గనుల రాజ్యంలో విజేతలెవరు?

12 May, 2018 02:27 IST|Sakshi

జాతిహితం

గనులకు ప్రసిద్ధి పొందిన బళ్లారిలో హోరాహోరి పోరు జరుగుతోంది. గతంలో సంచలనాలకు కారణమైన గాలి జనార్దన్‌రెడ్డి సోదరులిద్దరూ ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున రంగంలో ఉన్నారు. ఆయన తన ప్రాంతంలోని 23 సీట్లలో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారనే ఆశతో బీజేపీ ఉంది. రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం సీట్లలో ఇక్కడివి పదిశాతం ఉండడంతో జనార్దన్‌ రెడ్డి కీలక వ్యక్తిగా అవతరించారు. అన్నిచోట్లా కనిపించే అన్నదమ్ముల మధ్య ఉండే కీచులాటలు ఏ మాత్రం ఇక్కడ లేవు. ఒకప్పుడు నీళ్లు లేని ప్రాంతంలో ప్రస్తుతం ఎన్నికల జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఈ గనుల రాజ్యంలో విజేతలెవరు అన్నదే తేలవలసిన ప్రశ్న.

2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గోడల మీద రాతలు, పోస్టర్లుగాని వీధుల్లో బ్యానర్లు, జెండాలుగాని కనిపించడం లేదు.  అన్ని చోట్లా దర్శనమిచ్చే హోర్డింగులు, కటౌట్లు సైతం లేవు. దశాబ్దాల నా పాత్రికేయ వృత్తిలో నేను ఈ పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. అయితే, 2000 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి ఈశాన్య సరిహద్దులో ఆంధ్రప్రదేశ్‌కు అనుకుని ఉన్న బళ్లారి చేరుకోగానే పైన చెప్పినవన్నీ దర్శనమిచ్చాయి
సన్నని, అందమైన పక్కా రోడ్డు మొలకల మూరు గ్రామానికి దారితీస్తుంది.

అక్కడ పోలీసు చెక్‌పోస్ట్‌తోపాటు కేంద్ర పారామిలిటరీ దళాలు రోడ్డు మలుపు వద్ద గస్తీలో ఉన్నాయి. గ్రామంలోకి వెళ్లేవా రిపై కంటే లోపలి నుంచి వచ్చేవారిపైనే ఈ దళాలు ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. నీటి జాడ లేని ఈ దారిలో కొన్ని వందల మీటర్లు దాటాక ఆకుపచ్చని ఒయాసిస్‌ కనిపించింది. మిగతా ప్రాంతాల్లో లేని కానరాని హోర్డింగులు, కటౌట్లు అక్కడున్నాయి. తర్వాత బీజేపీ నేత బి.శ్రీరాములు భారీ కటౌట్‌ కనిపిస్తుంది. సీఎం సిద్ధరామయ్యపై బాదామిలో బీజేపీ అభ్యర్థిగా శ్రీరాములు పోటీచేస్తున్నారు.

విజేతలను నిర్ణయించే వారిపైనే కొండంత ఆశ
గతంలో సంచలనాలకు కారణమైన గాలి జనా ర్దన్‌రెడ్డి సోదరులిద్దరూ ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫున రంగంలో ఉన్నారు. జనార్దన్‌రెడ్డికి దశాబ్దాలుగా సన్ని హితుడు శ్రీరాములు. ఈ ఎన్నికల్లో బళ్లారి చక్రవర్తిగా ముద్రపడిన జనార్దన్‌ అందరి దృష్టిని ఆకర్షించడమే గాక ఎన్నికల్లో విజేతలను నిర్ణయించే స్థితిలో ఉన్నారు. దేశంలో ఏ ఇతర రాజకీయ నేతపై లేనన్ని కేసులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన తన ప్రాంతంలోని 23 సీట్లలో అత్యధిక స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారనే ఆశతో బీజేపీ ఉంది. రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం సీట్లలో ఇక్కడివి పదిశాతం ఉండడంతో ఆయన కీలక వ్యక్తిగా అవతరించారు.


