పౌరసత్వ చట్టానికి వక్రభాష్యాలేల?

7 Jan, 2020 00:46 IST|Sakshi

సందర్భం

దేశంలోని పలు ప్రాంతాల్లో పౌర సత్వ సవరణ చట్టం 2019కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇందులో పాల్గొం టున్న వారిలో అత్యధికులు యువతీయువకులే. నెహ్రూ–లియాకత్‌ ఒప్పందం గురించి, పాకిస్తాన్‌ మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రి జోగేంద్రనాథ్‌ మండల్‌ గురించి, అబ్దుల్‌ హక్‌ అలియాస్‌ మియాన్‌ మిథు గురించి, ఆసియా బీబీ గురించి, రవీనా–రీనా గురించి ఈ ఆందోళనలు చేస్తున్న వారిలో ఎంత మందికి తెలుసు? ఎంత తెలుసు? గత నెల 13న అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీలో శుక్రవారం ప్రార్థనల అనంతరం విద్యార్థులంతా మూకుమ్మడిగా రోడ్లపైకి రావడంతో ఆందోళనలు చెలరేగాయి. విద్యార్థులతో పాటు యూనివర్సిటీ ప్రొఫెసర్లు సైతం ర్యాలీ చేశారు. ఈ ఒక్క సంఘటనను బట్టే ఈ ఆందోళనలన్నీ ఎలా మొదలవుతున్నాయో, ఈ ఆందోళనల్లో పాల్గొంటున్న వారిని ఎవరు రెచ్చగొడుతున్నారో తెలుసుకోవచ్చు. ఏదో జరిగిపోతోందని భ్రమిస్తున్న కొందరు ఇంకేదో జరిగిపోవచ్చు అని మరింతమందిని ఉసిగొల్పుతున్నారు. దురదృష్టం ఏమిటంటే.. అసలు ఏం జరుగుతోందన్న విషయం ఎవరికీ స్పష్టంగా తెలియకపోవడం. 

పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ దేశాలు ముస్లిం మత దేశాలు. మతమే ఆ దేశాల రాజకీయాలను, రాజ్యాంగ వ్యవస్థలను శాసిస్తుంది. ఆయా దేశాల్లో ముస్లింలు కాని ఇతర మతస్తులపైన మతం మార్చుకోవాలన్న డిమాండ్లు, మైనార్టీ మతం కావటం వల్ల సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో అలా మతపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న మైనార్టీలు భారతదేశంలోకి వచ్చి, ఆశ్రయం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఇది ముస్లిం వ్యతిరేక చట్టం అని చాలామంది అంటున్నారు. అసలు ఈ చట్టంతో భారతీయ ముస్లింలకు కానీ, మరే ఇతర మతస్తులకు కానీ ఎలాంటి సంబంధం లేదు. ఈ చట్టం మూడు పొరుగు దేశాల్లోని వారికి మేలు చేసేందుకు ఉద్దేశించిన చట్టం. 

ఇక, ఆ మూడు దేశాలకు మాత్రమే ఈ చట్టాన్ని ఎందుకు పరిమితం చేశారు? పక్కనే ఉన్న మయన్మార్, నేపాల్, భూటాన్, శ్రీలంక మొదలైన దేశాలకు కూడా దీన్ని వర్తింపచేయొచ్చు కదా? అని కొందరు అంటున్నారు. నిజమే. ఏ దేశానికైనా దీన్ని వర్తింపచేయొచ్చు. అయితే, తొలుత అంగీకరించాల్సిన వాస్తవం ఏమిటంటే.. ఈ చట్టంలో ఎలాంటి తప్పూ లేదు, కాకపోతే దీని పరిధిని విస్తరించి ఉంటే బాగుండేది అని. వాస్తవానికి ఏ దేశం నుంచి అయినా ఎవరైనా శరణార్థిగా భారత్‌కు రావొచ్చు. వారివారి అర్హతలను బట్టి భారతీయ పౌరసత్వం పొంద వచ్చు. మతపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న ఈ మూడు దేశాల మైనార్టీలకూ చారిత్రక నేపథ్యంలో, గతంలో జరిగిన తప్పుల్ని సరిదిద్దే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇక శ్రీలంక హిందువులు మతపరమైన ఒత్తిళ్లను ఎదుర్కోవడం లేదు. వారిది జాతుల సంఘర్షణ. మయన్మార్‌లో హిందువులను కూడా ఊచకోత కోస్తున్నారు. వారికి కూడా ఈ చట్ట ప్రకారం మేలు చేసి ఉండా ల్సింది. అయితే, దీని పరిధిని విస్తరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడంలో తప్పులేదు.  
ఈ చట్టాన్ని అమలు చేసేది లేదని పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ మొదలైన కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెబుతున్నారు. నిజానికి పౌరసత్వం అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం. అందులో రాష్ట్రాలకు ఎలాంటి సంబంధం లేదు. పౌరసత్వం ఇవ్వాలన్నా, తొలగించాలన్నా కేంద్ర ప్రభుత్వమే చేయాలి. ఈ చట్టం అమలు చేసేది కూడా కేంద్ర ప్రభుత్వమే. మరి రాష్ట్రాలు దీన్ని ఎలా తిరస్కరిస్తాయి?   

