అంబేడ్కర్‌పై ఆకస్మిక ప్రేమ!

10 Apr, 2018 01:07 IST|Sakshi

రెండో మాట

మ అవసరాలు తొందర చేస్తున్నందున.. అంబేడ్కర్‌ పైన, ఆయన ‘మార్గం’పైన ఇప్పుడు మోదీ ఆలస్యంగానైనా అంత ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారు. కానీ అదే అంబేడ్కర్‌ ప్రధాన సంధాన కర్తగా, నిర్మాతగా రూపొందించిన రాజ్యాంగాన్ని మార్చాలన్న తలంపు బీజేపీ ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో ప్రజలు తెలుసుకోగోరుతున్నారు. ఒకవైపున ప్రగతిశీల ఉద్యమకారులను, హేతువాదుల్ని డజన్ల కొలదీ హతమారుస్తూ, మరోవైపు సెక్యులర్‌ వ్యవస్థా రక్షకునిగా వర్ధిల్లిన అంబేడ్కర్‌ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. ‘‘ఇంతవరకూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌కు ఏ ప్రభుత్వమూ ఇవ్వని గౌర వాన్ని మా బీజేపీ ప్రభుత్వం కల్పించింది. అంబేడ్కర్‌ చూపిన మార్గంలోనే నా ప్రభుత్వం నడుస్తోంది. దేశంలోని మిగతా పార్టీలన్నీ ఆ దారిలోనే నడవాలి’’

1989 నాటి షెడ్యూల్డ్‌ కులాల, షెడ్యూల్డ్‌ తెగలపై అత్యాచారాల, దాడుల నిరోధక చట్టాన్ని 2016లో బీజేపీ–ఆరెస్సెస్‌ పరివార్‌ ప్రభుత్వం సవరించిన అనంతరం బీజేపీ ప్రభుత్వ కోరికపై సుప్రీం కోర్టు ఇటీవల జారీ చేసిన రూలింగ్‌ను నిరసిస్తూ దేశవ్యాప్తంగా బాధిత వర్గాలు తీవ్ర ఆందోళన జరిపాయి. పర్యవసానంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆగమేఘాలపై ఈ ప్రకటన చేశారు (3.4.2018).
‘‘కుల వ్యవస్థ రక్షణ చట్టానికి, వివక్షారహిత సెక్యులర్‌ రక్షణ చట్టానికీ మధ్య ఘర్షణలో కుల (కమ్యూనల్‌) రక్షణ చట్టం విజయం పొందడమంటే భారతదేశ పతనానికి మార్గం ఏర్పడినట్టే’’
డాక్టర్‌ అంబేడ్కర్‌ 1948 ఏప్రిల్‌ 18న ఢిల్లీలో లా యూనియన్‌ వార్షికోత్సవ ప్రసంగం ‘అంబేడ్కర్‌ స్పీక్స్‌’ వాల్యూం–2, పే: 364.

ఉన్నట్టుండి అదాటున ఉలుకుపాటుతో నిద్ర మేల్కొనడం సాధారణ వ్యక్తులకు కాకుండా రాజకీయ పాలకులకు సహజమా? ప్రధాని మోదీ అకస్మా త్తుగా భారత రాజ్యాంగ నిర్మాతలలో అగ్రగణ్యుడైన ‘అంబేడ్కర్‌ మార్గం’ గురించి ఓ ‘కలలాగా’ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చి ప్రస్తావించినట్టు? ఇది ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే, జాతీయోద్యమ కాలంలోగానీ, దేశ స్వాతంత్య్ర సముపార్జన దశలోగానీ, ఆ తరువాతగానీ ఆరెస్సెస్‌–బీజేపీ పరివార్‌ వర్గానికి కనీస స్ఫురణకుగానీ, ప్రస్తావనకుగానీ రాని ‘అంబేడ్కర్‌ మార్గం’ ఇప్పుడెలా బీజేపీ నాయకత్వానికి గుర్తుకొచ్చింది? ‘అవకాశవాదం’ అనేది రాజకీయులకు ఉన్న అనేక మార్గాలలో ఒకటి కాబట్టి, కళ్లముందు దోబూచులాడుతున్న ఎన్నికల ఘడియలలో దేశ జనాభాలో అధిక శాతంలో ఉన్న తాడిత, పీడిత ఇత్యాది దళిత ప్రజా బాహుళ్యం ఓట్లు గుర్తుకు వచ్చిన ప్పుడల్లా ‘అంబేడ్కర్‌ మార్గం’ గుర్తుకొస్తోంది, నవ భారత నిర్మాణానికి దృఢమైన అసలు పునాది ఏదో అంబేడ్కర్‌కు తెలుసు. వివిధ జాతుల, భాషా మైనారిటీల, మతాల, విభిన్న సంస్కృతులతో తులతూగే సుందర భవి ష్యత్తును నిర్మించుకోవలసిన భారత దేశంలో చెక్కు చెదరని సమైక్యతా భార తాన్ని సుసాధ్యం చేసుకోవాలంటే ఏం చేయాలో ఒక దార్శనికునిగా అంబే డ్కర్‌ సూచించిన అసలు ‘మార్గం’ ఏమిటి?

