారం ప్రభుత్వ సౌకర్యాలు పొందుతున్న కుటుంబాల సంఖ్య 11.2 శాతం మాత్రమే ఉన్నట్లు తెలిసింది. అంటే 90 శాతం కుటుంబాలకు రేషన్‌ కార్డును అందించాల్సిన అవసరం ఉందని నాటి సర్వే తెలిపింది.

మూడోది... కిసాన్‌ సన్మాన్‌ యోజన. ఈ పథకం కింద ఏటా ఇచ్చే 6 వేల రూపాయలకు ప్రస్తుత సంక్షోభకాలంలో మరొక 2 వేలను కలిపి ఇస్తున్నారు. అయితే సన్నకారు రైతు కుటుంబాల వ్యవసాయ ఖర్చులతో పోలిస్తే ఇది ఒక మూలకు కూడా సరిపోదు. అందుకనే ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి కనీసం 10 వేల రూపాయలను పెంచడం సహేతుకంగా ఉంటుంది.

నాలుగోది... పంటల బీమా. ఇది ఇప్పుడు స్వచ్చందంగా తీసుకునే బీమా కిందికి మార్చారు. దీంతో చాలామంది రైతులు పంటల బీమా పాలసీని తీసుకోరు. ఈ బీమా పాలసీని పూర్తిగా రైతులకు లబ్ధి కలిగించేలా మార్పు చేయాలి. ఇప్పుడైతే సన్నకారు రైతులు బ్యాంకులకు వెళ్లి, కస్టమర్‌ సర్వీసు కేంద్రాలను, బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లను సంప్రదించి ప్రీమియం చెల్లించి తమ దరఖాస్తును అప్‌ లోడ్‌ చేయవలసి రావడం చాలా కష్టమైన వ్యవహారంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానాన్ని రైతులకు ఉపయోగించేలా సులభతరం చేయడంపై ఆలోచించాలి. పోస్ట్‌మ్యాన్‌నే పంటల బీమా ఏజెంటుగా మారిస్తే రైతు వద్దకే నేరుగా వెళ్లి సంబంధిత పని చేసిపెట్టడానికి వీలవుతుంది.

వలస కూలీలు విభిన్న రకాలుగా ఉన్నారు. కొందరు కొన్ని వారాలపాటు తమ గ్రామాలు విడిచిపెట్టి, మళ్లీ తిరిగి వస్తుంటారు. ప్రతి ఆరునెలలకు ఒకసారి ఇలా చేస్తుంటారు. కొందరయితే ఆరు లేదా ఎనిమిది నెలల వరకు వలస వెళ్లి తర్వాత తిరిగి వస్తుంటారు. మరికొందరు సంవత్సరాల పాటు గ్రామాలు వదిలేసి పట్టణ కేంద్రాల్లోనే జీవిస్తుంటారు. చాలామంది వలస కూలీలు ఖరీఫ్‌ సీజన్‌లో వెనక్కు వచ్చి తమ చిన్న కమతాల్లో సాగు చేస్తుంటారు. 2016–17 ఎకనమిక్‌ సర్వే ప్రకారం ప్రతి అయిదు కుటుంబాల్లో కనీసం ఒక కుటుంబంలో ఒక్కరయినా వలస పోతుంటారని తెలిసింది.

ఇప్పుడు లాక్‌డౌన్‌ పరిస్థితులలో వలస కార్మికులు చాలావరకు తమ ఇళ్లకు వెళ్లిపోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరి ఆరాటాన్ని అర్థం చేసుకోవచ్చు. తాము ఇన్నేళ్లుగా జీవిస్తూ వచ్చిన నగరాలు, పట్టణాలు తమను ఎలా గాలికి వదిలేశాయో అర్థమైనందువల్లే మళ్లీ నగరాలకు రావాలంటేనే వీరు భయపడిపోతున్నారు. ప్రస్తుత సంక్షోభం నుంచి కుదుట పడ్డాక నగరాలకు తిరిగివస్తే ఉండటానికి కాస్త గూడు ఎక్కడ దొరుకుతుందనేది వీరిని కలవరపరుస్తోంది. దీంతో చాలామంది కార్మికులు మళ్లీ నగర కేంద్రాలకు తిరిగి రాకపోవచ్చు కూడా.