ముగ్గురు గాలి సోదరుల్లో జనార్దన్‌ అందరి కన్నా చిన్నవాడు. ఆయన అన్నలు కరుణాకర్, సోమ శేఖర. కిందటి యడ్యూరప్ప మంత్రివర్గంలో ఇద్దరు రెడ్డి సోదరులు, శ్రీరాములు కీలక శాఖలతో (మౌలిక సదుపాయాలు, టూరిజం, ఆరోగ్యం, సంక్షేమం, రెవెన్యూ) కేబినెట్‌ మంత్రులుగా పనిచేశారు. గాలి కుటుంబం ఆధిపత్యంలో నడిచిన ‘బళ్లారి రిపబ్లిక్‌’ ప్రాంతంలో ఉన్న అసెంబ్లీ సీట్లకు తగ్గట్టుగా ఈ ముగ్గురు బళ్లారి మంత్రులు కేబినెట్‌లోని పది శాతం శాఖలు నిర్వహించారు. సోమశేఖరరెడ్డి కర్ణాటక పాల సహకార సమాఖ్య చైర్మన్‌గా పనిచేశారు. ముగ్గురు గాలి సోదరులు, శ్రీరాములు తమపై కేసుల విచా రణ సమయంలో జైలు జీవితం గడిపారు. బళ్లారి జిల్లాలోకి ప్రవేశించకూడదనే షరతుపై కోర్టు తనకు బెయిలు మంజూరు చేసింది. అందుకే ఆయన బళ్లారి సరిహద్దులోని మొలకమూరు గ్రామం నుంచి ఎన్ని కల ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు.

జిల్లాలోకి వెళ్లలేని జనార్దన్‌!
నేటి బళ్లారి పరిస్థితి గమనిస్తే హిందీ సినిమా షోలేలో జైలర్‌గా నటించిన ఆస్రాణీ డైలాగ్‌ ఒకటి గుర్తు కొస్తుంది. ‘‘హమారే ఆద్మీ చారోం తరఫ్‌ ఫయ్‌లే హుయే హై’ (మా మనుషులు ఈ ప్రాంతమంతా విస్తరించి డ్యూటీలో ఉన్నారు) అనే మాటలు అస్రాణీ నోట వినిపిస్తాయి ఈ సినిమాలో. జనార్దన్‌రెడ్డి కూడా ఇవే మాటలు చెబితే పరిస్థితికి అద్దం పడతాయి. ఆయన బళ్లారి వెళ్లలేరు. ఆయన మనుషులు, సోద రులు అందరూ అక్కడినుంచే పోటీ చేస్తున్నారు. అన్నదమ్ముల్లో పెద్దవాడైన సోమశేఖర బళ్లారి లోని సత్నాంపేట ప్రాంతంలో ఇంటింటి ప్రచారం చేస్తూ కనిపించారు.

అక్కడి ఓ చిన్న వీధిలో తమకు షెడ్యూల్డ్‌ కులం(ఎస్సీ)హోదా కావాలని కోరుతున్న జంగమ కులస్తులు గుమిగూడారు. ఆయన వెంటనే అందుకు అంగీకారం తెలిపారు. ఎవరీ జంగమలు (జంగాలు)? వారంతా లింగాయతులే. గురువులుగా పిలిచే పూజారి వర్గం కిందికి వారు వస్తారు. తమ కులంవారికి తమ మతం గురించి బోధించడమే వారి కుల వృత్తి. ఈ లెక్కన వారు పనిచేయకుండా భక్తుల దానధర్మాలపై ఆధారపడి జీవించాలి. ‘భిక్షాటనే’ తమ ఉపాధి మార్గం కాబట్టి తమను ఎస్సీల్లో చేర్చా లనేది వారి వాదన. అంటే, ఉన్నత కులంలోని మరింత ఉన్నత వర్గం తమను షెడ్యూల్డ్‌ కులంగా గుర్తించాలని కోరుకుంటోందని మనకు అర్థమౌ తోంది. లింగాయతులందరికీ మైనారిటీ మత హోదా ఇస్తానని సిద్దరామయ్య వాగ్దానం చేశారు. ఇలా చూస్తే కర్ణాటకలో నడుస్తున్నవి సంక్లిష్టమైనవి.

