బయోపిక్‌లకు సత్యమే పునాది

24 Jan, 2019 00:06 IST|Sakshi

విశ్లేషణ

ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని, పిల్లనిచ్చిన మామకు, మంత్రిపదవి కట్టబెట్టిన నాయకుడికి ద్రోహం చేసి సీఎం పీఠం నుంచి ఆయన్ని కూలదోసి తాను గద్దెనెక్కిన చంద్రబాబు వెన్నుపోటు చరిత్రను మాత్రమే వర్మ నేటి తరానికి చూపించదల్చుకుంటే ఆయన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ కోసం ఇంత కష్టపడవలసిన అవసరం లేదు. ఈ మాత్రం దానికైతే ‘‘జామాతా దశమగ్రహ’’ అనే ఎన్టీఆర్‌ క్యాసెట్‌ ఆధారంగా వర్మ ఒక పొలిటికల్‌ డాక్యుమెంట్‌ని నిర్మిస్తే సరిపోతుంది. చివరిదశలో ఎన్టీఆర్‌ ఉత్థాన పతనాలకు చెందిన వాస్తవాలను, కారకులైన వ్యక్తులను వాస్తవిక దృక్పథంతో చిత్రించడం అవసరం. బయోపిక్‌లకు వాస్తవాల చిత్రణే ప్రాతిపదిక.

ఇటీవల బయోపిక్స్‌ అంటూ వివిధ రంగాల్లో పేరుప్రతిష్టలు గల వారిని గురించి, వారి జీవి తాల్లో ప్రధాన ఘట్టానికి సంబంధించి చలనచిత్రాలు వచ్చాయి, వస్తున్నాయి. గాంధీ బయోగ్రఫీ ఆంగ్లంలో చాలా కాలం క్రితమే వచ్చింది. ఏ బయోగ్రఫీ కూడా పూర్తిగా చరిత్రగానే ఉండటం సాధ్యం కాదు. గాంధీ చిత్రం గాంధీజీ జీవితాన్ని, ఆయన దేశప్రజలకు చేసిన మేలు ఇచ్చిన సందేశాన్ని ప్రజలకు అందించాల్సిందే. కానీ నాటి అకుంఠిత దేశభక్తుడు భగత్‌సింగ్‌కు బ్రిటిష్‌ పాలకులు ఉరిశిక్ష విధిస్తే గాంధీజీ స్పందించలేదు. ఆ విషయం ప్రత్యేకించి గాంధీ చిత్రంలో లేదు. అలాగే దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు గాంధీజీ వ్యవహరించిన తీరు, జాతి వివక్షకు వ్యతిరేకంగా కాకుండా దాన్ని సమర్థించే రీతిలో ఉందని కూడా విమర్శ ఉంది. కానీ గాంధీ చిత్రంలో ఆ విషయం ప్రస్తావన లేదు. అయినా,  ఆ చిత్ర దర్శకుడు అటెన్‌బరో స్థూలంగా నిజాయితీగానే గాంధీజీని చిత్రీకరించాడనే చెబుతుంటాము.

మన ‘మహానటి’ సావిత్రి జీవిత చరిత్రను అందరూ ఆహ్వానిం చారు. ప్రధానంగా నాటి సావిత్రి, నటిగా తెలుగు ప్రజల ప్రేమాభిమానాలను ఎంతగా చూరగొన్నదో మనకు అర్థం అవుతుంది. కీర్తి నటన వలననే ఆ సినిమా గొప్ప విజయం సాధించిందని చెప్పలేము. ఆమె తన పరిధిలో తాను చక్కగా నటించారు తప్ప, మహానటి పట్ల ప్రజల్లో ఉన్న ఆరాధన, ఆత్మీయభావనలే ఆ చిత్ర విజయానికి ప్రధాన కారణం. ఆ చిత్రంపై కూడా జెమినీ గణేష్‌ పాత్రకు న్యాయం జరగలేదనీ, సావి త్రిపట్ల ఆ కుటుంబ సభ్యుల నిరాదరణను పక్కన బెట్టారన్న విమర్శలూ లేకపోలేదు. అయితే మహానటి సావిత్రి ప్రధానంగా ఒక నటిగానే జీవిం చారు. వ్యక్తిగతంగా ఆమె సద్గుణాలు ముఖ్యంగా ఆమె దాతృత్వ గుణం, వ్యక్తిత్వం వంటివి ఉన్నా ఆమెకు జయలలితలాగా ప్రముఖ రాజకీయ నాయకురాలుగా, సీఎం వంటి పదవులు అలంకరించిన పరిస్థితి లేదు. కనుక సావిత్రి చిత్రంపై చర్చకు తావులేదు. ఇకపోతే తన ప్రజారంజక పాలనతో తెలుగు ప్రజల హృదయాల్లో ముఖ్యంగా పేద, అణగారిన ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన దివంగత సీఎం వైఎస్సార్‌ రాజకీయ జీవితం ప్రధాన ఘట్టం ‘యాత్ర’ అన్నపేరుతో సినిమాగా వస్తోంది.

 ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మూడు తరాల ప్రేక్షకులకు ఆరాధనీయ మహానటుడు ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర సినిమాలుగా రానున్నాయి. ప్రథమ భాగం ఇప్పటికే విడుదలైంది కూడా. ఎన్టీఆర్‌ కేవలం సినిమా నటునిగానే మిగిలిపోతే, ఆయన జీవిత చరిత్రపై చిత్రం ఇంత చర్చనీయాంశం అయి ఉండేది కాదు. నటుడిగా, సంచలన రాజకీయ నేతగా ఆయన జీవిత చరిత్ర ప్రజలకు తెలిసిన చరిత్ర కూడా కనుక ఆ మహనీయుని జీవిత చరిత్ర వీలైనంత వాస్తవికంగా ఉండాలని, చరిత్ర కనుక చరిత్రగానే రాగద్వేషాలకు అతీతంగా నిర్మించాలని కోరుకోవడంలో అసహజం లేదు. అలాగే ఆయన జీవితంలో ఒక ప్రధాన భాగానికే పరిమితమైనప్పుడు కూడా నిజాయితీ చిత్రీకరణను ప్రజలందరూ ఆశిస్తారు.

ఎన్టీఆర్‌ తనయుడు, ప్రముఖ నటుడు బాలకృష్ణ, ఎన్టీఆర్‌ జీవితచరిత్రను రెండు భాగాలుగా ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ పేరిట నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ నటజీవితం, ఒక పల్లెటూరు నుండి వచ్చి ఆయన మహానటుడిగా ఎదగడానికి ఆయన ప్రదర్శించిన అకుంఠిత దీక్ష ఇవన్నీ ప్రజలను ఉత్తేజపరిచే అంశాలు. అలాగే ఆ చిత్రాల్లో ఎన్టీఆర్‌ అద్వితీయ జీవితం ప్రధానంగా ఉంటుంది. ఎన్టీఆర్‌ బయోపిక్‌ రెండోభాగం ప్రధానంగా ఆయన రాజకీయ జీవితానికి, ప్రజా ప్రస్థానానికి సంబంధించిందని అంటున్నారు. ఈ రెండో భాగంలో ఆయన జీవితం ప్రజలందరికీ తెరిచిన పుస్తకం. ఆయన ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీ కగా, ఆత్మగౌరవం గల తెలుగుజాతి ప్రతి ఒక్కరి ప్రతినిధిగా, ప్రజల మనసులు చూరగొన్నవాడు. నిజానికి, తెలుగుజాతిని కూడా, ద్రవిడ జాతితో కలిపి మద్రాసు వారిగానే ప్రపంచం చూస్తున్నప్పుడు, మన తెలుగువారి అస్తిత్వం నిలపడంలో ఎన్టీఆర్‌ ప్రధాన పాత్ర పోషించారు. 

