ఊహల్లోనే కలల రాజధాని

3 Jan, 2019 06:58 IST|Sakshi

శ్వేతపత్రం – 7, అమరావతి అంతర్జాతీయ కుంభకోణాలపై విశ్లేషణ 

రాజధానికి సంబంధించిన ప్రతి పని ఒక ఆర్భాటపు ప్రహసనమే తప్ప క్షేత్రస్థాయిలో ఆచరణ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. పరిపాలనా నగరం డిజైన్లను రూపొందించేందుకు మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా మొదట జపాన్‌కు చెందిన మకి అసోసియేట్స్‌ను అంతర్జాతీయ పోటీలో ఎంపిక చేసింది. ప్రభుత్వ పెద్దల అభిమతానికి అనుగుణంగా మకి అసోసియేట్స్‌ పనిచేయక పోవడంతో అనూహ్యంగా దాన్ని పక్కకు తప్పించి లండన్‌కు చెందిన నార్మన్‌ పోస్టర్స్‌ అండర్‌ పార్టనర్స్‌ను మాస్టర్‌ ఆర్కిటెక్‌గా ఎంపిక చేసింది. దీంతో మకి ఢిల్లీలోని కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు అంతర్జాతీయ జర్నళ్లలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలను ఎండగట్టడంతో రాష్ట్రం పరువు బజారునపడింది. 

అమరావతిలో రాజధాని ఎక్కడుందో కనపడ్డంలేదు కానీ అంతర్జాతీయ స్థాయి కుంభకోణాలు మాత్రం కలవరపెడుతున్నాయి. కొత్త రాజధానిలో నిర్మాణాలు ఒకటి రెండే ఉండగా వివాదాలు, అడ్డగోలు వ్యవహారాలు మాత్రం అడుగడుగునా దర్శనమిస్తున్నాయి. సింగపూర్‌ కంపెనీలతో లాలూచీపడి వేల కోట్ల విలువైన భూములను వారికి అప్పనంగా అప్పగించడం.. భూసమీకరణ పేరుతో నాలుగు పంటలు పండే భూములను రైతుల నుంచి బలవంతంగా తీసుకోవడం.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా వేల కోట్ల విలువైన భూములను సొంతం చేసుకోవడం.. డిజైన్లు, తాత్కాలిక నిర్మాణాల పేరుతో వందల కోట్ల రూపాయలను దుబారా చేయడం వంటి అనేక దారుణాలు అమరావతిలో చోటుచేసుకున్నాయి. ప్రపంచ స్థాయి రాజధాని కడుతున్నామంటూ పంచరంగుల సినిమా చూపించి ప్రచారం చేసుకోవడమే తప్ప రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాల గురించి పట్టించుకోలేదు. నాలుగున్నరేళ్లలో రాజధానిని కాగితాల నుంచి వాస్తవంలోకి తీసుకురాలేకపోయిన ప్రభుత్వం ఆ పేరుతో కనీవినీ ఎరుగని అవినీతికి పాల్పడిందనడానికి ఇవే నిదర్శనాలుగా ఉన్నాయి. కానీ రాజధానిపై విడుదల చేసిన శ్వేతపత్రంలో అంతా చేసేసినట్లు మరోసారి రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నించింది. 

