కరోనా తెచ్చిన సమానత్వం

8 May, 2020 00:05 IST|Sakshi

విశ్లేషణ

కనిపించని వైరస్‌ నుంచి ఎలా తప్పించుకుని ఉండాలా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రపంచంలోని పేదలు, ధనికుల మనస్సులను సమానంగా కలచివేస్తూ ఉంది.ఇప్పటివరకూ అణుశక్తి, పరమాణుశక్తి, అంతరిక్షయానం అని గొప్పలు చెప్పుకున్న దేశాల ప్రకటనలు దీని ముందు ఉత్తి ప్రగల్భాలుగానే మిగిలిపోయాయి. ధనిక, పేద– అందర్ని కరోనా వైరస్‌ మానసికంగా అట్టడుగు స్థాయికి దించేసింది. దీనికంతటికీ తాను కారణం కాదని, మనిషి తనకు తాను చేసుకున్న తప్పిదాలే అసలు కారణమని కరోనా చాటి చెబుతోందా? మనిషికి మైక్రోస్కోపు, టెలీ స్కోపు లాంటి దృష్టితో పాటు అంతకుమించిన అంతర్‌దృష్టి  కావాలి. అది ఉంటే దూరదృష్టి ఉంటుంది. అదే ఉంటే వైరస్‌ గురించి ప్రపంచ దేశాలు మొదట్లో ఇంత తేలిగ్గా తీసివేసిన పరిస్థితి సంభవించేది కాదు.

కోవిడ్‌–19 కర్కశత్వానికి ఒక్కపెట్టున ప్రపంచం మారిపోయింది. ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితి రాలేదని కాదు, వచ్చింది. సరిగ్గా వంద సంవ త్సరాల క్రితం అంటే 1918–20లలో స్పానిష్‌ ఫ్లూ అనే అంటు వ్యాధి నేటి కరోనా కంటే ఎంతో బీభత్సంగా అప్పటి ప్రపంచాన్ని కుదిపి వేసింది. చైనా నుండి అమెరికా వరకు ప్రజలు గజగజలాడిపోయారు. అదే సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం కూడా జరిగింది. ప్రపం చవ్యాప్తంగా కోట్లలో చనిపోయారు. పేరుకు తగ్గట్టుగా స్పానిష్‌ ఫ్లూ స్పెయిన్‌ దేశంలో అవతరించలేదు. పరిశోధనల ప్రకారం అది అమె రికాలో కానీ, ఫ్రాన్స్‌లోగానీ మొదలై, ఆ తర్వాత దాదాపు అన్ని దేశాల్ని కబళించిందని చెబుతారు. మొదటి ప్రపంచ యుద్ధంలో స్పెయిన్‌ దేశం తటస్థంగా ఉండటంవల్ల, కేవలం స్పెయిన్‌ వార్తలే బహిర్గతమవుతూ ఉండేవి. అందుకే భయవశాత్తు ఆ రోగానికి స్పెయిన్‌ పేరు ఆపాదించడం జరిగింది.

అదృశ్యమైన గొప్పవారి అధికారాలు
నావెల్‌ కరోనా వైరస్‌ ముట్టడికి నేటి అమెరికా ఎలా అతలా కుతలం అవుతోందో అలాగే ఆనాటి అమెరికా కూడా స్పానిష్‌ ఫ్లూ సంక్ర మణానికి తల్లడిల్లిపోయింది. వేలల్లో, లక్షల్లో చూస్తూ చూస్తూ జీవి తాలు కనుమరుగయ్యాయి. ఆ రోజుల్లో లెబనాన్‌ నుండి వచ్చి అమె రికాలో స్థిరపడిన ఖలీల్‌ జిబ్రాన్‌ అనే తత్వవేత్త న్యూయార్క్‌ నగరంలో రోగగ్రస్తులై అత్యంత దయనీయమైన స్థితిలో పేదరికంతో విలవిల లాడుతున్న ప్రజల్ని కళ్లారా చూసి, ‘వచ్చే తరాలు పేదరికంలో సమా నతను, దుఃఖంలో ప్రేమను గ్రహిస్తాయి’ అని వక్కాణించాడు. అవును, నేడు మనం అదే చూస్తున్నాం.

