వైద్యం జాతీయీకరణే మందు

10 Jul, 2020 02:08 IST|Sakshi

గత మూడు దశాబ్దాలుగా మన ప్రభుత్వాలు ఆరోగ్య సంరక్షణను ప్రైవేటీకరించడాన్ని ప్రోత్సహిస్తూ వచ్చాయి. ఈ క్రమంలో ప్రజారోగ్య వ్యవస్థకు నిధులను సమకూర్చడం క్రమానుగతంగా తగ్గిస్తూ వచ్చారు. వైద్యం ప్రైవేటీకరణ విధానమే ప్రస్తుత సంక్షోభానికి మూలకారణం. కరోనా వైరస్‌ నేపథ్యంలో మరింతమంది ప్రజలు బాధలకు గురవుతూ ప్రాణాలు పోగొట్టుకోవడానికి ముందే ప్రభుత్వాలు ఆరోగ్య సంరక్షణ రంగంపై అధికంగా డబ్బు ఖర్చుపెట్టే మార్గాలను అన్వేషించాలి. ప్రైవేట్‌ ఆసుపత్రుల జాతీయీకరణ ఒక్కటే మరిన్ని పడకలను రోగులకు అందుబాటులోకి తీసుకురాగలదు. సంపూర్ణ విధ్వంసాన్ని తప్పించాలంటే ప్రైవేట్‌ ఆసుపత్రులను తక్షణం జాతీయం చేయడం గురించి మనం ఆలోచించాల్సి ఉంది.

రష్యాను ఇప్పటికే అధిగమించిన భారతదేశం ప్రస్తుతం కోవిడ్‌–19 బారిన పడి తీవ్రంగా దెబ్బతిన్న దేశాల్లో రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత, ఉదాసీనతే దీనికి కారణం అని చెప్పాలి. ఉదాహరణకు కరోనా వైరస్‌ ప్రారంభ దినాల్లో ఐసీఎమ్‌ఆర్‌ సూచించిన కరోనా పరీక్షల వ్యూహం కేసి చూద్దాం. కేంద్ర వైద్య సంస్థ ఆలోచన ఒకటి కాగా, రాష్ట్ర ప్రభుత్వాల అనధికారిక విధానం మరొకటిగా మారిపోయింది. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించి కరోనా రోగులను ఏకాంతంలో పెట్టడానికి బదులుగా రోగుల సంఖ్యను తక్కువ చేసి చూపుతూ వచ్చారు. రోజుకు వంద కంటే తక్కువ కేసులు ఉంటున్న దశలో అనవసరంగా, కఠినాతికఠినంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను పథకం పాడూ లేకుండా అమలు చేశారు. అదే సమయంలో ఆరోగ్య కార్యకర్తలకు పీపీఈ కిట్లను భారీ స్థాయిలో సేకరించి ఇవ్వడాన్ని పట్టించుకోలేదు. అంతకుమించి వలస కార్మికులు దుస్థితి పట్ల స్పందించడలో విఫలమయ్యారు. పరీక్షలను పెద్ద సంఖ్యలో నిర్వహించేలా రాష్ట్రాలకు దిశానిర్దేశం ఇవ్వడంలో విఫలమయ్యారు.

ఇతర దేశాల్లో లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత నిబంధనలను సడలించి పథకం ప్రకారం ముందుకెళుతుండగా భారత్‌లో మాత్రం లాక్‌ డౌన్‌ అనంతరం కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నప్పటికీ కేంద్రంతో పాటు, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం మానేశాయి. పైగా లాక్‌డౌన్‌ దిగ్విజయంగా పూర్తయిందని, ఆట్టహాసంగా అన్‌లాక్‌–1, అన్‌లాక్‌–2ని ప్రకటించేశారు. లాక్‌డౌన్‌ కాలంలో ఏ ప్రభుత్వం నుంచి అయినా కనీసంగా ఆశించేది ఏమిటంటే, కరోనా పరీక్షల సామర్థ్యాన్ని తగినంతగా పెంచడం మాత్రమే. వ్యవస్థాగతంగా క్వారంటైన్‌ సౌకర్యాలను, ఆసుపత్రులను, ఐసీయూ పడకలను, వెంటిలేటర్లను, ఇతర సంస్థాగత అవసరాలను తీర్చడం ప్రభుత్వాల బాధ్యతగా ఉండాలి.