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో భారీ కుంభకోణం 
2014 జూన్‌లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని ఎక్కడనే విషయంపై వ్యూహాత్మకంగా లీకులిచ్చిన ప్రభుత్వ పెద్దలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి వేల కోట్ల విలువైన భూములను కారుచౌకగా చేజిక్కించుకున్నారు. శివరామ కృష్ణన్‌ కమిటీ ఇచ్చిన నివేదికను పక్కనపెట్టి తమకు అనుకూలమైన ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని ఆ విషయాన్ని తమ అనుయాయులు, అస్మదీయులకు మాత్రమే తెలిసేలా చేశారు. ముఖ్యమంత్రి కుమారుడు, ఆయనకు కావల్సిన వ్యక్తులంతా రాజధాని ఏర్పాటు చేయాలను కున్న ప్రాంతంలో తక్కువ ధరకు భారీగా భూములు కొనుగోలు చేశారు. సుమారు 25 వేల ఎకరాలను ఇలా తాము ముందే అనుకున్న ప్రాంతంలో టీడీపీ నాయకులు తక్కువ రేటుకు చేజిక్కించుకున్నారు. అదే సమయంలో బయట ప్రపంచానికి మాత్రం రాజధాని నూజివీడులో అని, గన్నవరంలో అని, గుంటూరు నాగార్జున వర్సిటీ పరిధిలో అని అనుకూల మీడియా ద్వారా లీకులిచ్చారు. తద్వారా రాజధాని పేరుతో ఆయా ప్రాంతాల్లో రియల్‌ఎస్టేట్‌ బూమ్‌ సృష్టించి సాధారణ, మధ్యతరగతి ప్రజలను తప్పుదారి పట్టించారు. మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా తాము ముందే నిర్ణయించుకున్నచోట కారుచౌకగా భూములు కొనేశారు. అక్కడ భూములన్నీ చాలావరకూ తమ చేతుల్లోకి వచ్చాక గుంటూరు జిల్లా తుళ్లూరులో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆ ప్రాంతంలో అప్పటివరకూ భూములమ్ముకున్న వారు గొల్లుమనగా, ప్రభుత్వ లీకులతో వేరే ప్రాంతాల్లో కొన్నవారు నిండామునిగిపోయారు. తాము అనుకున్న ప్రాంతంలో కొన్న భూముల విలువ రాజధాని ప్రకటన తర్వాత అమాంతం పెరిగిపోవడంతో టీడీపీ బడా బాబులంతా వేలకోట్ల లబ్ధి పొందగా, ఈ ఆట తెలియని సామాన్యులు సర్వం పోగొట్టుకున్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా ముఖ్యమంత్రి కుమారుడు లోకే శ్, మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వర రావుతోపాటు అనేక మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు రాజధాని ప్రాంతంలో ఇష్టానుసారం భూములు కొనుగోలు చేయడాన్ని రెండేళ్ల క్రితమే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది.

బలవంతపు భూసమీకరణ.. అడుగడుగునా దౌర్జన్యాలు
భూములన్నీ తమ చేతుల్లోకి వచ్చిన తర్వాత తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని 29 గ్రామాల్లోని 28,054 మంది రైతుల నుంచి ప్రభుత్వం భూసమీకరణ ద్వారా 34 వేల ఎకరాలను బలవంతంగా లాక్కుంది. కృష్ణా నది తీరంలో నాలుగు పంటలు పండే అత్యంత విలువైన భూములను ఇవ్వలేమని రైతులు గగ్గోలు పెట్టినా, పర్యావరణవాదులు ఎంత మొత్తుకున్నా, ప్రతిపక్షాలు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా పట్టించు కోకుండా ప్రభుత్వం బెదిరింపులు, దౌర్జన్యాలతో భూములు లాక్కుంది. పలు చోట్ల తోటలను దగ్ధం చేయడం, ఇవ్వని రైతులపై కేసులు పెట్టి వేధించడం, వారి ఇళ్లకు వెళ్లి మరీ టీడీపీ నాయకులు బెదిరించడం, పొలాలకు నీరు, విద్యుత్‌ సరఫరా ఆపివేయడం, వ్యవసాయ రుణాలు ఇవ్వకపోవడం, రైతులకు తెలియకుండానే వారి భూములను దున్నేయడం వంటి అనేక అరాచకాలు తెరవెనుక చోటుచేసుకున్నాయి. ఇంత దారుణంగా భూములు లాక్కున్న ప్రభుత్వం తమకు అనుకూలమైన కొందరు రైతులను చూపించి స్వచ్ఛందంగా రైతులు భూములిచ్చినట్లు ప్రచారం చేసింది. భూసమీకరణ ప్యాకేజీ టీడీపీకి అనుకూలంగా ఉన్న వారికి లబ్ది చేకూర్చేలా తయారు చేయడంతోపాటు సమీకరించిన భూమికి సంబంధించి రైతులకిచ్చే ప్లాట్ల విషయంలోనూ వివక్ష చూపించారు. చిన్న రైతుల నోట్లో మట్టికొట్టి వారి భూముల పేరుతో స్థానికంగా టీడీపీ నాయకులకు ప్లాట్లు ఇచ్చిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. దళిత రైతుల అసైన్డ్, లంక భూములను అధికార పార్టీ నేతలు భయపెట్టి కారుచౌకగా తీసుకున్నారు. ఐదు వేల ఎకరాలకుపైగా భూములు ఇలా టీడీపీ నేతల వశమయ్యాయి.