కరోనా ప్రకోపానికి, ప్రభావానికి అన్ని దేశాలు అన్ని సమూహాలు ఒకే అరుగుపైకి తేబడ్డాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా, ప్రపంచ వాసులందరూ ఒకే రకమైన ఉనికిలోకి వచ్చి చేరారు. ఇదేమైనా ప్రకృతి సిద్ధంగా జరిగిన కాకతాళీయమా? జీవన శైలుల రీత్యా ధనికులు, పేదలు అనే వ్యత్యాసం కానరాకుండా పోయింది. గొప్పవారి సామా జిక విశేషాధికారాలు అదృశ్యమయ్యాయి. బీదవాడితో సమానంగా హోదాలు తరిగాయి. ఎందుకంటే ఎవరికీ నాలుగు గోడల్ని దాటి బయటికి అడుగేసే అర్హత లేదు. అది అందరి మేలు గురించి విధించిన ప్రభుత్వాజ్ఞ. కరోనా నియంత్రణకు కనీసం ఆరడుగుల భౌతిక దూరం అవసరమైంది. దీన్ని పాటించకపోతే భూమిలో ఆరడుగుల కిందికి పోవాల్సి వస్తుందని అంటున్నారు. లేనివాడికి కారు ఎలాగూ లేదు. ఉన్నవాడికీ లేనట్లే. ఎందుకంటే కారు వాడలేడు కాబట్టి. బలహీనుడు, బలవంతుడు– ఇద్దరూ వాళ్ల బలం చూపించుకోవాల్సిన పనిలేదు. కనిపించని వైరస్‌ నుంచి ఎలా తప్పించుకుని ఉండాలా అన్న ప్రశ్న ఇద్దరి మనసుల్ని కలచివేస్తూ ఉంది.

గుడిసెలో ఉండేవాడు ఎప్పటిలాగే గంజన్నం, పచ్చడి మెతుకు లతో జీవన వ్యాపన చేస్తున్నాడు. కోటీశ్వరుడు కూడా అంతే. ఇంట్లో ఉన్న పప్పన్నమే పరమామృతం. కోరుకున్న వంటకాలకు సామగ్రి తెచ్చుకోవడానికి ఇంటినుంచి బయటికి వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. తప్పిదం జరిగితే అనుమానం పెనుభూతం అయినట్లే. 
అందరి స్వేచ్ఛలు అలాగే ఉన్నాయి. ఏ మాత్రం తారతమ్యం లేదు. జైలులో మగ్గుతున్న ఖైదీకి స్వాతంత్య్రం ఎంతవరకు ఉందో మిగతా వాళ్లకు వాళ్ల ఇళ్లల్లో అంతే వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. కాకపోతే ఖైదీలు కొంతవరకు మెరుగు. జైలు వంటవాడు చేసిన భోజనాలు చక్కగా వాళ్లకివ్వబడతాయి. మిగతావాళ్లు సొంతంగా వండుకోవాలి. కారణం, పనిమనుషుల్ని మానేశారు గదా. ఎందుకంటే, పనిమను షులు కూడా వాళ్లిళ్లలోనే ఉండాలి గనుక. వాళ్లు పనికి రాకపోయినా కొద్దికాలం నెలవారీ జీతం ముట్టజెప్పాల్సిందే. మంచిదే కదా.

ఏ ఇజమూ ఊహించని ఉపద్రవం
బ్రతుకు భయం మిన్నంటింది. బాలీవుడ్‌ నటీమణి అయినా, పొలాల్లో నాట్లు వేసే కూలీ అమ్మాయి అయినా కరోనా పెనుభూతానికి భయ పడక తప్పట్లేదు. సమాజంలో ఆర్థిక స్తంభన వల్ల నెలకొని ఉన్న సంక్షోభాన్ని పెట్టుబడిదారీ విధానం నిస్సహాయంగా చూస్తోంది. అదేవిధంగా కమ్యూనిజం కూడా. ఏ ప్రణాళికను చేసినా, కరోనాను దృష్టిలో పెట్టుకోవాల్సిందే. ఏ ఇజమూ ఇలాంటి దుర్భర పరిస్థితిని ముందుగా ఊహించలేకపోయింది. మనుషుల జ్ఞాపకశక్తి కూడా అంతంత మాత్రమే. అందుకే స్పానిష్‌ ఫ్లూ తాండవాన్ని నెమరువేసుకోలేక పోయారు. రాజరికాలు, ప్రజాస్వామ్యాలు పేరుకు మాత్రమే అన్నట్లుగా నిలిచాయి. ఓ ప్రక్క బ్రిటిష్‌ మహారాణి ఏకాంతవాసానికి పరిమితమయితే థాయ్‌లాండ్‌ రాజు తన దేశాన్ని వదలి విదేశాల్లో తలదాచుకుంటున్నాడు. 

ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యాలయిన ఇండియా, అమెరి కాలు విపరీత అవస్థల్లో ఇరుక్కుని ఉన్నాయి. ప్రజలకు తమతమ బ్రతుకులపై ప్రశ్న చిహ్నమైన అభద్రత, అనిశ్చితం లాంటి మనోభావనల్ని రూపుమాపేందుకు సామ్యవాదం పనికిరాకుండా పోయింది. ఇక మిశ్రమ ఆర్థిక విధాన సూత్రాలు అయితే నామ మాత్రమే. ఇప్పటివరకూ అణుశక్తి, పరమాణుశక్తి, అంతరిక్షయానం అని గొప్పలు చెప్పుకున్న దేశాల ప్రకటనలు కరోనా ముందు ఉత్తి ప్రగ ల్భాలుగానే మిగిలిపోయాయి. అధునాతన సమాజాలని చెప్పుకున్న ప్రజలు మనుగడ నృత్యాలకు విస్మయం చెందారు. డిజిటల్‌ విప్లవం పేరుగానే ఉండిపోయింది. అత్యంత ఆనంద దేశాలుగా పేరుగాంచిన ఐస్‌లాండ్, హాలెండ్‌ లాంటి దేశాలకు కూడా కరోనా ఒత్తిడితో ఆనందం దూరమైంది. రెండు రెండు దేశాల పౌరసత్వాలు కలిగిన వాళ్లు, ఏ దేశ పౌరసత్వమూ లేని స్టేట్‌లెస్‌ నిర్భాగ్యులు ఒకే దుస్థితిలోకి నెట్టబడ్డారు. పరువు ప్రతిష్టలు గల సమాజ పెద్దలు, బయటినుండి వచ్చి తలదాచుకున్న కాందిశీకులు సమాన పరిస్థితుల్లో అలమటిం చడం మామూలు అయింది. మతం, కులం, ప్రాంతం, వర్గం, భాష, సంస్కృతి అనే భేదాలు అగుపడటం ఆగిపోయాయి. 

మనిషి మళ్లీ వెనక్కి వచ్చేసినట్టేనా!
భౌతిక శాస్త్రజ్ఞుడు స్టీఫెన్‌ హాకింగ్‌ కలలుగన్న విలాసవంతపు విశ్రాంతి నేడు కానరాక, దాని స్థానంలో విధ్వంసకరమైన మానసిక వ్యథ చోటు చేసుకుంది. నోబెల్‌ బహుమతి గ్రహీత బెర్ట్రండ్‌ రస్సెల్‌ ‘పని ఎంత తగ్గితే మనిషికి అంత ఆనందం దొరుకుతుందని’ అన్నాడు. కానీ, అది ఒట్టి మాటే అని కరోనా రుజువు చేసింది. పనీపాటా లేక ఇంట్లో అట్టే కూర్చున్నా ఏదో ఆలోచన! ఏదో చింతన! ఏదో బాధ! మనిషి మళ్లీ మొదటికే వచ్చేశాడు. ఆదిమ మానవుడు ప్రకృతి వైపరీత్యానికి భయపడేవాడు. పర్యావరణంలోని ఉరుములు, మెరు పులకు వణికేవాడు. వన్య క్రూర మృగాల ధాటికి తట్టుకోలేక పోయేవాడు. ఇప్పుడు ఆ భయం మళ్లీ మనిషిని పీడిస్తోంది. ఇప్పుడు కలుషిత వాతావరణం ఆరోగ్యానికి ముప్పు అయితే, క్రూర మృగాలకు బదులుగా జీవికాని జీవి అయిన ఓ సూక్ష్మ వైరస్‌ పెనుముప్పులా తయారైంది. 

ఎప్పుడో ఓ అరవై ఏళ్ల క్రితం కర్ట్‌ వోనెగట్‌ అనే అమెరికన్‌ రచయిత రాసిన ‘హారిసన్‌ బెర్జెరోన్‌’ అనే కథను కరోనా నిజం చేసింది. ఆ కథలో భవిష్యత్‌ సమాజంలో ఓ ప్రభుత్వం చేసిన కొన్ని వింత చట్టాలవల్ల ప్రజలు ప్రతికూల సమానత అంటే నెగెటివ్‌ ఈక్వాలిటీ లోకి తోయబడుతారు. అదే మాదిరిగా కరోనా ధనిక, పేద– అందర్ని మానసికంగా అట్టడుగు స్థాయికి దించేసింది. దీని కంతటికీ తాను కారణం కాదని, మనిషి తనకు తాను చేసుకున్న తప్పిదాలే అసలు కారణమని కరోనా చాటి చెబుతోందా? ఏది ఏమైనా మనిషికి మైక్రోస్కోపు, టెలీ స్కోపు లాంటి దృష్టితో పాటు అంతకుమించిన అంతర్‌దృష్టి అంటే ఇన్‌సైట్‌ కావాలి. అది ఉంటే దూరదృష్టి ఉంటుంది. అప్పుడు వైరస్‌ గురించి ప్రపంచ దేశాలు ఇంత తేలిగ్గా తీసివేసిన పరిస్థితి సంభవించేది కాదు. ఇప్పుడైనా ముందు జాగ్రత్తలతో వ్యవహరిస్తే జరుగుతున్న సంక్షోభాన్నుంచి, రాబోయే సంక్షోభాల్నుంచి కూడా మనల్ని మనం సంరక్షించుకోవచ్చు. అతికొద్ది కాలంలో వైరస్‌ వ్యాక్సిన్‌ వస్తుంది. అంతవరకు డాక్టర్లు, శాస్త్రవేత్తలు చెప్పినట్లు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకుంటే ప్రశాంత జీవనం తిరిగి రావడానికి ఎంతో సమయం పట్టదు.


బండి మరియ కుమార్‌
వ్యాసకర్త రిటైర్డ్‌ డీజీపీ, మధ్యప్రదేశ్‌
మొబైల్‌ : 94258 24258 

మరిన్ని వార్తలు