కానీ దీనికి పూర్తి భిన్నంగా ఏం జరిగిందంటే మనం ఇప్పుడు ముంబై, ఢిల్లీ, చెన్నైల్లో కరోనా రోగుల దుస్థితిని చూసి చెప్పవచ్చు. భారీ స్థాయిలో పరీక్షలు నిర్వహించి చికిత్స చేయాల్సిన తరుణంలో ఆసుపత్రులు రోగులకు ముఖం చాటేశాయి. కరోనా చికిత్స చేసే ఆసుపత్రులు కనిపించక కొందరు దయనీయంగా మరణిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను కరోనా రోగులకు అందుబాటులో ఉంచలేకపోవడం, కుటుంబ సభ్యులతో సహా మిగతా జనాభానుంచి వారిని దూరం చేయడం ద్వారా వైరస్‌ని కట్టడి చేయడంలో ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయనే చెప్పాలి. 

చెన్నైలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకల కొరత ఏర్పడింది. నగరంలో అసంఖ్యాకంగా ఉన్న ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 61 ఆసుపత్రులు మాత్రమే కోవిడ్‌–19 రోగులకు చికిత్స చేయడానికి ముందుకొచ్చాయి. చివరకు ఈ ఆసుపత్రుల్లో కూడా పడకలు ఖాళీగా లేవు. పైగా కోవిడ్‌–19 రోగులకు, ఇతర వ్యాధిగ్రస్తులకు చికిత్స చేయడం నుంచి అనేక ఆసుపత్రులు తప్పుకోవడం గమనార్హం. కాబట్టి ఆసుపత్రి సంరక్షణ లేక, నగరంలోని ఆసుపత్రుల సామర్థ్యంలో ఎక్కువ భాగం ప్రైవేట్‌ రంగంలో ఉండిపోయి అవి కూడా తలుపులు మూసేయడం కారణంగా కరోనా రోగులు, ఇతరులు నిస్సహాయంగా మృత్యువు బారిన పడుతున్నారు.

ఈ ప్రమాదకరమైన పరిస్థితిలో మనం సాంక్రమిక వ్యాధి పతాకావస్థకు చేరుకుందని భావించేటంత అజ్ఞానంలో మాత్రం లేము. రెండు రోజుల క్రితం ఈ వ్యాసం రాసేనాటికి చెన్నైలో 22,375 యాక్టివ్‌ కేసులు మాత్రమే నమోదయ్యాయి. వీరిలో కొన్ని వేలమందికి మాత్రమే ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం ఉంది. మరి, 70 లక్షల పైగా ఉన్న జనాభాలో కొన్ని వేలమంది రోగుల పరిస్థితి ఇలా ఉండగా, అంతర్జాతీయ వైద్య టూరిజం అవసరాలను నెరవేరుస్తోందని గొప్పలు చెప్పుకుంటున్న ప్రైవేట్‌ హెల్త్‌ కేర్‌ వ్యవస్థ అసలు స్వరూపం బయటపడి ఆరోగ్య సంరక్షణ అనే భావనే కుప్పకూలుతున్న దశను సమీపిస్తోంది.