రైతులకిచ్చిన హామీలు బుట్టదాఖలు 
రాజధానిలో భూములిచ్చిన రైతులకు పెద్దపీట వేస్తున్నామని ప్రచారం చేస్తున్నా అది మాటల వరకే పరిమితమైంది. సేకరించిన భూమికి బదులు మూడేళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లను తిరిగి ఇస్తామని వాటి విలువ ఇచ్చిన భూమి కంటే నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటుందని నమ్మించారు. భూములు తీసుకున్న మూడున్నరేళ్ల తర్వాత కూడా ఇప్పటివరకూ రైతులకు భౌతికంగా ప్లాట్లు అప్పగించలేదు. కేవలం కాగితాల్లోనే పంపిణీ జరిగింది. రైతులకిచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వం వారిచ్చిన భూములతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మొదలు పెట్టింది. తమకిస్తామని చెప్పిన ప్లాట్లలో పిచ్చిమొక్కలు మొలిపించి వాటిని బీళ్లుగా మార్చిన ప్రభుత్వం, వాటి పక్కనే అపార్టుమెంట్లు నిర్మించి వేరే వాళ్లకి అమ్మకం ఎంతవరకూ సమంజసమని రైతులు వాపోతున్నా పట్టించుకునే నాథుడే లేడు. 29 గ్రామాల్లో రైతుల వాటాగా ఇవ్వాల్సిన ప్లాట్ల లేఅవుట్లను 13 జోన్లుగా విభజించి వాటిలో రోడ్లు, డ్రయిన్లు, మురుగునీటి పారుదల, తాగునీటి సరఫరా, విద్యుదీకరణ, భూగర్భ డ్రైనేజీ వంటి సకల సౌకర్యాలు కల్పిస్తామని సీఆర్‌డీఏ ప్రకటించింది. కానీ మూడున్నరేళ్లయినా ఒక్క జోన్లో కూడా ఈ పనులు మొదలు కాకపోగా పీపీపీ, హైబ్రీడ్‌ యాన్యుటీ విధానంలో పలుమార్లు టెండర్లు పిలిచి వాటిని రద్దు చేశారు. ఇచ్చిన హామీలను పట్టించుకోకపోవడంతో ప్రభుత్వంపై నమ్మకం లేక రైతులు తమకు తిరిగి ఇచ్చిన ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు ముందుకు రాలేదు. 62,596 ప్లాట్లను 28 వేల మంది రైతులు తమ పేరు మీద రిజిస్టర్‌ చేయించుకోవాల్సి ఉండగా ఇప్పటివరకు 27,750 ప్లాట్లను మాత్రమే సంబంధిత రైతులు రిజిస్టర్‌ చేయించుకున్నారు. ఇంకా 34,846 ప్లాట్లను వాటి యజమానులైన రైతులు రిజిస్ట్రేషన్‌ చేయించుకోకుండా వదిలేశారు.  రైతులకివ్వాల్సిన ప్లాట్లను ఆయా గ్రామాలకు దూరంగా లేఅవుట్లు వేసి హద్దుల ప్రకారం రాళ్లు పాతారు. అవన్నీ ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలతో నిండిపోయి దారీతెన్ను లేకుండా ఉన్నాయని రైతులు వాపోతున్నారు. లేఅవుట్లకు వెళ్లేందుకు రోడ్లు కూడా లేవు. లేఅవుట్లలోపల అంతర్గతరోడ్లు, డ్రయిన్లు, వీధిలైట్లు వంటి కనీస సదుపాయాలకు సైతం ఇంకా ప్రణాళికలు రూపొందిస్తూనే ఉన్నారు. మరోవైపు కార్పొరేట్‌ సంస్థలు, తమకు నచ్చిన వారికి కట్టబెట్టిన భూములను మాత్రం సీఆర్‌డీఏ సుందరంగా తీర్చిదిద్దింది. రైతుల నుంచి తీసుకున్న భూములను వారికి అప్పగించేముందు పూర్తిగా చదును చేశారు. ఎస్‌ఆర్‌ఎం, విట్‌ వంటి సంస్థలకిచ్చిన వందల ఎకరాలను పూర్తిగా అభివద్ధి చేయడంతోపాటు సీఆర్‌డీఏ సొంత ఖర్చులతో మంగళగిరి నుంచి ఆ క్యాంపస్‌లకు రోడ్లు వేసింది. తాగునీటి పైపులైన్లు, విద్యుత్‌ సౌకర్యాల కల్పన కూడా సీఆర్‌డీఏ అధికారులు దగ్గరుండి సమకూర్చారు. రైతుల వద్దకొచ్చేసరికి ప్రభుత్వం మొండిచేయి చూపింది. రైతుల నుంచి సేకరించిన భూమిని కార్పొరేట్‌ సంస్థలకు, తమకు నచ్చిన వారికి ప్రభుత్వం కారుచౌకగా కట్టబెట్టింది. విట్, ఎస్‌ఆర్‌ఎం, బీఆర్‌ శెట్టి వంటి సంస్థలకు ఎకరం రూ.50 లక్షలకు కట్టబెట్టగా ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులకు ఎకరం నాలుగు కోట్లకు అమ్మింది. తనకు కావాల్సిన కొన్ని సంస్థలకు ఉచితంగా, నామమాత్రపు రేట్లకు భూములు కట్టబెట్టారు. 

