స్వీయ తప్పిదాలతోనే ఈ దుస్థితి

13 Feb, 2020 04:01 IST|Sakshi

విశ్లేషణ

రాజకీయ ప్రాధాన్యత గలిగిన ఏ చిన్న అంశాన్నీ వదలకుండా అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా మీడియా సమావేశాలను నిర్వహించి గంటల కొద్దీ తెచ్చిపెట్టుకొన్న ఆవేశం, ఆవేదనతో మాట్లాడే అలవాటు ఉన్న చంద్రబాబు తన వ్యక్తిగత సహాయకుడిపై, తదితరులపై తాజా ఐటీ దాడుల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? 2050 వరకు తామే అధికారంలో  ఉంటామనే ధీమాతో చట్టాల్ని చాపలా చుట్టిన చంద్రబాబు అండ్‌ కోకు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. అధికారంలో ఉండగా చంద్రబాబు, ఆయన తాబేదార్లుగా పనిచేసిన అధికారులు పాల్పడిన అవినీతి, అక్రమాలపై కేంద్రప్రభుత్వ సంస్థలు నేడు దృష్టి సారించాయి. వాటి లోతు తెలుసు కాబట్టే బాబు తన అనుయాయులపై ఐటీదాడుల పట్ల వ్యాఖ్యానించకుండా కుక్కిన పేనులా పడిఉంటున్నారు. చంద్రబాబు స్వయంకృత పాపాల పంట పండుతున్నట్లుంది.

‘చట్టం ఎవరికీ చుట్టం కాదు’ ఓ పాపులర్‌ తెలుగు సినిమాలో విలన్‌ను ఉద్దేశించి హీరో పలికిన డైలాగ్‌ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుకు, అధికారంలో ఉండగా ఆయనకు తాబేదార్లుగా పనిచేసిన కొంత మంది అధికారులకు సరిగ్గా అన్వయిస్తుంది. 2050 వరకు తామే అధికారంలో  ఉంటామనే ధీమాతో చట్టాల్ని చాపలా చుట్టిన చంద్రబాబు అండ్‌ కోకు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. పాపాలు చేస్తే అవి వెంటాడటం, మెడకు చుట్టుకోవడం ఎవరికైనా సహజమే. ఇందుకు అనుగుణంగానే చంద్రబాబుకు బినామీలుగా, తాబేదారులుగా వ్యవహరించి ప్రజాధనాన్ని కొల్లగొట్టిన కొందరు వ్యక్తులపై చట్టం తన పని తాను చేసుకుపోతోంది. కొన్ని వ్యవస్థలను తన అదుపాజ్ఞల్లో ఉంచుకోగలిగిన ‘రాజకీయ కళ’ చంద్రబాబుకు ఉన్న మాట నిజం. కానీ, చంద్రబాబు విద్యల కంటే ‘చట్టం’ గొప్పది. కొంత ఆలస్యం కావచ్చునేమోగానీ.. అక్రమాలను కప్పిపుచ్చడం ఎవరికీ సాధ్యం కాదు.

15 ఏళ్లపాటు తన వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన ఓ సాధారణ ప్రభుత్వోద్యోగి ఇంటి మీద ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారుల బృందం 5 రోజులపాటు నిర్విరామంగా సోదాలు నిర్వహించి పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకొన్న ఉదంతంలో రోజులు గడుస్తున్నా పల్లెత్తు వ్యాఖ్య చేయడానికి చంద్రబాబు సాహసించలేకపోతున్నారు. కొన్ని నెలల క్రితం వరకూ.. టీడీపీకి చెందిన వ్యక్తులు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన కేసుల్లో, ఆదాయపు పన్ను ఎగవేసిన ఉదంతాల్లో చట్టం తన పని తాను చేసుకుపోయినా.. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు.. అవన్నీ పనిగట్టుకొని ప్రధాని నరేంద్ర మోదీ చేయిస్తున్నాడంటూ నిందించారు. ప్రస్తుతం.. తన పార్టీకి చెందిన కీలక వ్యక్తులు, వారి బంధుగణం పాల్పడిన అక్రమాలపై ఆదాయపన్ను శాఖ దర్యాప్తులో భాగంగా దాడులు చేసినప్పటికీ.. చంద్రబాబు మూగనోము పట్టారు. రాజకీయ ప్రాధాన్యత గలిగిన ఏ చిన్న అంశాన్నీ వదలకుండా అర్థరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా మీడియా సమావేశాలను నిర్వహించి గంటల కొద్దీ తెచ్చిపెట్టుకొన్న ఆవేశం, ఆవేదనతో మాట్లాడే అలవాటు ఉన్న చంద్రబాబు ఈ ఐటీ దాడులపై ఎందుకు మాట్లాడటం లేదు?

