ఎందుకీ ‘తెలుగు’ వంచన?

4 Dec, 2019 00:54 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రాథమిక స్థాయిలో ఇంగ్లిష్‌ మీడియంలో బోధన ప్రవేశపెట్టాలని తీసుకున్న సంచలన నిర్ణయం కొందరికి–అదీ మేధావి వర్గంలో నున్నవారికి నచ్చకపోవడం విడ్డూరమే. వారు కళ్ళుమూసుకుని వాస్తవాలను విస్మరించడం ఒకింత బాధాకరం కూడా. ఎక్కడైనా చూడండి! ఎంత పేదరికంలో మగ్గుతున్నవారైనా సరే, తమ పిల్లలు బాగుపడాలనే ఏకైక లక్ష్యంతో తల తాకట్టుపెట్టి మరీ వారిని ఇంగ్లిష్‌ మీడియం బడిలోనే వేస్తారు.

ఇది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. దాదాపు నాలుగు దశాబ్దాలనుంచీ జరుగుతున్న కథ. ఇంగ్లిష్‌ చదువులు చదివిన వారు తతిమ్మావారికంటే బాగున్నారనే వాస్తవాన్ని గ్రహించిన ఓటరు జనాభా తీసుకున్న నిర్ణయం.  ఇరవైయేళ్ళక్రితం మా అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ వాచ్‌మన్‌ సంజీవి తన ఇద్దరు కుమార్తెలను పక్కనే ఉన్న ప్రభుత్వ ఉచిత పాఠశాలలో కాక ఏదో పనికిరాని ఇంగ్లిష్‌ మీడియం స్కూల్లో చదివిస్తుంటే, ఎందుకలా చేస్తున్నావని అడిగాను.

తన జీతం నెలకు రెండువేల రూపాయలు. పిల్లల బడి ఫీజు ఇద్దరికీ కలిపి ఆరువందలు, ఆ పైన యూనిఫారమ్, పుస్తకాలు వగైరా ఖర్చులు. ఇదేమి తెలివితేటలు సంజీవీ అని అడిగాను. ఛీ.. ఆ దుంపల బడిలో ఏమీ నేర్చుకోలేరండీ’ అని అతడి సమాధానం. విశాఖపట్నంలో ప్రభుత్వ పాఠశాలలకు దుంపలబడి అని పేరుంది. బడి పక్కన ఉడికించిన చిలకడ దుంపలవంటివి అమ్ముతుండడం, వాటిని పిల్లలు ఇంటెర్వల్లో కాని, బడి వదిలాక కానీ కొనుక్కుని ఆరగించడం వల్ల నేమో ఆ పేరొచ్చింది. ఈగలు ముసిరిన ఆ తిను బండారాలను తిన్న పిల్లలు తరచూ రోగాలబారిన కూడా పడుతుంటారు.

అడుగడుగునా ప్రైవేటు ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్ళు అందుబాటులోకి రావడంతో ఈ సర్కారు బడులకు కూడా ఈగలు తోలుకునే పరిస్థితి దాపురించింది. దాన్ని సరిదిద్దడానికి ఇదివరలో ఏ ప్రభుత్వమూ ముందుకు రాలేకపోయింది. ఇన్నాళ్ళకు వైఎస్‌ జగన్‌ ధర్మమా అని పరిస్థితి మారుతోందంటే కొందరికి నచ్చడంలేదు. తమ పిల్లలతో పేదసాదల పిల్లాజల్లలూ అలగాజనం కూడా పోటీపడతారా అనేదే వారి బాధేమో! మాతృభాషపై గౌరవం ఉండవచ్చు. అది తిండి పెట్టకపోతే వేరే మార్గం వెతుక్కోవడంలో తప్పేముంది. కులవృత్తులకు సాటిలేదు గువ్వల చెన్నా అన్నది వినడానికి బాగానే ఉంటుంది. కానీ కులవృత్తులను అంతా ఎందుకు వదలివెళ్ళవలసివచ్చిందో మేధావులకు తెలియదా? 

అసలు సంగతికి వద్దాం. ఇంగ్లిష్‌ బాగా వచ్చినందువల్లనే మనవారు–అంటే భారతీయులు అమెరికా ఇతర విదేశాలలో ఉద్యోగాలు సంపాదించి రాణిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. హైస్కూల్‌ వరకూ తెలుగు మీడియంలో చదివి, ఇంటర్లో ఒక్కసారిగా ఇంగ్లిష్‌ మీడియంలో అంతా చదవాల్సి రావడం సగటు విద్యార్థికే కాదు, ప్రతిభావంతులకు కూడా ప్రతిబంధకమే. కొన్నిసార్లు ఇది ఆత్మహత్యలకు కూడా దారితీసేది. ఇంటర్‌ తర్వాత డిగ్రీ, పీజీ వరకూ కూడా తెలుగు మీడియంలో చదవాలంటే చాలామంది ఇష్టపడడంలేదు–ఉద్యోగాలు దొరకవనే ఒకే కారణం వల్ల.

ప్రాథమిక స్థాయి నుంచే గట్టి పునాదులతో ఆంగ్ల మాధ్య మంలో విద్య కొనసాగించడంవల్ల ఉన్నత విద్య పూర్తయ్యేసరికి ఉద్యోగావకాశాలు పుష్కలంగా ఉంటున్నాయి. నేను హిందూ పేపర్లో పనిచేసినప్పుడు తెలుగు మీడియంవారికోసం ప్రత్యేకంగా ఇ–ప్లస్‌ క్లబ్బులంటూ ప్రతి కాలేజీలోనూ ప్రారం భించవలసివచ్చింది. ఇప్పుడు ఆ అదనపు భారం పిల్లలపై పడబోదు. తెలుగు మీడియంవారు కార్పొ రేట్‌ కళాశాలలో చదువు కొనుక్కొనే బాధకూడా తప్పుతుంది. దర్జాగా గవర్నమెంట్‌ కాలేజీలలోనే ఉన్నతవిద్యను కొనసాగించవచ్చు. 

ఈ ప్రభుత్వచర్య వల్ల కార్పొరేట్‌ కాలేజీలకు పెద్ద నష్టం వస్తుందనుకోను. వారికి వ్యాపారం ఎలా చేయాలో బాగా తెలుసు. వారంతా తప్పక తెలుగు మీడియంలో ప్రత్యేక శిక్షణ తరగతులను ప్రారంభించి మరీ డబ్బుచేసుకోగలరు. వారిని అప్పుడు తెలుగుకోసం తపిస్తున్న ఈ ఇంగ్లిష్‌ చదువులు వెలగబెట్టినాక, తమ సంతానాన్ని కూడా ఇంగ్లిష్‌ మీడియంలోనే నడిపిస్తున్న మేధావి వర్గం ఆదరిస్తుందేమో చూడాలి. ఎందుకో ఈ ఆత్మవంచన! 


బులుసు ప్రభాకర శర్మ 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
మొబైల్‌ : 98495 95371 

మరిన్ని వార్తలు