అమరావతి మూలాలు తెలియని బాబు..!

15 Jul, 2018 09:08 IST|Sakshi

సందర్భం

చంద్రబాబుకు సింగపూర్‌ నమూనాపై విపరీతమైన మోజు ఉంది. ఆయన బుర్ర నిండా అమెరికా తరహా అభివృద్ధి సాధించాలనే ఆలోచనలే ఉన్నాయి. నిజానికి ఈ రెండూ ప్రధానంగా వ్యాపార దేశాలు. కానీ ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరులు, సహజ వనరులు పుష్కలంగా ఉన్న ఉత్పత్తి కేంద్రం. ఈ రెంటినీ సమన్వయంచేసి, సంపదను వృద్ధి చేయాల్సిన బాబు ఆ పనిచేయడం లేదు. దేశదేశాలు తిరిగి టెక్నాలజీని కూడా అడుక్కోవడం భావదారిద్య్రానికి గుర్తు. చంద్రబాబు వల్లే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాల నినాదాలు చేసే పరిస్థితులు ముందుకు వస్తున్నాయి. అందుకే రాష్ట్ర పాలనా వికేంద్రీకరణ జరగాలి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో కట్టే భవనాల గురించి సింగపూర్‌లో ఇటీవల దృశ్య శ్రవణ విన్యాసాలు చేసి వచ్చారు. ఆంధ్రుల సాంస్కృతిక భౌగోళిక చారిత్రక పునాదులు ఆయనకు బొత్తిగా తెలియవని అర్థమౌతోంది. క్రీస్తు పూర్వం రెండో శతాబ్దిలోనే అత్యున్నత నగర నిర్మాణ ప్రావీణ్యం కలిగింది అమరావతి. కృష్ణా నదికి రెండు వైపులా నీటి అద్దంలో భవంతులు కనపడేంత ఎత్తులో అమరావతి నిర్మాణం జరిగింది. ప్రధానంగా అమరావతి ప్రాంతపు నేల చెట్లు, చేమలతో కూడిన విశాలమైన గృహనిర్మాణానికి అనువైంది. ఇక్కడ ఎత్తయిన భవనాలు దీర్ఘకాలం నిలవవు. నిజానికి ఎత్తయిన భవనాల్లో గాలి, నీరు, వెలుతురు తగినంత చేకూరవు. మొదట్లో పూరిళ్లు, తర్వాత పెంకుటిళ్లు చుట్టూ వేప, రావి, గోరింటాకు చెట్లతో నిర్మించుకొనేవారు. వారికి ఈ నేల మీద స్పష్టమైన అవగాహన ఉంది.

చంద్రబాబుకు ఆంధ్రుల భౌగోళిక అంశాలపై అధ్యయనం లేదు. ఈ ప్రాంతమంతా బౌద్ధభూమి. అమరావతి నుంచి భట్టిప్రోలు వరకు, ఇంకా అనంతపురం వరకు బౌద్ధ చైత్యాలే. అవేవీ బహుళ అంతస్తుల మేడలు కాదు. అందుకే ఇంతకాలం ఉన్నాయి. ముఖ్యమంత్రి ఒక అమరావతినే కాదు మొత్తం రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకొని రాజధాని నిర్మించాలి. అప్పుడే ఆంధ్రులకు పరిపాలనా సమతుల్యత ఏర్పడుతుంది. హైదరాబాద్‌ రాజధానిగా ఉండగా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందలేదు. ఇప్పటికీ విశాఖపట్నానికి నగరశోభ రాలేదు. రాష్ట్రానికి ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఉండగా రెండు ఉప రాజధానులు ఉంటే మంచిది. అప్పుడు పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది. మొదట ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలు అయ్యింది. భాషా ప్రయుక్త ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌ హైదరాబాద్‌ రాజధానిగా అవతరించకపోయి ఉంటే ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా కర్నూలు, రాయలసీమ చాలా అభివృద్ధి చెందేవి. రాయలసీమ ఒకనాడు రత్నగడ్డ. స్వాతంత్య్రం వచ్చాక నిజంగా చెరువులన్నీ భూస్వాములు ఆక్రమించాక రాయలసీమలో నీటి పారుదల వ్యవస్ధ నాశనమైంది. కర్నూలు జిల్లాకు చెందిన కె.ఇ.కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రిగా, రెవెన్యూ మంత్రిగా ఉన్నాగాని అక్కడి నీటి పారుదల వ్యవస్థ దిగజారిందే గాని అభివృద్ధి చెందలేదు. దళిత బలహీన వర్గాలేగాక, పేద రైతులు కూడా పంటలు లేక మరింత పేదలవుతున్నారు. 

రాయలసీమలో పుట్టిన చంద్రబాబు నాయుడు పాలనలో ఈ ప్రాంతంలో విద్యాప్రమాణాలు మరింత దిగజారాయి. ఉదాహరణకు ఒక్క గుంటూరు జిల్లాలోనే 4 లక్షల మంది పిల్లలు, కృష్ణా జిల్లాలో 5 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చదువుతుండగా, కర్నూలు జిల్లాలో ప్రైమరీ స్కూళ్లు 394, అప్పర్‌ ప్రైమరీ స్కూళ్లు 284. ఈ పాఠశాలల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 2,01,199 మాత్రమే. కోస్తా జిల్లాలతో పోల్చితే రాయలసీమలో పాఠశాలల సంఖ్య బాగా తక్కువ. కొన్ని వందల గ్రామాల్లో పాఠశాలలు, లేవు. గ్రంథాలయాలు కనిపించవు. దిన పత్రికలు కూడా వెళ్లని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. రాయలసీమలో అక్షరాలు కూడా రాని ప్రజలు గణనీయ సంఖ్యలో ఉన్నారు.