హైందవ సమాజం స్తంభించింది అక్కడే
‘‘దేశ భవిష్యత్తు దైవ నిర్ణయమని మనువు, యాజ్ఞ్యవల్క్య ఏనాడు బోధించి శాసించడం మొదలుపెట్టారో, నాటి నుంచి హైందవ సమాజం తనను తాను మరమ్మతు చేసుకోలేకపోయింది. కనుకనే హిందూ సమాజంలో పాతుకు పోయిన సాంఘికపరమైన అడ్డుగోడలను, దడులను మడులనూ బదాబ దలు చేయనంతవరకు మన సమాజ ప్రగతికి మార్గం లేదు. ఈ విషయంలో చొరవ చేయవలసింది ప్రత్యేక మెజారిటీగా ఉన్న హిందూ సమాజమే. ఇతర సామాజిక వర్గాలు (కమ్యూనిటీస్‌) ప్రత్యేక ఉనికితో నివసిస్తూ జీవనం గడు పుతున్నప్పుడు వారిని పట్టించుకోనట్టు వ్యవహరించే హైందవ సమాజానిదే పూర్తి తప్పిదం అవుతుంది. కనుక ఆచరణలో ప్రయోజనం కల్పించని ఉబుసు పోని నిష్ప్రయోజనకరమైన తాత్కాలిక పథకాలవల్ల లాభం లేదు’’ అన్నారు అంబేడ్కర్‌ (అంబేడ్కర్‌ స్పీక్స్‌: వాల్యూం–2, పే. 344).

అంతేకాదు, షెడ్యూల్డ్‌ కులాల, షెడ్యూల్డ్‌ తెగల తదితర అసంఖ్యాక అణగారిన వర్గాల ప్రజల న్యాయమైన డిమాండ్లను బేషరతుగా అంగీకరించడానికి అటు కాంగ్రెస్‌గానీ, ఇటు హిందూ మహాసభీయులు (ఆరెస్సెస్‌ ఒర లోని) సిద్ధ పడితే ఆ పార్టీలతో చేతులు కలపడానికి సిద్ధమన్నారు అంబేడ్కర్‌. అయితే అందుకు ఆయనొక సూటి ప్రశ్నను ఆనాడే సంధించారు: ‘‘ఇంతకూ ఈ రెండుపార్టీలు (కాంగ్రెస్‌/హిందూ మహాసభ) షెడ్యూల్డ్‌ కులాలకు మిత్రులో, శత్రువులో తేల్చుకోవాలి’’ అన్నారు అంబేడ్కర్‌. 

మతోద్రేక ఉద్యమాలే దేశభక్తా?
అంటే, ఇప్పుడు ఆరెస్సెస్‌–బీజేపీ అభ్యర్థి అయిన ప్రధాని మోదీ చెబుతున్న ‘అంబేడ్కర్‌ మార్గం’ ఇదే అయితే, అంబేడ్కర్‌ హిందూ సమాజంపైన ఎక్కు పెట్టిన ప్రశ్నలకు కూడా సూటిగా సమాధానం చెప్పగలగాలి. ఈ అనుమానం ఎందుకు తలెత్తుతోందంటే– ‘అంబేడ్కర్‌ మార్గం’ ఏదో కూలంకషంగా వివరిం చకుండా ఎన్నికల నినాదంలో భాగంగా భావించి కూర్చుంటే దేశ ప్రజా బాహుళ్యాన్ని మరోసారి మోసగించడమే అవుతుంది. ఈ అనుమానానికి అసలు కారణం– ఆరెస్సెస్‌ పరివారం స్వాతంత్య్ర సమరానికి దూరం కావడం,  సావర్కార్‌గానీ, గోల్వాల్కర్‌గానీ జాతీయ స్వాతంత్య్రోద్యమంతోకన్నా మతో ద్రేక ఉద్యమాలతో మమేకం కావడమే ‘దేశభక్తి’గా భావించారు. భిన్న మతస్తు లతో ఆప్యాయంగా కౌగలింతలు కూడా వారి దృష్టిలో నిషిద్ధమయ్యాయి. భారతదేశంలోని ఇతర మతస్తులకు (విదేశీయులుగానీ, స్థిర నివాసులుగానీ) పౌర హక్కులు సహితం ఉండడానికి వీల్లేదని గోల్వాల్కర్‌ శాసించారు.

