వ్యవసాయంపై మళ్లీ శీతకన్ను

15 Feb, 2020 03:53 IST|Sakshi

విశ్లేషణ

భారత ఆర్థిక వ్యవస్థ మందగమనానికి అంతర్జాతీయ కారణాలకంటే వినియోగ డిమాండ్‌ పడిపోవడం, పెట్టుబడులు తగ్గిపోవడమే ప్రధాన కారణమని ఆర్థికరంగ నిపుణులు చాలావరకు ఏకాభిప్రాయానికి వస్తున్నారు. పైగా దేశ స్థూల దేశీయోత్పత్తి 5 శాతంకంటే తక్కువకు పతనమైన నేపథ్యంలో గ్రామీణ జనాభాకు మరింత ఎక్కువగా డబ్బును అందించాల్సి ఉంది. వ్యవసాయానికి ఉద్దీపన ప్యాకేజీలు అందించాల్సి ఉంది. కానీ 2020 బడ్జెట్‌ కూడా వ్యవసాయ రంగ అభివృద్ధి విషయంలో ‘కోల్పోయిన మంచి అవకాశం’ గానే మిగిలిపోయిందనిపిస్తోంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, సాగునీరు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ వంటి కీలక రంగాలకు తాజా బడ్జెట్‌లో కేటాయింపులు పెంచడానికి కేంద్రప్రభుత్వానికి మనసొప్పలేదంటే వ్యవసాయంపై పాలకుల శీతకన్ను ఇంకా కొనసాగుతోందనే చెప్పాల్సి ఉంటుంది.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన 2020 కేంద్రబడ్జెట్‌ ముక్కుసూటిగా చెప్పాలంటే ఒక కోల్పోయిన అవకాశంగానే భావించాల్సి ఉంటుంది. గ్రామీణ వ్యయంలో పతనం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ పడిపోయి ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనివిధంగా దేశ స్థూల దేశీయోత్పత్తే (జీడీపీ) 5 శాతం కంటే తక్కువగా పతనమైపోయిన సమయంలో గ్రామీణ జనాభా చేతుల్లోకి మరింత ఎక్కువగా డబ్బును అందించాల్సి ఉంది. మన వ్యవసాయంలో ఇప్పటికీ దేశంలోని 70 శాతం గృహాలు పాలు పంచుకుంటున్నందున ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేయాలంటే గ్రామీణుల చేతుల్లో మరింత అధికంగా డబ్బు పంపిణీ చేయడం అత్యుత్తమమైన మార్గం. గ్రామీణ వినియోగం ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి పడిపోయిన తరుణంలో పల్లెసీమల్లో ప్రభుత్వ వ్యయాన్ని బాగా పెంచాల్సిన అవసరం ఉంది. అంటే వ్యవసాయానికి ఉద్దీపన ప్యాకేజీలు అందించడం అత్యవసరం.

భారతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనానికి అంతర్జాతీయ కారణాల కంటే దేశీయ కారణాలే ప్రధానమన్నది అందరికీ తెలిసిన విషయమే. అవేమిటంటే డిమాండ్‌ పడిపోవడం, పెట్టుబడులు తగ్గిపోవడం. ఈ దుస్థితినుంచి బయటపడాలంటే వ్యవసాయదారులకు, కూలీలకు ప్రత్యక్ష నగదు మద్దతు రూపంలో మరింత డబ్బు అందేలా చూడటమే మార్గమని చాలామంది ఆర్థికవేత్తలు ఇప్పుడు సూచిస్తున్నారు. జనాభాలోని 60 శాతం మంది అధోజగత్‌ సహోదరుల చేతుల్లో మొత్తం జాతీయ సంపదలో 4.8 శాతం వాటా మాత్రమే ఉంటున్న స్థితిలో ప్రధానమంత్రి–కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకానికి బడ్జెట్‌ కేటాయింపులు పెంచడం అనేది ఒక ఆదర్శపూరితమైన పంథా అవుతుంది.

