సోషలిస్ట్‌ స్వాప్నికుడు –శ్రేయో వైజ్ఞానికుడు 

13 Nov, 2019 01:17 IST|Sakshi

సందర్భం

స్వాతంత్య్రోద్యమ ప్రస్థానంలో కీలకమైన 1930, 1940 దశకంలో యువతను ఆకర్షించి వారిని ఉద్యమంలో భాగం చేసి విదేశాల్లో స్వరాజ్య సమర గొంతుకను వినిపించడంలో, మద్దతును కూడగట్టడంలో జవహర్‌ లాల్‌ నెహ్రూ అద్వితీయ కృషి చేశారు. స్వాతంత్య్రం తర్వాత 1947 నుండి 1964 వరకు దార్శనికత కల్గిన ప్రధానమంత్రిగా నవ్య, విశాల, వైవిధ్య బహుళత్వ భారత  నిర్మాణంలో, సంక్షేమ రాజ్య ప్రజాస్వామ్య స్థాపనలో నెహ్రూ నిమగ్నమయ్యారు. విశాల భావాలు, అభ్యుదయ ధోరణి, చురుకైననాయకత్వ లక్షణాలు, వైజ్ఞానిక మేధోపటిమతో దేశాన్నిసంఘటితపరుస్తూ, సంస్థానాలను ఒక్కతాటిపైకి తెచ్చి పునర్నిర్మాణానికి దీపస్తంభమై నిలిచాడు. భారత భవిష్యత్‌ను సమున్నతంగా తీర్చిదిద్దడానికి వ్యవసాయ, పారిశ్రామిక, శాస్త్ర సాంకేతిక రంగాలలో స్వయం స్వావలన, స్వయం సమృద్ధి కోసం, ప్రపంచస్థాయి ప్రమాణాలను అందుకోవడానికి బలమైన పునాదులను, సౌధాలను నిర్మించి చరిత్రలో చెరగని ముద్రవేశారు. నెహ్రూ అమరత్వం సందర్బంగా సుప్రసిద్ధ పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ ఆయనను ’మేకర్‌ ఆఫ్‌మాడ్రన్‌ ఇండియా‘ గా అభివర్ణించింది. ది ఎకనామిస్ట్‌ పత్రిక సామాన్య ప్రజల ఆకాంక్షలను అకళింపుచేసుకున్న మహోన్నత వ్యక్తి అని, అతడు లేని అంతర్జాతీయ యవనిక పేదరాలిగా మారిందని వ్యాఖ్యానించింది.

నవంబర్‌ 14, 1889 లో జన్మించిన నెహ్రూ హౌరా, కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాడు. 1919–1920 కాలంలో జాతీయోద్యమంలో  అతివాదులు, మితవాదుల మధ్య సంఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నప్పుడు నె్రçహూ గాంధీవైపు నిలిచాడు. 1929 లాహోర్‌ కాంగ్రెస్‌ సమావేశంలో ‘సంపూర్ణ స్వరాజ్‌’ తీర్మా నం చేయించాడు. ఉద్యమ తీవ్రతను పెంచడం కోసం శాసనోనల్లంఘన ఉద్యమానికి యావత్తూ కాంగ్రెస్‌ శ్రేణులను సమాయత్తం చేశాడు.ఉద్యమ ప్రస్థానంలో 1921–1945 కాలంలో 3,259 రోజులు జైలు జీవితాన్ని గడిపాడు.

గణతంత్ర, ప్రజాస్వామ్య రూపశిల్పిగా వ్యవహరించి రాజ్యాంగ నిర్మాణాన్ని నిర్దేశిం చాడు. ప్రతి పౌరుడికి అవకాశాల్లో సమానత, సామాజిక, ఆర్థిక రాజకీయ న్యాయం అందేలా   తన మేధో సహచరుడు,సామాజిక విప్లవకారుడు అంబేడ్కర్‌కు సంపూర్ణ తోడ్పాటు అందించాడు. బహుళ భాషా సంస్కృతులు, కుల, మతప్రాంతపరంగా అనేక వైవిధ్యాలు ఉన్న బహుళత్వ భారత్‌లో ఐక్యత కాపాడుకునే ఉద్దేశంతో  కేంద్రానికి విశిష్ట అధికారాలు ఉండేలా నిబంధనలు రూపొందించాడు. వర్ణ వివక్ష సామ్రాజ్యవాద విధానాల వ్యతిరేక పోరులో అంతర్జాతీయ గొంతుకగా మారాడు.  రష్యా విప్లవ ప్రేరణతో ప్రజాస్వామ్య సోషలిజాన్ని రూపొందించి ప్రజల ప్రగతికి, సంక్షేమానికి ఉపయోగపడే విద్య, వైద్యం, రవాణా, గనులు, అంతరిక్షం, సాగునీటి ప్రాజెక్టులు  నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేశాడు. వైజ్ఞానిక దృక్పథంతో   హోమిభాబా ఆధ్వర్యంలో అణుశక్తి కమిషన్‌ ఏర్పాటు చేశారు.

అంతరిక్ష కార్యక్రమాల కోసం ఇస్రోను ఏర్పాటు చేశాడు. ప్రతిష్టాత్మక ఐఐటీ, నిట్, ఐఐఎంలు, విశ్వ విద్యాలయాలు, అన్ని పరి శోధన కేంద్రాలు, రక్షణరంగ పరిశ్రమలు నెహ్రూ ఏర్పాటు చేసినవే. బాంబే ప్లాన్‌ వెలుగులో మిశ్రమ ఆర్థికవ్యవస్థను ఏర్పాటు చేసి స్వదేశి పెట్టుబడి దారులకు ప్రోత్సాహాన్ని అందించాడు. హైందవ సమాజంలో స్త్రీలపై కొనసాగుతున్న వివక్ష, అణచివేత విధానాలను తొలగించడానికి అంబేడ్కర్‌ రూపొందించిన హిందూకోడ్‌ బిల్లులు ఆమోదం పొందడానికి కృషి చేశారు. 1953 సెప్టెంబర్‌ 20న కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నెహ్రూ లేఖ రాస్తూ, తీవ్ర జాతీయవాదం దేశానికి కీడు కలిగిస్తుందని హెచ్చరించారు. ఇప్పుడు  ఆయన హెచ్చరిక నిజమని రుజువవుతోంది.  నె్రçహూ దార్శనికత, రాజ్యాంగ విలువల రక్షణ కోసం పౌరసమాజం చారిత్రక భాధ్యతను చేపట్టాలి.(రేపు నెహ్రూ జయంతి )  


అస్నాల శ్రీనివాస్‌
వాస్య కర్త తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం

మరిన్ని వార్తలు