కోడెలను కాటేసిందెవరు?

25 Sep, 2019 00:33 IST|Sakshi

అభిప్రాయం

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మాజీ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేయడం, రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం అందించడం దొంగే.. దొంగ, దొంగ అని అరిచిన చందంగా ఉంది. నాలుగయిదు నెలల క్రితమే.. అంటే, చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న చివరి రోజుల్లో  ఆంధ్రప్రదేశ్‌లో సీబీఐ అడుగుపెట్టడానికి అనుమతించబోమంటూ జీవో తెచ్చారు. అంతకుముందే చంద్రబాబు పలుమార్లు గవ ర్నర్‌ వ్యవస్థ మీద తనకు ఏమాత్రం నమ్మకం లేదని బహి రంగంగానే వ్యాఖ్యానించారు.  

డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య అందర్నీ కలచివేసింది. కోడెల ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త రాగానే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి కోడెల కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. ప్రతి రాజకీయనాయకుడి మీద పలురకాల ఒత్తిళ్లు ఉంటాయి. కోడెల కూడా తన రాజకీయ జీవితంలో అనేక కష్టాలు, ఒత్తిళ్లతోనే ముందుకు సాగారు. కానీ, 2014 నుంచి కోడెలకు సొంత పార్టీ నుంచే కష్టాలు ఎదురయ్యాయి. 2014 ఎన్నికల్లో నరసరావుపేట టికెట్‌ ఇవ్వడానికి చంద్రబాబు నిరాకరించారు. చివరి క్షణంలో కోడెలను సత్తెనపల్లి పంపారు. పార్టీ అధికారంలోకి వచ్చాక.. స్వల్ప మెజార్టీతో గెలిచిన కోడెలకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. స్పీకర్‌ పదవి ఉన్నతమైనదే. కానీ రాజకీయంగా క్రియాశీలకమైనది కాదు కనుక దానిని నిర్వహించడానికి కోడెల ఆసక్తి చూపలేదన్న వార్తలొచ్చాయి. చివరకు అయిష్టంగానే స్పీకర్‌ పదవి చేపట్టారు.  స్పీకర్‌గా ఉండి ఆయన పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరిగింది. ఇవన్నీ తమ నాయకుడు చంద్రబాబు మెప్పుపొందడానికి చేసినట్లుగానే కన్పించాయి.  

రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే డాక్టర్‌ కోడెల కుటుంబం బాధితులందరూ బయటకొచ్చారు. సొంత పార్టీ వారే ఆయన మీద ఫిర్యాదులు పెట్టారు. వాటి ఆధారంగానే పోలీసులు కేసులు నమోదు చేశారు. నిజానికి, కోడెల పట్ల గౌరవంతో పోలీసు యంత్రాంగం వ్యవహరించింది. కక్షసాధింపు చేయాలనుకొంటే ఆయనను విచారణకు పిలిపించేవారు. కోడెల కుటుంబంపై పెట్టిన కేసులపై యాగీ చేస్తున్న చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ముద్రగడ పద్మనాభం మొదలుకొని ఎంతోమందిని రాజకీయంగా వేధించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడిన విద్యార్థులపై కూడా కేసులు పెట్టి వేధించిన విషయాన్ని చంద్రబాబు మర్చిపోయినట్లు ఉన్నారు.   

నిజానికి, కోడెల ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం బాబు అనుచితవైఖరే. 2014లో అధికారంలోకి రాగానే కెటాక్స్‌ పేరుతో నరసరావుపేటలో కోడెల కుమార్తె, సత్తెనపల్లిలో ఆయన కుమారుడు దందాలకు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువె త్తాయి. వారి బాధితుల్లో సొంత పార్టీకి చెందిన వ్యక్తులూ ఉన్నారు. కానీ, కుటుంబ సభ్యుల్ని కట్టడి చేయమని చంద్రబాబు కోడెలకు చెప్పలేకపోయారు. కారణం వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీకి ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే ఫైల్‌ స్పీకర్‌గా ఉన్న కోడెల వద్ద  ఉన్నది.  