చంద్రబాబు ఐదేళ్ల అవినీతి పాలనలో అడుగడుగునా అవినీతి పుట్టలు పుట్టుకొచ్చాయి. సొంత సామాజిక వర్గానికి చెందిన కొందరు ఉన్నతాధికారులను దగ్గర పెట్టుకొని.. చట్టవిరుద్ధమైన, రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు చంద్రబాబు పాల్పడ్డారు. ఒకరిద్దరు అధికారులు ‘సర్వంతామే’ అన్నట్లు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా మారి చంద్రబాబు చెప్పినదల్లా చేశారు. చెప్పనివి కూడా చేసిపెట్టారు.  ప్రభుత్వంలోని అనేక పనులను అస్మదీయులకు దఖలు పరిచారు. ఇవన్నీ చేసిపెట్టిన అధికారులు చేతివాటం ప్రదర్శించి కోట్లు కొల్లగొట్టినా చంద్రబాబు పట్టించుకోలేదు సరికదా.. వారికి మితిమీరిన స్వేచ్ఛ కల్పించారు. చంద్రబాబు ‘నరేంద్రమోదీ’ని ఏపీ ప్రజల దృష్టిలో విలన్‌గా చిత్రీకరించడానికి తెర వెనుక అనేక ప్రయత్నాలు చేశారు. సోషల్‌ మీడియాను ఉపయోగించుకొని నరేంద్రమోదీ, అమిత్‌షాలపై దారుణమైన పోస్టింగ్‌లు పెట్టారు. తనకు అనుకూలమైన ఓ దినపత్రికలో నరేంద్రమోదీ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఓ మానసిక విశ్లేషకుడితో  జుగుప్సాకరమైన రాతలు రాయించారు. విజయవాడలో ప్రజాధనంతో ‘ధర్మదీక్ష’ పేరుతో నిర్వహించిన సభలో  సినీనటుడు బాలకృష్ణ.. ప్రధాన మంత్రిని పచ్చిబూతులు తిడుతుంటే.. సీఎంగా ఉన్న బాబు ఆ మాటల్ని ఆమోదిస్తున్నట్టుగా నిర్వికారంగా ఉండటం ‘యూట్యూబ్‌’లో ఇప్పటికీ కనిపిస్తుంది. సినీ నటుడు శివాజీ అనే వ్యక్తితో ‘గరుడపురాణం’ పేరుతో.. కొన్నాళ్లు రోజువారీ సీరియల్‌ నడిపించారు. మోదీ.. టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చబోతున్నారని, అందుకు వేలకోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని ఊదరగొట్టారు.

దేశ రాజకీయాల్లో మరోసారి చక్రం తిప్పాలన్న ఆశతో చంద్రబాబు.. రాష్ట్ర ప్రయోజనాలను, దాంతోపాటు పార్టీ సిద్ధాంతాలను కాలరాసి కాంగ్రెస్‌ పార్టీతో అంటకాగటం ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనం. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నప్పుడే గుజరాత్‌ రాష్ట్రానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి కాంగ్రెస్‌ పార్టీకి చంద్రబాబు రహస్యంగా నిధులు సమకూర్చారన్న వార్త గుప్పుమంది. ఆ తర్వాత కర్ణాటక అసెంబ్లీలో ఎన్నికల సమయానికి.. చంద్రబాబు పూర్తిగా కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరయ్యారు. ఆ రాష్ట్రంలో బీజేపీని ఓడించడానికి చంద్రబాబు కాంగ్రెస్, జేడి(ఎస్‌)లకు ఇతోధికంగా సహాయం చేశారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో కూడా చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీకి సహకరించారు. ఆ 3 రాష్ట్రాలలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే చంద్రబాబు స్వయంగా మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్‌ పార్టీ గెలవడంలో నా పాత్ర కూడా ఉంది’’ అని వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీకి చంద్రబాబు సహకారం అంతటితో ఆగలేదు. చతికిలపడిన కాంగ్రెస్‌ పార్టీకి జవసత్వాలు ఊది నరేంద్ర మోదీని గద్దె దించడానికి చంద్రబాబు ఎన్నో ఎత్తులు వేశారు. ఎన్డీఏ వ్యతిరేక పార్టీలను దగ్గర చేసి యూపీఏ–3 గొడుగు కిందికి తేవడానికి చంద్రబాబు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. అందులో ప్రధానమైనది నిధులలేమితో కునారిల్లుతున్న కాంగ్రెస్‌ పార్టీకి పెద్దఎత్తున ఆర్థిక సాయం చేయడం. ఆ క్రమంలోనే తెలంగాణ ఎన్నికలలో, లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి సంపూర్ణ సహాయ సహకారాలు అందించారన్న సమాచారాన్ని బీజేపీ పసిగట్టింది. చంద్రబాబు ఏ విధంగా నిధులు సమీకరించారు.. వాటిని ఏ విధంగా ఏయే వ్యక్తుల ద్వారా.. ఏయే మార్గాలలో చేరవేశారన్న పక్కా సమాచారం కేంద్రం వద్ద ఉందని బీజేపీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఆనాడు చంద్రబాబు, ఆయన తాబేదార్లుగా పనిచేసిన అధికారులు పాల్పడిన అవినీతి, అక్రమాలపై కేంద్రప్రభుత్వ సంస్థలు నేడు దృష్టి సారించాయి.
 