పీఎమ్‌–కిసాన్‌ పథకానికి కేంద్ర ప్రభుత్వం మరొక రూ.1.50 లక్షల కోట్ల డబ్బును కేటాయించాలని నేను ఇప్పటికే చాలాసార్లు సూచించి ఉన్నాను. అంటే నెలకు దేశంలోని ప్రతి వ్యవసాయ కుటుంబానికి మరొక రూ. 1,500ల డబ్బు ప్రత్యక్ష నగదు మద్దతు రూపంలో అందుతుంది. దీనికి అనుగుణంగానే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రైతులకు అందిస్తున్న వార్షిక మొత్తాన్ని రూ.6,000 నుంచి రూ. 12,000కు రెట్టింపు చేస్తుందని నేను భావించాను. దీనికి అదనంగా జాతీయ పనికి ఆహార పథకం కింద బడ్జెట్‌ కేటాయింపులను ప్రస్తుతం ఉన్న రూ. 70,000 కోట్లను కనీసం లక్ష కోట్ల రూపాయలకు పెంచినట్లయితే అది ఆర్థిక వ్యవస్థపై గణనీయ ప్రభావం చూపిస్తుంది. పైగా వ్యవసాయ కూలీలు అయిదేళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం కూడా పాలకులు గమనించాల్సి ఉండింది. కానీ ప్రధానమంత్రి కిసాన్‌ ప«థకాన్ని, జాతీయ పనికి ఆహార పథకాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడంలో ఆర్థిక మంత్రి విఫలమయ్యారు. ఈ రెండు పథకాలకు బడ్జెట్‌లో ఇతోధికంగా నిధులు కేటాయించి ఉంటే గ్రామీణ వినియోగంలో డిమాండును సృష్టించడం సాధ్యమయ్యేది. ఇది దానికదిగా గ్రామీణ వినియోగాన్ని పెంచి అధిక ఆర్థిక వృద్ధి రేటుకు దోహదపడేది. కానీ దురదృష్టవశాత్తూ వ్యవసాయరంగం, దాని అనుబంధ రంగాలు, సాగునీరు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ వంటి కీలక రంగాలకు తాజా బడ్జెట్‌లో గణనీ యంగా కేటాయింపులు పెంచడానికి కేంద్రప్రభుత్వానికి మనసొప్పినట్లు లేదు.

ఈసారి వ్యవసాయరంగానికి బడ్జెట్‌ కేటాయింపులు రూ. 2.83 లక్షల కోట్లు. అయితే గత సంవత్సరం బడ్జెట్‌లో కేటాయించిన రూ. 2.68 లక్షల కోట్ల అంచనాతో పోలిస్తే తాజా కేటాయింపుల్లో పెద్దగా పెరుగుదల లేనట్లే. వ్యవసాయ రుణాల కల్పనకు మాత్రం గత సంవత్సరంలో కేటాయించిన రూ.13.5 లక్షల కోట్లతో పోలిస్తే ఈ దఫా కాస్త ఎక్కువగా అంటే రూ. 15 లక్షల కోట్ల మేరకు పెంచడం ముదావహం. అయితే ఈరోజుకీ దేశంలోని చిన్న, సన్నకారు రైతుల్లో దాదాపు 41 శాతంమందికి షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకులనుంచి వ్యవసాయ రుణాలు అందడం లేదని పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన కీలకమైన విషయం ఏమిటంటే ఇప్పుడు రైతులకు కావలసింది మరింత రుణం కాదు. వారికి అధిక ఆదాయాన్ని కల్పించడమే ప్రస్తుత తక్షణ కర్తవ్యం.

నిజం చెప్పాలంటే ఆహార సబ్సిడీకి బడ్జెట్‌ కేటాయింపులు గత సంవత్సరంలోని రూ.1.84 లక్షల కోట్లతో పోలిస్తే ఈ సంవత్సరం 1.15 లక్షల కోట్ల రూపాయలకు తగ్గించివేయడం దారుణం. ఈ వ్యవహారాన్ని మరింత లోతుగా పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వం ధాన్య సేకరణ కార్యకలాపాలనుంచి మొత్తంగా వైదొలగాలనే ఉద్దేశంతో ఉందా అని పలు సందేహాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు వ్యవసాయ గ్రూపులు ఈ అంశంపై తమ ఆందోళనను చాటి చెప్పాయి. దానికి తగినట్లుగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభంలోనే వ్యవసాయ మార్కెట్లను సరళీకరించడం గురించి మాట్లాడారు. దీంతో దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న ఆహార సబ్సిడీలపై ఎన్డీఏ ప్రభుత్వం కోత విధించబోతోందన్న భయాందోళనలు వ్యవసాయదారుల్లో, రైతు సంఘాల్లో పెరిగిపోయాయి. దీనికి తగినట్లుగానే వ్యవసాయ మదుపులు, ధరల కమిషన్‌ (సీఏసీపీ) బహిరంగ మార్కెట్లో ధాన్య సేకరణ విధానాన్ని నిలిపివేయాలని సిఫార్సు చేసింది. ఇది చాలా ప్రాధాన్యత కలిగిన అంశం. ఇప్పటికే దేశ ధాన్యాగారాలుగా పేరొందిన పంజాబ్, హరియాణా రాష్ట్రాలు ధాన్య సేకరణను గణనీయంగా తగ్గించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. పంజాబ్‌ ఇప్పటికే ధాన్య సేకరణలో ప్రైవేట్‌ రంగం భాగస్వామ్యాన్ని అనుమతిస్తూ చట్టాలను తదనుగుణంగా సవరించింది కూడా. అలాగే ప్రైవేట్‌ మండీలను కూడా ప్రారంభించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నడుం కడుతోంది.