ఆ మహనీయుని జీవిత చరమాంకంలో.. ఆయన రాజకీయ ఔన్నత్యం విశ్వవ్యాపితమవుతున్న దశలో, తన పార్టీని, తన పదవిని, చివరకి తాను స్థాపించిన పార్టీ పేరును కూడా పోగొట్టుకుని, సొంత అల్లుడు చంద్రబాబు కారణంగా, సొంత పార్టీ ఎంఎల్‌ఏలే చెప్పులు విసిరిన దుస్థితిలో ఎన్టీఆర్‌ ఘోర అవమానభారాన్ని మోయవలసి వచ్చింది. ఈ అంశాన్ని సైతం ‘మహానాయకుడు ఎన్టీఆర్‌’ చలన చిత్రంలో వాస్తవాలకు దగ్గరగా చరిత్రను వక్రీకరించకుండా చిత్రించాలని ఆశించడంలో అసహజం ఏమీ ఉండదు. ఎన్టీఆర్‌ జీవితాన్ని విషాదాంతం చేయడంలో, నాటి రాజకీయ పరిస్థితికి ప్రధాన కారకులు ఎవరు, ఏం చేశారు? అన్నది కూడా తెలుగు ప్రజలకు తెలియాలి. ఎన్టీఆర్‌ బయోపిక్‌లో ఎన్టీఆర్‌ పాత్రను పోషిస్తూ, తన తండ్రి పాత్రలో పరకాయప్రవేశం చేసి తండ్రి రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్న వారసుడు బాలకృష్ణ. ఎన్టీఆర్‌ బయోపిక్‌ రెండోభాగం ‘మహానాయకుడు’లో చరిత్రను వక్రీకరించకుండా వీలైనంతవరకు వాస్తవానికి దగ్గరగా నిర్మిస్తారని ఆశించలేము. 

మరోవైపున పరిచయం అక్కరలేని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. సంచలనాలకు మారుపేరుగా, విలక్షణ దర్శకుడిగా, వార్తల్లో ఉంటూ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ అనే పేరిట ఎన్టీఆర్‌ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించినప్పటినుంచి ఎన్టీఆర్‌ మరణం వరకు  ప్రధానమైన, ప్రత్యేకభాగాన్ని చలనచిత్రంగా రూపొందించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఒక పాట కూడా యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఎన్టీఆర్‌ తాను నమ్మిన వారిచేతే నమ్మకద్రోహానికీ, కుట్రకూ బలైన వాడిగా ఆ పాట ఉంది. ఆ పాట సందర్భంలో ఆనాటి చంద్రబాబు, అలాగే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తది తర కుటుంబ సభ్యులను, ఇతరులను ఎన్టీఆర్‌తో విడిగానూ ఉన్న వీడియో క్లిప్పింగులను కూడా జత చేశారు. దానితో నేటి తెలుగుదేశం పార్టీ, కార్యకర్తల నుంచి, నేతల నుంచి రామ్‌గోపాల్‌ వర్మపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ పాటలో చంద్రబాబును చూపించడంతో, ఆ కుట్రలకు చంద్రబాబే బాధ్యుడు అన్నట్లుందనీ, రాష్ట్రానికి సీఎంగా ఉంటున్న నేతను ఇలా చూపించడం, ఆయన్ని అవమానించడమేననీ, దీన్ని మేం సహించం అంటూ కొందరు వర్మపై స్థానిక పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టారు. వర్మ దిష్టిబొమ్మలు తగులబెట్టారు. ఇది చంద్రబాబు టీడీపీ వారి భుజాలు తడుముకునే  నైజానికి, నిజం బయటపడుతుందేమోనన్న భయానికి, ఆనాటి ఘటనపై ఉండిన తీవ్ర వైరుధ్యాలను గూర్చిన అవగాహన లేకపోవడానికి సంబంధించినదిగా నాకు తోచింది. అంతే కాదు. వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా విడుదలను ఆపడానికో,  ఆ సినిమా చూసేందుకు వెళ్లే ప్రేక్షకులను భయపెట్టడానికో ఇలా చేస్తున్నారని అనిపిస్తుంది. 

