మీ రాతలు విద్వేషపూరితం కావా?

7 Jul, 2020 01:23 IST|Sakshi

అభిప్రాయం

అమెరికాలో నల్లజాతీయులపై వివక్ష, ఇక్కడ ముస్లి ముల పట్ల వివక్ష ఒక్కటే అని చూపించడం లోనే రచయితల దురుద్దేశం స్పష్టమవుతోంది. హిందూ ముస్లిముల మధ్య గీత గీసి, ఇద్దరూ వేర్వేరు అని చూపించి మతచిచ్చు రగల్చాలనే కుయుక్తులను కుహనా లౌకికవాదులు ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు.

కొంతమంది ఉగ్రవాదులు, మరి కొంతమంది అతివాదుల (పర్వె ర్టెడ్‌)ను మినహాయిస్తే, హిందూ– ముస్లిం మత సామరస్యానికి ప్రతీక భారతదేశం. గణేశ్‌ శోభాయాత్రలో ముస్లిములు పాలుపంచుకుంటారు. రంజాన్‌ రోజు ముస్లిముల ఖీర్‌ను హిందువులు ఆస్వాదిస్తారు. మసీ దులు, దర్గాలకు హిందువులు వెళ తారు. హిందూ దేవాలయాలను ముస్లిములు సందర్శి స్తారు. హిందూ ముస్లిం అనే కాదు; క్రైస్తవులు, సిక్కులు, జైనులు... ఇలా అందరి మధ్య మత సామరస్యం నెలకొన్నది ఒక్క భారతదేశంలోనే. ఇటువంటి సామరస్య భారతంలో మతచిచ్చు రగిలించి, చలి కాచుకోవాలనుకునే నైచ్యం, పైత్యం కొంతమంది కుహనా మేధావులది. అటువంటి రాత లను రాజ్యసభ మాజీ ఎంపీ హుస్సేన్‌ దల్వాయి, జిందాల్‌ గ్లోబల్‌ లా స్కూలు ప్రొఫెసర్‌ సమీనా దల్వాయి ‘ముస్లింల ప్రాణాలు విలువైనవి కావా?’ పేరిట వండి వార్చారు.

అమెరికాలో జార్జి ఫ్లాయిడ్‌ హత్య తర్వాత వెల్లువెత్తిన నిరసన వంటిది భారతదేశంలో రావాలని వీళ్లు ఆకాంక్షిస్తు న్నారు. ఇందుకు భారతీయ మెజారిటీ వర్గాలు, ప్రభుత్వాలు నడుం కట్టాలని కూడా కోరుకున్నారు. ఇందుకు కారణం లేక పోలేదు. తమిళనాడులో లాకప్‌ డెత్‌ ఘటన అమెరికాలోని జార్జి ఫ్లాయిడ్‌ కేసును తలపిస్తోందనీ, జార్జి హత్యకు వ్యతి రేకంగా అమెరికాలో మొదలైన ఉద్యమం వంటిది భారత్‌లో కనిపించదేమనీ విద్వేషం రగిలించడానికి ప్రయత్నించారు. తమ అవగాహనా రాహిత్యాన్ని, మనసులోని విషాన్ని బయటపెట్టుకున్నారు. కానీ, తమిళనాడు ఘటనలో చని పోయిన తండ్రీకొడుకులు ముస్లిములు కారు. 

ఇక, పోలీసుల క్రూరత్వం అనేది ఇప్పుడే మొదలు కాదు. ఇది కొన్ని దశా బ్దాలుగా చర్చల్లో ఉంది. ముస్లిములు మాత్రమే కాదు, అన్ని వర్గాల వారూ కొంతమంది పోలీసుల దుశ్చేష్టలకు బాధి తులే. అందుకే, పోలీసు శాఖలో సంస్కరణలు అనేవి నిరం తర ప్రక్రియగా సాగుతున్నాయి. కొంతమంది వ్యక్తిగత నిర్లక్ష్యం, బాధ్యతా రాహిత్యానికి దేశాన్నో మతాన్నో వర్గాన్నో శత్రువుగా చేయడం అత్యంత ఆక్షేపణీయం. ఈ ఘటనకు నిరసనగా అమెరికా తరహాలో దేశంలోనూ ఉద్యమం రావా లని పిలుపునివ్వడం నిస్సందేహంగా దేశద్రోహమే. 

