మత జాతీయవాదం పట్ల వ్యతిరేకతే ‘బ్యాలెట్‌’ అంతరార్థం

24 Dec, 2017 01:45 IST|Sakshi

అవలోకనం
ఇప్పుడు మనం తరచుగా చూడాల్సి వస్తున్న వీధుల్లోని హింస, మీడియాలోని హింస మత జాతీయవాద భౌతిక వ్యక్తీకరణలే. మనలో చాలా మంది విస్మరించలేని ఈ సమస్యకు సంబంధించి అత్యవసర  స్థితిని కల్పించినది ఇదే. జాతీయవాదం పేరిట భారతీయులెవరికీ హాని జరుగని విధంగా, నిజమైన జాతీయ ప్రాధాన్యాలైన పేదరికం, ఆరోగ్యం, విద్యపై దృష్టిని కేంద్రీకరించగలిగే విధంగా ఇది ముగిసిపోవాలని మనం కోరుకుంటాం. మరే ఇతర అంశం కంటే ఇదే చాలా మంది బీజేపీ మరోసారి గుజరాత్‌లో గెలవకూడదని అనుకోవడానికి కారణం.

గుజరాత్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన విజయాన్నే సాధించింది. అందుకు కారణాలేమిటా అని మనం ఊహాగానాలు సాగించవచ్చు. కానీ, ఫలితా లలో అస్పష్టతేమీ లేదు. గత 20 ఏళ్లుగా గుజరాతీ ప్రజలు మాట్లాడుతున్నదానికి అనుగుణంగానే వారు తీర్పు చెప్పారు. కాంగ్రెస్‌ ఓట్ల శాతం పెరిగింది. కానీ, అది దేశవ్యాప్త ధోరణి అనగలిగేంత పెద్దదో కాదో చెప్పాలంటే మరింత సమాచారం కావాలి. ఇతర రాష్ట్రాల నుంచి మరిన్ని ఫలితాలు రావాలి. ఏదిఏమైనా గుజరా త్‌లో బీజేపీ విజయం సాధించింది. దీన్ని స్పష్టపరచుకున్నాం కాబట్టి, ఇక కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించాలని చాలా మంది ఎందుకు ఆశించారనే అంశాన్ని, లేకపోతే మరింత కచ్చితంగా చెప్పాలంటే మళ్లీ బీజేపీ గెలవకూడదని ఎందుకు కోరుకున్నారనే దాన్ని పరిశీలిద్దాం. వంశపారంపర్య రాజకీయాలను పూర్తిగా సమర్థించే వారు ఎంతో మంది నాకు కనబడలేదు. కాబట్టి బీజేపీ గెలుపు గురించి ఆందోళన చెందిన ప్రజల్లో చాలా మంది కాంగ్రెస్‌ సమర్థకులు కారని అను కోవచ్చు. అంటే వారు మరి దేని కోసమో మాత్రమే ఆందోళన చెందారు. అదేమిటి?

బీజేపీ ఉద్దేశపూర్వకంగా ముందుకు నెట్టిన మత జాతీయవాదమే. జాతీ యవాదం ఎన్నో రకాలుగా ఉండొచ్చు. అది, దేశంలోని అన్ని మతాల, అన్ని ప్రజా విభాగాల, అన్ని ప్రాంతాల భారతీయులందరినీ కలుపుకున్న సమగ్ర జాతీయ  వాదంగా ఉండొచ్చు. బీజేపీ పెంపొదింపజేయాలని అనుకుంటున్నది ఇది కాదు. ఒక నాగా లేదా మిజో తన భారతీయ గుర్తింపును సగర్వంగా అనుభూతి చెందగ లరా? బీజేపీ నిర్వచించిన విధంగా తమ భారతీయతను నొక్కి చెప్పుకోగలగా లంటే వారు భారత్‌ మాతాకీ జై వంటి హిందీ నినాదాల ద్వారా, గొడ్డు మాంసం తినడాన్ని మానేయడం ద్వారా మాత్రమే చేయగలుగుతారు. గొడ్డు మాంసం వేల ఏళ్లుగా వారి సాంప్రదాయక ఆహారం అయినా మానేయాలి. కేరళ లోని ఓ ముస్లిం తన భారతీయ అస్తిత్వాన్ని చాటుకోగలడా? ఓ హిందూ స్త్రీతో ప్రేమలో పడనని వాగ్దానం చేస్తేనే సాధ్యం. బీజేపీ చెప్పే జాతీయవాదం భారతీయులందరి జాతీ యవాదం కాదు. అది ఒక ప్రత్యేక రకమైన భారతీయులకే సంబంధించినది. కొన్ని రకాల భారతీయులకు అది నచ్చకపోయినా సరే అది వారి దృష్టిలో జాతీయ వాదమే. నేను ఉత్తర భారతదేశానికి చెందిన హిందువును అయినా నాకు ఇతర భారతీయులను దూరంగా ఉంచే ఆ జాతీయవాదం నాకు అక్కర్లేదు.