సింగపూర్‌ కంపెనీలతో లాలూచీ    
స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టు పేరుతో రాజధాని భూములను కారుచౌకగా సింగపూర్‌ కంపెనీలకు కట్టబెట్టి ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయి కుంభకోణానికి తెరతీసింది. రైతుల నుంచి సేకరించిన భూముల్లో 1691 ఎకరాలను ఎకరం రూ.12 లక్షల చొప్పున స్విస్‌ చాలెంజ్‌ విధానంలో నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి సింగపూర్‌ కన్సార్టియంకు అప్పగించింది. అవే భూములను ఇతర కంపెనీలకు ఎకరం రూ.4 కోట్లకు ప్రభుత్వం కేటాయించింది. దీన్నిబట్టి రూ.6,764 కోట్ల విలువైన భూములను కేవలం రూ.243 కోట్లకు అప్పగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ప్రాజెక్టు కోసం రాజధాని ప్రకటనకు ముందే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యులు సింగపూర్‌ కంపెనీలతో లోపాయకారీ ఒప్పందం చేసుకున్నారు. రాజధాని మాస్టర్‌ప్లాన్‌ను వారితో తయారు చేయించి ఆ తర్వాత ఈ ప్రాజెక్టును స్విస్‌ చాలెంజ్‌ విధానంలో వారికే అప్పగించారు. ఈ విధానంలో ఉన్న అవకతవకలు, ఇందులో తమకూ అవకాశం ఇవ్వాలని పలు సంస్థలు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపింది. దీంతో ఏపీఐడీసీ చట్టాన్నే మార్చివేసి సింగపూర్‌ కన్సార్టియంకు ప్రాజెక్టును అప్పగించారు. ప్రభుత్వం అభివృద్ధి చేసి ఇచ్చిన  ఈ భూముల్లో ప్లాట్లు వేసి సింగపూర్‌ కన్సార్టియం, ఏడీసీ (అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) కలిసి విక్రయిస్తుంది. కారుచౌకగా భూములివ్వడంతోపాటు రూ.5,500 కోట్లతో అందులో మౌలిక వసతులు అభివద్ధి చేసే పని కూడా ప్రభుత్వానిదే. ఈ భూములపై సింగపూర్‌ కన్సార్టియంకు సీఆర్డీఏ పవర్‌ ఆఫ్‌ అటార్నీ కూడా ఇచ్చేసింది. ఇంతచేసి సింగపూర్‌ కంపెనీలు ఇందులో పెట్టే పెట్టుబడి రూ.330 కోట్లు మాత్రమే. కానీ ప్రాజెక్టులో మాత్రం 58 శాతం వాటా వారికిచ్చారు. భూములు, వసతుల కల్పన అన్నీ చేసిన ఏడీసీకి 42 శాతం వాటా ఉండటం గమనార్హం. ఇంత దారుణంగా నష్టపోతూ సింగపూర్‌ కన్సార్టియంకు మోకరిల్లడం వెనుక ప్రభుత్వ ముఖ్యుల స్వప్రయోజనాలున్నాయని, వేల కోట్ల లబ్ధి ఉందని స్పష్టమవుతోంది.
 