ప్రభుత్వ అధికారిక డేటా ప్రకారం చెన్నైలో కోవిడ్‌–19 రోగులకు చికిత్స అందించడానికి ప్రభుత్వం అనుమతించిన ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కేవలం 4,145 పడకలు మాత్రమే ఉంటున్నాయి.  2020 జూన్‌ 28 నాటికి వీటిలో 2,258 పడకలు మాత్రమే రోగులకు అందుబాటులో ఉన్నాయి. ఇంకా 1,887 పడకలు ఖాళీగా ఉండగా ప్రభుత్వం అనుమతించిన ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో రోగులను చేర్చుకోకుండా ఎందుకు పంపించి వేస్తున్నారు అన్నదే అంతుపట్టని మిస్టరీగా ఉంటోంది. అయితే ఎలాగోలా పడక సౌకర్యం చేజిక్కించుకున్నప్పటికీ ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకునే వెసులుబాటు అత్యధిక శాతం జనాభాకు లేదు.

అక్కడి ఖర్చులు భరించడం అసాధ్యం. తమిళనాడు ప్రభుత్వం బీమాపథకం కింద కోవిడ్‌–19 చికిత్సలో భాగంగా ఆసుపత్రులు విధించే బిల్లులకు గరిష్ట పరిమితిని నిర్ణయించింది. అయితే ఇలా గరిష్ట పరిమితి విధించినప్పటికీ దాన్ని అమలు చేయడం ఎవరి తరమూ కాదని ప్రైవేట్‌ ఆసుపత్రుల నిర్వాకాలకు సంబంధించిన ఉదాహరణలు ఇప్పటికే స్పష్టం చేస్తున్నాయి. దీనికి మించి జనాభాలోని అధిక శాతం ప్రజల ఆరోగ్య సంరక్షణా బాధ్యతనుంచి రాష్ట్ర ప్రభుత్వం తన చేతులు దులుపుకుంది. మరో ప్రశ్న ఎదురవుతోంది. జూలై చివరినాటికి తమిళనాడులో రోజుకు 25 వేల కొత్త కేసులు బయట పడనున్న సందర్భంగా మిగిలి ఉన్న ఆ 1,887 పడకలు ఏ మూలకు వస్తాయి అన్నదే అసలు సమస్య. వాస్తవానికి చెన్నైలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో పడకలు మరి కొన్ని వారాల్లోనే పూర్తిగా భర్తీ అవుతాయి. వ్యాక్సిన్‌ కనుగొనకపోయినట్లయితే, చెన్నై నగరంలోని 40 నుంచి 56 లక్షల మంది జనం (మొత్తం జనాభాలో 50 నుంచి 70 శాతం) వైరస్‌ బారిన పడటం ఖాయం.

ఈరోజు ఆసుపత్రులు చాలావరకు మూసివేతకు గురై ఉండవచ్చు కానీ కోవిడ్‌–19 రోగులు, ఇతర వ్యాధిగ్రస్తులు దశాబ్దాలుగా ఆరోగ్య సంరక్షణను ప్రైవేటీకరిస్తూ పోయిన ప్రభుత్వ పాలసీ ఘోర వైఫల్యానికి పరమ నిదర్శనాలుగా మనముందు కనిపిస్తున్నారు. వరుసగా ప్రభుత్వాలు ఆరోగ్య సంరక్షణను ప్రైవేటీకరించడాన్ని ప్రోత్సహిస్తూ వచ్చాయి. ఈ క్రమంలో ప్రజారోగ్య వ్యవస్థకు నిధులను సమకూర్చడం క్రమానుగతంగా తగ్గిస్తూ వచ్చారు. గత మూడు దశాబ్దాలకు పైగా ప్రభుత్వాలు సాగిస్తూ వచ్చిన ఈ విధానమే ప్రస్తుతం సంక్షోభానికి మూలకారణమై నిలిచింది. ప్రైవేట్‌ ఆసుపత్రులపై అమలు కాని ఆదేశాలు, మార్గదర్శకాలు విధించి పబ్బం గడుపుకోవడానికి బదులుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం ప్రైవేట్‌ ఆసుపత్రులను జాతీయం చేసితీరాలి. 