సాధారణంగా చెప్పాలంటే నాకు అన్ని జాతీయవాదాలతోనూ పేచీ ఉంది. ఎందుకంటే వాటిని ఒక ప్రజాసమూహానికి వ్యతిరేకంగా మరో ప్రజాసమూహాన్ని సమీకరించడానికి ప్రయోగిస్తుంటారు. నాకు చీదర పుట్టించే విధంగా ఎదుటి సమూహాన్ని ఎగతాళి చేసి, దుష్టులుగా క్రూరులుగా చిత్రీకరిస్తుంటారు. సాధార ణంగా జాతీయవాదం హింసకు దారితీస్తుంటుంది. కాబట్టి దానితో చాలా జాగ్ర త్తగా వ్యవహరించాలి. అన్ని రకాల జాతీయవాదాల్లోకి మతపరమైన, జాతిపర మైన జాతీయవాదాలు ప్రత్యేకించి కంపరమెత్తించేవి. పాకిస్తాన్‌ ముస్లిం జాతీయ వాదం అన్నా, చైనా హాన్‌ జాతీయవాదమన్నా కూడా నాకు ఇష్టం లేదు. చాలా మంది భారతీయులు నాలాగే భావిస్తుంటారు. కాబట్టే వారు బీజేపీని ఆందోళనతో చూస్తుంటారు. నాలాగా మీరు మతం ప్రాతిపదికగా గల జాతీయవాదాన్ని వ్యతి రేకిస్తూ, బీఎస్పీకి ఓటు చేసేవారు కావచ్చు. లేదంటే తృణమూల్‌ కాంగ్రెస్‌ ఓటర్‌ లేక ఆమ్‌ ఆద్మీ పార్టీ మద్దతుదారు లేదా ఎన్‌సీపీ, టీడీపీ, పీడీపీ, జేడీయూ, సీపీఎం లేదా ఎక్కడ ఏ పార్టీకి మద్దతుదారైనా కావచ్చు. కానీ మీరే గనుక మత జాతీయవాదానికి మద్దతుదారైనట్టయితే దేశంలో ఎక్కడున్నా గానీ బీజేపీని సమ ర్థిస్తారు. దీన్ని ప్రధాన ఎజెండాగా ముందుకు నెడుతున్న పార్టీ దేశంలో ఒకే ఒక్కటి ఉంది. కాబట్టే దాని చర్యలపట్ల, మాటల పట్ల, అది మన దేశానికి కలిగిస్తున్న నష్టం పట్ల ఆందోళన చెందుతారు. కాబట్టే తమ పార్టీ అనుబంధాలు ఏవైనాగానీ గుజరాత్‌లో ఆ పార్టీ ప్రాబల్యం క్షీణించాలని వారు కోరుకుని ఉంటారు.

మత జాతీయవాదాన్ని తొలగించినట్టయితే బీజేపీ విధానాలు ఇతర పార్టీల విధానలకంటే భిన్నమైనవేమీ కావనే అనిపిస్తుంది. ఈ పార్టీలన్నిటి ఉమ్మడి విధా నాలు మంచివని నేను చెప్పడం లేదు. వాస్తవానికి అవి మంచివి కావు కూడా. నేను పనిచేసే మానన హక్కుల సంస్థ చూస్తున్న సమస్యలు దాదాపుగా అన్నీ కాంగ్రెస్‌ పాలనలో సృష్టించినవే. ఉదాహరణకు, సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్‌ఎస్‌పీఏ) ప్రయోగించడం, ఆదివాíసీ భూములను నేరపూరితంగా ఉపయోగించడం. వీటిలో ఏవీ బీజేపీ లేదా మోదీ సృష్టించినవి కావు.

బీజేపీ వీటిని తగ్గించకపోగా మరిన్నిటిని జోడిస్తోంది. దూకుడుగా అది మత జాతీయవాదాన్ని ముందుకు నెడుతుండటం వల్ల కలిగే పర్యవసానాలను మనం రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం గోమాంసం పేరిట కొట్టి చంపేయడం వంటి హింసాత్మక ఘటనలు తరచుగా సంభవిస్తున్నాయి. అవి బీజేపీ ఉద్దేశ పూర్వకంగా సృష్టించినవని మనం చదువుతున్నాం. వారు గనుక ఇలా భారతీ యులను ప్రధానంగా మత ప్రాతిపదికపైనే చీల్చడానికి బదులుగా కులం, లింగం, ప్రాంతం ప్రాతిపదికపై చీల్చాలని చూసి ఉంటే వీటిలో చాలా ఘటనలు జరిగి ఉండేవే కావు.

ఇప్పుడు మనం తరచుగా చూడాల్సి వస్తున్న వీధుల్లోని హింస, మీడియా లోని హింస (వ్యక్తులను పాకిస్తాన్‌ ‘దళారుల’ని పిలవడం) మత జాతీయవాదపు భౌతిక వ్యక్తీకరణలే. మనలో చాలా మంది విస్మరించలేని ఈ సమస్య గురించిన అత్యవసర  స్థితిని కల్పించినది ఇదే. జాతీయవాదం పేరిట భారతీయులెవరికీ హాని జరుగని విధంగా, నిజమైన జాతీయ ప్రాధాన్యాలైన పేదరికం, ఆరోగ్యం, విద్యపై దృష్టిని కేంద్రీకరించగలిగే విధంగా ఇది ముగిసిపోవాలని మనం కోరుకుంటాం. మరే ఇతర అంశం కంటే ఇదే చాలా మంది బీజేపీ మరోసారి గుజరాత్‌లో గెలవ కూడదని అనుకోవడానికి కారణం. మనం ఆ విషయాన్ని అంగీకరించి, ఆ పార్టీ మద్దతుదార్లతో సంవాదాన్ని తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నించాలి. తద్వారా వారు మన దృక్పథాన్ని అర్థం చేసుకునేలా చేయాలి.

వ్యాసకర్త కాలమిస్టు, రచయిత 

aakar.patel@icloud.com
ఆకార్‌ పటేల్‌

మరిన్ని వార్తలు