అబ్దుల్‌ హక్‌ అలియాస్‌ మియాన్‌ మిథు పాకిస్తాన్‌లో ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు అత్యంత సన్నిహితుడు. పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీ సభ్యుడిగా కూడా పనిచేశాడు. గత పదేళ్ల కాలంలో ఇతను చేసిన, చేస్తున్న అకృత్యాలు అన్నీ ఇన్నీ కావు. సింధ్‌ ప్రావిన్సులో హిందూ బాలికల్ని కిడ్నాప్‌ చేయడం, బలవంతంగా మతం మార్చడం, నిండా 18 ఏళ్లు లేని ఆ అమ్మాయిల్ని కాటికి కాళ్లు చాచిన ముస్లిం వృద్ధులకిచ్చి పెళ్లిళ్లు చేయడం.. ఇతని దురాగతాలపై మీడియా కానీ, ప్రపంచం కానీ దృష్టి సారించడంలేదు. సరిగ్గా పదేళ్ల కిందట పంజాబ్‌ ప్రావిన్సులో ఆసియా నౌరీన్‌ అనే ఒక క్రిస్టియన్‌ మహిళ మత ప్రవక్తను కించపర్చిందంటూ తప్పుడు కేసు పెట్టారు. ఈ కేసులో ఆమెకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. పంజాబ్‌ గవర్నర్‌ సహా చాలామంది ఈ కేసు తప్పుడు కేసు అంటూ ఆసియా బీబీకి మద్దతుగా నిలిచారు. దాదాపు దశాబ్దకాలంపాటు ఆసియా బీబీ న్యాయ పోరాటం చేసింది. చివరికి సుప్రీంకోర్టు ఆమె ఉరిశిక్షను రద్దు చేసింది.  సింధ్‌ ప్రావిన్సులో రవీనా–రీనా హిందూ అమ్మాయిలు అకస్మాత్తుగా కనిపించకుండా పోయారు. కొన్ని రోజుల తర్వాత ముస్లిం మతంలోకి మారి, ముస్లింలను పెళ్లి చేసుకున్నారు. మతం మారిన తరువాత వాళ్ల కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లే స్వేచ్ఛ లేదు. ఇలాంటి బాధితుల కోసం చేసిన చట్టాన్ని స్వాగతించాల్సిందిపోయి  రాజకీయం చేయడం ఎవరికోసమో? 

1950 ఏప్రిల్‌ 8న నెహ్రూ–లియాకత్‌ ఒప్పందం మేరకు భారతీయ ముస్లింలకు, ఇతర మైనారిటీ మతస్థులకు సంపూర్ణ స్వేచ్ఛ, ఇతర హక్కులను రాజ్యాంగంలోనే పొందుపర్చామని నాటి భారత్‌ ప్రధాని నెహ్రూ పేర్కొనగా పాకిస్తాన్‌ రాజ్యాంగంలో ఇలాంటి హక్కులు అక్కడి మైనారిటీలకు ఇవ్వలేదని పలువురు చేసిన వాదనలను నెహ్రూ పట్టించుకోకుండా పాక్‌ లోని మైనారిటీ మతస్తులకు తీరని అన్యాయం చేశారు. ఈ తప్పును 70 ఏళ్ల కిందటే గుర్తించిన శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించినా నెహ్రూ వినకపోవడంతో ముఖర్జీ తన మంత్రిపదవికి రాజీనామా ఇచ్చారు.

ఈ పరిస్థితుల్లో జోగేంద్రనాథ్‌ మండల్‌లాగే బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు వలస వచ్చిన మహా నాయకులే ఎలాంటి గుర్తింపు లేకుండా చనిపోవాల్సి వచ్చింది. కానీ, ఆ దేశం నుంచి వచ్చిన ముస్లింలను మాత్రం కాంగ్రెస్‌ పార్టీ తన ఓటు బ్యాంకుగా మార్చుకుంది. ఇప్పుడు మమతా బెనర్జీ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. చారిత్రక అన్యా యాన్ని సరిదిద్దటానికి బీజేపీ ప్రయత్నిస్తే దీన్ని అక్రమం, అన్యాయం అంటూ గోల చేస్తున్నారు. స్వార్థ రాజకీయాల కోసం కాకుండా దేశ హితం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీయే అని ప్రజలు నమ్ముతున్నారు. చరిత్రాత్మక చట్టాలతో, చర్యలతో నరేంద్ర మోదీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు.


పురిఘళ్ల రఘురాం
వ్యాసకర్త బీజేపీ సమన్వయకర్త, అధికార ప్రతినిధి
ఈ–మెయిల్‌ : raghuram.bjp@gmail.com

మరిన్ని వార్తలు