కరోనా వైరస్‌ నేపథ్యంలో మరింతమంది ప్రజలు బాధలకు గురవుతూ ప్రాణాలు పోగొట్టుకోవడానికి ముందే ప్రభుత్వాలు ఆరోగ్య సంరక్షణ రంగంపై అధికంగా డబ్బు ఖర్చుపెట్టే మార్గాలను అన్వేషించాలి. ప్రైవేట్‌ ఆసుపత్రుల జాతీయీకరణ ఒక్కటే మరిన్ని పడకలను రోగులకు అందుబాటులోకి తీసుకురాగలదు. ఉదాహరణకు చెన్నై నగరంలో 84,210 ఆసుపత్రి పడకలు అందుబాటులో ఉన్నాయి. జాతీయీకరణ చేస్తే కోవిడ్‌–19, ఇతర వ్యాధిగ్రస్తులకు చికిత్స చేయడానికి ప్రభుత్వం ఈ పడకలన్నింటినీ ఉపయోగించుకోవచ్చు. చెన్నై వంటి నగరాల్లో్ల ప్రైవేట్‌ ఆసుపత్రులను పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే కేంద్రీకృత నిర్వహణలో ఆరోగ్య వ్యవస్థల యంత్రాంగాన్ని ఏర్పర్చడానికి అవకాశం లభిస్తుంది పైగా తగిన సిబ్బంది, వైద్యసామగ్రి, ల్యాబరేటరీ ఇతర మౌలిక వసతులను కేంద్రీకృత నెట్‌వర్క్‌లోకి తీసుకొచ్చి మరింత సమర్ధంగా వైద్య సేవలను అందించవచ్చు. ప్రైవేట్‌ ఆసుపత్రుల జాతీయీకరణ వల్ల మరణాల రేటు తగ్గిపోతుంది. రోగుల వ్యధలు తగ్గిపోతాయి. వైరస్‌ గుర్తింపు, ప్రజలను ముందే ఏకాంతంలో ఉంచడం వంటి చర్యల కొనసాగింపు వల్ల మెరుగైన ఆరోగ్య సంరక్షణను అందించవచ్చు.

ప్రపంచంలోనే అత్యంత కఠినంగా అమలు చేసిన లాక్‌ డౌన్‌ ఇప్పటికే విఫలమైపోయింది. అయితే నగరాలు పూర్తిగా విధ్వంసం బారిన పడకుండా ఈ లాక్‌ డౌన్‌ కొంతమేరకు ఫలితం ఇచ్చిందని చెప్పాలి. ఈలోగా ప్రైవేట్‌ ఆసుపత్రుల జాతీయీకరణకు డిమాండ్లు రానురాను పెరుగుతున్నాయి. ఇప్పటికే తమిళనాడులో ఎంపీ, వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరమావులన్‌ ప్రయివేట్‌ ఆసుపత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండుకు ఇటీవలే నిర్వహిం చిన ట్విట్టర్‌ పోల్‌లో మెజారిటీ మద్దతివ్వడం గమనార్హం. సంపూర్ణ విధ్వంసాన్ని తప్పించాలంటే ప్రైవేట్‌ ఆసుపత్రులను జాతీయం చేయడం గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. అంతిమంగా ప్రభుత్వాల ముందు ప్రస్తుతం ఉన్న అవకాశం స్పష్టం గానూ, సరళంగానూ కనిపిస్తోంది. జనాభాలోని మెజారిటీని నిశ్శ బ్దంగా బాధలకు గురి చేయడం కొనసాగించడమా లేక ప్రజల బాధలను వీలైనంతగా తగ్గించడానికి అందుబాటులో ఉన్న వనరులన్నిం టినీ ఉపయోగించడమా? అసలు ప్రశ్న ఇదేమరి.

- అసుర, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, బయోకెమిస్ట్రీ, (ది వైర్‌ సౌజన్యంతో)

మరిన్ని వార్తలు