సోమశేఖరను ఆయనపైన, ఆయన సోదరుల పైన పెట్టిన మైనింగ్‌ కేసుల గురించి ప్రశ్నించగా, తాము అమాయకులమనీ, తమ ప్రత్యర్థులు, కాంగ్రెస్‌ కలిసి తమను వేధిస్తున్నారని జవాబిచ్చారు. అంతేగాక, అన్ని మైనింగ్‌ కార్యకలాపాలు నిలిపివేసి, తాజాగా గనులు వేలం వేయాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వునే ఆయన ప్రశ్నించారు. ఉద్యోగాలు కోల్పో యిన పది లక్షల మంది జనం రోడ్డున పడ్డారని ఆయన చెప్పారు. క్రిమినల్‌ కేసుల గురించి ప్రస్తా విస్తూ, ‘‘కోర్టులనే నిర్ణయించనీయమనండి. న్యాయమే గెలుస్తుంది. బళ్లారిలో అతిగా మైనింగ్‌ జరిగిందేగాని నేరపూరితంగా గనుల తవ్వకాలు జరగలేదు,’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

తర్వాత కుటుంబం గురించి అడుగుతూ, ఎవరు బాస్‌? ఎవరిది తుది నిర్ణయమని ప్రశ్నించగా, జనా ర్దనే అని ఆయన జవాబిచ్చారు. ఆయన అన్నద మ్ముల్లో చిన్నవాడు కదా! అని నేనడగ్గానే, ‘‘లేదు సార్‌. అతను అందరిలోనూ అత్యంత తెలివైనవాడు,’’ అంటూ చిన్న తమ్ముడిని పెద్దన్న పొగిడారు. అన్ని చోట్లా కనిపించే అన్నదమ్ముల మధ్య ఉండే కీచు లాటలు ఏ మాత్రం ఇక్కడ లేవు. పూర్వపు యడ్యూ రప్ప కేబినెట్‌లో కూడా రెడ్డి సోదరుల హవా నడిచిన రోజుల్లో జనార్దన్‌రెడ్డే కీలక శాఖలు నిర్వహించారు.

మైనింగ్‌ లెక్కలు వివరించిన జేడీఎస్‌ నేత!
గనుల తవ్వకాలకు సంబంధించిన ఆర్థికాంశాలు, మైనింగ్‌లో అక్రమాల గురించి తెలుసుకోవడానికి జేడీఎస్‌ అభ్యర్థి హోతూరు మహ్మద్‌ ఇక్బాల్‌తో గంట సేపు మాట్లాడాం. సౌమ్యుడేగాక ఉర్దూ మాట్లాడే ముస్లిం కుటుంబ పెద్ద అయిన ఇక్బాల్‌కు మూడు పెద్ద గనులున్నాయి. 2000 సంవత్సరం వరకూ ఇక్కడ మైనింగ్‌లో సమస్యలుగాని భారీ లాభాలు గాని లేవు. అంతకు ముందు టన్ను ఇనుప ఖనిజం తవ్వకానికి రూ.150 ఖర్చయితే, రూ. 250కి అమ్మే వారు. ప్రభుత్వానికి రాయల్టీ కింద రూ.16.50 చెల్లించేవారు. అంటే ఇది తక్కువ లాభాలున్న వ్యాపారం. అదీగాక బళ్లారి ఇనుప ఖనిజం నాణ్యత కూడా బాగా తక్కువ. అమ్మడం కష్టంగా ఉండేది. చైనా నుంచి దీనికి డిమాండ్‌ అమాంతంగా పెరిగి పోయింది.