ఎవరేమనుకున్నా, ఏదో సినిమాలో అన్నట్లు ‘చరిత్రను చించేస్తే చిరిగిపోదు. చెరిపేస్తే చెరిగిపోదు’. కొంత కాలం చారిత్రక సత్యాన్ని తొక్కిపెట్టవచ్చు. లేదా వక్రీకరించవచ్చు. కానీ సత్యాన్ని సమాధి చేయలేరు. నిజానికి ప్రజలకు ఆనాటి చారిత్రక సత్యమేమిటో తెలియాలి. ఈ సందర్భంగా నాకొక విషయం గుర్తుకొస్తున్నది. ప్రముఖ కమ్యూనిస్టు పుచ్చలపల్లి సుందరయ్య నాటి వీర తెలంగాణ సాయుధ పోరాట రథసారథుల్లో ఒకరిగా ‘వీర తెలంగాణ విప్లవ రైతాంగ పోరాటం–గుణపాఠాలు’ అని రాసిన బృహత్‌ గ్రంథంలో ‘సీపీఎం వారి కంటే సీపీఐలో ఉన్న వారికే ఎక్కువగా పాత్ర కల్పించారు ఎందుకని’ అని నాటి సీపీఎం నాయకుడు లావు బాలగంగాధరరావు ప్రశ్నించారు. ‘నేను చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టాన్ని మాత్రమే రాస్తున్నాను.  ఆ ఘటనలో ఎవరెవరి పాత్ర ఏమిటి? ఈ రోజు వారు ఏ పార్టీలో ఉన్నారు? వారి ప్రస్తుత జీవితాన్ని బట్టి నాటి సాయుధ పోరాటంలో వారి పాత్రను విస్మరించలేను, వక్రీకరించలేను. ఒక చరిత్రకారునిగా అలాంటి పనిచేయరాదు. నాటి భౌతిక వాస్తవికతనే ప్రస్తావించాలి’ అని సుందరయ్య సమాధానమిచ్చారు. బయోపిక్‌ నిర్మించదలిచిన వారు ఎవరైనా దీన్ని గుర్తించుకోవాలి. 

ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని, పిల్లనిచ్చిన మామకు, మంత్రిపదవి కట్టబెట్టిన నాయకుడికి ద్రోహం చేసి సీఎం పీఠం నుంచి ఆయన్ని కూలదోసి తాను గద్దెనెక్కిన చంద్రబాబు వెన్నుపోటు చరిత్రను మాత్రమే వర్మ నేటి తరానికి చూపిం చదల్చుకుంటే ఆయన లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ కోసం ఇంత కష్టపడవలసిన అవసరం లేదు. ఈ మాత్రం దానికైతే ఎన్టీఆర్‌ సీఎం పదవి కోల్పోయిన తర్వాత సొంత అల్లుడు తనకు చేసిన నమ్మకద్రోహం గురించి తన గళంతో వెలువరించిన ‘‘జామాతా దశమగ్రహ’’ అనే క్యాసెట్‌ ఆధారంగా వర్మ తన వ్యాఖ్యానం జోడించి ఒక పొలిటికల్‌ డాక్యుమెంట్‌గా నిర్మిస్తే సరిపోతుంది. కేవలం ఈ దృష్టితో మాత్రమే కాకుండా తన మొదటి భార్య బసవతారకం మరణానంతరం, సంతానం ప్రేమాభిమానాలు కరువై ఒంటరిగా జీవిస్తున్న ఎన్టీఆర్‌ మానసిక పరిస్థితి, ఆ నేపథ్యంలో ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించాక ఎన్టీఆర్‌ మనస్థితిలో వచ్చిన సానుకూల మార్పు, పార్టీలోని పదవీవ్యామోహపరులు లక్ష్మీపార్వతికి అధికార దాహం ఆపాదించి అధికార దాహం తీర్చుకునేపనిలో సాగించిన ఘాతుకాలను, ఈ క్రమంలో దారుణంగా మారిన మానవ సంబంధాలను వర్మ చిత్రించదల్చుకున్నారేమో! చివరిదశలో ఎన్టీఆర్‌ ఉత్థాన పతనాలకు చెందిన వాస్తవాలను, కారకులైన వ్యక్తులను వాస్తవిక దృక్పథంతో చిత్రించడం ఈ బయోపిక్‌ల ద్వారా సాధ్యపడుతుందని ఆశిద్దాం. అలాంటప్పుడే ఎన్టీఆర్‌పై బయోపిక్‌ ప్రయత్నాలు ఆహ్వానించదగినవి. ‘చంద్రోదయం’ పేరుతో చంద్రబాబు బయోపిక్‌ కూడా తీయనున్నారని తాజావార్త. ఎవరైనా ‘చంద్రగ్రహణం’ అని మరో బయోపిక్‌ తీస్తే అదీ వివాదాస్పదం కావడం ఖాయమే!

వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్‌ : 98480 69720
డాక్టర్‌ ఏపీ విఠల్‌ 

మరిన్ని వార్తలు