అమెరికా నల్లజాతీయులపై వివక్ష, ఇక్కడ ముస్లిముల పట్ల వివక్ష ఒక్కటే అని చూపించడంలోనే రచయితల దురు ద్దేశం స్పష్టమవుతోంది. హిందూముస్లిముల మధ్య గీత గీసి, ఇద్దరూ వేర్వేరు అని చూపించి మతచిచ్చు రగల్చాలనే కుయుక్తులను కుహనా లౌకికవాదులు, కుహనా మేధావులు, అర్బన్‌ నక్సల్స్, కాంగ్రెస్‌ వాదులు ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు. షాహీన్‌బాగ్‌ పేరిట ఇటువంటి ప్రయత్నాన్ని ముమ్మరంగానే చేశారు. కానీ, చివరికి ఓడిపోయారు. ఇటు వంటి ప్రయత్నంలో భాగమే తాజా వ్యాసం కూడా. ఇందు లోనూ శూన్యం నుంచి అగ్గి రగల్చాలనే కుట్ర చేశారు. దేశ విభజనకు ముందు ప్రారంభమైన హిందూముస్లిం ఘర్ష ణకు కారణమెవరో ఈ కుహనా మేధావులే తేల్చాలి. ఆ తర్వాత ఏడు దశాబ్దాలుగా కొనసాగడానికి కారణమెవరో కూడా గుర్తించాలి. అంతే తప్ప, మొత్తం చరిత్రకు వక్ర భాష్యం చెప్పి వాస్తవాల వక్రీకరణకు పూనుకోవడం నిస్సం దేహంగా ఆక్షేపణీయమే.

 అంతేనా, రచయితల అవగాహన రాహిత్యానికి కూడా ఈ కథనం అద్దం పడుతోంది. నాయ కత్వపరంగా పోలీసు బాసులు బాధ్యత వహించేలా చేసే వ్యవస్థ భారతదేశంలో లేదని ఇద్దరు మేధావులూ పేర్కొ న్నారు. సామాన్యులు పోలీసు అధికారిపై దావా వేయడానికి చట్టం అనుమతించడం లేదని రాశారు. వారిపై చార్జిషీటు ఉండదనీ, ప్రభుత్వమే ప్రాసిక్యూట్‌ చేసినా అది బల హీనంగా ఉంటుందనీ పేర్కొన్నారు. ఇంతకుమించిన హాస్యాస్పద వాదన మరొకటి ఉండదు. ఇటువంటి ఘట నలు జరిగిన దాదాపు ప్రతి సందర్భంలోనూ బాధ్యులపై చర్యలు ఉంటూనే ఉన్నాయి. కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. శిక్షలు కూడా పడుతున్నాయి. 

ఎటువంటి రాజకీయ, మత కల్లోలాలకు అవకాశం లేకుండా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలూ గత ఆరేళ్లుగా సుఖసంతోషాలతో కలసిమెలసి జీవిస్తున్నారు. చరిత్రను తిరగరాస్తూ ఐదేళ్ల కిందటి ఎన్నికల ఫలితాలతో పోలిస్తే మరింత మెరుగైన ఫలితాలను 2019లో బీజేపీ సాధించింది. బీజేపీ సొంతంగా 303 సీట్లను సాధిస్తే ఎన్డీయే 353 సీట్లను సాధించింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో అయితే 62 సీట్లను సాధించింది. ముస్లిములు సహా అన్ని వర్గాల ప్రజలూ మోదీ నాయకత్వాన్ని ఆదరించడమే ఇందుకు కారణం. ‘సబ్‌ కా సాత్, సబ్‌ కా వికాస్‌’ నినా దంతో 2014 ఎన్నికల్లో ఢిల్లీ పీఠాన్ని దక్కించుకున్న మోదీ దేశ ప్రజలందరిలో విశ్వాసం కల్పించడమే ధ్యేయంగా ‘సబ్‌ కా విశ్వాస్‌’ను 2019 ఎన్నికల సమయంలో జోడించారు.  

