ధీరోదాత్త మహానేత

1 Sep, 2019 01:01 IST|Sakshi

రేపు వైఎస్సార్‌ పదవ వర్ధంతి

మూర్తీభవించిన వ్యక్తి.. ధీరోదాత్తుడు.. మధ్యేమార్గం లేనటువంటి నాయ కుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి. సమోన్నతమైన ఆలోచనలు, తాత్విక చింతన కలిగిన వ్యక్తి. రాజకీయాల్లోకి రాకముందు నుంచే ప్రజలకు ఏదో చెయ్యాలనే తపనపడే మానవత్వం ఉన్న మనిషి. ఎంబీబీఎస్‌ అయిన వెంటనే పులివెందుల వాసులకు సేవ చెయ్యాలనే ఉద్దే శంతో కేవలం రూపాయితో వైద్యం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రిపేరున వైద్యశాలను ఆరంభించారు. గుల్బర్గాలో విద్యార్థి నాయకు  డిగా ఉన్నప్పటి నుంచి సహచరులు, అనుచరులకు వెన్నుదన్నుగా నిలిచిన వ్యక్తి. రాజకీయాల్లో అప్పటి వరకు ఎవరూ నలగనంతగా.. కష్టాలకు, నష్టా లకు నలిగినటువంటి మనిషి. 

తను ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రతిఘటించేవారు. ఆ సమయంలో పార్టీలో విమర్శలను లెక్కచెయ్యకుండా ధృడచిత్తంతో నడిచారు. కాంగ్రెస్‌ బతకదు, కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదు అన్నటువంటి ప్రతికూల రాజకీయ పరిస్థితుల్లో– చంద్రబాబును అందరూ పనిగట్టుకుని మూకుమ్మడిగా ఆకా శానికి ఎత్తుతున్నప్పుడు, తన అసమానమైన ప్రతిభతో మండుటెండల్లో... ప్రాణాలు, ఆరోగ్యాన్ని లెక్కచెయ్యకుండా... 1,475 కి.మీ సుదీర్ఘ పాద యాత్ర చేశారు. రోజుకు 23 కి.మీ పైగా నడిచి చరిత్రకెక్కారు వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారు. అప్పటివరకు పాదయాత్ర చేసినవారు  చాలామంది ఉన్నారు. కానీ 47, 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో పాదయాత్ర చేసిన మొట్ట మొదటి వ్యక్తి ఆయన. 

67 రోజుల పాద యాత్రలో... ప్రజా కంటకుల మీద వజ్రాయుధంగా మారిన వ్యక్తి రాజ శేఖరరెడ్డి గారు. ప్రజల కష్టనష్టాలను తెలుసుకోవటమే కాకుండా, ప్రజలకు శత్రువులుగా మారిన ప్రభుత్వాలపై ఏరకంగా తిరుగుబాటు చెయ్యవచ్చో ప్రజాస్వామ్యయుతంగా పాదయాత్ర ద్వారా నిరూపించారు. రాజమండ్రి వద్ద 50 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో చావుకు దగ్గరగా... మంచాన పడితే, హుటా హుటిన హెలికాప్టర్‌లో తరలించే ప్రయత్నం చేస్తే వారించారు. ప్రాణాలైనా పోగొట్టుకుంటానే కానీ, పాద యాత్రను మధ్యలో ఆపేది లేదని, ఆరోగ్యం కుదుటపడే వరకు అక్కడే ఉండి, పాదయాత్రను పూర్తిచేయటం వైఎస్‌లోని రాజకీయ ధృడ సంకల్పానికి నిదర్శనం. 

ఆనాడు రాష్ట్రానికి అతిసమీపంలో వచ్చినటువంటి సోనియా గాంధీ మాట వరసకు కూడా పలకరించకపోగా, నన్నడిగి పాదయాత్ర చేస్తున్నాడా? అని పరుషమైనటువంటి పదాలతో దూషించటం ఎవరూ మరచి పోలేరు. ఆనాడు వైఎస్‌ నాయకత్వం, ప్రతిభ, వ్యక్తిత్వాన్ని చూసి, ఆయన లోని క్రియాశీల ప్రజాపోరాట నేపథ్యాన్ని చూసి ఈ నాయకుని గొడుగుకింద రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలు ముక్త కంఠంతో భావించారు. కాంగ్రెస్‌ పార్టీకి కాకుండా వైఎస్‌కి ఓట్లు వెయ్యటం మూలంగానే కాంగ్రెస్‌ అధికారం లోకి వచ్చింది. ఆయనే లేకపోయి ఉంటే, కాంగ్రెస్‌కు పట్టుమని 15 సీట్లు కూడా వచ్చే అవకాశాలు లేవు.

దేశంలోనే మొట్టమొదటిసారిగా సీల్డ్‌ కవర్‌ ద్వారా కాకుండా, శాసన సభ్యులతో ఎన్నుకోబడిన మొదటి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి గారు. తన ఐదేళ్ల పాలనలో ప్రజలను కనుపాపల్లా చూసుకుంటూ, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏవి కావాలో అన్నీ సమకూరుస్తూ, ప్రపంచంలోనే ఆదర్శవంతమైన ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టడమే కాకుండా, వృ«థాగా పారు తున్న నదుల నీటితో రైతుల పాదాలను కడుగుతూ, పొలాల దాహాన్ని తీర్చటానికి మళ్లించిన భగీరధుడుగా వైఎస్‌ రాజశేఖరరెడ్డి చరిత్రలో నిలిచి పోయారు. ఇవి కేవలం మచ్చుకు కొన్ని మాత్రమే. 