తాత్కాలిక సచివాలయం ఒక్కటే.. అందులోనూ అవినీతి.. 
ప్రపంచ స్థాయి రాజధాని అంటూ నాలుగున్నరేళ్లుగా హంగామా చేసినా ఇప్పటివరకూ తాత్కాలిక సచివాలయం తప్ప మరో నిర్మాణాన్ని రాజధానిలో కట్టలేకపోయారు. వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలకు ఎవరూ ఊహించని విధంగా వెయ్యి కోట్ల వరకూ ఖర్చు చేశారు. ఆరు లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన ఆరు బ్లాకులను మొదట రూ.180 కోట్లతో మొదలు పెట్టి అంచెలంచె లుగా దాని ఖర్చు పెంచుకుంటూ వెళ్లారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా చదరపు అడుగుకు రూ.10 వేలు ఖర్చు చేసి నిర్మించిన ఈ భవనాలు పైన పటారం లోన లొటారం మాదిరిగా తయారయ్యాయి. చిన్నపాటి వర్షానికే భవనాల లోపల వర్షపు ధార కారిపోతుండటం వాటి నాణ్యతను బయటపెట్టింది. తాత్కాలిక హైకోర్టు నిర్మాణం విషయంలోనూ ప్రభుత్వం చేతులెత్తేసింది. గత సంవత్సరం డిసెంబర్‌ 15వ తేదీలోపు కోర్టు భవనాలను అందుబాటులోకి తెస్తామని సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ప్రభుత్వం మాటలు నమ్మి సుప్రీంకోర్టు హైకోర్టు విభజనకు నోటిఫికేషన్‌ ఇచ్చాక ఇంకా భవన నిర్మాణం పూర్తికాలేదని, ఇప్పటికిప్పుడు ఎలా హైకోర్టును విభజిస్తారని సాక్షాత్తూ ముఖ్యమంత్రి మాటమార్చేశారు. ప్రభుత్వం చెప్పే మాటలకు చేతలకు పొంతన లేదనడానికి హైకోర్టు నిర్మాణం ఒక ఉదాహరణ. 

కన్సల్టెన్సీలకు రూ. 461 కోట్ల చెల్లింపులు 
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో నిష్ణాతులైన అధికారులున్నా, రాష్ట్రంలోనూ, దేశంలోనూ అనేక మంది నిపుణులు, సంస్థలున్నా పట్టించుకోకుండా పైపై మెరుగుల కోసం కన్సల్టెన్సీల కోసం కోట్లు ధారబోసింది. నాలుగున్నరేళ్లలో అక్షరాల రూ.461 కోట్లను కన్సల్టెన్సీలకు చెల్లించింది. మొత్తం 55 కన్సల్టెన్సీలను నియమించుకోగా అందులో రాజధాని డిజైన్ల పేరుతో కేవలం రెండు సంస్థలకే రూ.173 కోట్లు ఇచ్చింది. వందలాది మంది ఇంజనీర్లను కొత్తగా నియమించుకుని, డిప్యుటేషన్లపై వివిధ శాఖల నుంచి రప్పించుకున్నాక కూడా ప్రాజెక్టుల నిర్వహణ కోసమంటూ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్లను తెచ్చిపెట్టుకుంది. ఈ నిర్వహణ సంస్థలకే ఇప్పటివరకూ రూ.117 కోట్లు సమర్పించింది.