హిందూ–ముస్లిం ఐక్యత అవసరాన్ని ప్రబోధించిన జాతిపిత గాంధీజీ దేశీయ ఉన్మాదుల చేతుల్లో హత్యకు గురయ్యారు. జాతీయోద్యమ నాయ కులు, ప్రజలు నిరసించిన సొంత ఇంటి ఉన్మాదులే దీనికి కారణం. ‘గాంధీజీ హత్య’ కారణాలను తిరిగి విచారించాలన్న ఉన్మాదుల పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఇటీవలనే కొట్టి పారేసింది. ఈ పరిణామం 2014 ఎన్నికల ఫలితాల పర్యవసానంగానే ప్రజలు గుర్తించారు. అంతేగాదు, తమ అవసరాలు తొందర చేస్తున్నందున.. అంబేడ్కర్‌ పైన, ఆయన ‘మార్గం’పైన అంత ప్రేమాభిమానాలు ఇప్పుడు మోదీ ఆలస్యంగానైనా కురిపిస్తున్నప్పుడు– అదే అంబేడ్కర్‌ ప్రధాన సంధాన కర్తగా, నిర్మాతగా రూపొందించిన రాజ్యాంగాన్ని మార్చాలన్న తలంపు బీజేపీ ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందో ప్రజలు తెలు సుకోగోరుతున్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడే రాజ్యాంగం నుంచి, దానిలో భాగమైన ప్రియాంబుల్‌ నుంచి ‘సెక్యులర్‌’ ‘సోషలిస్టు’ పదాలను తొలగించాలన్న ప్రయత్నం విఫలం కాగా, తాజాగా మోదీ పాలన రాజ్యాం గాన్ని ‘హిందుత్వ’ వేర్పాటువాద ధోరణులకు అనుకూలంగా అధికారం ముగిసేలోగా మార్చేయాలని సంకల్పించినట్టుంది. 

అందుకు ఒక ‘ముసుగు’ కావాలి. ఆ ముసుగును ఎవరికో కాదు, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కే తొడిగి, ఆయని ‘మార్గం’ ఏదో స్పష్టంగా వివరించకుండానే ప్రజా బాహుళ్యాన్ని మోసగించడానికి బీజేపీ వెనుకాడదు. ఒకవైపున పౌర సమాజాన్ని ప్రగతిశీల ఉద్యమకారులను, హేతువాదుల్ని డజన్ల కొలదీ హతమారుస్తూ, ఇంకోవైపునుంచి సెక్యులర్‌ వ్యవస్థా రక్షకునిగా వర్ధిల్లిన అంబేడ్కర్‌ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. సెక్యులర్, ప్రజా స్వామిక వ్యవస్థ కోసం నిలబడి, కేంద్ర కేబినెట్‌లో న్యాయ శాఖామంత్రిగా పనిచేసిన అంబేడ్కర్‌ తన లక్ష్యం నెరవేరగల అవకాశం ఈ ధనికవర్గ వ్యవస్థలో పూజ్యమని నమ్మి పదవికి రాజీనామా చేయవలసి వచ్చిందని మరవరాదు. ఇందుకు నిదర్శనం ఈ రోజుకీ, ‘అంబేడ్కర్‌ మార్గం’ గురించి ఎన్నికల ప్రచార పథంగా వల్లిస్తున్న బీజేపీ పాలకుల నినాదమే. ఇందుకు తాజా ఉదాహరణ–షెడ్యూల్డ్‌ కులాలపై అత్యాచారాల, దాడుల నిరోధక చట్టాన్ని (1989) నీరుకారుస్తూ 2015లో మోదీ ప్రభుత్వం తెచ్చిన సవరణల ప్రకారమే, కేంద్ర ప్రభుత్వ రివ్యూ పిటిషన్‌ను అనుసరించే తాను తాజా రూలింగ్‌ ఇచ్చానని సుప్రీం బహిరంగ పర్చడంతో మోదీ ప్రస్తావిస్తున్న ‘అంబేడ్కర్‌ మార్గం’లో చిత్తశుద్ధి కాస్తా దేశానికి వెల్లడైపోయింది.