దారిద్య్రరేఖకు దిగువ నున్న  కుటుంబాల పిల్లలు పైచదువులు చదివేందుకు వారి ఆర్థిక స్థితి సహ కరించే పరిస్థితి లేదని ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకొచ్చారు. దీంతో లక్షలాది మంది ఇంజనీర్లు, డాక్టర్లు, ఇతర ఉన్నతమైన చదువుల్లో పట్టభద్రులు కావటానికి ఆయన చేసిన ప్రయత్నం అనన్యసామాన్యం. అందుకే ఆయన మరణాన్ని తట్టుకోలేక 670 మందికిపైగా సామాన్యుల గుండెలు పగిలి  వైఎస్‌తో పాటు భగవంతునిలో లీనమయ్యారు. ప్రపంచ చరిత్రలో ఏ చక్రవర్తికి, రాజుకు, రాజకీయ నాయకునికి జరగనంత అంత్యక్రి యల కార్యక్రమం వైఎస్‌ విషయంలో జరిగింది. వైఎస్‌ మరణించిన రోజు గణేష్‌ నిమజ్జనం. అయినా రాష్ట్ర వ్యాప్తంగా నిమజ్జనాన్ని ఆపుకుని అందరూ వైఎస్‌ రాజశేఖర రెడ్డికి నివాళి అర్పించటం వారి అభిమానానికి మచ్చుతునక మాత్రమే. 

తన తండ్రి వ్యక్తిత్వాన్ని, పరిణతిని, రాజకీయాన్ని, ఒడిసిపట్టుకుని తన అన్న ప్రయోగించినటువంటి రాజకీయ బాణంగా వైఎస్‌ షర్మిలమ్మ 3వేల కి.మీ పైగా పాదయాత్ర చేశారు. తన అన్నపై అక్రమ కేసులు బనాయించి నందుకు, పరిపాలన విధ్వంసం చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నిలబడా ల్సిన  అవసరాన్ని అవస్యం స్వీకరించారు. తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మర ణీయమైన స్థానాన్ని అలంకరించిన మొదటి మహిళగా వైఎస్‌ షర్మిలమ్మ చరిత్రకెక్కారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అణువణువునా తండ్రి, తాతల వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. 

మానసిక  స్థైర్యం, «ధైర్యం, నిజాయతీ, నిర్భీతి పెట్టుబడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్‌మోహన్‌రెడ్డి తన తండ్రి మిగిల్చినటువంటి ఆశయాలను కొనసాగించటానికి నడుం బిగిం చారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన కుటుం బాలను పరా మర్శించేందుకు అనుమతి కూడా కాంగ్రెస్‌ అధిష్టానం ఇవ్వకపోతే హైందవ ధార్మిక సంస్కృతిలో చనిపోయిన వారి కుటుంబాలను వారి ఇంటికి వెళ్లి పరామర్శించటం ఒక భాగంగా భావించి, అధిష్టా నాన్ని ధిక్కరించి ప్రజల వద్దకు వెళ్లి కోట్లాది మంది తెలుగు వారి అభిమానాన్ని సంపాదించుకున్న అతి చిన్న వయస్కుడైన వ్యక్తిగా వైఎస్‌ జగన్‌ వినుతికెక్కారు. 38 ఏళ్లకే జగన్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. అది ఆయన వ్యక్తిత్వంవల్లే చెల్లింది. అటువంటి పరిస్థితుల్లో తనపై కుట్ర, కుతం త్రాలు, కుయుక్తులు, మోసాలు, నీచాలు, నైచ్యాలు అన్నీ ప్రయోగించి, తప్పుడు కేసులు బనాయించి, ప్రజలకు దూరం చేసే ప్రయత్నం చేశారు.

ఏడాదిన్నరపాటు జైలుకు పంపినా, వెన్ను చూపకుండా, వెనుదిరగకుండా బయటకు వచ్చిన వెంటనే ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టి పోరాటాల పురిటి బిడ్డగా మారిపోయారు. తన వ్యక్తిత్వాన్ని, రాజకీయ ఔన్న త్యాన్ని, నిష్కాపట్యాన్ని, మనసులోని నిర్భీ తిని, నిరంతరం ప్రత్యర్థులు హననం చేసే ప్రయత్నం చేసినా, అపవాదులు సృష్టించినా ఖాతరు చెయ్యలేదు. అసమానమైన సాహసంతో ప్రజా క్షేత్రాన్ని ఆయన నడిపిన తీరు ప్రపంచంలో మరెవ్వరికీ సాధ్యం కాదు అన్నంతగా ఆశ్చర్య చకితుల్ని చేశారు. తను ప్రతిపక్ష నాయకుడైన తరువాత ఐదేళ్ల పాటు చేసిన టువంటి వీరోచిత రాజకీయ కార్యలాపాల వలన దినదిన ప్రవర్థమానుడై, పాదయాత్ర సంకల్పించారు. 

చైనాలో మావో సే టుంగ్‌ కంటే మిన్నగా 3,648 కి.మీ సుదీర‡్ఘ పాదయాత్ర చేపట్టారు. ప్రజల కష్టాలు తెలుసుకుని, కన్నీళ్లు తుడుస్తూ, తానున్నాననే భరోసా కల్పిస్తూ... వారిలో నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించారు. వారి ప్రేమను అసమానంగా పొందారు. వెనుక ఎవరి రాజకీయ అండదండలు లేక పోయినా.. ఒక యువకుడు 50 శాతానికి పైగా ఓట్లు సాధించి, ముప్పాతికకుపైగా సీట్లు సంపాదించటం ప్రపంచ రాజకీయాల్లో ప్ర«థమం. దీనికి ప్రధానమైనటువంటిది వైఎస్‌ రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వమే. ఆయన వారసుడే ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

- భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే

మరిన్ని వార్తలు