ఇలాంటివారు తమ పరిసర గ్రామాలలోనే పనికోసం ప్రయత్నించవచ్చు. నగరాల్లో ఉన్నప్పుడు వీరు నైపుణ్యాలను పెంచుకుని ఉండవచ్చు కానీ ఆ నిర్దిష్టమైన నైపుణ్యాలు గ్రామీణ ప్రాంతాల్లో అసలు పనికిరాకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో రహదారులు, చిన్నచిన్న దుకాణాలు నిర్మించడం, విద్యుత్‌ నెట్‌వర్క్‌ పనులు, సోలార్‌ లేదా ఇతర పునర్వినియోగ విద్యుత్‌ ప్లాంట్లను నిర్మించడం, ఇంటర్నెట్‌ నెట్‌వర్క్స్, తదితర మౌలిక వ్యవస్థాపన పనుల్లో వీరి నైపుణ్యాలను ఉపయోగించేలా తగు చర్యలు తీసుకోవాలి.
వలస కార్మికుల గాథలో ఒక కోణాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. వీరిలో చాలామంది పని వెదుక్కోవడం కోసమే నగరాలకు వెళుతుంటారు. అప్రెంటీస్‌గా పనిచేస్తూ నైపుణ్యాలను నేర్చుకుం టారు. వసతికోసం తంటాలుపడుతూ, గుడిసెలను ఏర్పర్చుకుం టారు. ఈ గుడిసెలను క్రమబద్ధీకరించేంతవరకు అధికారుల వేధింపులకు గురవుతూనే ఉంటారు. తగిన ఇళ్లు, నీరు, టాయ్‌లెట్‌ సౌకర్యాలు, విద్యుత్, రేషన్‌ కార్డులు వంటివి లేకుండానే వీరు నగరాల్లో నివసిస్తుంటారు. ప్రభుత్వం ప్రాథమిక సేవలు కల్పించకపోవడంతో వీరి ఆదాయాల్లో 40 నుంచి 50 శాతం వరకు కనీస వసతులపైనే పెట్టాల్సి వస్తోంది. ప్రభుత్వం తగు సౌకర్యాలు కల్పిస్తే ఇలా ఖర్చుపెట్టే ఆదాయాలను పొదుపు చేసుకుని సంక్షోభ సమయాల్లో వాడుకోవడం సాధ్యపడుతుంది.

కరోనా సంక్షోభ నేపథ్యంలో గ్రామీణ ఆర్థిక ముఖచిత్రాన్ని పునర్నిర్మించాలంటే ఒక కొత్త దృక్పథం అవసరం. చిన్న చిన్న లక్ష్యాల గురించి ఆలోచించాలి. గ్రామీణ ప్రాంతాల్లో వాటర్‌ షెడ్‌ పథకాలను మళ్లీ అమలు చేయాలి. తృణధాన్యాలు, నూనె గింజలు, కాయధాన్యాలు, వంటి సాంప్రదాయిక పంటల ఉత్పత్తిని పెంచే పథకాలు చేపట్టాలి. వరి, గోధుమ కాకుండా ఇతర పంటలను ప్రోత్సహించాలి. పశుపోషణను పెద్ద ఎత్తున చేపట్టాలి. తమ భూములు, తమ శ్రమకు తగిన ఆదాయాలను పెంచే సాంప్రదాయిక పంటలవైపు గ్రామీణులను మళ్లించాల్సి ఉంటుంది. రోజురోజుకూ కనీవినీ ఎరుగని సంక్షోభం మన జీవితాలను ఆవరిస్తోంది. ఇంతవరకు భారతదేశం సాధించిన మానవాభివృద్ధికి సంబంధించిన మైలురాళ్లన్నింటినీ ఈ సంక్షోభం వెనక్కు మళ్లించేలా ఉంటోంది. దేశ గ్రామీణ ముఖచిత్రంపై దారిద్య్ర భూతం మరోసారి కోరలు చాస్తోంది. ఈ విపత్తును ఎలా పరిష్కరిస్తారనేది దేశ భవిష్యత్తునే నిర్దేశించనుంది. (ద వైర్‌ సౌజన్యంతో...)

వ్యాసకర్త : అశ్విని కులకర్ణి , ఫౌండర్‌ ట్రస్టీ, ప్రగతి అభియాన్‌

మరిన్ని వార్తలు