ఎన్నికల ఫలితాల తర్వాత గుంటూరు జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. నరసరావుపేటలో కోడెలకు వ్యతిరేకంగా తెలుగుదేశంలోని ఒక వర్గం గుంటూరులోని టీడీపీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించింది. పొమ్మనకుండా పొగబెట్టి కోడెలను పార్టీ నుంచి సాగనంప డానికి చంద్రబాబే కోడెల వ్యతిరేక వర్గంతో.. పార్టీ కార్యాలయం ముందు ధర్నా చేయించారని పార్టీలో చర్చ సాగింది. గుంటూరులోని పార్టీ కార్యాలయానికి కోడెల వెళ్ళినపుడు ఆయనతో చంద్రబాబు అంటీముట్టనట్లుగా వ్యవహరించారన్న వార్తలు కూడా వచ్చాయి. ఇక పెయిడ్‌ ఆర్టిస్ట్‌లతో చంద్రబాబు చేయించిన ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి కోడెలను రావొద్దంటూ కబురు చేశారన్న వార్త మీడియాకు లీక్‌ చేశారు. కోడెల కుమారుడి ఆఫీస్‌లో అసెంబ్లీ ఫర్నిచర్‌ దొరికిన అంశంలో సీనియర్‌ నేతతో పార్టీ కార్యాలయంలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేయించి ‘కోడెల ఫర్నిచర్‌ను తరలించడం వల్ల పార్టీకి అప్రదిష్ట కలిగింది’ అని మాట్లాడించారు.

చంద్రబాబు చౌకబారు రాజకీయాన్ని కోడెల తట్టుకోలేకపోయారు. చంద్రబాబు కావాలనే తనను నిర్లక్ష్యం చేస్తున్నారని, తనను వదిలించుకోవడానికే జూనియర్‌ నేతలతో విమర్శలు చేయిస్తున్నారని గ్రహించి అవమానపడ్డారు. దాంతో కోడెల నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశారు. సకాలంలో కుటుంబ సభ్యులు స్పందించి ఆసుపత్రిలో చేర్పించడంతో ఆయనకు అప్పుడు ప్రాణాపాయం తప్పింది. పార్టీ పరువు పోతుందనే ఉద్దేశంతో గుండె నొప్పితో కోడెల ఆసుపత్రిలో చేరారంటూ పార్టీ నేతలతో చెప్పించారు. ఆరు పర్యాయాలు శాసనసభ్యుడిగా, సుదీర్ఘ కాలం మంత్రిగా, ఐదేళ్లు స్పీకర్‌గా పనిచేసిన కోడెల ఆత్మ హత్యాయత్నం చేశారని తెలిసి కూడా చంద్రబాబు ఆయనను పరామర్శించలేదు. పైగా డాక్టర్‌ కోడెలకు ఉన్న ఆసుపత్రి గుంటూరు నగరంలోనే ఉంది. గుంటూరులోనే ఉన్న పార్టీ కార్యాలయానికి చంద్రబాబు రోజూ వెళుతుంటారు. కానీ, ఐదు నిమిషాల సమయాన్ని కోడెలను పరామర్శించడానికి కేటాయించలేకపోయారు.
 
అధికారం కోల్పోయాక, మాజీ స్పీకర్‌గా మిగిలిన కోడెలతో అక్కర తీరిపోయిందని చంద్రబాబు భావించి నందునే ఆయనంతట ఆయనే పార్టీ నుంచి నిష్క్రమించే పరిస్థితుల్ని చంద్రబాబు సృష్టించారన్నది తేటతెల్లం. అయితే, కోడెల ఆత్మహత్య అంశాన్ని అధికార పక్షం మీద ఆయుధంగా ఉపయోగించుకోవడానికి చంద్రబాబు చకచకా పావులు కదిపారు. అంతకు ఒకరోజు ముందు ఆయన కుమార్తె మీడియా ముందుకొచ్చి స్వయంగా ‘జరిగిందేదో జరిగింది. మమ్మల్ని వదిలివేయండి. రాజకీయం చేయకండి’ అని వేడుకొన్నారు. తరువాత ఎవరి ప్రోద్భలంతో వెంటనే మాట మార్చారో ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది.  

కోడెల బీజేపీలో చేరడానికి సంప్రదింపులు జరిపారని ఆ పార్టీ నేతలు బయట పెట్టడంతో.. చంద్రబాబు ప్లాన్‌ బెడిసి కొట్టింది. ‘యూజ్‌ అండ్‌ త్రో’ పాలసీకి తాజాగా బలైపోయిన కోడెల ఆత్మకు శాంతి లేకుండా ఆయన ఆత్మహత్యను రాజకీయంగా మలుచుకోవాలనుకుంటున్న చంద్రబాబుది శవరాజకీయమే! వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం, ఆయన నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధి సామాజిక సమానత్వం పునాదులపై ప్రభుత్వం ఏర్పాటు కావడం సహించలేని చంద్రబాబు విధ్వంసకర రాజకీయం వికృతరూపం దాల్చింది.

సి. రామచంద్రయ్య 
వ్యాసకర్త మాజీ ఎంపీ,
అధికార ప్రతినిధి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ

మరిన్ని వార్తలు