చంద్రబాబు చేసిన అనేక తప్పులు, మోసాలు, పాపాలకు బదులుగా ప్రజలు తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలతో కనాకష్టంగా ప్రతిపక్ష హోదాకు పరిమితం చేశారు. ప్రజలిచ్చిన తిరుగులేని తీర్పు చంద్రబాబు ఓటమిలో ఒక పార్శ్వం మాత్రమే. చంద్రబాబు ఓటమిలో రెండో పార్శ్వం ప్రజల తీర్పును వమ్ము చేసి స్వార్థంతో తను, తన అనుచర వర్గం ఆర్థికంగా బలోపేతం కావడానికి అక్రమాలకు పాల్ప డటం. దీనికి చట్ట ప్రకారం శిక్షపడాల్సిన అవసరం ఉంది. అయితే, ప్రజల దృష్టిని మరల్చడానికి, తానేమీ అన్యాయాలు, అక్రమాలకు పాల్పడలేదని చెప్పుకోవడానికి చంద్రబాబు గత 7 నెలలుగా అధికార వైఎస్సార్‌సీపీపై తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు. ముఖ్యంగా అమరావతి ప్రాంతంలోని 23 గ్రామాలకు చెందిన రైతులతో దీక్షలు, ఉద్యమాల పేరుతో చేయిస్తున్న క్రతువును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రాజధాని రైతులకు ఎటువంటి అన్యాయం జరగదని ముఖ్యమంత్రి మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ.. రాజధాని రైతులు దీక్షలు విరమించకుండా చంద్రబాబు, ఆయన సృష్టించిన కొంత మంది రెడీమేడ్‌ నాయకులు వారిని రెచ్చగొడుతున్నారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తలపెట్టిన అధికార వికేంద్రీకరణను అడ్డుకోవడానికి చంద్రబాబు రైతులను పావులుగా వాడుకుంటున్నారు. నిజానికి, రైతులు ఉద్యమించాల్సింది చంద్రబాబుకి వ్యతిరేకంగా! ఐదేళ్లలో చంద్రబాబు తమకు ఎందుకు న్యాయం చేయలేదో రైతులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. తమ భూములను కొన్ని సంస్థలకు ఎందుకు కారుచౌకగా కట్టబెట్టాడో, తమకు ఇస్తామన్న భూములను ఎందుకు అభివృద్ధి చేసి ఇవ్వలేదో రైతులు చంద్రబాబును ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అమరావతి వద్దనే లక్ష కోట్లు పెట్టుబడి పెడితేనే 29 గ్రామాల రైతులకు న్యాయం జరుగుతుందా? రైతులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అనేక మంది రైతులు చంద్రబాబు ఉచ్చులో చిక్కుకున్నారు. కొన్ని పత్రికలు, చానళ్లు చంద్రబాబుకు వంతపాడుతూ రైతులను రెచ్చగొట్టడం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు  ప్రయోజనాలకు గొడుగుపట్టే కొంతమంది ఇతర పార్టీల్లోని అగ్రనేతలు.. అమరావతిపై చంద్రబాబు అనుకూల ధోరణి, వాణిని వినిపించడం సిగ్గుచేటు. చంద్రబాబు విష కౌగిలి కారణంగానే.. ఎంతో చరిత్ర కలిగిన కొన్ని పార్టీలు నామమాత్రంగా మిగిలాయి. చంద్రబాబు విష పరిష్వంగం నుంచి బయటపడకపోతే ఆ పార్టీలను, నాయకులను చరిత్ర క్షమించదు. చంద్రబాబు దళం ఆంధ్రప్రదేశ్‌ బీజేపీని హస్తగతం చేసుకొని, బాబు ఎజెండాను అమలు చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీ కేంద్ర నాయకత్వంపై ఉంది. ప్రజలు తిరస్కరించిన చంద్రబాబును రాజకీయంగా ఆదరిస్తే అంతే సంగతులు!

వ్యాసకర్త మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి
సి. రామచంద్రయ్య

 

>
మరిన్ని వార్తలు