రైతును ‘రెవెన్యూ’తో కలపాలి

3 Dec, 2019 03:02 IST|Sakshi

సందర్భం

ఇటీవల అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దారు విజయారెడ్డి సజీవదహనం ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనకు కారణమైన భూములు, దాని వెనుక ఉన్న రాజకీయ నాయకుల వంటి అంశాలు పక్కకు పోయి రెవెన్యూ శాఖపై ప్రజల ఆగ్రహానికి దారి తీయడం కొంత ఇబ్బంది కలిగించే అంశం. ఈ వివాదాలన్నిటికీ నిజాం కాలం నాటి సర్వేనే ఇప్పటికీ అమల్లోకి ఉండడం, చట్టాలలో లొసుగులు కారణం. 1936–  42 వరకు తెలంగాణ వ్యాప్తంగా భూ సర్వే జరిగింది. అప్పుడే రికార్డులు అమలు అయినాయి. ఎక్కువ భాగం భూములన్నీ భూస్వాముల చేతుల్లో కేంద్రీకృతమైనందున, సన్న, చిన్నకారు రైతులకు నామ మాత్రంగా భూములుండటంతో భూ వివాదాలు చోటు చేసుకోలేదు.  

తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో ‘‘దున్నే వాడికే భూమి’’ అనే నినాదం తెరపైకి రావడంతో లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు, కౌలు భూములు పేదలకు ధారాదత్తం అయినాయి. అయితే చాలా చోట్ల సర్వే నంబర్ల హద్దు తొలగించడంతో భూ వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఫలితంగా రెవెన్యూ చట్టానికి  కొన్ని సవరణలు తెచ్చారు. అందులో అసైన్‌మెంట్‌ చట్టం, కౌలుదారుల హక్కుల చట్టం, ఇనాం భూముల చట్టం, దేవాదాయ, వక్ఫ్‌ భూములలాంటివి ఎన్నో. అంతే కాకుండా రికార్డులను సరి చేయడానికి ‘‘రికార్డ్స్‌ ఆఫ్‌  రైట్‌’’ ద్వారా పాసు పుస్తకాలివ్వడంలాంటివి జరిగాయి.  పహానిలో విధిగా అనుభవదారు కాలం పెట్టి, ప్రతి సంవత్సరం పంట వివరాలు రాస్తూ, గ్రామసభల ద్వారా తెలియపరచాలి. అప్పుడు రైతు భూమి వివరాలు, రెవెన్యూ శాఖకు సంబంధం ఏర్పడుతుంది.

ప్రభుత్వం తక్షణమే రెవెన్యూ చట్టాల మార్పు నకు నడుం బిగించాలి. ప్రజలు కేంద్రంగా ఉండే విధంగా రెవెన్యూ చట్టాలు మార్చాలి. అందుకు కొన్ని సూచనలు 
1.గ్రామస్థాయిలో శాస్త్రీయ పద్ధతులలో సమగ్ర భూసర్వే ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలి. అందుకు తగిన రీతిలో ప్రభుత్వం రూపొందించే రెవెన్యూ బిల్లుపై విస్తృతస్థాయి చర్చకు అవకాశం కల్పించాలి.  
2.తక్షణమే శాస్త్రీయ పద్ధతిలో భూ సర్వే చేపట్టాలి. గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టం, సాటిలైట్‌ ఇమేజినరీ టెక్నాలజీ, జియోగ్రాఫికల్‌ ఇన్ఫర్మేషన్‌ వంటి టెక్నాలజీని వినియోగించాలి. ప్రతి సర్వే నెంబర్‌ హద్దులను నిర్ణయించి, హద్దురాళ్ళును పాతించి, శాశ్వతంగా వివాదాలను పరిష్కరించాలి. 
3.రెవెన్యూ పరిపాలన గ్రామస్థాయి నుండి వేళ్ళూనటానికి, సమస్యలు పరిష్కారం కావడానికి గ్రామస్థాయిలో విధిగా రెవెన్యూ అధికారిని నియమించాలి.  
4.వారసత్వం, కుటుంబ భూ పంపకం, క్రయవిక్రయాలు, గిఫ్టు డీడ్, కోర్టు డిక్రి, అసైన్‌మెంట్‌ ద్వారా పొందే భూములకు భూమిపై హక్కు కల్పించే క్రమాన్ని పూర్తి చేయడానికి సంబంధిత రెవెన్యూ అధికారికి నిర్ధిష్టకాల పరిమితి విధించాలి.  
5.పెండింగ్‌లో వున్న సాదాబైనామాల క్రయవిక్రయాల దరఖాస్తులను వీలైనంత త్వరగా క్రమబద్దీకరణ చేయడానికి పూనుకోవాలి.  
6.రికార్డు ఆఫ్‌ రైటస్‌ (ఆర్‌.వొ.ఆర్‌) చట్టంలో వున్న లొసుగులను తొలగించాలి. 
7.పట్టాదారు పాసుపుస్తకాలలో అవకతవకలను సరిదిద్దాలి.  
8.అటవీ శాఖ, రెవెన్యూశాఖల స్వాధీనంలోని భూముల హద్దులను తక్షణమే సరిచేయాలి. 
9.పోడు భూముల సమస్యను పరిష్కరించాలి. అటవీ హక్కుల చట్టం కింద గిరిజనులకు పట్టాలివ్వాలి. 
10.కోనేరు రంగారావు కమిటీ చేసిన 104 సిఫారసులను దృష్టిలో ఉంచుకొని రెవెన్యూ చట్టాలను సవరించడం సబబుగా ఉంటుంది.  
11.రికార్డులను తారుమారు చేసినా, తప్పులతో నమోదు చేసినా కారకులైన సిబ్బందిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి. 
12.రెవెన్యూ శాఖతో రైతుల సంబంధాల పునరుద్ధరణ కొరకు తగు కార్యాచరణ ఉండాలి.  
13.హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో భూములను హెచ్‌ఎండిఎ తదితర సంస్థలు వేలం వేసే భూముల్లో ప్రభుత్వమే అపార్ట్‌మెంట్‌లు కట్టించి అందుబాటు ధరలో కేటాయించాలి. 

వ్యాసకర్త: చాడ వెంకటరెడ్డి
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి 
మొబైల్‌ : 94909 52301

మరిన్ని వార్తలు