ఒక్క శాశ్వత భవనమూ లేదు
ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్ల వరకూ తాత్కాలిక సచివాలయం మినహా ఒక్క శాశ్వత భవన నిర్మాణానికి పునాది వేయలేదు. డిజైన్ల కోసం పాత సినిమాల్లో విఠలాచార్యను మించిన ఐడియాలతో చంద్రబాబు చేస్తున్న విన్యాసాలతో నవ్వులపాలవడం తప్ప ఫలితం లేకుండాపోయింది. 1,375 ఎకరాల రాజధాని పరిపాలనా నగరం డిజైన్లను రూపొందించేందుకు మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌గా మొదట జపాన్‌కు చెందిన మకి అసోసియేట్స్‌ను అంతర్జాతీయ పోటీలో ఎంపిక చేసింది. ప్రభుత్వ పెద్దల అభిమతానికి అనుగుణంగా మకి అసోసియేట్స్‌ పనిచేయకపోవడంతో అనూహ్యంగా దాన్ని పక్కకు తప్పించి లండన్‌కు చెందిన నార్మన్‌ పోస్టర్స్‌ అండర్‌ పార్టనర్స్‌ను మాస్టర్‌ ఆర్కిటెక్‌గా ఎంపిక చేసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందని మకి ఢిల్లీలోని కౌన్సిల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు అంతర్జాతీయ జర్నళ్లలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలను ఎండగట్టడంతో రాష్ట్రం పరువు బజారునపడింది. మరోవైపు నార్మన్‌ పోస్టర్స్‌ సంస్థ డిజైన్లు సమర్పించకుండానే బాహుబలి సినిమాలో మాహిష్మతి సెట్టింగ్, గౌతమీపుత్ర శాతకర్ణిలోని అమరావతి సెట్టింగ్‌లపై మనసుపడిన చంద్రబాబు వాటి దర్శకులతో చర్చలు జరిపారు. ఇలా రకరకాల డిజైన్లను అనుకూల మీడియాలో చూపిస్తూ అదే రాజధాని అని హడావుడి చేశారు. నాలుగేళ్లయినా శాశ్వత కట్టడాలకు పునాది పడలేదనే విమర్శల హోరు తట్టుకోలేక మూడు నెలలక్రితం నుంచే శాశ్వత భవనాలైన సచివాలయం, అసెంబ్లీ, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగ నివాస భవనాల పనులను మొదలు పెట్టారు. అయితే ఈ భవనాలు, రాజధాని రోడ్ల నిర్మాణ అంచనాలను కళ్లుచెదిరేలా రూపొందించి పనులు చేస్తుండటం వెనుక భారీ అవినీతి చోటు చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. చదరపు అడుగుకు నాలుగైదు వేలతో నిర్మించే అవకాశం ఉన్న భవనాలను రూ.7 వేల నుంచి పది వేల వరకూ అంచనాలతో చేపట్టడంతో నిపుణులే విస్తుపోయే పరిస్థితి నెలకొంది. రూ.1,387 కోట్ల అంచనాతో కష్ణా నదిపై ఐకానిక్‌ బ్రిడ్జి పనుల్ని ఎల్‌అండ్‌టీ సంస్థకు అప్పగించడం ఈ కోవలోనిదే. మరోవైపు టెండర్లు, డిజైన్లతో సంబంధం లేకుండా రూ.250 కోట్లు ఖర్చు పెట్టి రెండున్నరేళ్ల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన చేయించినా అక్కడ ఏం కట్టాలనే దానిపై ప్రభుత్వం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. పరిపాలనా నగరానికి కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీతో రెండేళ్ల కిందట శంకుస్థాపన చేయించినా అక్కడ ఇప్పుడిప్పుడే నిర్మాణాలు మొదలు పెట్టి వాటిని చూపించి అదే రాజధాని అని ప్రచారం చేస్తున్నారు. ఇలా రాజధానికి సంబంధించిన ప్రతి పని ఒక ఆర్భాటపు ప్రహసనమే తప్ప క్షేత్రస్థాయిలో ఆచరణ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. 
–బొల్లికొండ ఫణికుమార్, సాక్షి ప్రతినిధి 

మరిన్ని వార్తలు