ఆకాంక్షల భారత్‌లో భాగంగా దేశీయ వ్యవసాయరంగాన్ని కార్పొరేట్‌ వ్యవసాయం వైపుగా మార్చేందుకు రోడ్‌ మ్యాప్‌ అందించడం గురించి ఆర్థిక మంత్రి 16 సూత్రాల కార్యాచరణపై మాట్లాడారు. గతంలో ప్రతిపాదించిన త్రీ మోడల్‌ చట్టాలను అమలుపర్చిన రాష్ట్రాలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని నిర్మలా సీతారామన్‌ నొక్కి చెప్పారు. ఈ మూడు మోడల్‌ చట్టాలకు భూమి కౌలు చట్టం, మార్కెట్‌ సరళీకరణ, కాంట్రాక్టు వ్యవసాయంతో నేరుగా సంబంధం ఉందని గమనించాలి. వ్యవసాయరంగంలో పోటీ తత్వాన్ని పెంచాల్సిన అవసరముం దని ఆర్థిక మంత్రి చెబుతూ, 2025 నాటికి పాల ప్రాసెసింగ్‌ను రెట్టింపు చేసే పథకాలను కొన్నింటిని పేర్కొన్నారు. అలాగే 2025 నాటికి దేశీయ మత్స్య ఉత్పత్తిని 2 కోట్ల టన్నులకు పెంచడం, కమోడిటీ ట్రేడింగ్‌ని ప్రోత్సహించడానికి ఈ–నామ్‌తో వేర్‌హౌసింగ్‌ రిసిప్టులపై ఫైనాన్స్‌ని ప్రోత్సహించడం గురించి కూడా నిర్మల ప్రతిపాదనలుచేశారు. త్వరగా పాడైపోయే సరకులను రవాణా చేయడానికి కిసాన్‌ రెయిల్, కిసాన్‌ ఉడాన్‌ను ప్రారంభించడం వల్ల వ్యవసాయ వాణిజ్య కంపెనీలకు లబ్ధి చేకూరుతుందని కూడా ఆమె పేర్కొన్నారు. 16 సూత్రాల కార్యాచరణ పథకం గురించి ఆమె చెప్పిన అంశాలు మునుపటి బడ్జెట్లలో కూడా ప్రస్తావించారు, చర్చించారు కానీ ఈ పథకాలకు ప్రత్యేకంగా కేటాయింపులు జరిగినట్లు కనిపించడం లేదు.

భవిష్యత్తులో వ్యవసాయరంగం పయనించాల్సిన దిశ కోసం ఒక స్పష్టమైన రోడ్‌ మ్యాప్‌ రూపొందించడం కచ్చితంగా సరైనదే కానీ ఈ మార్గాన్ని ఎంత సమర్థంగా రూపొందిస్తారు అనేది ముందుగా స్పష్టం కావాలి. ఇప్పటికే మన వ్యవసాయరంగంలో తీసుకొచ్చిన చాలా సంస్కరణలు అమెరికా, యూరోపియన్‌ యూనియన్ల నుంచి అరువు తెచ్చుకున్నవే. అయితే ఇలా అరువు తెచ్చుకున్న విధానాలు ప్రభావవంతమైనవే అయినట్లయితే అమెరికా, ఈయూలో కూడా వ్యవసాయరంగం ఎందుకు దుస్థితికి గురవుతోందన్నది ఆలోచించాల్సిన విషయం.అమెరికాలో గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న ఆత్మహత్యలు ఆ దేశంలోని పట్టణ కేంద్రాల్లో జరుగుతున్న ఆత్మహత్యల కంటే 45 శాతం అధికంగా నమోదవుతున్నాయి. పైగా, 1960ల నుంచి అమెరికాలో నిజ వ్యవసాయ ఆదాయం పెరుగుదల క్రమంగా పతనమవుతూ వచ్చింది. అందుచేత పాశ్చాత్య నమూనాలను అనుకరించడం కంటే గ్రామీణ సౌభాగ్యాన్ని, సంపదను పెంచిపోషించేలా మన వ్యవసాయరంగాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది.

దేవీందర్‌ శర్మ 
వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు
ఈ–మెయిల్‌ : hunger55@gmail.com

మరిన్ని వార్తలు