సాయుధ పోరులో కోయబెబ్బులి

12 May, 2018 03:48 IST|Sakshi
సోయం గంగులు

కోయబెబ్బులిగా ప్రసిద్ధి చెందిన సోయం గంగులు నిజాం రాజ్యంలోని దట్టమైన పాల్వంచ (పాత తాలూక) అటవీ ప్రాంతంలో తిరుగులేని నాయకుడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం జమేదారు బంజర అనే కోయ గూడెంలో జన్మించాడు. గంగులు ఉద్యమ (రహస్య) జీవితం దశలుగా కన్పిస్తుంది. మొదటి దశలో నిజాం వ్యతిరేక పోరాటంలో గంగులు దళ నాయకుడిగా కీలక బాధ్యత వహిం చాడు. రెండవ దశలో పాల్వంచ అటవీ ప్రాంతాన్ని కమ్యూ నిస్టుల ముఖ్య స్థావరంగా మార్చడంలో కీలక భూమిక పోషించాడు. మూడవ దశలో యూనియన్‌ సైన్యాన్ని  ధిక్క రించి వీరోచితంగా పోరాడాడు.

గంగులు యవ్వనంలో వేలేర్‌పాడు మండలం పేరంటాల పల్లిలో బాలానందస్వామి అక్కడి కొండ రెడ్డి, కోయ జనులకు విద్యా బుద్ధులు నేర్పుతూ, తిండి గింజలు పంచి ఆదు కున్నాడని విన్నాడు. ఆయన అనుచరుడైన సింగ రాజు దళంలో చేరి కమాండర్‌గా ఎదిగిన గంగులు నాటి ఉద్యమంలోని సంఘటిత శక్తిని అంచనా వేశాడు. 1948 మార్చిలో పాల్వంచ ఏరియాలోని కమ్యూనిస్టు దళంలో చేరిపో యాడు. సీపీఐ పార్టీ లోని వివిధ కమి టీలతో గ్రామ కమిటీల నిర్మాణం చేశాడు. పార్టీలో సెంట్రల్‌ కమాండర్‌గా ఎదిగిన గంగులు గెరిల్లా దళాల నిర్మా ణంలో కీలక పాత్ర పోషించాడు.

సోయం గంగులును మట్టుబెడితే తప్ప పాల్వంచ అటవీ ప్రాంతాల్లో ఉద్యమాన్ని అణచ లేమని పెత్తందారులు భావించారు. ఆయనకు సమీప బంధువైన ఒక స్త్రీని కోవర్టుగా చేసి. ఆమె ఇచ్చిన జీలుగు కల్లు తాగిన మైకంలో స్పృహ కోల్పోయిన గంగులును సైన్యం బంధించి చిత్ర హింసలు పెట్టారు. పార్టీ రహస్యాలేమీ చెప్పని గంగులును రుద్రాక్షపల్లిలోని రావిచెట్టుకు కట్టేసి, 1951 మే 12న కాల్చిచంపి నిస్సిగ్గుగా ఎదురు కాల్పులుగా చిత్రీకరించారు.మహోజ్వల ఆదివాసీ సమాజాన్ని స్వప్నిం చిన మహా ఆదివాసీ యోధుడు సోయం గంగులు దొర పేరును భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పెట్టాలి.
(మే 12 సోయం గంగులు 66వ వర్ధంతి)
– వూకె రామకృష్ణ దొర, ఆదివాసీ రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షులు
మొబైల్‌ : 98660 73866

 

మరిన్ని వార్తలు