చంద్రబాబు కుమారుడు, రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్‌ ఇటీవల కర్నూలులో మాట్లాడుతూ, గ్రామ స్వరాజ్యం తెస్తానని, ఇంటికో కుళాయి వేయిస్తానని హామీ ఇచ్చారు. ఆయన తండ్రి అంతకు ముందు ఉమ్మడి ఏపీకి తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేశారు. తెలంగాణ అవతరించాక ఏపీ సీఎంగా గత నాలుగేళ్లుగా పదవిలో ఉన్నారు. అయినా, ఎందుకు రాయలసీమ ప్రజలందరికీ మంచినీరు కూడా ఇవ్వలేకపోతున్నారు? మరి సీమ ప్రజలు తమ ప్రాంతంలో తగినన్ని వర్షాలు లేక ఇతర నగరాలకు వలసపోతున్నారు. వారు బెంగళూరులో రాళ్ళు మోస్తున్నారు. కేరళలో నిర్మాణం పనుల్లో కూలీలుగా బతుకుతున్నారు. చెన్నైలో భవన నిర్మాణానికి రాళ్లు ఎత్తుతూ పొట్ట నింపుకుంటున్నారు. ఇలా రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్ర రాజధానుల్లో కూలీలుగా పనిచేయడానికి వలసపోవడం చూసి చంద్రబాబు, లోకేష్‌కు బాధ కలగడం లేదా?

రాష్ట్ర బడ్జెట్‌ రూ.1,56,000 కోట్లు. ఇంతటి బడ్జెట్‌ ఉన్నా, కేంద్రం నుంచి వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి వచ్చిన నిధులు చేతిలో పెట్టుకొని మంచినీళ్లు కూడా లేని పరిస్థితిని ఎందుకు తెచ్చారు? నాకు తెలిసిన మిత్రుడు ఒకరు పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీరు దొరకని ఊళ్లు రాయలసీమలో ఉన్నాయని చెప్పారు. ఉత్తరాంధ్రలోని అటవీ ప్రాంతం పాడేరులో విషజ్వరాలతో మరణించిన గిరిజన కుటుంబాల గురించి లోకేష్‌ ఏమి ఆలోచిస్తున్నారు. స్వాతంత్య్రోద్యమంలో పోరాడిన మన ప్రాంత ప్రజలు ఇప్పుడు ఎందుకు రోగాల బారిన పడుతున్నారో ఆలోచించాల్సిన అవసరం పంచాయతీరాజ్‌ మంత్రిగా ఆయనకు లేదా? రాజకీయ ప్రకటనలు చేసే సభలో అధికారులను కూర్చో బెట్టుకోకూడదనే రాజ్యాంగ సూత్రం కూడా లోకేష్‌కు తెలిసినట్టు లేదు! నిజానికి 15,16వ శతాబ్దాల్లో ఉచ్ఛస్థితిలో ఉన్న రాయలసీమ ఎందుకు కరువు ప్రాంతంగా మారిపోయిందో ఆలోచించాల్సిన అవసరం లేదా?

చంద్రబాబుకు సింగపూర్‌ నమూనాపై విపరీతమైన మోజుంది. ఆయన బుర్రనిండా అమెరికా తరహా అభివృద్ధి సాధించాలనే ఆలోచనలే ఉన్నాయి. నిజానికి ఈ రెండూ ప్రధానంగా వ్యాపార దేశాలు. ఉత్పత్తి దేశాలు కాదు. ఆంధ్రప్రదేశ్‌ ఉత్పత్తి కేంద్రం. మానవ వనరులు, సహజ వనరులు పుష్కలంగా ఉన్న రాష్ట్రం. ఈ రెంటినీ సమన్వయంచేసి, సంపదను అభివృద్ధి చేయాల్సిన చంద్రబాబు ఆ పనిచేయడం లేదు. దేశదేశాలు తిరిగి టెక్నాలజీని కూడా అడుక్కోవడం భావదారిద్య్రానికి గుర్తు. నిజానికి కోస్తా జిల్లాలతోపాటు చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ తీవ్ర నిర్లక్ష్యానికి గురవు తున్నాయి.

చంద్రబాబు సామాజిక ప్రాంతీయతత్వం వల్ల ఈ రెండు ప్రాంతాలు నష్టపోతున్నాయి. ప్రజల్లో అసంతృప్తి, వేదన పెరుగుతున్నాయి. పాలకుడు స్వార్థపరుడై, తన ప్రాంతపు చారిత్రక పునాదులు తెలియనివాడైతే నిష్పాక్షిక పాలన జరగదు. చంద్ర బాబు వల్లే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాల నినాదాలు చేసే పరిస్థితులు ముందుకు వస్తున్నాయి. అందుకే రాష్ట్ర పాలనా వికేంద్రీకరణ జరగాలి. రాష్ట్ర రాజధానిగా అమరావతిని అభివృద్ధిచేసి, కర్నూలు, విశాఖపట్నాలను ఉప రాజధానులుగా తీర్చిదిద్దాలి. అప్పుడే సామాజిక, ప్రాంతీయ పాలనా సమతుల్యత ఏర్పడుతుంది. దీని కోసం ప్రతిపక్షాలు, వామపక్షాలు, లౌకికవాద పార్టీలు ఐక్యంగా పోరాడవలసిన చారిత్రక సందర్భం ఇది. చరిత్ర అంటే సమాజాన్ని మార్చే శక్తుల ఐక్యతే.

వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, నవ్యాంధ్ర పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు
డా '' కత్తి పద్మారావు
మొబైల్‌ : ‘ 98497 41695

మరిన్ని వార్తలు