మోదీ మానస పుత్రిక ముద్ర రుణాల పథకంతో లబ్ధి పొందిన ముస్లిములు, ఇతర వర్గాలు ఎందరో. ఉజ్వల వంటి పథకాలను అందిపుచ్చుకున్నవారు ఎందరో. అంతేనా, ముస్లిం మహిళల మెడపై ఎప్పుడూ తలాక్‌ అనే కత్తి వేలాడుతూ ఉండేది. భర్త ఎప్పుడు వదిలేస్తాడో, తన బతుకు ఏమిటో అనే అయోమయం నెలకొనేది. కానీ, ముస్లిం మహిళల రక్షణకు ప్రధాని మోదీ ట్రిపుల్‌ తలాక్‌ చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు ఎంతోమంది ముస్లిముల జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇది ముస్లిములకు వ్యతిరేకంగా రాజ్యం పని చేయడం అవుతుందా? హజ్‌ కోటా సంఖ్యను రెండు లక్షలకు పెంచారు. సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, బహ్రెయిన్‌ వంటి దేశాల్లోని జైళ్లలో మగ్గు తున్న ఎంతోమందిని తిరిగి స్వదేశానికి రప్పించారు. 

ఏకంగా 5 కోట్లమంది ముస్లిం విద్యార్థులకు వర్తించేలా ప్రత్యేక స్కాలర్‌షిప్‌ పథకాన్ని మోదీ అమలు చేస్తున్నారు. వీటి లోనూ 50 శాతం ముస్లిం మహిళలకు కేటాయించారు. ఇది ముస్లింలకు వ్యతిరేకమా? జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్‌ 370ని నిర్వీర్యం చేశారు. తద్వారా, దేశంలోని ఇతర ప్రాంతాల్లోని ప్రజలు పొందే ప్రయోజనాలను కూడా జమ్మూ కశ్మీర్‌లోని బీద ముస్లింలు పొందడానికి అవకాశం దక్కింది. ఇది వేర్పాటువాదానికి మద్దతు ఇవ్వడమా? దేశం లోని ముస్లింలలోనూ, పాకిస్తాన్‌ మినహా ప్రపంచంలోని ముస్లిం దేశాలలోనూ మోదీ పాలన పట్ల విశ్వాసం వ్యక్తమవు తోంది. 

దీనిని జీర్ణించుకోలేని కొంతమంది కుహనా లౌకిక వాదులు మోకాలికి, బోడిగుండుకు ముడి వేసినట్లు, ముస్లిం వ్యతిరేక భావన తీసుకొచ్చి జాతి విద్వేషానికి ఆజ్యం పోసి చలి కాచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ప్రజల మధ్య విద్వేషాలు ఉంటే వాటిని ఎలా తగ్గించాలని మేధా వులు అనుకునేవాళ్లు ప్రయత్నించాలి. అంతే తప్పితే, విద్వేషాలకు ఏమాత్రం ఆస్కారం లేనిచోట్ల వాటిని ఎగదోసి కృత్రిమంగా పురిగొల్పే ప్రయత్నాలు చేయడం నిర్ద్వంద్వంగా ఖండనార్హమే.

వ్యాసకర్త: ఎన్‌. రామచంద్రరావు,
బీజేపీ ఎమ్మెల్సీ, తెలంగాణ

మరిన్ని వార్తలు