ఏడు దశాబ్దాలకూ తగ్గని కులపీడన
అందుకనే అంబేడ్కర్‌ ‘ఏ మతాన్నైనా వారసత్వ సంపదగా అందిపుచ్చు కొనకూడదు, ప్రతి ఒక్కరూ హేతువు ఆధారంగానే పరిశీలించుకోవాల’నీ దాన్ని తండ్రి నుంచి కొడుక్కి సంక్రమించే వస్తువులుగానో లేదా ముచ్చట గొలిపే కబుర్లుగానో భావించరాద’నీ కోరారు. అయినా సరే 70 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా ‘కులంగాడు’ భారతీయ సమాజాన్ని దారు ణంగా ఏలుతూనే ఉన్నాడు. ఈ పరిస్థితి కాంగ్రెస్‌ హయాంలోనూ, బీజేపీ పాలనలోనూ నర్మగర్భంగానూ, బాహాటంగానూ అమలులోనే ఉంది. అందుకే మన అగ్రకుల వ్యవస్థలో ‘2వేల ఏళ్లుగా షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలూ (దళిత వర్గాలు) బాధలు అనుభవిస్తూనే ఉన్నాయని’ చెబుతూ అంబేడ్కర్‌ తన ఆవేదనను ఆనాడే అక్షరబద్ధం చేశారు.

అయినా ఈ రోజుకీ కాంగ్రెస్‌ పాలనలోకన్నా, బీజేపీ పాలనలోనే షెడ్యూల్డ్‌ కులాలపైన, పౌరులపైన దేశవ్యాప్తంగా పలుచోట్ల దాడులు జరుగుతూనే ఉన్నాయని మరవరాదు. పరిపాలనా శాఖల్లో ‘దళిత’ పదాన్ని వాడొ ద్దని నిషేధం విధిస్తూ, షెడ్యూల్డ్‌ కులాలు అని మాత్రమే వాడాలని సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ (15.3.2018) తాఖీదు విడుదల చేసింది. కానీ, ‘దళిత’ పదాన్ని వాడొద్దన్నంత మాత్రాన ఆ తాడిత, పీడిత అసంఖ్యాక ప్రజా బాహుళ్యానికి ప్రత్యేకించి ఒరిగేదేమీ లేదు, ‘షెడ్యూల్డ్‌ కులాలన్నంత మాత్రాన వారికి వచ్చి పడేది ఉండదు. వారికి ఉద్దేశించామని చెబుతున్న ఎన్ని పథకాలకు ఆచరణలో ‘గౌరవం’ లభించింది? వాటి ఆస రాగా ఎందరు అజ్ఞాత శక్తులు నాయకుల ముసుగులో ‘ఆమ్యామ్యా’లకు పడ గెత్తలేదు? అసలింతవరకూ, అస్పృశ్యతా రద్దు చట్టం వచ్చి పేరుకు ‘అస్పృ శ్యత’ అన్న పదం వైదొలగినా, నిషేధం ఉన్నా ఆ పదం చాటున నర్మగర్భంగా జరిగే దారుణాలు తగ్గలేదు.

విద్యా, వైద్య, శాస్త్ర, సాంకేతిక రంగాలకు చెందిన సాధికార పబ్లిక్‌ సంస్థలన్నీ బీజేపీ పాలకుల ప్రత్యక్ష, పరోక్ష మార్గాల ద్వారా అవాంఛనీయమైన మార్పులకు ‘హిందుత్వ’ సిద్ధాంత జోక్యానికి క్రమక్ర మంగా గురవుతున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ– డార్విన్‌ పరిణామ వాద నిరూపిత సిద్ధాంతానికి, విశ్వరూపంపై, వివిధ గ్రహరాశిలో జరుగు తున్న పరిణామాలను వివరించిన స్టీఫెన్‌ హాకింగ్‌ సిద్ధాంతాలకు ఆధారం అంతా వేదాలనుంచి ‘కొట్టిన కాపీ’ అని నిరూపించడానికి బీజేపీ కేంద్రమం త్రులే సాహసించి తృప్తి చెందడం. ఈ బాపతు ‘హిందూత్వ’ సరుకునే శ్రీశ్రీ ‘‘నవీన విశ్వ విద్యాలయాల్లో పురాణ కవిత్వం’’ వినిపించడంలాంటిద న్నాడు. విజ్ఞాన సాగరాన్ని మధించిన వారికి ‘క్షీర సాగరం’ తమలోనే దాగి ఉంటుంది గానీ కాకమ్మ కథలలో నిక్షిప్తమై ఉండదు గాక ఉండదు. ఆ రహస్యం తెలిసిన వాడు కాబట్టే, దేవులపల్లివారు ‘‘నాలోనే కలదు క్షీర సాగ రము’’ అనగలిగాడు. రాజకీయంగా కూడా అదీ– అంబేడ్కర్‌ మార్గం అంటే!


ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు 
abkprasad2006@yahoo.co.in

మరిన్ని వార్తలు