పోరాట దిగ్గజం భీమిరెడ్డి

9 May, 2020 00:59 IST|Sakshi

ఉమ్మడి నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండ లంలోని కర్విరాల కొత్తగూడెం గ్రామానికి చెందిన రామిరెడ్డి చుక్కమ్మల మలి సంతానంగా భీమిరెడ్డి నర్సింహా రెడ్డి (బీఎన్‌) 15.3.1922న జన్మించారు.  ఆకలికి అన్నంలేక సొమ్మసిల్లిన పాలేరును చూసి కలత చెందాడు. ఈ ఆకలికి మూలమెక్కడ అన్న ఆలోచనల్లోంచి ఆయన పోరాట ప్రస్తానం ప్రారం భమైంది. అది కాస్తా  వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా ఆ తర్వాత సాయుధ దళాలకు సారథ్యం వహించే దిశగా సాగింది. బండెనుక బండిగట్టి పదహారు బండ్లుగట్టి ఏ బండ్లె పోతావు కొడుకో నైజాము సర్కరోడ అంటూ కైకట్టి పాడుతూ దొరల తుపాకీ గుండుకు ఎదురొడ్డి ప్రాణాలు అర్పించిన బండి యాదగిరి బీఎన్‌ దళ సభ్యుడే. 

విసునూరు రామచంద్రారెడ్డి  కిరాయి గుండాలను ప్రతిఘటించిన పాలకుర్తి వీరనారి చాకలి ఐలమ్మకు..  ఖబడ్దార్‌.. కల్లాంలకు అడుగుబెడితే చంపుత కొడు కుల్లారా అని తెంపునిచ్చిందీ.. అచ్చుకట్టె ఆరుకాలం కష్టపడిన కౌల్దారి ఐలమ్మ ఇంటికి బువ్వ గింజల బస్తాలు భుజానేసుకెల్లిందీ బీఎన్‌ గుత్తపదళమే. కొడకండ్ల కేంద్రంగా పేద ప్రజల ధన మాన ప్రాణా లతో చెలగాటమాడుతున్న రజాకార్ల క్యాంపును దయం రాజిరెడ్డి బూర్లు అంజయ్య బీఎన్‌ దళాలు మూడు వైపుల నుండి వచ్చి పదిహేను మంది కర్కోటకులను హతమార్చారు. 

రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, దేవుల పల్లి ప్రోత్సాహంతో వితంతువైన సరోజినిని వివా హమాడి తన ఆదర్శాన్ని చాటుకున్నారు బీఎన్‌. పోరాటం తొలి నాళ్లలో ఆయన తొలి సంతానం అడ వులలో అరకొర ఆహారంతో, వైద్య సదుపాయం లేక మరణించాడు. ఒక సందర్భంలో ఎడమచేతిలో ఏడాది నిండిన కొడుకు మరో చేతిలో మర తుపా కీతో ఎల్లంపేట గుట్టమీద దట్టమైన పొదలమాటున ఉన్న బీఎన్‌ దంపతులపై రజాకార్లు మారణాయు ధాలతో చుట్టుముట్టారు. ఎడమచేతిలో ఉన్న బాబును బంతిలా విసిరెయ్యగా ఎంకటయ్య అనే సహచర యోధుడు అందుకొని పరుగు తీశాడు. మరో చేతిలో మర తుపాకీతో రజాకార్ల చక్ర బంధాన్ని ఛేదించుకొని ప్రాణా లతో బయటపడ్డాడు బీఎన్‌. 

బీఎన్‌ రెండుసార్లు ఎమ్మె ల్యేగా, మూడుసార్లు లోక్‌సభ సభ్యులుగా సేవలందించారు. నల్లగొండ జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా, రైతు సంఘం కేంద్ర రాష్ట్ర నాయకునిగా సేవలం దించారు. దళిత గిరిజన వెనుకబడిన తరగతుల వారు ఎల్లకాలం పల్లకీలు మోసే బోయీలు కాకూ డదంటూ వారు పాలకులుగా రాజ్యాధికారం పొందాలని సూర్యాపేటలో 1996లో లక్షలాది సమస్త కులాలను సమీకరించి సభ చేసి సామాజిక న్యాయం కోసం పరితపించిన నాయకుడు బీఎన్‌ 2008 ఏప్రిల్‌ 9న మరణించారు.
(నేడు భీమిరెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా)
– మల్లు కపోతం రెడ్డి 

మరిన్ని వార్తలు