టన్ను ధర 600 నుంచి 1,000 వరకూ పెరిగి, తర్వాత కొద్ది రోజులకే రూ.6 వేలకు చేర డంతో గనుల యజమానులు సంపన్నులయ్యారు. చట్టవ్యతిరేకంగా తవ్వకాలతోపాటు నల్లధనం పెరిగిపోయింది. అప్పటి నుంచి గనుల తవ్వకాలు జరిపే కంపెనీల యజమానుల జీవనశైలి మారిపో యింది. మాఫియా పాలన మొదలైంది. ఫలితంగా తవ్వకాలపై విధించిన పూర్తి నిషేధం, తాజా వేలం పాటలు సహేతుకమైనవి కావని ఇక్బాల్‌ చెప్పారు. ఇనుప, మాంగనీస్‌ ఖనిజాలు ఇక్కడ దొరకడం ప్రజ లకు చివరకు శాపంగా మారింది. మైనింగ్‌పై పూర్తి నిషేధం విధించే వరకూ అందరూ ఎవరి శక్తిని బటì ్ట వారు ఉచితంగా ఖనిజాన్ని తవ్వుకునేవారు. గతంలో మైనింగ్‌ పర్మిట్లు ఉన్నవారు తమ పరిధి చుట్టుపక్కల కూడా తవ్వకాలు జరిపి అమ్ముకునేవారు. మీకు బల ముంటే మీ పొరుగువారి గనులను కూడా తవ్వుకోవ చ్చనే రీతిలో అక్రమ తవ్వకాలు సాగాయి.  

యడ్దీపై గాలి సోదరుల తిరుగబాటు!
లోకాయుక్త నివేదిక ఆధారంగా యడ్యూరప్ప సర్కారు చర్యలు తీసుకోవడంతో గాలి సోదరులు తిరుగుబాటు చేశారు. ఫలితంగా బీజేపీ సర్కారు సంక్షోభంలో చిక్కుకుంది. బళ్లారిలో లెక్కలకు కూడా అందనంత స్థాయిలో వచ్చి పడిన సొమ్ము నేరాలకు, ఊహకందని విపరీత జీవనశైలికి కారణమైంది. వెను కబడిన పేద ప్రాంతమైన బళ్లారి గనుల యజమాను లకు విలాసవంతమైన కార్లు, ప్రైవేటు విమానాలు, హెలికాప్లర్లు సొంతమయ్యాయి. కాని, ఇప్పుడు అంతటి విలాసాలు, ఆర్భాటాలు కనిపించడం లేదు.

కాంగ్రెస్‌ అభ్యర్థి అనిల్‌ లాడ్‌ గతంలో తనకున్న రెండు హెలికాప్టర్లను ఇప్పుడు అమ్మేశారు. 20 టన్నుల కెపాసీటీ లారీలు 50 టన్నుల ఇనుప ఖనిజం లోడుతో రోడ్లపై పోతుంటే కార్ల డ్రైవింగ్‌ కష్టం కాబట్టే హెలికాప్లర్లలో తిరిగామని ఆయన వివరిం చారు. బళ్లారిలో ముగ్గురు అభ్యర్థులూ గతంలో గనుల యజమానులే. జేడీఎస్‌ అభ్యర్థి తన మూడిం టిలో రెండు మైన్లు కోల్పోగా, కాంగ్రెస్‌ అభ్యర్థి తాను తవ్వకాలు జరిపిన గనులన్నిటినీ పోగొట్టుకున్నారు. ఎన్నికల ఫలితం వల్ల తమకు మళ్లీ మంచి రోజులొ స్తాయని అభ్యర్థులు ఆశిస్తున్నారు. ప్రపంచ మార్కె ట్‌లో ఖనిజాల ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.
వ్యాసకర్త: శేఖర్‌ గుప్తా, దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌

twitter@shekargupta

మరిన్ని వార్తలు